సెక్షన్-8 సభ రసాభాస
చంద్రబాబును రక్షించేందుకే సెక్షన్ 8ను లేవనెత్తారు
మంత్రులను నిలదీసిన విశాఖ న్యాయవాదులు
సాక్షి, విశాఖపట్నం: ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8 అమలు చేయాలనే డిమాండ్‌తో విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన సదస్సు రసాభాసగా ముగిసింది. ఏపీ ప్రభుత్వం తెరవెనుక ఉండి నిర్వహించిన ఈ సదస్సు ఎదురుతిరిగింది. న్యాయవాదులు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టడంతో నిర్వాహకులు వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాంతో సదస్సు గందరగోళంగా మారింది. రాష్ట్ర విభజన బిల్లులోని సెక్షన్-8 అమలు, సవరణపై విశాఖపట్నంలో ఓ హోటల్లో బుధవారం చర్చావేదిక నిర్వహించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్‌బాబు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ఏపీ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షుడు సీహెచ్ కృష్ణాంజనేయులు తదితరులంతా వేదికపై కూర్చొన్నారు. ముందుగా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడించడాన్ని సీనియర్ న్యాయవాది పలకా శ్రీరామ్మూర్తి వ్యతిరేకించారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని అడగాలే గానీ సెక్షన్-8 ఒక్కటే అమలు చేయండని డిమాండ్ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
‘‘ఓటుకు కోట్లు కేసు వచ్చినప్పటినుంచి సెక్షన్-8 గుర్తుకు వచ్చింది. రేవంత్‌రెడ్డి కేసు నుంచి అందరినీ మభ్యపెట్టేందుకే తప్ప ప్రజల కష్టాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు’’అని ఆయన నిలదీశారు. పదవులేమో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అనుభవిస్తారు. కానీ వారు అవినీతిచేసి దొరికిపోతే బయటపడేందుకు మొత్తం ఐదుకోట్ల ప్రజలను అడ్డుపెట్టుకుంటారా?అని నిలదీశారు. దాంతో నిర్వాహకుల మద్దతుదారులు పెద్దగా అరుస్తూ శ్రీరామ్మూర్తిపై చెయ్యి చేసుకుంటూ సదస్సు ప్రాంగణం నుంచి బయటకు గెంటివేశారు. ఈ ఘర్షణలో శ్రీరామ్మూర్తికి స్వల్ప గాయాలయ్యాయి. న్యాయవాది గాయపరచడమే కాకుండా గెంటివేయడంపై సదస్సుకు హాజరైన రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ అధ్యక్షుడు, విశాఖపట్నం బార్ అసోషియేషన్ అధ్యక్షుడు జె.పృథ్వీరాజ్ తీవ్రంగా స్పందించారు. సదస్సును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. దాంతో నిర్వాహకులు ఆయనకు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు.