గ్రామాలకు నీరొచ్చేసింది
తన నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు పట్టువీడని విక్రమార్కుడిలా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేసిన పోరాటాలు ఫలించాయి. తాగునీటి దగ్గర రాజకీయాలను సహించనని, 4వ తేదీలోపు నీటి పథకాన్ని ప్రారంభించకుంటే ప్రజలతో కలిసి తామే ఆ పని చేసుకుంటామని శనివారం ఆయన హెచ్చరించడంతో అధికారపార్టీ నాయకులు, అధికారుల్లో చలనం వచ్చింది. ఆదివారం ప్రాజెక్టును ప్రారంభించి గ్రామాలకు నీరు సరఫరా చేశారు.
కూడేరు : మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన సమగ్ర గ్రామీణ రక్షిత నీటి పథకాన్ని అధికారులు ఎట్టకేలకు ఆదివారం ప్రారంభించి గ్రామాలకు నీరు సరఫరా చేశారు. కూడేరు మండలమంతటికీ నీరందింది. నియోజవర్గంలోని కూడేరు, ఉరవకొండ, వజ్రకరూర్, విడపనకల్లు మండలాల్లోని 90 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేందుకు 2013 నవంబర్‌లో రూ.56 కోట్లతో ఈ పథకం పనులు ప్రారంభించారు. కానీ పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. నిబంధనల మేరకు 2015 నవంబర్‌తో గడువు ముగిసినా పనులు పూర్తి కాలేదు. దీంతో గడువు మళ్లీ పొడిగించారు. తర్వాత కూడా పనులు వేగం పుంజుకోలేదు. ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ పనులను పర్యవేక్షిస్తూ వచ్చారు. పలుమార్లు ఇరిగేషన్ అధికారులను కలిసి తాగునీటి సమస్య తీవ్రతను వివరించారు.
స్పందించిన అధికారులు పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో 3 నెలల క్రితం పనులు పూర్తయ్యాయి. కానీ దాని ప్రారంభానికి అధికారపార్టీ నాయకులు అడ్డు తగులుతూ వచ్చారు. దీనిపై సాక్షి దినపత్రిక కొన్ని కథనాలను కూడా ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. చివరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన నిలిచి పోరాటానికి దిగారు. మే 4వ తేదీ లోపు ప్రారంభించకుంటే ప్రజా ఉద్యమం చేపట్టి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తామే ప్రారంభించుకుంటామని శనివారం కూడేరులో చేపట్టిన ధర్నాలో డెడ్‌లైన్ పెట్టి హెచ్చరించారు. దీంతో ఇరిగేషన్ అధికారుల్లోనూ, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లోనూ చలనం వచ్చింది. ప్రాజెక్టును ప్రారంభించడంతో ప్రజల దాహార్తి తీరుతోంది.