మద్యరహిత ఆంధ్రాగా తీర్చిదిద్దాలి
అనంతపురం అర్బన్ : మద్యపానాన్ని అరికట్టి 2017లోనైనా మద్య రహిత ఆంధ్రాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ధాలని ఏపీ మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.పద్మావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. పాఠశాలలు, దేవాలయాల పక్కన మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను ప్రొత్సహిస్తున్నారని మండిపడ్డారు.
కూలీలు తమ సంపాదనంతా మద్యానికి ఖర్చుపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మద్యం మహమ్మారిని పెంచి పోషిస్తూ, మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలకు కారణమవుతోందన్నారు. సహాయ కార్యదర్శులు అరుణ, పవిత్ర, ఉపాధ్యక్షురాలు పార్వతిప్రసాద్, కార్పొరేటర్ పద్మావతి, నగర అధ్యక్షురాల ఖుర్షీదా పాల్గొన్నారు.