శాప్ మాజీ కోచ్ సూర్యనారాయణ మృతి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ప్రముఖ అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ వి.సూర్యనారాయణ(91) శుక్రవారం రాత్రి మృతి చెందారు. గతంలో ఆయన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) అథ్లెటిక్స్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో పలువురు జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్లను తీర్చిదిద్దిన ఘనత సూర్యనారాయణది. ఆయన శిష్యరికంలో అంతర్జాతీయ అథ్లెట్ ఎస్.ఎ.నాయుడు వెలుగులోకి వచ్చాడు. అతను 110 హర్డిల్స్‌లో భారత్ తరఫున అనేక అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్‌ల్లో పాల్గొన్నాడు. అథ్లెటిక్స్‌లో చిన్నారులను ప్రోత్సహించేందుకు ఆయన చిల్డ్రన్ ఒలింపియాడ్, లిమ్కా రేసు, ఒలింపిక్ రన్లను 30 ఏళ్ల పాటు నిర్వహించారు. 1970 నుంచి 2000 వరకు ఈ పోటీలను కొనసాగించారు. రాష్ట్ర వెటరన్ అసోసియేషన్‌లో పలు పదవులు చేపట్టిన సూర్యనారాయణ భారత వెటరన్ అథ్లెటిక్స్ సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు.
ఆయన మృతి పట్ల హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ (హెచ్‌డీఏఏ) ప్రధా న కార్యదర్శి డాక్టర్ రాజేష్ కుమార్, కోశాధికారి భాస్కర్‌రెడ్డి, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్‌లు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే బీఎస్ఎన్ఎల్ జాతీయ మాజీ అథ్లెట్ తారావతి సింగ్ (52) మృతి పట్ల ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారావతి జాతీయ అథ్లెటిక్స్ టెక్నికల్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.