గూడు కట్టుకున్న పక్షి ప్రేమ
‘హర్గిలా కొంగలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని మనమే రక్షించుకోవాలి’ అని ఊరూరు తిరుగుతూ ప్రచారం చేసేది పూర్ణిమాదేవి. ‘అలాగే’ అన్నవారి కంటే ‘మాకేమీ పనిలేదనుకుంటున్నావా’ అని ముఖం మీద చెప్పిన వాళ్లే ఎక్కువ. తాను భుజానికెత్తుకున్న పని ఎంత ముఖ్యమైనదో కాలక్రమంలో ప్రజలకు అవగాహన కలిగించడంలో పూర్ణిమాదేవి విజయవంతం అయింది. తాజా విషయానికి వస్తే,,, అస్సాంకు చెందిన జీవశాస్త్రవేత్త, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషనిస్ట్ పూర్ణిమాదేవి బర్మాన్ ‘టైమ్’ మ్యాగజైన్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో చోటు సాధించింది. ఈ జాబితా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 13 మంది మహిళలలో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళ పూర్ణిమాదేవి బర్మాన్...బ్రహ్మపుత్ర నదికి దగ్గర్లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పెరిగింది పూర్ణిమ. ‘ఈరోజు నీ స్నేహితులను చూపిస్తాను వస్తావా?’ అని నవ్వుతూ అడిగింది అమ్మమ్మ.‘పద వెళదాం’ అంటూ రెడీ అయిపోయింది పూర్ణిమ. అది తన జీవితాన్ని మార్చిన రోజు. పక్షుల ప్రపంచాన్ని పరిచయం చేసిన రోజు. ఆరోజు మొదలు ప్రతిరోజూ అమ్మమ్మతోపాటు పంట పొలాల్లోకి వెళ్లి పక్షులతో మాట్లాడడం నుంచి వాటి మధుర గానాన్ని వినడం వరకు ఎన్నో చేసేది.జువాలజీలో మాస్టర్స్ చేసిన పూర్ణిమ గ్రేటర్ అడ్జటంట్ జాతికి చెందిన హర్గిలా కొంగలపై పీహెచ్డీ చేయాలనుకున్నప్పుడు అవి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయనే చేదునిజం తెలిసొచ్చింది. ఆ సమయంలో తనకు అకాడమిక్ ఆలోచనల కంటే ఉద్యమ స్థాయిలో ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది.‘పక్షులను రక్షించడం కోసం ఇప్పుడు ఒక సైన్యం కావాలి’ అనుకుంది. ఎవరి ప్రపంచం వారిది అయిపోయిన ఈ ప్రపంచంలో తన కలల సైన్యంలోకి ఎవరు మాత్రం వస్తారు? అయితే.. మనం ఒక మంచిపనికి నడుం బిగిస్తే అది విజయవంతం అయ్యేలా ప్రకృతి ఆశీర్వదిస్తుందట. అది నిజమేనేమో... ఒక్కరొక్కరుగా ఎంతోమంది మహిళలు ‘హర్గిలా’ సైన్యంలో చేరడం మొదలైంది. హర్గిలా ఆర్మీలో ఇప్పుడు ఇరవై వేల మంది మహిళా సైనికులు ఉన్నారు.హర్గిలా పక్షిని ‘స్కావెంజర్’ అని పిలుస్తారు. నీటికాలుష్యాన్ని నివారించడం నుంచి పరిసరాల శుభ్రత వరకు అవి ఎన్నో రకాలుగా మానవాళికి మేలు చేస్తాయి. ‘హర్గిలాను రక్షించుకోవడం అంటే ప్రకృతిని రక్షించుకోవడమే’ అనే నినాదంతో హర్గిలా ఆర్మీ ప్రజల్లోకి వెళ్లింది. గాయపడిన కొంగలకు చికిత్స చేయడం, గూడును ఏర్పాటు చేయడం, రకరకాల ఉత్సవాలు నిర్వహించడం... ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకువచ్చింది. మూడు పదులు దాటని కొంగల సంఖ్య ఇప్పుడు నాలుగు వందలు దాటేలా చేసింది.‘కొంగలకు సోదరి’ అంటూ పూర్ణిమాదేవిని ప్రజలు ప్రేమగా పిలుచుకుంటారు. అస్సాం సంప్రదాయ దుస్తులపై హర్గిలా బొమ్మలు వేస్తూ పర్యాటకులకు విక్రయించడం అనేది స్థానిక మహిళలకు జీవనోపాధిగా మారింది. ‘హర్గిలా’ ఆర్మీ అస్సాంకే పరిమితం కాలేదు. దేశంలోని ఎన్నోప్రాంతాలకు విస్తరించింది.కంబోడియా, ఫ్రాన్స్ పాఠశాలల్లో పూర్ణిమ చేసిన విశేష కృషి గురించి పాఠాలుగా చెబుతున్నారు. ‘సమాజంలో మార్పు తీసుకు వచ్చే శక్తి మహిళల్లో ఉంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మాన్. పురుషుల నుంచి అవమానాలు, తిట్లు, వెటకారాలు ఎదురైనప్పుడు ఆమెకు అండగా నిలబడింది మహిళలే. ‘హర్గిలా’ రూపంలో తన అసాధారణ కలను సాకారం చేసింది మహిళలే! ఆరోజు ఎంతగా అవమానించారో!ఆరోజు ఒక గ్రామానికి వెళ్లాను. ఒక వ్యక్తి తొమ్మిది గూళ్లు ఉన్న చెట్టును నరికివేయడం, పక్షి పిల్లలు చనిపోవడం చూశాను. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ గ్రామస్థుడితో మాట్లాడే సాహసం చేశాను. అప్పుడు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అంతమంది మగవాళ్ల మధ్య నేను ఒంటరి అయ్యాను. చెట్టు నరికిన వ్యక్తి తాను చేసింది తప్పు అనుకోలేదు. పైగా నాతో కోపంగా మాట్లాడాడు. నీకు పక్షులపై అంత ప్రేమ ఉంటే మా ఇంట్లో పనిమనిషిగా చేరు. పక్షుల మలమూత్రాలు శుభ్రం చేయడం లాంటి పనులు చెయ్యి అని అరిచాడు. అక్కడ ఉన్న వాళ్లు కూడా తిట్టడం మొదలుపెట్టారు. నువ్వు వచ్చింది హర్గిలాను రక్షించడానికి కాదు వాటి మాంసాన్ని తినడానికి అని ఒకరు తిట్టారు. హర్గిలాను రక్షించుకోవాలంటే ప్రయోగశాలలో శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే సరిపోవు అనే విషయం అప్పుడు నాకు అర్థమైంది. ముందు ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావాలి అనిపించింది. ఆ ఆలోచనే హర్గిలా ఆర్మీకి బీజం వేసింది.– పూర్ణిమాదేవి బర్మాన్