ఫ్లిప్‌కార్ట్ ఒక్క రోజు సీఈవోగా పద్మిని
న్యూఢిల్లీ: ఒకే ఒక్కడు సినిమాలో ఓ సామాన్య జర్నలిస్టు ఒక్క రోజు సీఎం అయిన తరహాలో తాజాగా ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఓ ఉద్యోగినికి... ఒక రోజంతా సీఈవోగా వ్యవహరించే అవకాశం కల్పించింది. ముప్పై నాలుగేళ్ల వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్ పద్మిని ఈ అవకాశం దక్కించుకున్నారు. పదేళ్ల వేడుకల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రయోగానికి తెరతీసింది.
సీఈవోగా వ్యవహరించాలని కోరుకునే ఫ్లిప్స్టర్స్ (ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు) దానికి కారణాలు వివరిస్తూ పోటీలో ఎంట్రీలు పంపాలని సూచించింది. ఇందులో ఎంపికైన పద్మిని... అధికారిక సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తితో కలిసి ఒక రోజు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఫ్లిప్‌కార్ట్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. ‘మా సీఈవోతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌తో రోజు ప్రారంభమైంది. కల్యాణ్ రోజువారీ షెడ్యూల్లో భాగమైన కొన్ని సమావేశాలకు కూడా హాజరయ్యాను. ఇదో అద్భుతమైన అనుభూతి‘ అని నాలుగేళ్లుగా ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేస్తున్న పద్మిని పేర్కొన్నారు.
ఫ్లిప్‌కార్ట్ వంటి ఒక భారీ సంస్థకు సీఈవోగా పనిచేయడమంటే ఎలా ఉంటుందన్నది తెలుసుకునేందుకు ఫ్లిప్స్టర్స్కి ఇది చక్కని అవకాశంగా కల్యాణ్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. వాస్తవానికి కార్పొరేట్ ప్రపంచంలో ’సీఈవో ఫర్ ఎ డే’ కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. గల్ఫ్ ఆయిల్ ఇండియా ఇటీవలే క్రికెటర్ ధోనీని, అటు పాకిస్తాన్లో ట్యాక్సీ సేవల సంస్థ కరీమ్.. క్రికెటర్ వసీమ్ అక్రమ్‌ని ఒక రోజు సీఈవోలుగా చేశాయి.