పప్పు కూడుకూ కరువే..?
రాష్ట్రంలో పప్పుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. సాధారణ ప్రజలకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. వర్షాభావంతో సాగు తగ్గడం, దిగుబడి తగ్గిపోవడంతో పప్పు ధాన్యాలకు కొరత ఏర్పడింది... వ్యాపారుల ‘నిల్వల’ మాయాజాలం మరింత కరువు తెచ్చిపెట్టింది. దీంతో పెసరపప్పు ధర ఇప్పటికే ‘వంద’ మార్కును దాటి దూసుకుపోతుండగా... మినపపప్పు, కందిపప్పుల ధరలు దాని దగ్గరికి చేరుకుంటున్నాయి. ఇక వేసవి ముదిరే సమయానికి పప్పుల ధరలు అందనంత ఎత్తుకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో చుక్కలను తాకుతున్న పప్పుల ధరలు
⇒ రూ. 112కు చేరిన పెసరపప్పు..
⇒ రూ. 100కు చేరువలో కందిపప్పు, మినపపప్పు
⇒ వర్షాభావంతో తగ్గిన సాగు.. పడిపోయిన దిగుబడి
⇒ దీనిపై ఎప్పుడో హెచ్చరించిన అసోచామ్
⇒ ఏకంగా 32 శాతం తగ్గిన పప్పు ధాన్యాల సాగు
⇒ భారీగా నిల్వలతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
⇒ రంగంలోకి దిగిన ప్రభుత్వం.. నిల్వలపై నిఘా
సాక్షి, హైదరాబాద్:-
సాగు తగ్గింది.. దిగుబడీ పోయింది..
సాధారణంగా రాష్ట్రంలో 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. 3.17 లక్షల హెక్టార్లలోనే రైతులు సాగుచేశారు. పెసర 48 శాతం, మినుములు 45 శాతం, కందులు 87 శాతం మేర మాత్రమే సాగయినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో పప్పుధాన్యాల ఉత్పత్తి పడిపోయింది. ఒక్క కందుల ఉత్పత్తి పరిస్థితి మాత్రమే కొంతవరకూ మెరుగ్గా ఉంది. పెసరపప్పు అయితే ఏకంగా 1.07 లక్షల టన్నుల ఉత్పత్తికిగానూ కేవలం 24 వేల టన్నులకు తగ్గిపోయింది. మినుముల ఉత్పత్తి 46 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి చాలా దూరంగా.. కేవలం ఆరు వేల టన్నులకు పరిమితం కావడం ఆందోళనకరం.
ముందే హెచ్చరించినా..
దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిపై పారిశ్రామిక మండలి ‘అసోచామ్’ గత ఖరీఫ్ సీజన్ మొదట్లోనే ప్రభుత్వాలను హెచ్చరించింది. రుతుపవనాలు సరిగా ఉండని నేపథ్యంలో వర్షపాతం తగ్గొచ్చని... దానివల్ల పప్పుధాన్యాల ఉత్పత్తి పడిపోయి ధరలు పెరగవచ్చని తమ నివేదికలో పేర్కొంది. అందులోనూ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 80 శాతం వాటా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని స్పష్టంగా తెలియజేసింది. కానీ ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదు. అసోచామ్ చెప్పిన విధంగానే పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది.
నిల్వలపై ఆంక్షలు.. విజిలెన్స్ నిఘా
రాష్ట్రంలో పప్పుల ధరలు మరింతగా పెరిగే అవకాశాన్ని, డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని వ్యాపారులు కృతిమ కొరత సృష్టించే అవకాశాలున్న దృష్ట్యా ప్రభుత్వం రంగంలోకి దిగింది. పప్పుల నిల్వలపై పరిమితిని నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరానికి ఒక పరిమితిని, ఇతర ప్రాంతాల్లో మరో పరిమితిని విధించింది. హైదరాబాద్‌లో శనగపప్పు మినహా అన్ని రకాల పప్పులను హోల్‌సేల్ వ్యాపారులైతే నాలుగు వేల క్వింటాళ్లు, రిటైల్ వ్యాపారులు 125 క్వింటాళ్లను మించి నిల్వ చేయరాదని స్పష్టం చేసింది.
అదే శనగపప్పును హోల్‌సేలర్ వెయ్యి క్వింటాళ్లు, రిటైలర్ 30 క్వింటాళ్లను మించరాదని తెలిపింది. మిగతా ప్రాంతాల్లో శనగపప్పు హోల్‌సేలర్ 500 క్వింటాళ్లు, రిటైలర్ 20 క్వింటాళ్లు.. ఇతర పప్పులైతే హోల్‌సేల్ వ్యాపారి 2,500 క్వింటాళ్లు, రిటైలర్ 100 క్వింటాళ్లను మించి నిల్వ ఉంచరాదని ప్రభుత్వం నిర్దేశించింది. ఇంతకు మించి పప్పులు నిల్వ చేసిన వ్యాపారులపై విజిలెన్స్ దాడులు చేయాల్సిందిగా ఇటీవల నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌శాఖ పప్పు ధాన్యాల నిల్వలపై నిఘాను పెంచింది.
చుక్కల్ని తాకుతున్న పెసరపప్పు..
పప్పు ధాన్యాల ఉత్పత్తులు తగ్గడంతో రాష్ట్రంలో పెసరపప్పు ధర కిలో రూ. 112 కు చేరింది. గత ఏడాది ధరతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. పలు చోట్ల రిటైల్ మార్కెట్లో పెసరపప్పు ధర కిలో రూ. 120 వరకూ ఉంది. ఇక కందిపప్పు ధర కిలో రూ. 90కి పెరగగా... మినపపప్పు ధర రూ. 94కు చేరింది. సాగు తగ్గిన నేపథ్యంలో భవిష్యత్ డిమాండ్‌ను ముందుగానే ఊహించిన వ్యాపారులు పప్పుల నిల్వలను భారీగా పోగు చేయడం, వాటిని కొద్దికొద్దిగా మార్కెట్లోకి విడుదల చేస్తూ ధరలను ఇష్టారీతిన నిర్ణయిస్తుండటం వంటివి జరుగుతున్నాయి. దీంతో సామాన్యుడికి మాత్రం ధరాఘాతం తప్పడం లేదు.