చిత్తూరులో యువకుడి హత్య
రాళ్లతో కొట్టి చంపి.. బావిలో పడేశారు
స్నేహితుల హస్తం ఉందని
పోలీసుల అనుమానం
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని మాపాక్షి కి చెందిన ఆర్.విజయన్(25) హత్యకు గురయ్యాడు. రాళ్లతో కొట్టి చంపిన దుం డగులు అతడి మృతదేహాన్ని స్థానిక కైలాశపురం వద్ద ఉన్న నాగాలమ్మ ఆలయ సమీపంలోని పాడుబడ్డ బావిలో పడేశారు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందచేశారు. పోలీసుల కథనం మేరకు.. చి త్తూరు నగరంలోని మాపాక్షికి చెందిన కస్తూరి, రామ్మూర్తి పెద్ద కుమారుడు విజయన్ ఓటీకే రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి నగరంలో తిరుగుతున్నాడు. రాత్రి 7 గంట ల ప్రాంతంలో తల్లి కస్తూరి కూలి పని పూర్తిచేసుకుని ఫోన్ చేయగా, మాపాక్షి కి వెళ్లడానికి ఆమెను ద్విచక్రవాహనంలో తీసుకెళ్లి ఎంఎస్ఆర్ కూడలి వద్ద వదిలాడు. అతని స్నేహితుడు మహేం ద్ర సంతపేటకు రమ్మన్నాడని ఆమెకు చెప్పి వెళ్లిపోయూడు. రాత్రి ఇంటికి వెళ్లలేదు. విజయన్ తల్లి ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. శనివారం ఉదయం చెప్పుల దుకాణానికి కూడా వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు నగరంలోని స్నేహితులను విచారించారు. స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నాగాలమ్మ గుడి వద్ద స్థానికులు ఓ బావి వద్ద రక్తపు మరకలు ఉండడాన్ని గుర్తించారు. బావిలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐలు సూర్యమోహన్‌రావు, నిరంజన్‌కుమార్ అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య వెనుక స్నేహితుల హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుడి మెడ, తల, వీపుపై రాళ్లతో కొట్టిన గుర్తులు, కత్తిగాట్లు ఉన్నాయి. బావి వద్ద ఉన్న గోడకు రక్తపు మరకలున్నాయి. మృతుడి జేబులో ఉన్న ద్విచక్రవాహనం తాళాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
‘ ఏడు నెలల ముందే నా అల్లుడు చనిపోయాడు. ఇప్పుడు నా ఇంటి పెద్ద దీపం ఆరిపోయింది... నేనెందుకు బతకాలిరా.. దేవుడా ’’ అంటూ మృతుని తల్లి కస్తూరి రోదించడం అందరినీ కలచివేసింది. ఎవరికీ ఏ హాని చేయని నా కొడుకును చంపడానికి చేతులెలా వచ్చాయిరా.. అంటూ ఆమె ఆర్తనాదాలు చేసింది.