దున్నపోతు తొక్కితే.. దోషాలు మటుమాయం
దున్నపోతు తొక్కితే దోషాలు ఇట్టే మాయమైపోతాయని ఆ ఊరివాసులు నమ్ముతారు. కొత్తపల్లి మండలంలోని మత్స్యకార గ్రామమైన అమీనాబాద్‌లో గ్రామ దేవత పోలేరమ్మతల్లికి నిర్వహించే జాతరలో ఈ వింత ఆచారం కానవస్తుంది. అమ్మవారి జాతర బుధవారం జరిగిన సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం నుంచీ ఉపవాసం ఉన్న గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే పూజలు చేసిన దున్నపోతును గరగ నృత్యాలతో గ్రామంలో ఊరేగించారు. సాయంత్రం పోలేరమ్మతల్లి కొత్త ఆలయంవద్ద కొంతమంది మహిళలను గ్రామ దేవతలుగా భావించి, వారి తలపై పసుపు నీళ్లు పోసి పూలదండలు వేశారు.
అనంతరం ఉపవాసం ఉన్న భక్తులందరూ స్నానాలు చేసి పాత ఆలయం వరకూ సాష్టాంగంగా పడుకున్నారు. వారిపై నుంచి గ్రామ దేవతలుగా భావించిన మహిళలు, దున్నపోతు మూడుసార్లు నడిపించారు. అనంతరం తీర్థం మొదలైంది. ఇది పూర్వంనుంచీ వస్తున్న ఆచారమని, దీనివల్ల గ్రామానికి పట్టిన అరిష్టాలు తొలగిపోతాయన్నది తమ విశ్వాసమని భక్తులు అన్నారు. కొత్తపల్లి, ఉప్పాడ, యండపల్లి తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
- అమీనాబాద్ (కొత్తపల్లి)