అధికారుల చేతుల్లో రైతుల వివరాలు
► ఇంటింటా నిర్వహిస్తున్న సర్వే
► పూర్తి వివరాలు సేకరణ
జైనథ్ : మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లోని 55 గ్రామాల్లో రైతుల వారీగా పక్క వివరాలు నమోదుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యవసాయాధికారి ఏవో వివేక్, కొత్తగా విధుల్లోకి చేరిన ఏఈవోలు ఈ పనులను ప్రారంభించారు. ప్రత్యేకంగా రూపొందిన ప్రొఫార్మాలతో ఏఈవోలు వారి సెక్టార్ పరిధిలోని గ్రామాల్లో సర్వేలను ప్రారంభించారు.
రైతుల పూర్తి సమాచారం..
ప్రత్యేకంగా చేపడుతున్న ఈ సర్వేలో రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వేల కోసం ప్రత్యేకంగా రూపొందిన ప్రొఫార్మాలో ఏఈవో సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. దీంట్లో రైతుల పేర్లు, తండ్రి పేరు, గ్రామం, శివారం, ఆధార్ నంబర్, సర్వే నంబర్‌తో పాటు ముబైల్ నంబర్ కూడ నమోదు చేస్తున్నారు. ఇవే కాకుండా రైతులు ప్రస్తుతం వేసిన, వేస్తున్న పంటల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. రైతులకు పంట రుణం ఉందా? బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉందా? అనే అంశాలు కూడా సేకరిస్తున్నారు.
వీటితో పాటు రైతులకు అతి ముఖ్యమైన నీటి పారుదల అంశంపై ఈ సర్వేలు వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులకు నీటి పారుదల వసతి ఉందా? ఉంటే బావుల ద్వారా ఎంత? కాల్వల ద్వారా ఎంత ఉంది? అనే కోణంలో వివరాలు నమోదు చేస్తున్నారు? కాగా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం కోసం యంత్ర పరికరాలు, డ్రిప్ సిస్టమ్, ట్రాక్టర్లు వంటివి ఎంత మందికి అందుబాటులో ఉన్నాయనే అంశాలను సైతం ప్రాధాన్యంగా సర్వే చేస్తున్నారు.
సేంద్రీయ వ్యవసాయంపై ఎంతమంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు? ఎంత మందికి వర్మీ కంపోస్ట్, నాడెం కంపోస్ట్ యూనిటులు ఉన్నాయి? వంటి రైతుల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు ఈ సర్వేలు నిర్వహిస్తున్నట్లు ఆధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సర్వే ద్వారా రైతుల సమగ్ర సమాచారం అందుబాటులోకి రావడంతో వ్యవసాయ శాఖ సేవలు మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉంది.
15రోజుల్లో సర్వే పూర్తి...
మండలంలో గత కొన్ని రోజులుగా ఈ సర్వే నిర్వహిస్తున్నాము. ఒక్కొక్క ఏఈవో పరిధి లో 2వేల మంది రైతులు ఉన్నారు. ఈ లెక్క న 15రోజుల్లో సర్వే పూర్తి చేసి, తుది నివేదికలు సిద్ధం చేస్తాం. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం పథకలు అర్హులైన రైతులకు మాత్రమే అందేలా చూడటంతో పాటు, రైతులకు మరింత వేగవంతంగా, నాణ్యతతో సేవలిందవచ్చు.
– వివేక్, ఏవో