Xerox Colour
-
జెరాక్స్ తీసి చెలా‘మనీ’
రూ.2 వేల కొత్త నోటుకు నకిలీ యువకులను అదుపులో తీసుకున్న పోలీసులు ఆరిలోవ: కొత్త రూ.2 వేల నోటుకు కలర్ జెరాక్స్ తీసి ఆరిలోవ పరిసర ప్రాంతాల్లో చెలామణీ చేస్తున్న ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు. ఆరిలోవ సీఐ సీహెచ్ తిరుపతిరావు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. ఎస్బీఐ ఇన్సూ్యరెన్స్లో పనిచేస్తున్న కంచరపాలెం ప్రాంతానికి చెందిన మల్ల సత్యనారాయణ, అక్కయ్యపాలెం ప్రాంతంలో ఫొటో స్టూడియో నడుపుతున్న ఆసపు యుగంధర్, ఫౌల్ట్రీ ఫీడింగ్ వర్క్ చేస్తున్న సింహాచలం ప్రాంతం పాత గోశాలకు చెందిన డోల ఎల్లాజిలు స్నేహితులు. యుగంధర్ ఫొటో స్టూడియోలో ఇటీవల చెలామణీలోకి వచ్చిన కొత్త రూ.2 వేల నోట్లకు కలర్ జెరాక్స్ తీశారు. అచ్చం నిజమైన నోటు లాగే వాటిని తయారు చేశారు. ఈ నెల 26న సత్యనారాయణ విశాలాక్షినగర్‌లోని బంక్‌కు వెళ్లి రూ.300 పెట్రోల్ పోయించుకున్నాడు. తన వద్ద ఉన్న జెరాక్స్ రూ.2 వేల నోటును అక్కడి సిబ్బందికి ఇవ్వగా..వారు నకిలీ నోటుగా గుర్తించి బంక్ నిర్వాహకుడు సంపత్‌రావు వెంకటరమణకు తెలిపారు. అతను ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే వారు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న సుమారు 15 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతనికి సహకరించిన యుగంధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎల్లాజి పరారీలో ఉన్నాడు. వీరి ముగ్గురూ జల్సాలకు అలవాటుపడి డబ్బు సంపాదనలో అడ్డదారులను ఎంచుకొన్నారు. ఎల్లాజీపై గతంలో నగరంలో పలు పోలీస్స్టేషన్లలో గొలుసు దొంగతనాల కేసులు, యుగంధర్‌పై ఓ యువతిపై అత్యాచారయత్నం కేసు నమోదై ఉన్నట్టు సీఐ తెలిపారు. యుగంధర్‌ను పట్టుకోవడంలో హెచ్‌సీ విజయకుమార్, కానిస్టేబుళ్లు భాస్కరరావు, గణపతి సహకరించారు. ఎస్ఐ జి.సంతోష్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు -
నకిలీ రూ.2 వేల నోటుతో బురిడీ
డాబాగార్డెన్స్: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.2వేలు నోటును కలర్ జెరాక్స్ తీసి ఇద్దరు మహిళలు బురిడీ కొట్టించారు. కనకమహాలక్ష్మి దేవస్థానం పరిసరాల్లో శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయ పరిసరాల్లో పలువురు చిల్లర దుకాణాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఇద్దరు మహిళలు ఓ దుకాణంలోకి వెళ్లి రాగి, ఇత్తడి వస్తువులు బేరమారారు. నకిలీ రూ.2వేల నోటును దుకాణ యజమానికి ఇవ్వగా.. ఆయనకు అనుమానం వచ్చి చిల్లర లేదని పంపించేశారు. మరో షాపునకు వెళ్లగా అక్కడ కూడా చిల్లర లేదని పంపించేశారు. ఎదురుగా ఉన్న నాగమణికి చెందిన దుకాణానికి ఇద్దరు మహిళలు వెళ్లారు. ఉదయం నుంచి బేరం లేకపోవడం.. తొలి బేరం కావడంతో ఆమె వ్యాపారాన్ని వదులుకోలేకపోయింది. రూ.600ల విలువ చేసే పూజా సామగ్రిని కొనుగోలు చేసి ఇద్దరు మహిళలు వారి వద్ద ఉన్న రూ.2వేల దొంగనోటు అందజేశారు. నోటు నలిగిపోయి ఉండడంపై నాగమణి ప్రశ్నించగా.. బ్యాగులో పెట్టడడంతో నలిగిపోయిందని బదులిచ్చారు. దీంతో నాగమణి రూ.600లు తీసుకొని వారికి రూ.1400 చిల్లర ఇచ్చింది. వారు వెళ్లిపోయాక నాగమణికి మళ్లీ అనుమానం వచ్చి నోటును వేరే వారికి చూపించింది. ఇది దొంగనోటని.. కలర్ జెరాక్స్ తీసి ఇచ్చేశారని చెప్పడంతో ఆమె కంగుతింది. వెంటనే పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు చేసిందేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. వారు వెళ్లిపోయాక వస్తే మేం ఏం చేస్తామని పోలీసులు చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఆ ఇద్దరు మహిళలను గుర్తించవచ్చని చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నాగమణి బోరున విలపించింది.