వర్మా.. ఇదేమి ఖర్మ!
ఓట్లేసిన పాపానికి తలలు పట్టుకుంటున్న ఓటర్లు
ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అదే పంథా
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెదిరింపులు
మాకీ ఉద్యోగాలు వద్దంటూ లాంగ్ లీవ్‌లోకి
తనకిష్టం లేకపోతే వీఆర్‌లో పెట్టాలంటూ ఒత్తిళ్లు
చివరకు అగ్నిమాపక సిబ్బందినీ వదలని వైనం
కోతికి కొబ్బరి కాయ దొరికింది ... కొమ్మ, కొమ్మపై గంతులేస్తూ సందడి చేస్తోంది.దానికో అర్థం, పరమార్థం ఉంది. ఎందుకంటే ఆకలితో ఉన్న సమయంలో కొబ్బరి ముక్క దొరకడం ... తన పొట్ట నిండబోతుందనే ఆనందం ఆ కుప్పిగంతుల్లో కనిపిస్తుంది. మరి ఈ కథనంలో ఈయనను ఎమ్మెల్యే పదవి వరించింది. ఆ మరుసటి రోజునుంచీ ఒకటే చిందులు. ఈ చిందుల్లో అక్రమాల ఆతృతే కనిపిస్తోంది. తనతోపాటు తన అనుచరుల పొట్ట నింపడానికి ఎదుటివారి బతుకులను చిదిమేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేసినా ప్రధాన పార్టీలను కాదని ఆ నియోజకవర్గ ప్రజలు ఓట్లేశారు. ఆ రుణం తీర్చుకోవల్సింది పోయి రణన్నినాదంతో రభస చేస్తున్నారు. అభివృద్ధిని వదిలేసి అడుగడుగునా అకృత్యాలకు పాల్పడుతున్నారు... అదెలాగో మీరే చదవండి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
జిల్లాలో పలు శాఖలకు ఉన్నతాధికారులున్నా ఆ ప్రాంతానికి మాత్రం ఆయనే సర్వాధికారి. ఆ రాజ్యంలో ఎవరైనా రాజుగారి మాట జవదాటారో శంకరగిరి మాన్యాలే. చక్రవర్తి వస్తున్నారంటే భుజంపై కండువా చంకలో పెట్టుకుని ‘జీ హుజూర్’ అనే రాజులకాలం తరహా సంస్కృతి అక్కడ నడుస్తోంది. ఆయన అనుమతి లేనిదే ఆ రాజ్యంలో అడుగుపెట్టే ధైర్యం ఎవరూ చేయలేరు. అటువంటి రాజ్యంలో పనిచేయడమంటే అధికారులు హడలెత్తిపోతున్నారు. పిఠాపురం సంస్థానాధీశుల కాలంలో కూడా ప్రజలు ఈ తరహా పాలన చూసి ఉండరన్న వ్యంగ్యం వినిపిస్తోంది. ఆయనెవరో కాదు పిఠాపురం ఎమ్మెల్యే (టీడీపీ) ఎస్వీఎస్ వర్మ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజకవర్గంలో పని చేయాలంటేనే అధికారులు ఠారెత్తిపోతున్నారు. వేధింపులు మరీ
మితిమీరిపోయాయి. అక్కడ పనిచేయలేక ఒక్కొక్కరు ఊళ్లు వదిలిపోతున్నారు. రెవెన్యూ, పోలీసు, విద్య, వ్యవసాయంతోపాటు చివరకు అగ్నిమాపకశాఖను కూడా ఆ నేత విడిచిపెట్టడం లేదు. ఇలా దాదాపు అన్ని శాఖల అధికారులు ఆ నియోజకవర్గంలో అడకత్తెరలో పోక చెక్కలైమితిమీరిపోయాయి. అక్కడ పనిచేయలేక ఒక్కొక్కరు ఊళ్లు వదిలిపోతున్నారు. రెవెన్యూ, పోలీసు, విద్య, వ్యవసాయంతోపాటు చివరకు అగ్నిమాపకశాఖను కూడా ఆ నేత విడిచిపెట్టడం లేదు. ఇలా దాదాపు అన్ని శాఖల అధికారులు ఆ నియోజకవర్గంలో అడకత్తెరలో పోక చెక్కలై పోతున్నారు.
ఎంఈఓ మరణానికి వేధింపులే కారణం...
పిఠాపురం మండల విద్యాశాధికారిగా పనిచేసిన శర్మ హఠాన్మరణానికి గురవడానికి కారణం ఆ ముఖ్యనేత, అతని అనుచరగణం ఒత్తిళ్లే శర్మను బలితీసుకున్నాయని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పాఠశాల భవన నిర్మాణాలు, విద్యార్థుల యూనిఫారాల కొనుగోలులో కమీషన్ల కోసం ఆ ముఖ్యనేత చెప్పినట్టు నడుచుకోకపోవడమే శర్మ చేసిన తప్పు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆ ముఖ్యనేత తిట్ల పురాణం లంఘించుకోవడంతో ఎంఈఓ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందారని అప్పట్లో ఉపాధ్యాయులు ధ్వజమెత్తారు.
కాంట్రాక్టుల కోసం కమిషనర్‌పై...
∙ఆ జాబితాలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బి.రాము కూడా ఉన్నారు. రాము పిఠాపురం కమిషనర్‌గా పనిచేసే సందర్భంలో తాను చెప్పినట్టుగా మున్సిపల్ కాంట్రాక్టులు నామినేషన్ పద్దతిపై తన సోదరుడు బినామీదారులకు ఇవ్వకపోవడం ఆ ముఖ్యనేతకు నచ్చలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పాదగయ క్షేత్రంలో జరిగిన సమావేశంలో అందరి ముందూ నోరుపారేసుకోవడంతో ఆత్మాభిమానం అడ్డువచ్చి ఉద్యోగం ఎక్కడైనా చేసుకోవచ్చననే రాము వేరే చోటుకు బదిలీపై వెళ్లిపోయారు.
వీఆర్‌లోకి ఎస్ఐ
గొల్లప్రోలు ఎస్సైగా పనిచేసిన బుచ్చిబాబును కూడా ఇదేరకమైన వేధింపులకు గురిచేసి బలవంతంగా వీఆర్‌లోకి పంపేశారు. అది భార్య, భర్తల కేసు. భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నాడని భార్య ఇచ్చిన ఫిర్యాదుపై చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడమే అక్కడ ఎస్ఐ చేసిన నేరం. ఆ కేసులో భర్త ఆ ముఖ్యనేత అనుచరుడు కావడం, తన అనుచరుడని తెలిసి కూడా కేసు పెడతావా అంటూ ఎస్ఐ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చట్ట ప్రకారం నడుచుకున్న ఎస్ఐపై తన అనుచరుడితో వేధింపులు ఫిర్యాదు ఇప్పించి వీఆర్‌కు పంపించేశారు.
ఎస్సైని కూడా వీఆర్లోకే...
∙భూ లావాదేవీలకు అడ్డుపడుతున్నాడనే కారణంతో దళితుడైన కొత్తపల్లి తహసీల్దారు పినిపే సత్యనారాయణపై కేసు నమోదుకు కూడా ఆ ముఖ్య నేత వెనుకాడ లేదంటే అతని వేంధిపులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తహసీల్థార్పై కేసు నమోదు చేయమన్నప్పటికీ మండల మెజిస్ట్రేట్ కావడంతో తటపటాయించిన పిఠాపురం టౌన్ ఎస్సై సన్యాసి నాయుడును కూడా వి.ఆర్‌లో పెట్టించారు.
అడ్డగోలుగా పట్టాలు ఇవ్వనందుకే బదిలీ వేటు
∙ పిఠాపురం జగ్గయ్య చెరువులో ఇళ్ల పట్టాలు తన అనుచరుల పేరున రాసివ్వాలని ఆ ముఖ్యనేత తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. తాను ఆపని చేయలేనన్న అప్పటి తహసీల్దారు రియాజ్ హుసేన్‌పై బదిలీ వేటు వేయించారు. అనంతరం వచ్చిన తహసిల్థార్పై ఒత్తిడి తెచ్చి 700 పట్టాలు రద్దు చేయించడం, వాటిలో ఉన్న నిరుపేదల కట్టడాలను అడ్డగోలుగా కూల్చివేత యత్నాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తేవడంతో ఆ ముఖ్యనేత తోకముడవక తప్పింది కాదు.
అగ్నిమాపక శాఖనూ వదలని వైనం..
∙అగ్నిమాకశాఖ శకటాలకు ఉన్న ఇంజిన్లతో పంట పొలాలకు నీరు తోడించడమనే కొత్త సంప్రదాయానికి కూడా ఆ ముఖ్యనేతకే చెల్లింది. అగ్నిప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే వినియోగించే అగ్నిమాపకశాఖ సేవలను ఇష్టారాజ్యంగా సోమవారం పొలాలకు నీరు తోడడానికి వినియోగించడంతో ఆ శాఖ సిబ్బందిపై ఎంత ఒత్తిడి తెచ్చారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయం ‘సాక్షి’లో ప్రచురితమవడంతో ఉన్నతాధికారుల జోక్యంతో చివరకు మంగళవారం నిలిపివేశారు. ఇలా కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా అధికారం ఉందికదా అని కుప్పి గంతులేస్తూ అధికార గణాన్ని ఇబ్బందుల చేస్తున్న ఎమ్మెల్యే వర్మ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యే మెుండిపట్టుదలతో నిలిచిన ఓ నెల జీతాలు
గొల్లప్రోలు మండల విద్యాశాఖాధికారిగా తునికి చెందిన ఒక స్కూల్ అసిస్టెంట్‌ను నియమించేందుక మాట ఇచ్చారు. దీని వెనుక ఆమ్యామ్యాల ఒప్పందం కుదరడంతో గొల్లప్రోలులో పనిచేస్తున్న ఎంఈఒను సెలవుపై వెళ్లిపోవాలని ఒత్తిడులు పెట్టారు. సెలవు అనంతరం తిరిగి జాయిన్ చేసుకోకుండా మోకాలడ్డుతున్న కారణంగా గతనెల గొల్లప్రోలులో 122 మంది ఉపాధ్యాయుల జీతాలు నిలిచిపోయాయి.
ఎంఈఓను జాయిన్ కానీయకుండా...
తన అనుచరులు చెప్పిన పనులు చేయడం లేదనే కారణంతో పిఠాపురం ఎంఈఓ రమణమ్మపై కక్షకట్టి బదిలీపై వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. సెలవు ముగించుకుని తిరిగొచ్చిన ఆమెను జాయిన్ చేసుకోవద్దని ఎంపీడీఓ సుబ్బారావుకు తనదైన శైలిలో హుకుం జారీ చేశారు. ఉన్నతాధికారులు చెప్పారా లేదా అని వెనుకాముందు చూసుకోకుండా ముఖ్యనేత చెప్పినట్టే సెలవు నుంచి తిరిగొచ్చిన ఆమెను జాయిన్ చేసుకోడానికి నిరాకరించిన ఎంపీడీఓ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అనివార్యంగా ఆమెను జాయిన్ చేసుకున్నారు.