విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
విశాఖ ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద సిబ్బంది ఆందోళన
సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలు మూత
విశాఖపట్నం , న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లాలోనూ విద్యుత్ ఉద్యోగులు ఆదివారం మెరుపు సమ్మెకు దిగారు. ట్రాన్స్‌కో, జెన్కో, విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బంది విధులను బహిష్కరించారు. జెన్కో ఉద్యోగులంతా సీలేరు జలవిద్యుత్ కేంద్రం మెయిన్‌గేటు వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలోని మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి.
నాలుగింట 505 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖ మహారాణిపేటలోని ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ఆ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ ఇ.గణపతి మాట్లాడుతూ పేరివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు విషయంలో ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. 2014 నూతన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని కోరారు.
ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు అదనపు పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పరిమితి లేకుండా వైద్యఖర్చులు చెల్లించాలన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని కోరారు. అనంతరం ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సత్యనారాయణ, ఉప కన్వీనర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.
మాచ్‌ఖండ్ సిబ్బంది ఆందోళన
ముంచంగిపుట్టు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కారించాలంటూ ఆదోళన చేశారు. పీఆర్సీని అమలు చేయాలని జలవిద్యుత్ కేంద్రం కార్మిక, ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఈ కార్యలయం ఎదుట ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్ సమస్యను ప్రభుత్వం అమలు చేయకుంటే అత్యవసర సేవలు స్తంభింప చేస్తామని హెచ్చరించారు.