తెలంగాణ రైతులకూ ఇవ్వాలి...
‘‘నిర్మాతల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన డబ్బులో ఏకంగా పాతిక లక్షల రూపాయలు వైజాగ్ పునర్నిర్మాణం కోసం ప్రకటించి తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి మరోసారి తమ వివక్షను చాటుకుంది’’ అని తెలంగాణ సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి దుయ్యబట్టారు. ‘తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి’ మనది అనే భావనతో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది తెలంగాణ నిర్మాతలు కౌన్సిల్లో సభ్యులుగా చేరి కోట్లాది రూపాయలు సభ్యత్వ రుసుముగా చెల్లించారన్న యాదిరెడ్డి, ఏనాడూ తెలంగాణకు చెందిన చిన్న నిర్మాతల ప్రయోజనాల విషయంలో నిర్మాతల మండలి శ్రద్ధ చూపించలేదని ఆరోపించారు.
తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల కోసం కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి పాతిక లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 18 కోట్ల కౌన్సిల్ మిగులు నిధుల్ని సభ్యుల అంగీకారం తీసుకోకుండా ఇలా దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదన్నారు.