ముచ్చటగా మూడో రోజూ..
* ఏఎన్ఎం రాత పరీక్షలో కొనసాగిన మాల్‌ప్రాక్టీస్
* పోలీస్ కానిస్టేబుల్‌పై అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి ఆగ్రహం
విజయనగరంఆరోగ్యం: ఏఎన్ఎం కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు నిర్వహించిన రాత పరీక్షలో మూడో రోజు కూడా మాల్ ప్రాక్టీస్ యథేచ్ఛగా సాగింది. పర్యవేక్షించాల్సిన అధికారే ఈ మాల్‌ప్రాక్టీస్‌కు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల హెచ్చరికలను సైతం పర్యవేక్షణ అధికారి పట్టించుకోకపోవడం గమనార్హం. స్థానిక మహిళా ప్రాంగణంలో మూడో రోజు 240 మంది వరకు అభ్యర్థులు హాజరుయ్యారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ ఓఅభ్యర్థినిని అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి గుర్తించి బయటకు పంపిస్తే ఆమె వెళ్లిపోయిన తర్వాత మళ్లీ అదే విద్యార్థినితో పర్యవేక్షణ అధికారి పరీక్ష రాయించడం గమనార్హం.
పారదర్శకంగా జరగాల్సిన పరీక్షలు కాసుల బేరసారాల మధ్య జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చూసిరాతలతో జరిగిన పరీక్షలను వాయిదా వేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొంగలను పట్టుకోవడానికి వచ్చావా, కూర్చోడానికి వచ్చావా? పరీక్ష కేంద్రంలోకి పంపించే ముందు తనిఖీ చేయాలనే విషయం తెలియదా? అంటూ జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సి.పద్మజ పరీక్ష కేంద్రానికి సందర్శనకు వచ్చినప్పుడు మహిళా కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేవిషయంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యు.స్వరాజ్యలక్ష్మిని వివరణ కోరగా మాల్ ప్రాక్టీస్ జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.