తిరుమలకు సమైక్య సెగ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అఖి లాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ‘సమైక్య’ సెగ తలిగింది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. వెంకన్న హుండీ ఆదా యం సగానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి 24 గంటలపాటు తిరుపతి-తిరుమల మధ్య టాక్సీలను నిలిపి వేయాలని తిరుమల, తిరుపతి ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ జేఏసీ నిర్ణయించింది. ప్రతిరోజూ తిరుపతి-తిరుమల మధ్య 4వేల ప్రయివేటు టాక్సీలు నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయాలని ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈనెల 13వ తేదీన తిరుమలకు బస్సులు నిలిపివేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి బస్సులు నడపాల్సిందిగా సూచించడంతో కొద్దిపాటి బస్సులను పునరుద్ధరించారు.
సాధారణ రోజుల్లో దాదాపు 500 బస్సులు తిరుమలకు తిరుగుతుండగా, ఈనెల 14వ తేదీ నుంచి 107 బస్సు సర్వీసులను మాత్రమే పునరుద్ధరించారు. ఇవికూడా తిరుపతి బస్టాండ్ నుంచి గాక అలిపిరి బాలాజీ బస్టాండు నుంచి తిరుమలకు నడుపుతున్నారు. మామూలు రోజుల్లో బస్సుల ద్వారా వెళ్లి వచ్చే భక్తుల సంఖ్య లక్షకుపైగా ఉంటుంది. ప్రస్తుతం 107 బస్సుల్లో సగటున 26 వేల మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తున్నారు. భక్తుల సంఖ్య తగ్గడంతో తిరుమల వెంకన్నకు వచ్చే ఆదాయం కూడా భారీగా పడిపోయింది. రోజూ రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల వరకూ ఉండే హుండీ ఆదాయం కోటిన్నరకు పడిపోయింది. గదులు కూడా ఖాళీ అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు వాహనాలు నిలిచిపోవడం కూడా తిరుమలపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. సగటున రోజుకు 20 వేల మందికిపైగా భక్తులను ప్రైవేటు వాహనాలు కొండకు చేరుస్తుంటాయి.
ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు నిలిచిపోతే సొంత వాహనాలు, కాలినడకన వెళ్లే భక్తులు మాత్రమే తిరుమలకు చేరుకుంటారు. ఆ లెక్కన నాలుగో వంతు భక్తులు మాత్రమే దర్శనానికి వెళతారు. సమైక్యాంధ్ర సమ్మెలో తిరుమల బస్సు సర్వీసుల బంద్ కేంద్ర బిందువుగా మారడంతో ఏపీ ఎన్జీవోల సంఘం దానిపైనే దృష్టి సారించింది. శుక్రవారం గుంటూరులో జరిగిన ఏపీ ఎన్జీవోల సంఘం సమావేశంలో దీనిపైనే ఎక్కువసేపు చర్చ జరిగింది. భక్తులకు ఇబ్బందే అయినా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే తిరుమలకు బస్సులను ఆపక తప్పదనే అభిప్రాయానికి ఉద్యమకారులు వచ్చారు. అన్ని ప్రాంతాలకు ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల ప్రయాణికులు తిరుమలకు రాకుండా జాగ్రత్త పడతారని వారు భావిస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ యూనియన్ నాయకులు ప్రభాకర్‌రావు, ప్రకాష్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తిరుమలకు బస్సులను ఎప్పటి నుంచి నిలిపివేయాలన్న దానిపై స్పష్టమైన సూచనలు అందలేదని అన్నారు. జేఏసీ నాయకులతో కలసి చర్చిస్తామని చెప్పారు.
తొలుత 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేటు వాహనాల యజమానులు కూడా దాన్ని పొడిగించే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చేంతవరకూ తాము నిరవధికంగా వాహనాలను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని సంఘం నేతలు బీవీ కృష్ణయాదవ్, మోహనరావు అన్నారు. తిరుమల పోటు కార్మికులు కూడా శుక్రవారం సమైక్య ఆందోళనల్లో పాల్గొన్నారు. టీటీడీ పరిపాలనా కార్యాలయం ఉద్యమం కారణంగా బోసిపోతోంది. ఉద్యమం ఉధృతమైతే వెంకన్నకు విశ్రాంతి తప్పదేమో?.