వీటీపీఎస్ కెనాల్లో ముగ్గురు గల్లంతు
విజయవాడ: ఇక్కడి ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో గురువారం తండ్రి, ఇద్దరు కొడుకులు దూకి గల్లంతయ్యారు. వారి బంధువైన ఓ వృద్ధురాలు కూడా దూకగా, స్థానికులు కాపాడారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన మహేశ్వర హనుమాన్ ప్రసాద్ (35) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య శ్రీలక్ష్మితో అతడికి మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హనుమాన్‌ప్రసాద్ తన కుమారులు శివభార్గవ్(9), గోపీచంద్(7)తో కలిసి అమ్మమ్మ వరుసైన పులిపాటి పుష్పావతి(70) ఇంటికి చేరాడు.
ఆమెతో కలిసి గురువారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం వచ్చాడు. తామందరం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్యకు ఫోన్‌చేసి చెప్పాడు. అనంతరం అంతా కలసి స్థానిక ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్ వంతెనపై నుంచి కాలువలో దూకారు. స్థానికులు పుష్పావతిని కాపాడారు. హనుమాన్‌ప్రసాద్, ఇద్దరు కుమారుల ఆచూకీ దొరకలేదు. వీరి ఆత్మహత్యాయత్నానికి కారణం తెలియలేదు.