‘పశ్చిమ’ కోడలికి కేంద్ర కేబినెట్లో స్థానం
డాక్టర్ పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్‌కు మంత్రి పదవి,
నరసాపురంలో హర్షాతిరేకాలు
నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్: జిల్లా కోడలికి కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో స్థానం లభించింది. మాజీ మంత్రి పరకాల శేషావతారం కోడలు, విశాలాంధ్ర పరిరక్షణ వేదిక నాయకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ సతీమణి నిర్మల్ సీతారామన్‌కు ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా చోటు కల్పించారు. నిర్మల్ చాలాకాలంగా బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. భర్త పరకాల ప్రభాకర్‌తో పాటు నిర్మల బీజేపీలో పలు క్రీయాశీలక పదవుల్లో పనిచేశారు. అయితే ప్రభాకర్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
ఆ తర్వాత ఆయన పీఆర్పీకి గుడ్‌బై చెప్పారు. ఆయన భార్య నిర్మల మాత్రం బీజేపీలో కొనసాగుతూ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ పార్టీలో మంచి గుర్తింపు పొందారు. పార్టీకి సంబంధించిన పలు విధాన నిర్ణయాలను సమర్థవంతంగా వ్యక్తీకరించడంలో ఆమె తనదైన ముద్రను వేసుకున్నారు. ఊహించని విధంగా నిర్మలకు నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కింది. సోమవారం సాయంత్రం ఆమె కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రస్తుతం ఆమె పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలో కూడా సభ్యురాలు కాకపోయినప్పటికీ ఆమెలో ఉన్న నైపుణ్యం, పార్ట్టీ పట్ల అంకితభావం నిర్మలకు మంత్రి పదవి దక్కడానికి ప్రధాన కారణ మైందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా తెరమరుగైందనుకున్న పరకాల కుటుంబానికి మూడు దశాబ్దాల తర్వాత మంత్రి పదవి దక్కడంతో మరోసారి ఆ కుటుంబం రాజకీయంగా తెరపైకి వచ్చినట్లయ్యిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
1986లో ప్రభాకర్‌తో వివాహం
చెన్నైకు చెందిన నిర్మల సీతారామన్ 1986లో నరసాపురం కోడలయ్యింది. పట్టణానికి చెందిన మాజీ మంత్రి పరకాల శేషావతారం తనయుడు డాక్టర్ పరకాల ప్రభాకర్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడి కొంతకాలం ప్రణవ్ పబ్లిక్ స్కూల్‌ను నిర్వహించారు. తర్వాత బీజేపీలోకి చేరి పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ఆమె గత మూడేళ్లుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. 2003-05 లో జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలుగా కూడా సేవలందించారు.