యువతికి అరుదైన ఆపరేషన్
శ్రీనగర్‌కాలనీ: పునరుత్పత్తి అవయవాలతోపాటు జననాంగం లేని 26 సంవత్సరాల యువతికి ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ డి.పద్మావతి న్యూ వెజీనా రీ కన్స్ట్రక్షన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ సందర్భంగా శనివారం కృష్ణానగర్‌లోని శీతల్ నర్సింగ్‌హోమ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సర్జరీకి సంబందించిన వివరాలను డాక్టర్ పద్మావతి వెల్లడించారు. పటాన్చెరు ప్రాంతానికి చెందిన ఒక యువతి చిన్నతనం నుండి వెజీనా ఎజెనిసిస్తో బాధపడుతుండేదని, వైద్యం కోసం తమను సంప్రదించగా ఆమెను పరీక్షించి జన్యుసంబంధ వ్యాధిగా గుర్తించినట్లు తెలిపారు.
చాలా అరుదుగా.. ఐదు లక్షల మందిలో ఒకరికి పుట్టుకతో వచ్చే జన్యుసంబంధమైన వ్యాధుల్లో వెజినా ఎజెనిసిస్ ఒకటని, ఈ విషయమై ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. ఇదే విషయాన్ని బాధితురాలికి, ఆమె తల్లిదండ్రులకు చెప్పి శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ డి.రామారావు సహకారంతో కృత్రిమ వెజీనాను సృష్టించామన్నారు. ఆపరేషన్ విజయవంవతంగా జరిగిందని, ఆమె ఆరోగ్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించవచ్చుని తెలిపారు.