పిల్లి కరిచి ఇద్దరు మహిళల మృతి
మొవ్వ (పామర్రు): పిల్లి కాటుకు గురైన ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకడంతో ఇద్దరూ మృత్యువాతపడిన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. వేములమడ ఎస్సీ కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమల (64), అదే కాలనీలోని ఆర్ఎంపీ వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణి (43)లను రెండు నెలల క్రితం పిల్లి కరిచింది. అప్పట్లో ఆ మహిళలిద్దరూ టీటీ ఇంజెక్షన్ చేయించుకుని మందులు వాడారు. ఉపశమనం కలగడంతో యథావిధిగా తమ పనులు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం కమల, నాగమణి ఆరోగ్యంలో త్రీవ మార్పులు రావడంతో కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందారు. అయినా.. మెరుగు పడలేదు. కమల గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10 గంటల సమయంలో చనిపోయింది. నాగమణి శుక్రవారం మొవ్వ పీహెచ్సీలో వైద్యం చేయించుకుని అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరింది. ఆమె కూడా చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందింది. మృతి చెందిన ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకిందని వైద్యాధికారి డాక్టర్ శొంఠి శివరామకృష్ణారావు చెప్పారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో శరీరం విషతుల్యమైందన్నారు. కాగా మహిళలను కరిచిన పిల్లిని ఓ కుక్క కరిచిందని, ఆ కుక్క కూడా కొద్దిరోజులకే చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు.