vedasasta
-
వేదవాఙ్మయం: ధర్మాలు అంటే ఏంటి..?
భారతదేశ సంస్కృతి సమస్తం వివిధ రకాల ధర్మాలమీద నిర్మించబడింది. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది భారతదేశ నినాదం అయింది. అంటే, ధర్మాన్ని రక్షించండి, దానిచేత రక్షించబడండి అని అర్థం. ‘ధృ‘ అనే సంస్కృత ధాతువునుండి ‘ధర్మ’ అనే పదం పుట్టింది. దీనికి ‘కలిపి వుంచు’ లేదా ‘నిలబెట్టు’ అని అర్థం. అసలు ఈ ధర్మాలు అంటే ఏంటి..? ఇవి ఎప్పటివి..? ఎవరు రచించారు ..? వేదకాలంలో వీటికి ప్రాముఖ్యత వుందా..? ఇలాంటి విషయాల గురించిన వివరణే ఈ వ్యాసం..! భారతదేశంలో ప్రతి మనిషి పాటించాల్సిన నాలుగు ధర్మాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాలు. వీటినే ఆశ్రమ ధర్మాలు అంటారు. ఇవి మనిషి జీవితంలో ఎదురయ్యే నాలుగు దశలు. మనిషి, బ్రహ్మచర్యాశ్రమం లో బ్రహ్మచారిగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, గురువు ఇంటిదగ్గరే వుండి, గురువుకు సేవలు చేస్తూ విద్యాభ్యాసం చెయ్యాలి. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత, గురువు అనుమతితో, ఒక యోగ్యురాలైన కన్యను పెళ్ళిచేసుకోవడం ద్వారా బ్రహ్మచర్యాశ్రమంలోనుండి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. అందులో పంచ యజ్ఞాలను ఆచరిస్తూ, నిత్య నైమిత్తిక కర్మలను నిర్వర్తిస్తూ, గృహస్థు ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహించి, తన సంతానానికి పెళ్ళిళ్ళు జరిపించి, మనుమ సంతానంతో గడిపిన తర్వాత, భార్యతో సహా అడవులకు వెళ్ళి వానప్రస్థ ఆశ్రమాన్ని ప్రారంభించాలి. ఆపైన లౌకిక జీవితంతో అనుబంధాన్ని విడిచిపెట్టి, సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, భిక్షాటన చేస్తూ, మోక్షగామియై పూర్తిగా దైవచింతనలో పారమార్థిక జీవితాన్ని గడపాలి. వీటిలో మరలా ఒక్కొక్క ఆశ్రమధర్మానికి విడివిడిగా మనిషి పాటించాల్సిన అనేక ధర్మాలను చెప్పియున్నారు. వేద వాఙ్మయంలో శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం అనేవి ఆరుశాస్త్రాలు. వీటినే షడంగాలు అంటారు. వీటిలో మొదటి నాలుగు శాస్త్రాలు, వేదాలను చదివే జ్ఞానాన్ని ఇస్తే, ఐదవదైన జ్యోతిష్య శాస్త్రం ఖగోళవిజ్ఞానాన్ని ఇస్తుంది. బ్రహ్మచర్యాశ్రమంలో, ఒక వ్యక్తి, విద్యార్థిగా ఈ అయిదు శాస్త్రాలని అధ్యయనం చేసిన తరువాత, తను భవిష్యత్తులో పాటించాల్సిన ధర్మాల గురించి తెలుసుకోవడానికి కల్పశాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు. ఆరవదైన కల్పశాస్త్రం మనిషి చెయ్యాల్సిన కర్మలను గురించి, నెరవేర్చాల్సిన ధర్మాలని గురించి చెప్తుంది. అందుకే కల్పాన్ని వేదపురుషుని బాహువులుగా చెప్తారు. ఈ కల్ప శాస్త్రాలే భారత దేశ సంస్కృతికీ, సాంప్రదాయాలకీ, ఆచార వ్యవహారాలకీ, యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణకీ, గర్భాదానం మొదలుకుని సమస్త సంస్కారాలకీ, ఆశ్రమ ధర్మాల వారీగా మానవులు పాటించాల్సిన ధర్మాలకీ, మనిషి నడవడికకీ, నైతిక విలువలతోకూడిన ధార్మిక సమాజ నిర్మాణానికీ ఆధారం. ప్రపంచంలో, భారతదేశాన్ని ధార్మిక దేశంగా, కర్మభూమిగా మహోన్నతమైన స్థానంలో నిలబెట్టింది ఈ కల్పసూత్రాలే. ప్రపంచ వ్యాప్తంగా ఇతరదేశస్తులు మన ధర్మాలకు ఆకర్షితులవుతున్నారంటే, ఈ కల్ప సూత్రాలే కారణం. ఈ కల్పసూత్రాలను క్రీ.పూ 800 ప్రాంతంలో రచించినట్లు మనకు ఆధారాలున్నాయి. అంటే, సుమారు మూడువేల సంవత్సరాలనుండి భారతీయులు ఒక క్రమశిక్షణతో కూడిన ధర్మబద్ధమైన పారమార్థిక జీవితాన్ని గడుపుతున్నారు. దీనినిబట్టి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల మూలాలు ఎంతపురాతనమైనవి, దృఢమైనవో అర్థం చేసుకోవచ్చు. – ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు -
వైదిక విజ్ఞానం
వేద వాఙ్మయంలో ఆరు విభాగాలున్నాయి. అవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. వీటినే షడంగాలు అంటారు. ఇవి వేదాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ షడంగాలను అధ్యయనం చెయ్యకుండా వేదాలను చదువ కూడదన్నది సాంప్రదాయం. షడంగాలను అధ్యయనం చేయకుండా వేదాలను చదివితే, అవి సరైన రీతిలో అర్థంకాకపోగా, విపరీతమైన అర్థాలు వచ్చేదానికి అవకాశం వుంటుంది. అందుకే ముందుగా మనం వేదాంగాల గురించి తెలుసుకుందాం... వేదాల్లోని అక్షరాలు, పదాలు, అవి పలికే విధానం గురించి, వేద మంత్రాల స్వరాలు, ఒత్తిడి, శ్రావ్యతల గురించి, మంత్రాలు పలికే సమయంలో పదాల కలయిక, వాటి నియమాల గురించి శిక్షాశాస్త్రం వివరిస్తుంది. మనిషి ఆలోచనలను వ్యక్తపరచడానికి కావలసిన పదాలు, వాక్యనిర్మాణం, భాషావిశ్లేషణ నియమాలు, సంధులు, పదవిఛ్ఛేదాలు, పదాల ఏర్పాటు, మొదలైన వాటిగురించి వ్యాకరణం వివరిస్తుంది. వేదమంత్రాలన్నీ ఏదో ఒక ఛందస్సులో చెప్పబడినవే కనుక ఒక క్రమ పద్ధతిలో నిర్ణీతసంఖ్యలో అక్షరాల ఆధారంగా మంత్రాలను అర్థం చేసుకోవడాన్ని ఛందస్సు వివరిస్తుంది. వేదాలలోని శబ్దాలు, వాటి వ్యుత్పత్తి, నిర్మాణం, అవి ఉపయోగించిన సందర్భాన్ని బట్టి వాటి అర్థాలు, అస్పష్టమైన అర్థంతో చేసిన పద ప్రయోగాలను అర్థం చేసుకోవడం,మొదలైనవాటి వాటిగురించి వివరించేది నిరుక్తం. ఆచారాలు, సూర్యచంద్రాది గ్రహ, నక్షత్రాలను బట్టి ఏర్పడు శుభాశుభ సమయాలు, ఋతువులు, ఇత్యాది ఖగోళ శాస్త్ర విఙ్ఞానాన్ని అందించేదే జ్యోతిష్య శాస్త్రం. యఙ్ఞయాగాదులలో నిర్మించే యఙ్ఞగుండాలు, వేదికలు, యాగశాలల నిర్మాణ విధానాలు, జననం, మరణం, వివాహం వంటి సంఘటనలలో జరుపవలసిన ఆచారాలు మొదలైన వాటి గురించి కల్పం వివరిస్తుంది. వేదవాఙ్మయానికి జ్యోతిష్యం నేత్రం వంటిది అని శాస్త్రోక్తి. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. అలాగే షడంగాలలో జ్యోతిష్యం ప్రధానం. ఎందుకంటే, మిగిలిన ఐదు శాస్త్రాలూ ఎక్కువభాగం భాషకు సంబంధించినవి. కానీ జ్యోతిష్యశాస్త్రం మాత్రం ఖగోళంలోని గ్రహనక్షత్రాది జ్యోతుల గతులను, వాటివలన ఏర్పడే పరిణామాలను వివరిస్తుంది. ఆ రోజుల్లో ఖగోళాన్ని దర్శించి అధ్యయనం చేసేవారు. కాంతివంతంగా వుంటాయి కనుక గ్రహాలను నక్షత్రాలను కలిపి, జ్యోతులు అంటారు. వాటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రం అన్నారు. ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారానే వేదాల్లో వుండే ఎన్నో ఖగోళ అద్భుతాలను, విఙ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. వేదాల్లో వుండే ఖగోళ విఙ్ఞానాంశాలు మచ్చుకి కొన్ని. ఋగ్వేద ప్రథమ మండలంలో సూర్యుడు తన కక్ష్యలో చరించడాన్ని, సూర్యాకర్షణశక్తి వల్లనే భూమి, ఇతర పదార్థాలు సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయని, సూర్యుడు చాలా భారీగా వుంటాడనీ, అతని ఆకర్షణశక్తి వల్లనే గ్రహాలు ఒకదానితో మరొకటి ఢీకొనకుండా వుంటాయని తెలిపారు. మరొక మంత్రంలో, ‘కదిలే చంద్రుడు నిత్యం సూర్యునినుండి కాంతికిరణాలను పొందుతాడు’ అనీ, ‘చంద్రుడి వివాహానికి సూర్యుడు తన కుమార్తెలాంటి ఒక కిరణాన్ని బహుమతిగా ఇచ్చాడు’ అని, చంద్రకళలు మారడంలో సూర్యకిరణాల పాత్రని తెలియజేశారు. ఋగ్వేదం ఐదవ మండలంలో ఒక మంత్రం ‘ఓ సూర్యదేవా! ఎవరికైతే నీ వెలుగును బహుమతిగా ఇస్తున్నావో వారి (చంద్రుడు) వలన నీవెలుగు నిరోధించబడినప్పుడు, భూమి అకస్మాత్తుగా చీకటిలో భయపడుతుంది‘ అంటూ గ్రహణాలకు కారణం సుర్యుడు, చంద్రుడు, భూమియే అని చెప్పింది. ఋగ్వేద ఎనిమిదవ మండలంలో, సౌరకుటుంబంలోని ఆకర్షణశక్తుల గురించి, ‘ఓ ఇంద్రా..! గురుత్వాకర్షణ, ఆకర్షణ, ప్రకాశం, కదలిక లక్షణాలను కలిగియున్న శక్తివంతమైన కిరణాలను ప్రసరించి ఆకర్షించడం ద్వారా ఈ విశ్వాన్ని నిలపండి‘ అంటూ సూర్యుణ్ణి, భోగప్రదాత అయిన ఇంద్రుడితోపోల్చి చెప్పారు. మరొక మంత్రంలో సృష్టికర్తను ఉద్దేశించి ‘ఓ దేవా! మీకున్న అనంతమైన శక్తితో సూర్యుని సృష్టించి, ఆకాశంలో ధృవపరచి, సూర్యుని, ఇతర గోళాలను సమన్వయపరచి స్థిరం చేసినారు’ అని సూర్యుని చుట్టూ గ్రహాలు స్థిరంగా తిరగడం గురించి తెలిపారు. ఋగ్వేద పదవ మండలంలో ‘ఈ భూమికి కాళ్ళు, చేతులు లేకపోయినప్పటికీ అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దానితోబాటూ దానిమీద వుండే అన్నీ కదులుతాయి’ అని చెప్పారు. యజుర్వేదంలో ఒక మంత్రంలో సూర్యుని ఆకర్షణశక్తి గురించి, ‘సూర్యుడు తన కక్ష్యలో కదులుతూ తనతోబాటు భూమివంటి వస్తువులను తనతోబాటు తీసుకు వెళ్తున్నాడు’ అని చెప్పారు. అథర్వవేదంలో ‘సూర్యుడు భూమిని, ఇతర గ్రహాలను పట్టి వుంచాడు’ అని తెలియజేశారు. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
నేటి నుంచి వేదశాస్త్ర పరీక్షలు
రాజమహేంద్రవరం కల్చరల్ : వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 24వరకు వేదపరీక్షలు జరుగుతాయని పరిషత్తు కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్నీసుపేటలోని కెనరాబ్యాంకు పక్కనే గల హోతావారి భవనంలో వివిధ విభాగాల్లో జరిగే ఈ పరీక్షలకు పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారని తెలిపారు. ఈనెల25వ తేదీ ఉదయం7.30 గంటలకు టి.నగరులోని విశ్వేశ్వర స్వామి ఆలయం నుంచి మార్కండేయేశ్వర స్వామి ఆలయం వరకు వేదపండితుల స్వస్తివాచకులతో ఊరేగింపు జరుగుతుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో దానవాయి పేట, చిన్నగాంధీబొమ్మ సమీపంలోని వాడ్రేవువారి ఇంటిలో పండిత మహాసభ జరుగుతుందని పేర్కొన్నారు.