ఏడాదైనా వీడనిమిస్టరీ
వీణవంక న్యూస్‌లైన్: మండలంలోని మామిడాలపల్లికి చెందిన టెంకాయల వ్యాపారి జోగు వెంకటేశ్వర్లు హత్యపై పోలీసులు మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. ఏడాది గడుస్తున్నా నిందితులను పట్టుకోలేకపోతున్నారు.
దీంతో హతుడి కుటుంబ సభ్యులు పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గత ఏడాది నవంబర్ 22వ తేదీ అర్ధరాత్రి గ్రామంలోని వేంకట్వేరస్వామి ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆయనను దారుణంగా హత్య చేశారు. ఆలయం వద్ద టెంకాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన ప్రతి రోజూ ఆలయంలోనే నిద్రిస్తాడు. అప్పటి డీఎస్పీ నాగలక్ష్మి, రూరల్ సీఐ వీరభద్రం నిందితులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలోకి దించారు.
ఆలయంలో దొంగతనం చేసేందుకు వచ్చిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠానే ఆయనను హత్య చేసిందని నిర్ధారించారు. ఆలయంలో సుమారు రూ.4లక్షల విలువ చేసే నగలు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. అయితే హతుడి కుటుంబ సభ్యులు మాత్రం గ్రామానికి చెందిన కొందరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, వారి ప్రలోభాలకు లొంగిన పోలీసులు నిందితులను కాపాడుతున్నారని ఆరోపిస్తున్నారు.
అప్పటి సీఐ వీరభద్రం కేసును తప్పు దోవ పట్టిస్తున్నారని హతుడి తల్లి లక్ష్మి, తమ్ముడు తిరుపతి, అన్న రాజేశం అప్పటి జిల్లా ఎస్పీ రవీందర్, డీఐజీ భీమానాయక్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో తమకు న్యాయం చేయాలని లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ ఉదంతంపై నివేదిక ఇవ్వాలని లోకాయుక్త జిల్లా ఎస్పీని ఆదేశించడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వారం రోజుల క్రితం విచారణ జరిపారు.