చట్టాలు కాదు.. భరోసా ఇవ్వండి
- లైంగిక దాడులపై మహిళల గళం
- శిక్షల అమలులో వేగం అవసరమని అభిప్రాయం
కుత్బుల్లాపూర్: ‘మహిళా రక్షణ’ అనేది చర్చించుకోవడానికే గాని, ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారిపై దాడులు జరుగుతునే ఉన్నాయి. ‘మహిళా రక్షణకు రాజీలేని చర్చలు, చట్టంలో సమూల మార్పులు చేసి వారికి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామ’ని ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మన హైటెక్ నగరంలో మహిళలకు హైటెక్ లెవల్ సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి.. అందుకు భరోసాగా ఈ మధ్యే ఐటీ కారిడార్‌లో మహిళా పోలీస్‌స్టేషన్‌ను సైతం ప్రారంభించారు. కానీ ఇవేవీ మహిళల భద్రతకు భరోసా ఇవ్వలేక పోతున్నాయి.
మహిళా హెల్ప్‌లైన్, మహిళా భద్రత చట్టాలు, మహిళా పోలీస్స్టేషన్లు.. ఎన్ని ఉన్నా మృగాళ్ల వికృత చేష్టలు సాగుతునే ఉన్నాయి. వ్యవస్థలో లోపాలు, చట్టంలోని లొసుగులతో శిక్షల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండడంతో వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. నగర శివారులో స్నేక్ గ్యాంగ్ ఆగడాలు మరవక ముందే.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో తల్లీ కూతుళ్లపై సామూహిక లైంగిక దాడి జరగడం శోచనీయం. ఈ విషయంపై పలు మహిళా సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇలాండి ఘటనల్లో దాడికి పాల్పడ్డవారికి కఠిన శిక్షలు వేగంగా అమలు చేయాలన్నారు.
శిక్షలు వేగవంతం చేయాలి
రెండేళ్ల కిందట ఢిల్లీలో మెడికల్ విద్యార్థినిపై జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. తర్వాత నిర్భయ లాంటి చట్టాలను తీసుకువచ్చినా ఉపయోగం లేదు. పాలకులకు మహిళల పట్ల ఉండే చిత్తశుద్ధి తాత్కాలికమే అని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి, ఇప్పటికైనా లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. శిక్షలు కఠినంగా వేగంగా అమలు చేయాలి.
- అనురాధ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షురాలు
కౌన్సెలింగ్ సెంటర్లు అవసరం
‘నిర్భయ చట్టం’ అమల్లోకి వచ్చిన తర్వాత లైంగిక దాడుల సంఖ్య మరింత పెరిగింది. వావి వరసలు మరిచి వేధిస్తున్నారు. చట్టాలు చుట్టాలుగా ఉండకుండా ఉండాలంటే నిందితులకు కఠిన శిక్షలు పడాలి. పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో కమిటీ వేసినా లైంగిక వేధింపులు ఆగకపోవడం సిగ్గుచేటైన విషయం. అన్ని చోట్లా కౌన్సెలింగ్ సెంటర్లు పెట్టి పురుషులకు శిక్షలపైన, తదుపరి పరిణామాలపైనా అవగాహన కల్పించాలి. - శివపార్వతి, జాగృతి సొసైటీ అధ్యక్షురాలు
స్వేచ్ఛ కూడా లేదు..
అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగినపుడే మనకు స్వాతంత్య్రం వచ్చినట్టు.. అని ఆనాడు గాంధీ చెప్పారు. కానీ ప్రస్తుత పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల మహిళ ఇంట్లో ఉన్నా లైంగిక దాడులు జరుగుతున్నాయి. మార్కెట్, బడికి, గుడికి వెళ్లినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు బాధాకరం. స్వాతంత్య్రం కాదు కదా.. స్వేచ్ఛగా తిరిగే అవకాశం కూడా లేదు.
- చెరుకు లావణ్య గౌడ్, పట్టణ స్లమ్ సమాఖ్య ఉపాధ్యక్షురాలు
బహిరంగ శిక్షలు తప్పనిసరి
లైంగిక దాడులకు పాల్పడుతున్న వారు కూడా ఓ తల్లికి పుట్టిన వారే. వారు ఏం చేస్తున్నారో గుర్తు చేసుకుంటే ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుంది. లైంగిక దాడులకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలి.
- కృష్ణవేణి, ఉజ్వల మహిళా మండలి అధ్యక్షురాలు