మొక్కల కొను‘గోల్మాల్’
=టీటీడీ అటవీశాఖ అవినీతి బాగోతం
=రూ.200కు లభించే మొక్కకు రెండు వేల బిల్లు
=అడుగడుగునా అక్రమాలు
=దేవస్థానం ఖజానాకు భారీ కన్నం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కంచే చేను మేసిన చందంగా ఉంది టీటీడీ అటవీ శాఖ అధికారుల తీరు. మొక్క ల కొనుగోలు పేరిట దేవస్థానం ఖజానాకు అటవీ విభాగం అధికారులు కన్నం పెడుతున్నారు. గతంలో కోట్ల రూపాయల్లో అక్రమాలకు పాల్పడి విజిలెన్స్ విచారణను ఎ దుర్కొన్న అటవీ విభాగం తాజాగా తిరుపతిలో డివైడర్లపై వేసిన మొక్కల పేరిట లక్షల్లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుచానూరు నుంచి అలిపిరి వరకు ఉన్న రహదారి డివైడర్‌పై అటవీ విభాగం అధికారులు రెండు రకాల మొక్కలను నాటారు.
బయట మార్కెట్లో వంద నుంచి రెండు వందల రూపాయలకు లభ్యమయ్యే ఈ మొక్కలకు రెండు వేల రూపాయల వరకూ బిల్లు పెట్టడం వివాదాస్పదంగా మారింది. విజయభాస్కరరెడ్డి అనే ఫారెస్ట్ మజ్దూర్ ద్వారా ఈ వ్యవహారం నడిపినట్లు తెలిసింది. లక్షల రూపాయలతో మొక్కలు కొనుగోలు చేసేప్పుడు టెండర్ పిలవకుండా ఇష్టానుసారం వ్యవహరించడంపై ఇ ప్పుడు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వక్క చెట్టును పోలివుండే ఫాక్స్‌టైల్ ఫామ్ చెట్టును రూ.2000కు, చిన్న గుబురుగా ఉండే పైటస్ మొక్కను రూ.350 రూపాయలకు కొనుగోలు చేసినట్లు దేవస్థానం డీఎఫ్‌వో కే. వెంకటస్వామి ‘సాక్షి’తో చెప్పారు.
లేబర్ యూనియన్లకు ప నులు అప్పగించడం వల్ల మంచి ఫలితాలు ఉం టాయన్న భావనతో లక్షల రూపాయలతో మొ క్కలు కొనుగోలు చేసినా టెండర్ పిలవలేదని స్పష్టం చేశారు. 2012 నాటి తుడా ధరల ప్రకారం కొనుగోలు చేసినట్లు ఆయన వివరిం చారు. మొక్కల కొనుగోలులో తుడా భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. రా ష్ట్ర అటవీ, హార్టికల్చర్ శాఖలు నిర్ణయించిన ధరలను పక్కనపెట్టి దేవస్థానం ఆటవీ శాఖాధికారులు తుడా ధరలను అమలు చేయడంతోనే అ వినీతికి తలుపులు తెరుచుకున్నాయి. తిరుపతిలోని నర్సరీల్లో ఫాక్స్‌టైల్ ఫామ్ రూ.200 రూపాయలకు, పైటస్ రూ.50 నుంచి రూ.75 మధ్య లభ్యమౌతున్నాయి.
టీటీడీ కోసం అయి తే ఇంతకంటే తక్కువ ధరలకు ఈ మొక్కలను సరఫరా చేసేందుకు నర్సరీల యజమానులు సిద్ధంగా ఉన్నారు. అయినా రెండో కంటికి తెలియకుండా, టెండర్ పిలవకుండా ఈ వ్యవహారం నడపడం వెనుక ఉన్న ఉద్దేశం లక్షల రూపాయలు వెనుకేసుకోవడమే అని తెలిసింది. తిరుచానూరు నుంచి అలిపిరి వరకూ 14 కిలోమీటర్ల దూరంలో మొక్కలు నాటే భారీ ప్రాజెక్టును ప్రారంభించే ముందు టెండర్ ప్రక్రియకు వెళ్లకపోవడం వెనుక దేవస్థానం పరిపాలనా విభాగంలోని ఉన్నతస్థాయి అధికారుల హస్తముందున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవస్థానం అటవీ శాఖకు ఇప్పటికే కోట్ల రూపాయల ప్రాజెక్టులు మంజూరయ్యాయి. మొక్కల కొనుగోలులోనే నిబంధనలకు పాతరేసిన అధికారులు ఈ ప్రాజెక్టుల విషయంలో ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.