ఘనంగా ప్రారంభమైన కాణిపాకం బ్రహ్మోత్సవాలు
కాణిపాకం, న్యూస్‌లైన్:
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఆలయంలోని అన్వేటి మండపంలో స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషిక పటాన్ని ఉంచి గణపతి పూజ, స్వస్తివాచనం, నవగ్రహ సంధి, పుణ్యాహవచనంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వాతి నక్షత్రం, కన్యాలగ్నంలో 7 నుంచి 8గంటల మధ్య ధ్వజస్తంభంపై మూషికపటాన్ని ఎగురవేశారు. అనంతరం ధ్వజ స్తంభానికి క్షీర, చందనద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తదుపరి ప్రత్యేక పూజలు జరిపి ధ్వజ స్తంభాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు.
అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం కాణిపాకం పురవీధులలో మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి గ్రామోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అన్వేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో 108 కలశాలను ఉంచారు. అందులో పుట్టమన్ను, నవధాన్యాలు వేసి ప్రత్యేక పూజలతో అంకురార్పణ నిర్వహిం చారు. బ్రహ్మోత్సవాల బాధ్యతలు నిర్వహించే ఈవో పూర్ణచంద్రరావుకు ఆలయ ప్రధాన అర్చకులు రక్షా బంధన కంకణాన్ని తొడిగారు.
హంస వాహనంపై గణనాథుడు
బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి గణనాథుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లెకు చెందిన శీర్కరుణీకర్ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. మందుగా స్వామివారి మూలవిరాట్‌కు ఉభయదారులతో ప్రత్యేక అభిషేకం నిర్వహిం చారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు. ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలతో ముందు గా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాల మధ్య పురవీధులలో ఊరేగించారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆదికేశవపిళ్లై, ఏసీ గురుప్రసాద్, ఆలయ ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి, సూపరింటెం డెంట్ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.