పోరుబాట పడదాం
‘రైతులు, మహిళలు, ఇతర వర్గాలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చడం లేదు. కల్లబొల్లి కబుర్లతో ప్రచారం చేసుకుంటోంది తప్పా ఒక్కరికీ కూడా సాయం అందడం లేదు. దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రజల్లోకి వెళ్లండి. ప్రభుత్వ వైఫల్యాలపై వారిని చైతన్యవంతులను చేయండి’.
‘గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి. అందుకు నేతలందరూ సమన్వయంతో పనిచేయండి. పార్టీ కూడా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళి కను రూపొందిస్తుంది’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పార్టీ నేతలతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రభుత్వ దొంగాట, ఇంతవరకు తుపాను బాధితులకు అందని ప్రభుత్వ సహాయం తదితర అంశాలపై సవివరంగా చర్చించారు. జిల్లాలో పార్టీ స్థితిగతులు, పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడులతోపాటు జిల్లాలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం
అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని వైఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కూడా హామీలు నెరవేర్చకుండా మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటూ కాలం గడుపుతోందన్నారు. రైతు రుణమాఫీ హామీ అపహాస్యం పాలు చేసిందని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళల రుణాల మాఫీ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు ఆ మాటే మరిచిపోయారన్నారు. ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు.
5న విశాఖ ధర్నాకు హాజరవుతా..
ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా ఉండాలని పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. అందుకోసం పార్టీ రూపొందించిన నిరసన కార్యక్రమాల్లో పార్టీ నేతలు, శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలన్నారు. డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద చేపట్టనున్న ధర్నాలను విజయవంతం చేయాలన్నారు. విశాఖపట్నంలో నిర్వహించే ధర్నాకు తాను హాజరవుతానని ఆయన చెప్పారు.
గ్రేటర్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలి
త్వరలో జరగనున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి మద్దతు కూడగట్టాలన్నారు. పార్టీ విజయం సాధించేందుకు పుష్కలంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కచ్చితంగా పార్టీ గెలుచుకోవాలని స్పష్టం చేశారు. అందుకోసం పార్టీ అధిష్టానం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందని కూడా ఆయన చెప్పారు. జిల్లాలో నేతలకు జీవీఎంసీలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని ఆయన తెలిపారు. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే డివిజన్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని నేతలకు కర్తవ్యబోధ చేశారు.
పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశాలు
జిల్లా పార్టీ నేతలతో సమావేశం అనంతరం వారితో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. పార్టీ నిర్మాణం, ఉద్యమ కార్యాచరణ తదితర అంశాలపై వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారి సూచనలకు ఆయన సానుకూలంగా స్పందించారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, మైసూరారెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు బలివాడ సత్యారావు, గొల్ల బాబూరావు, తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తి రెడ్డి, చెంగల వెంకట్రావులు పాల్గొన్నారు.
వారితోపాటు నియోజకవర్గ సమన్వయకర్తలు వంశీకృష్ణ, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రగడ నాగేశ్వరరావులతోపాటు పార్టీ నేతలు బొడ్డేటి ప్రసాద్, కంపా హనోక్, జాన్‌వెస్లీ, సత్తి రామకృష్ణారెడ్డి, వీసం రామకృష్ణ, కొయ్య ప్రసాదరెడ్డి, పోతల ప్రసాద్, గుడ్ల పోలిరెడ్డి, దామా సుబ్బారావు, భూపతిరాజు శ్రీనివాసరాజు, అంకంరెడ్డి, జమీల్, పక్కి దివాకర్, అదీప్‌రాజు, పీలా ఉమారాణి, ఉషాకిరణ్, పీలా వెంకటలక్ష్మి, నీలం శారద, డాక్టర్ రాజశేఖర్, రవిరెడ్డి, ఉరుకూటి అప్పారావు, జీలకర్ర నాగేంద్ర తదితరులు హాజరయ్యారు. వ్యక్తిగత పనులు ఉన్నందున తాము ఈ సమావేశానికి హాజరుకాలేమని ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, భీమిలి సమన్వయకర్త కర్రి సీతారాం పార్టీకి ముందుగానే సమాచారమిచ్చారు.