కుటుంబం సహా వాటాళ్ పార్టీ నేత ఆత్మహత్య
*భార్య, కుమారుడు, కుమార్తెతో ఇంటిలోనే ఆత్మహత్య
* 20 ఏళ్లు కన్నడ భాష కోసం పోరాటం చేసిన నాయకుడు
* వాటాళ్ నాగరాజ్‌కు కుడిభుజం
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆర్థిక ఇబ్బందులతో కన్నడ చళువళి పార్టీ కీలక నాయకుడు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇక్కడి బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బయ్యప్పనహళ్ళిలోని నాగవరపాళ్యలో నివా సం ఉంటున్న వాటల్ పక్ష పార్టీ నాయకుడు గోపి అలియాస్ నా. గోపి (44), ఆయన భార్య జయశ్రీ (38), వీరి కుమారుడు దిలీప్ (18), కుమార్తె సంగీత అలియాస్ సంజన (15) ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం గోపి కుటుంబ సభ్యులు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో చుట్టు పక్కల వారు, బంధువులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా విషయం వెలుగు చూసింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. గోపి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్‌నోట్ రాసిపెట్టారని తెలిసింది. అయితే అందులోని వివరాలు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. ఆర్థిక సమస్యల కారణంగా గోపి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు తెలిపారు. వాటాళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు వాటాళ్ నాగరాజ్‌కు గోపి కుడి భుజం. వాటాళ్ నాగరాజ్ ఎప్పుడు పోరాటం చేసినా గోపి కీలకంగా వ్యవహరించేవాడు.
రెండుసార్లు శాసన సభ ఎన్నికలలో పోటీ చేసిన గోపి ఓటమి చెందాడు. వాటాళ్ నాగరాజ్‌కు అన్ని తానై చూసుకునే గోపి గత 10 రోజుల క్రితం బయ్యప్పనహళ్లిలో ఉదయం నుంచి రాత్రి వరకు కన్నడ రాజ్యోత్సం జరిపించారు. ఈ కార్యక్రమానికి వాటాళ్ నాగరాజ్‌తో సహ పలు కన్నడ సంఘాల నాయకులు హాజరయ్యారు. బుధవారం ఆయన ప్రజా సమస్యలపై పోరాటానికి 20 ఏళ్లు పూర్తి అయ్యింది. ఆ సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గోపి ఆనందంగా గడిపారు. అదే సమయంలో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదే తన చివరి పార్టీ అని స్నేహితుడు రూపేష్‌తో గోపి చెప్పినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే ఈ దారుణం జరిగిపోయిందని రూపేష్‌తో సహ ఆయన స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. గోపి, అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యలకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంతోనే గోపి కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.