ఇలా చేస్తే మోసపోరు..!
పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు పాటించాలని పెద్దలంటూ ఉంటారు. ఒక సినిమా కూడా వచ్చింది. అలాగే బ్యాంక్ లావాదేవీలు సురక్షితంగా ఉండాలంటే 12 సూత్రాలను పాటించాలన్నది నిపుణుల సూచన. బ్యాంక్ లావాదేవీల విషయంలో గతానికి, ఇప్పటికీ పోలికే లేదు. గత పదేళ్లలో బ్యాంక్ లావాదేవీల స్వరూపం సమూలంగా మారిపోయింది. కానీ ఆ స్థాయిలో జాగ్రత్తలు మాత్రం పెరగలేదు. చిన్ని చిన్ని జాగ్రత్తలతో పెద్దపెద్ద మోసాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. డబ్బులు పోయాక లబోదిబోమంటే లాభమేముంది? అందుకే బ్యాంక్ లావాదేవీల్లో, ఆన్లైన్ ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలివీ...
1 సీవీవీ నంబర్ చెరిపేయండి
చాలా మంది కార్డుదారులు చేసే సాధారణమైన తప్పు సీవీవీ (కార్డ్ వెరిఫికేషన్ వేల్యూ) నంబర్‌ను పట్టించుకోకపోవడం. ప్రతీ డెబిట్/క్రెడిట్ కార్డు వెనక మూడంకెల సీవీవీ నంబర్ ఒకటి ఉంటుంది. ఇది చాలా కీలకమైన సమాచారం. ఇది మీకు మాత్రమే తెలిసుండాలి. డెబిట్/క్రెడిట్ కార్డ్ తీసుకోగానే ముందు చేయాల్సిన పని... దీనిని చెరిపేయడం. ఈ మూడంకెల నంబర్‌ను గుర్తుపెట్టుకోవడం కానీ, లేదా గుర్తుగా వేరే చోట రాసుకోవటంగానీ చేయాలి. దీంతో ఇతరులకు మీ సీవీవీ నంబర్ తెలిసే అవకాశం లేదు. మీరు ఈ నంబర్‌ను మర్చిపోతే దీనిని తిరిగి పొందే అవకాశం లేదనే విషయాన్ని మాత్రం మరవకండి.
2 ఎవరైనా సీవీవీ నంబర్ అడిగితే...
మీ సీవీవీ నంబర్, ఎక్స్పైరీ డేట్ ఏమిటని బ్యాంక్ వాళ్లు అసలు అడగరు. ఒకవేళ వాళ్లు వెరిఫికేషన్ కోసం.. కార్డ్ నంబర్, స్టార్ట్ డేట్, మీ పుట్టిన తేదీ వివరాలను మాత్రమే అడుగుతారు. అలా కాకుండా సీవీవీ నంబర్‌ను గానీ, ఎక్స్పైరీ డేట్‌ను గానీ అడిగినట్లయితే అది ఫ్రాడ్ కేసుగా గుర్తించాలి. సీవీవీ నంబర్‌ను, కార్డ్ ఎక్స్పైరీ డేట్‌ను ఫోన్లో ఎవరికీ చెప్పడం కానీ, ఇ-మెయిల్ చేయడం కానీ ఎప్పుడూ చేయకండి.
3 మీ వాలెట్‌కు బీమా ధీమా
వన్అసిస్ట్, సీపీపీ ఇండియా వంటి సంస్థలు వాలెట్ బీమా సౌకర్యాన్నందిస్తున్నాయి. మోసాలు, దొంగతనాల నుంచి మీ వాలెట్‌ను ఈ బీమా కవర్ చేస్తుంది.
4 ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్
సీవీవీ తర్వాత మీరు జాగ్రత్త పడవలసిన మరో ముఖ్య విషయం ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్. ఎవరైనా తేలిగ్గా ఊహించేలా మీ పాస్వర్డ్ ఉండకూడదు. అలాగని మీరు కూడా మర్చిపోయేంత కష్టంగా కూడా ఉండకూడదు. మీ పుట్టిన రోజు, మీ నిక్‌నేమ్, మీకు ఇష్టమైన వాళ్ల పేర్లు అసలే పెట్టుకోకూడదు. ఈ పాస్‌వర్డ్‌లో క్యాపిటల్ లెటర్స్, నంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇది వీలైనంత పొడవుగా ఉంటే మంచిది.
పాస్‌వర్డ్‌లో ఎక్కువ అక్షరాలుంటే ఇతరులు సులభంగా ఊహించలేరు, అంతేకాకుండా మీరు టైప్ చేసేటప్పుడు వేరే వాళ్లెవరైనా గమనించినా, పట్టుకోలేరు. ఇక ఈ పాస్‌వర్డ్‌ను ఫోన్లో గానీ, ఈ మెయిల్లో గానీ సేవ్ చేసుకోకూడదు. ఒక వేళ సేవ్ చేసుకోవలసిన పరిస్థితి వస్తే పాస్‌వర్డ్‌ను ఉన్నదున్నట్లుగా కాకుండా మీకు అర్థమయ్యేలా ఏదైనా కోడ్‌భాషలో సేవ్ చేసుకోవడం ఉత్తమం. వేరే ఎవరైనా ఈ కోడ్‌ను చూసినా దానిని డీకోడ్ చేయడం కష్టమవుతుంది.
5 ఎస్ఎంఎస్ అలర్ట్ సౌకర్యం
మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ప్రతీ లావాదేవీకి ఎస్ఎంఎస్ అలర్ట్ సౌకర్యం ఉండేలా చూసుకోండి. చిన్న మొత్తానికి సంబంధించిన లావాదేవీ జరిగినా మిమ్మల్ని అలర్ట్ చేసే ఈ ఎస్ఎంఎస్ సౌకర్యం వల్ల పెద్ద పెద్ద మోసాల బారిన పడకుండా ఉండొచ్చు.
6 పిన్ నంబర్... జాగ్రత్త
మనలో చాలా మంది రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు, లేదా, పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపుకున్నప్పుడు పిన్ నంబర్‌ను నోటితే చెప్పేస్తాం. ఇలా ఎన్నడూ చేయకండి. ఇలా చెప్పడం వల్ల 99 శాతం కేసుల్లో ఎలాంటి నష్టం ఉండదు. కానీ, మీ పిన్ నంబర్ తెలుసుకున్నవాళ్లకు మీ సీవీవీ నంబర్, ఎక్స్పైరీ డేట్ కూడా తెలిసిందనుకోండి. అంతర్జాతీయ వెబ్సైట్లలో మీ కార్డు పేరుతో కొనుగోళ్లు చేసుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ వెబ్సైట్లకు వన్‌టైమ్ పాస్వర్డ్ (భారత్‌లో వెబ్సైట్లకు ఇది తప్పనిసరి) అవసరం లేదు. అందుకని మీ పిన్ నంబర్‌ను మీరే పంచ్ చేస్తే బెటర్.
7 అందుబాటులో కస్టమర్ కేర్ నంబర్లు
మీ క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్‌కు సంబంధించి కస్టమర్ కేర్ నంబర్లను మీ ఫోన్లో తప్పనిసరిగా సేవ్ చేసుకోండి. ఏదైనా ఫ్రాడ్ జరిగిందని మీరు గుర్తిస్తే, వెంటనే ఈ నంబర్లకు ఫోన్ చేసి, వారిని అలర్ట్ చేయవచ్చు.
8 ఇతరులు చూడకుండా ఏటీఎం పిన్ను వాడండి
ఏటీఎంల్లో డెబిట్/క్రెడిట్ కార్డులను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు పిన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు దానిని కవర్ చేస్తూ చేయి ఉంచడం మంచిదే. చాలా మంది పిన్ తెలిస్తే ఏముంది? కార్డ్ మన దగ్గరే ఉంటుందిలే అన్న ధీమాతో ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. పిన్ నంబర్, సీవీవీ నంబర్, ఎక్స్పైరీ డేట్ కూడా తెలిశాయనుకోండి. ఇంటర్నేషనల్ వెబ్సైట్ల ద్వారా కొనుగోళ్లు చేయవచ్చు.
9 సోషల్ సైట్లలో ఎక్కువ వివరాలు వద్దు
సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా మంది తమ డేటాను ఇస్తుంటారు. తమ పాన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, పుట్టిన తేదీ.. తదితర విషయాలు పొందుపరుస్తారు. వినియోగదారుల ఫిర్యాదుల వెబ్సైట్లలో ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. ఇలాంటి వ్యక్తిగత వివరాలను వెల్లడి చేయకండి.
10 సైబర్ కేఫ్‌లలో ఆన్లైన్ లావాదేవీలు వద్దు
సైబర్ కేఫ్‌లు, ఇతరుల పీసీలలో, బ్యాంకింగ్, లేదా ఆన్లైన్ లావాదేవీలు జరపకండి. సైబర్ కేఫ్‌లలో గానీ, ఇతరుల పీసీల్లో గానీ ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో మనకు తెలియదు కదా. కీ లాగర్స్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా మీరు టైప్ చేసిన కీల ద్వారా కావలసిన సమాచారాన్ని సేకరించే అవకాశాలుంటాయి. కొన్ని వైరస్లు, ట్రోజన్లు మీ ముఖ్యమైన సమాచారాన్ని లాగేసే అవకాశాలూ ఉంటాయి.
11 ఈ మెయిల్ లింక్స్‌ను క్లిక్ చేయకండి
మీ ఈ మెయిల్‌కు వచ్చే బ్యాంక్, క్రెడిట్ కార్డ్ వెబ్సైట్ల లింక్స్‌ను క్లిక్ చేయకండి. బహుశా అవి ఫ్రాడ్ వెబ్‌సైట్స్ కావచ్చు. బ్యాంక్ వెబ్సైట్లను స్వయంగా అడ్రస్ బార్లో టైప్ చేసి కానీ, ముందే స్టోర్ చేసుకున్న వెబ్-అడ్రస్ ద్వారా.. బుక్‌మార్క్ ద్వారా ఓపెన్ చేయడం ఉత్తమం.
12 ఫైర్‌వాల్ కొనసాగించండి
ఇంటర్నెట్ స్పీడ్ పెంచడానికి చాలా మంది ఫైర్‌వాల్‌ను ఆపేస్తారు. బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేటప్పుడు ఇలా ఎప్పుడూ చేయకండి. ఫైర్‌వాల్ మంచి సెక్యూరిటీగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ నుంచి మీరేదైనా డౌన్లోడ్ చేసుకుంటే, దాంతో పాటు వైరస్లు కూడా వస్తాయి. ఇక మీ కంప్యూటర్లో మంచి యాంటీ వైరస్‌ను ఇన్స్టాల్ చేసుకోండి.
13 మొబైల్ యాంటీ వైరస్
మొబైల్ ఫోన్ ద్వారా మీరు బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లయితే, మొబైల్ యాంటీ వైరస్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది.
బ్రౌజర్లో పాస్వర్డ్లు సేవ్ చేసుకోవద్దు యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లతో ఏదైనా వెబ్సైట్లో లాగిన్ అయితే బ్రౌజర్లు పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలా అని అడుగుతాయ్. మీరు ఓకే అంటే పాస్వర్డ్ అవసరం లేకుండానే ఆ తర్వాత ఆ వెబ్సైట్లు ఓపెన్ అవుతుంటాయి. ఇలా బ్రౌజర్ ద్వారా పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ సేవ్ చేసుకోకండి.
14 వర్చువల్ కీ బోర్డ్‌ను వాడండి
మీకు వీలైతే వర్చువల్ కీ బోర్డ్‌ను వాడండి. స్పై వేర్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా మీరు వాడే కీల ద్వారా కీలకమైన సమాచారాన్ని కాజేస్తాయి. వర్చువల్ కీ బోర్డ్ వాడితే ఇలాంటి ముప్పు తగ్గుతుంది.
15 రెగ్యులర్‌గా కార్డ్ స్వైప్ చేయకపోతే, దానిని ఇంట్లోనే ఉంచేయండి.
క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లు డెబిట్ కార్డ్‌ను తక్కువగా ఉపయోగిస్తారు. ఆన్‌లైన్‌లోగానీ, మాల్స్‌లో గానీ క్రెడిట్ కార్డ్‌ను ఎక్కువగా ఉపయోగించేటట్లయితే, డెబిట్ కార్డ్‌ను ఇంట్లోనే ఉంచేయడం ఉత్తమం.