రైలు ముందు దూకి...
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడు చూపిన తెగువ 18 నెలల పసికందు ప్రాణాలు నిలిపింది. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేకుండా కదులుతున్న రైలు ముందుకు దూకి తన మనరాలికి ముప్పుతప్పించాడో తాత. వెంట్ వోర్త్ విల్లే రైల్వే స్టేషన్ లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.
గురుద్వారాకు వెళ్లేందుకు ఓ సిక్కు కుటుంబం వెంట్ వోర్త్ విల్లే రైల్వే స్టేషన్ కు వచ్చింది. ఇదే సమయంలో18 నెలల పసిపాప స్ట్రోలర్ సహా ఒక్కసారిగా రైలు పట్టాలపై పడింది. ఇది గమనించిన 62 ఏళ్ల తాత ఒక్క ఉదుటన పట్టాలపైకి దూకి ఆమెను సురక్షితంగా రక్షించాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాప ప్రాణాలు కాపాడాడు.
తన తండ్రి చూపిన తెగువకు గర్వపడుతున్నానని పాప మేనమామ పర్మిందర్ సింగ్ అన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఇదంతా జరిగిందని వివరించారు. తన మేనకోడలకు స్వల్ప గాయాలయ్యాయని, ఆస్పత్రిలో కోలుకుందని తెలిపారు. తాతగారి సాహసకార్యం రైల్వే స్టేషన్ సీసీ టీవీలోనూ రికార్డైంది.