'ఇలాంటి వాతావరణంలో నేనుండను'
న్యూఢిల్లీ: పర్యావరణ శాస్త్రవేత్త ఆర్కే పచౌరీపై లైంగిక ఆరోపణలు చేసిన పరిశోధకురాలు ఉద్యోగాన్ని వదిలేసింది. ఆమె ది ఎనర్జీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్(తెరా)లో చేస్తున్న జాబ్‌కు రిజైన్ చేసింది. అనంతరం ఆ సంస్థలోని ఉద్యోగులపై పలు ఆరోపణలు చేసింది. తనను కొంత మేధావి వర్గం చెప్పుకోలేని విధంగా చిన్న చూపు చూస్తున్నారని, ఒక ఉద్యోగినిగా తన ఇష్టాలను గుర్తించడంలో, గౌరవాన్ని కాపాడటంలో తెరా సంస్థ విఫలమైందని రాజీనామా లేఖలో వివరించింది.
'మీరు పచౌరీపై చర్యలు తీసుకునే బదులు ఆయనకు పూర్తిగా రక్షణ కల్పించారు. నేను చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై మీరు స్వయంగా వేసిన కమిటీ కూడా తననే అవమానించేలా నివేదిక ఇచ్చింది. ఇక పాలక మండలి కూడా నన్ను ఊహించని విధంగా చిన్నబుచ్చింది. కనీసం ఆయనపై సస్పెండ్ వేటు వేసి చర్యలు కూడా తీసుకోలేదు. పైగా నేను ఇమడలేనంత వాతావారణాన్ని మీరు కావాలనే సృష్టించారు. అందుకే రాజీనామా చేస్తున్నాను' అంటూ ఆమె వాపోయింది.
తాను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పచౌరీ తనను లైంగికంగా వేధించాడని ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు పరిశోధనకారిణి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈమెయిల్స్, సంక్షిప్త సందేశాలు, వాట్సాప్ సందేశాల ద్వారా ఎంతో విసిగించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే వీటన్నింటిని అప్పుడు పచౌరీ ఖండించారు. తన మెయిల్స్, ఫోన్ నెంబర్స్ హ్యాక్ చేశారని చెప్పారు.