పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్‌కు షాక్..
లండన్: ప్రపంచవ్యాప్తంగా తన పరుగుతో గత కొన్నేళ్లుగా అభిమానులను ఉర్రూతలూగించిన జమైకన్ పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ కెరీర్లో చివరి పరుగును మాత్రం కాంస్యంతో ముగించాడు. లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో బోల్ట్ చివరి సారిగా పాల్గొని కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి జరిగిన 100 మీటర్ల రేసులో మాత్రం తన జోరు కొనసాగించలేకపోయాడు. 9.95 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. బోల్ట్ చివరి పరుగును చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయంగా ఎంతో మంది క్రీడాభిమానులను సంపాదించుకున్న బోల్ట్ చివరి పోరులోనూ గెలుపొంది తమను అలరిస్తాడని భావించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.
విజేతకు బోల్ట్ అభినందనలు..
దశాబ్దకాలముగా స్ప్రింట్ ఈవెంట్‌ను రారాజుగా ఏలిన బోల్ట్ తన చివరి 100 మీటర్ల ఫైనల్లో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పరుగు పూర్తైన వెంటనే బోల్ట్ ఏమాత్రం నిరాశ చెందకుండా విజేతగా నిలిచిన గాట్లిన్‌కు అభినందనలు తెలిపి అభిమానులతో ముచ్చటిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. గాట్లిన్ గొప్ప పోటీదారుడని, తనకు అసలైన పోటీ ఇచ్చింది అతనే అని ప్రశంసించాడు.
అమెరికా స్టార్ స్పింటర్ జస్టిన్ గాట్లిన్ ఈ సారి బోల్ట్‌ను వెనక్కి నెట్టి స్వర్ణం ఎగరేసుకుపోయాడు. 8 సార్లు చాంపియన్‌గా నిలిచిన బోల్ట్‌ను 35 ఏళ్ల జస్టిన్ అధిగమించడం విశేషం. జస్టిన్ గాట్లిన్ 9.92 సెకన్లలో పరుగును పూర్తి చేయగా క్రిష్టియన్ కోలెమన్( అమెరికా) 9.94 సెకన్లు, జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్ 9.95 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేశారు. అమెరికాకు చెందిన జస్టిన్, కోలెమన్లు స్వర్ణం, రజతంలు కైవసం చేసుకున్నారు.