కిలో ఉల్లి రూ.34
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జిల్లాలోని 13 రైతు బజారులతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలు కిలో రూ.34కు వినియోగదారులకు విక్రయించేందుకు ఏర్పాటు చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని ఉల్లిపాయల హోల్‌సేల్ విక్రయదారులు, రైతు బజారుల ఎస్టేట్ అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహిం చారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు అసాధారణంగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు రైతుబజార్లు ద్వారా తక్కువ ధరలకు ఉల్లిపాయలను అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం నుంచి నిర్దేశించిన ధరకు ప్రత్యేకౌంటర్లలో ఉల్లిపాయలను అందిస్తామన్నారు. ఉల్లిపాయల సరఫరా, ధరల నియంత్రణను అదుపు చేసేందుకు హోల్‌సేల్ విక్రయదారులు కిలో రూ.33లకు సరఫరా చేయాలన్నారు.
వాటిని ప్రత్యేక కౌం టర్లలో రూ.34కి ప్రజలకు విక్రయించాలని రైతుబజారుల ఎస్టేట్ అధికారులను ఆయన ఆదేశించారు. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో ఈ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్, గాంధీ నగర్ రైతు బజారుల్లో , అమలాపురం రైతు బజారులోను, రాజమండ్రిలోని ఏడు రైతు బజార్లలో, రామచంద్రపురం, రావులపాలెం, కొత్తపేట రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పా టు చేశామన్నారు. కాకినాడలోని మసీద్ సెంటర్, రమణయ్యపేట, రామారావుపేట, నాగమల్లితోట జంక్షన్లలోని సూపర్ బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాల న్నారు. పౌరసరఫరాల శాఖాధికారులు, తహశీల్దార్లు, ఆర్డీలు నిరంతరం పర్యవేక్షించాలని జేసీ ఆదేశించారు.