రైతన్న కన్నెర్ర
సాక్షి, హనుమాన్‌జంక్షన్ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా హనుమాన్‌జంక్షన్ వేదికగా నిర్వహించిన రైతు గర్జన సభ విజయవంతమైంది. రాష్ట్ర విభజనతో రైతులకు జరిగే నష్టాన్ని వివరించేందుకు జిల్లా జేఏసీ చేసిన కృషి పలించింది. రైతులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ విద్యుత్, సాగునీరు వంటి రంగాల నిపుణులు పాల్గొని రాష్ట్ర విభజన జరిగితే జరిగే నష్టాలను వివరించి రైతులకు అవగాహన కల్పించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సారథులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి దిశనిర్దేశం చేశారు.
రాజకీయాల్లో అవకాశవాద కలుపుమొక్కలుగా ఉండే నాయకులను ఏరిపారేయాలని సభ స్పష్టం చేసింది. సమైక్య ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిర్వహిస్తున్న ఉద్యోగులకు అవసరమైతే రైతులే జోలిపట్టి జీతాలు ఇస్తారని పలువురు రైతు ప్రతినిధులు ప్రకటించడం విశేషం. అందరికీ అన్నంపెట్టే రైతు జోలి పట్టకూడదని.. తమ జీతాలు రాకపోయినా, జీవితాలు ఫణంగాపెట్టి అయినా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామంటూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు.
ఈ రైతు గర్జన సభా వేదిక నుంచే రైతులు రంగంలోకి దిగి ఉద్యమాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, మండలం, జిల్లాతో పాటు రాష్ట్రస్థాయికి రైతు కమిటీలను ఏర్పాటు చేసుకుని సమైక్య ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పలువురు పిలుపునిచ్చారు. రైతు రోడ్డెక్కితే పాలకుల జాతకాలు తిరగబడతాయని, సమైక్యపోరుకు రైతు గర్జనతో ఇప్పుడు నిండుతనం వచ్చిందని పలువురు కితాబిచ్చారు.
రాజీనామా చేయని నేతలు ద్రోహులే...
తమ పదవులకు రాజీనామా చేయని కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ద్రోహులుగా తేల్చిన సభ వారికి 2014 ఎన్నికల్లో ఓటు అనే బుల్లెట్‌తో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చింది. వారి పదవులకు రాజీనామా చేసేలా ఒత్తిడి పెంచాలని, వారి ఇళ్ల వద్ద మరోమారు ఆందోళనలు నిర్వహించాలని రైతు గర్జన సభ నిర్ణయించింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించుకోవడమా? ఆమోదించుకునేలా తాము రంగంలోకి దిగడమా? అనే రెండు ఆప్షన్లు ఇస్తున్నట్టు రైతు గర్జన సభ అల్టిమేటం ఇచ్చింది. పదవుల కోసం ఢిల్లీ అధిష్టానం చాటున నక్కిన కేంద్ర మంత్రులు, ఎంపీలను స్థానిక నియోజకవర్గాల్లో తిరగనీయకుండా అడ్డుకోవాలని రైతు గర్జన సభ పిలుపునిచ్చింది. రాహుల్ కోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టే కాంగ్రెస్ ఆటలు సాగనిచ్చేది లేదని పలువురు వక్తలు హెచ్చరించారు.
సమైక్యం కట్టుబడిన నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్..
ఎన్టీఆర్, వైఎస్సార్ సమైక్యాంధ్ర కోసం పాటుపడ్డారని పలువురు ప్రతినిధులు కితాబిచ్చారు. కృష్ణా-గోదావరి డెల్టా ఏడారి కాకూడదన్న ఆశయంతో వైఎస్ జలయజ్ఞం చేపట్టారని, దాన్ని అడ్డుకుని కొందరు మనకు అన్యాయం చేస్తున్నారంటూ జలవనరుల నిపుణులు ఉదాహరణలతో వివరించారు. రాష్ట్రం విడిపోతే కృష్ణా-గోదావరి డెల్టా ఏడారిగా మారిపోతుందని, జలయుద్ధాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ పరుచూరి అశోక్‌బాబును పలువురు అభినందనలతో ముంచెత్తారు. కేసీఆర్ కాంగ్రెస్ తయారుచేసిన కలియుగ హంస అని, అందుకే పాలునీళ్లులా కలిసున్న సీమాంధ్ర, తెలంగాణను వేరుచేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ అశోక్‌బాబు చెప్పిన కథ అందర్నీ ఆకట్టుకుంది.
ఆకట్టుకున్న నినాదాలు..
సభా ప్రాంగణానికి ఆచార్య ఎన్జీరంగా ప్రాంగణంగా నామకరణం చేశారు. సభా వేదికకు సర్ ఆర్ధర్ కాటన్ వేదికగా తీర్చిదిద్దారు. సభా ప్రాంగణంలో జై సమైక్యాంధ్ర, గ్రామ స్వరాజ్యం, జై జవాన్ జైకిసాన్, దేశానికి వెనుముక రైతన్న అనే నినాదాలను ఏర్పాటు చేశారు. ఈ సభలో విద్యార్థులు ప్రదర్శించిన సమైక్యాంధ్ర సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రైతు గర్జనలో గజల్ శ్రీనివాస్ ఆలపించిన గీతలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబుతోపాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షుడు కలగ కమలాకరశర్మ, జలవనరుల నిపుణుడు పీఏ రామకృష్ణంరాజు, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రప్రసాద్, కిసాన్ సేవా అధ్యక్షులు అక్కినేని భవాని ప్రసాద్, రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంవీ సూర్యనారాయణరాజు, మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, మాదిగ దండోరా నాయకుడు వెంకటేశ్వరరావు, అన్నపూర్ణ తదితరులు రైతులను ఉత్తేజం చేసేలా ప్రసంగించారు.
రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ ఉపాధ్యక్షుడు ఎం.సత్యానందం, నీటి సంఘాల అధ్యక్షుల రాష్ట్ర నాయకులు ఆళ్ల వెంకటగోపాలకృష్ణ, రుద్రరాజు పండురాజు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉత్తమరైతు గొర్రిపర్తి నరసింహారాజు యాదవ్, జిల్లా జేఏసీ అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, జాయింట్ కన్వీనర్ చలసాని ఆంజనేయులు, ఎం.వెంకటేశ్వర్లు, ఎన్ఎస్వీ శర్మ, ఎండీ ప్రసాద్, పి.సత్యనారాయణ, సుంకర సుబాష్‌చంద్రబోస్, గుంపపనేని ఉమా వరప్రసాద్, జి.వెంకటేశ్వరరావు, పీవీ రమణమూర్తి, బి.వెంకటేశ్వరావు, వీరమాచినేని సత్యప్రసాద్, త్రిపురనేని బాబూరావు, మత్తి కమాలకరరావు తదితరులు పాల్గొన్నారు.