వణికిస్తున్న వైరల్ ఫీవర్స్
కోరలు చాస్తున్న డయేరియా
వాంతులు, విరోచనాలతో పిల్లలు విలవిల
సిరిసిల్లలో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
సిరిసిల్ల : సిరిసిల్ల ప్రాంతంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అతిసారం కోరలు చాస్తోంది. జ్వరం, వాంతులు, విరోచనాలతో జనం విలవిలలాడుతున్నారు. వర్షాలతో తాగునీరు కలుషితం కావడం, దోమలు, పందుల స్వైరవిహారం, పారిశుధ్యలోపం కారణంగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వరం, డయేరియాకు గురైనవారు వారం రోజులైనా కోలుకోవడం లేదు. ముఖ్యంగా జలుబు, తలనొప్పి, చలిజ్వరంతో మంచంపడుతున్నారు. ఒళ్లంతా వేడిగా ఉండి బలహీనపడుతున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వంద మందికిపైగా జ్వరపీడితులు, డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో, ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద మరో ఐదారు వందల మంది వైద్యం చేయించుకుంటున్నారు. ఇందులో మూడు వందల మంది పిల్లలే ఉన్నారు.
వణికిపోతున్న పిల్లలు..
జ్వరాలతో పిల్లలు వణికిపోతున్నారు. వాంతులు, విరోచనాలతో వాలిపోతున్నారు. సిరిసిల్ల విద్యానగర్‌కు చెందిన ఎదురు శివలక్ష్మి(8) సోమవారం నుంచి జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకురాగా.. డాక్టర్లు అడ్మిట్ చేసుకున్నారు. బీవైనగర్‌కు చెందిన గాజుల రాజేశ్వర్(7) జ్వరం, విరోచనాలతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు సోమవారమే ఆస్పత్రిలో అడ్మిట్ చేసినా.. బాలుడు కోలేకోలేదు. తల్లి వీణ బీడీ కార్మికురాలు, తండ్రి వేణు పవర్‌లూం కార్మికుడు. ఇదే కాలనీకి చెందిన పొన్నం అఖిల్(6) సైతం జ్వరం, దగ్గుతో బాధపడుతుండగా తల్లి ఆస్పత్రిలో చేర్పించింది. తల్లి లత బీడీ కార్మికురాలు. ఇలా సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రిలో 60 మంది చిన్నారులు అడ్మిట్ అయ్యారు. ఒక్క మంగళవారమే 129 మంది పిల్లలు జ్వరాలు, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ సిరిసిల్ల ఆస్పత్రికి వచ్చారు.
‘సాక్షి’ కథనంతో పెరిగిన మంచాలు..
సిరిసిల్లలో జ్వరాలు, వాంతులు, విరోచనాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ‘సాక్షి’లో వరస కథనాలు ప్రచురితమయ్యాయి. సిరిసిల్ల ఆర్డీవో జీవీ.శ్యామ్‌ప్రసాద్‌లాల్ ఆస్పత్రి సూపరింటెండ్ గూడూరి రవీందర్‌తో మాట్లాడి అదనపు మంచాలను ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
రోజూ 120 పైగా కేసులు..
– డాక్టర్ మురళీధర్‌రావు, పిల్లల వైద్యనిపుణులు
సిరిసిల్లలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. పిల్లలకు వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. రోజూ 120 పైగా కేసులు వస్తున్నాయి. ఈ రోజు 129 మంది పిల్లలు వచ్చారు. తీవ్రతను బట్టి పిల్లలను అడ్మిట్ చేసుకుని వైద్యం అందిస్తున్నాం. ఈ వ్యాధులు ఎక్కువగా కలుషితమైన నీళ్లు తాగడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్లనే వస్తున్నాయి. అందుకని కాచివడబోసిన మంచినీరు తాగాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పిల్లలకు ఎలక్ట్రాల్ పౌడర్ తాగించాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.