ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయం
తిరుచానూరు : ప్రభుత్వ పాఠశాలలు, విద్యారంగ పరిరక్షణే ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) ధ్యేయమని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తెలిపారు. తిరుపతి రామతులసీ కల్యా ణ మండపంలో ఆదివారం ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన యూటీఎఫ్ జిల్లా స్థాయి విద్యా చైతన్య సదస్సుకు విఠపు బాలసుబ్రమణ్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై యూటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన ఉన్న ఏకైక సంఘం యూటీఎఫ్ అని తెలిపారు. యూటీఎఫ్ వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలతో ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలో పడిందన్నారు. చైతన్యం కలిగిన ఉపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలను యూటీఎఫ్ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
పేదలకు విద్యాబుద్ధులు నేర్పి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకునే లక్ష్యంగా యూటీఎఫ్ పనిచేయాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు సుభాష్ చంద్రబోస్, పీ.బాబురెడ్డి మాట్లాడుతూ అడ్డగోలు ఉత్వర్వులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, పాఠశాలల పనివేళలు మార్చాలని, సర్దుబాటు ఉత్తర్వులను నిలిపేయాలని తెలిపారు.
హెల్త్‌కార్డులపై ఉన్న ఆంక్షలు తొలగించి, నగదు రహిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని, రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, పీఎఫ్‌ను ఆన్లైన్ ఖాతాగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు యూటీఎఫ్ భవనం నుంచి కల్యాణ మండపం వరకు ర్యాలీగా వచ్చారు.
ఈ విద్యా చైతన్య సదస్సులో పుత్తూరు డీవైఈవో శేఖర్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు వీ.రవి, ఎన్జీవో నాయకులు సురేంద్ర, డిగ్రీ లెక్చరర్ల సంఘం నాయకులు రామచంద్ర, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోదందరెడ్డి, అధ్యక్షులు శ్రీరామమూర్తి, ప్రధాన కార్యదర్శి సోమచంద్రారెడ్డి, సహాధ్యక్షులు వరలక్ష్మి, రమణయ్య, కార్యదర్శులు రవిప్రకాష్, ఎస్ఎస్.నాయుడు, ముత్యాలరెడ్డి, బండి మదుసూధన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, నిర్మల, చంద్రశేఖర్‌రెడ్డి, వందలాది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వర్క్ అడ్జెస్ట్మెంట్ మెమోను రద్దు చేయాలి
సర్దుబాటు(వర్క్ అడ్జెస్ట్మెంట్) పేరుతో ఉపాధ్యాయు ల్లో గందరగోళం నెలకొందని, తక్షణమే వర్క్ అడ్జెస్ట్మెంట్ మెమో నం బర్ ఆర్టీ 25ను రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా స్థాయి విద్యా చైతన్య సదస్సులో ఆ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. వక్తలు మాట్లాడుతూ సర్దుబాటు నిర్ణయంతో ఉపాధ్యాయులు విద్యాభివృద్ధిపై అనాసక్తి కనబరుస్తున్నారన్నారు.
యూపీ పాఠశాలల మనుగడకే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. డైస్ 2013-14న ఆధారంగా చేసుకుని ఈ విద్యాసంవత్సరంలో ఎలాంటి రేషనలైజేషన్ చేయకూడదని కోరారు. విద్యారంగ పరిరక్షణ పేరుతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే విద్యార్థులు బడిలో కాకుండా బయట ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ.బాబురెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.రవి పాల్గొన్నారు.