సంక్రాంతిపల్లిలో ఇళ్ల కూల్చివేత
రాపూరు : కృష్ణపట్నం-ఓబులవారిపల్లి రైల్వేలైను నిర్మాణం కోసం సంక్రాంతిపల్లి ఎస్సీ కాలనీ వద్ద ఇళ్లను మంగళవారం అధికారులు భారీబందోబస్తు మధ్య కూల్చివేశారు. అధికారుల చర్యలను స్థానికులు ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. వివరాల్లోకెళితే.. సంక్రాంతిపల్లి పున రావాస ప్రాంతంలో 32 మంది ఎస్సీలకు 1996లో ప్రభుత్వం నివేశన స్థలాలను కేటాయించింది. అక్కడ వాతావరణం సరిగా లేదంటూ లబ్ధిదారులు సమీపంలోని భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. ఇటీవల తమకు కేటాయించిన పట్టాభూముల్లో 46 ఇళ్లు కట్టారు. రైల్వే లైను నిర్మాణానికి ఈ 46 ఇళ్లు అడ్డుగా ఉన్నాయని రైల్వే అధికారులు జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించారు. వీటి తొలగింపు విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని స్థానికులు పలుమార్లు అధికారులతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ జానకి మంగళవారం స్వయంగా ఈ ప్రాం తాన్ని పరిశీలించారు. ఇటీవల కట్టిన ఇళ్లను కూల్చేయాలని అధికారులను ఆదేశించి వెళ్లిపోయారు.
ఆ వెంటనే నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇళ్ల కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. దీనిని నిర్వాసితులు అడ్డుకోవడంతో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్సైలు, 100 మంది పోలీసులను మోహరించారు. తమకు నష్టపరిహారం చెల్లించాకే ఇళ్లు కూల్చుకోవాలని బాధితులు భీక్ష్మించారు. చివరు పోలీసుల సహకారంతో ఇళ్లను తొలగించారు. ఎవరూ లేని సమయంలో తమ ఇళ్లు కూల్చివేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కట్టుకుంటున్నప్పుడు పట్టించుకోని అధికారులు ఇప్పుడు వచ్చి కూల్చేయడం అన్యాయమన్నారు. ఇళ్లలోని వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయని వాపోయారు.
అక్రమ కట్టడాలే: వెంకటేశ్వర్లు ఆర్డీఓ
ప్రభుత్వం సర్వే నంబర్6లో గతంలో 32 మంది ఎస్సీలకు పట్టాలు మంజూరు చేసిందని ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ స్థలాలు బాగలేవని పక్కనే అదే సర్వే నం బర్లోని ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకున్నారని, దీంతో పాత పట్టాలను రద్దు చేశామన్నారు. రైల్వేలైను వస్తుం దని మళ్లీ ఆ స్థలాల్లో ఇళ్లు కట్టారని, ఖాళీ చేయమని పలుమార్లు సూచించినా వినకపోవడంతో కలెక్టర్ స్వయంగా పరిశీలించి అక్రమ కట్టడాలని నిర్ధారించారని చెప్పారు. ఆయన వెంట తహశీల్దార్ నిర్మలానందబాబా, సీఐలు ర త్నయ్య, సుబ్బారావు, శ్రీనివాసులు, ఎస్సైలు ఉన్నారు.