కుక్క మాంసం తినకండయ్యా..
కుక్క మాంసాన్ని ఇష్టంగా తినే చైనాలో పుట్టి.. పెంపుడు కుక్కను వెంటపెట్టుకుని ప్రపంచ యాత్ర చేయడం.. ఆ యాత్రద్వారా కుక్క మాంసభక్షణ వద్దని పిలుపునివ్వడం 29 ఏళ్ల జియావో యూ ను వరల్డ్ ఫేమస్ చేశాయి. అతని స్ఫూర్తికి ప్రపంచ జంతు ప్రేమికులు సలాం చేస్తున్నారు. ప్రొఫెషనల్ పెట్ ఫొటోగ్రాఫరైన జియావో .. చైనా జియాంగ్షు ఫ్రావిన్స్ లోని షుజో సిటీకి చెందిన వ్యక్తి. ఓ రోజు దారిన వెళుతుండగా చెత్త కుండీ పక్కన స్పానిష్ వాటర్ డాగ్ ఒకటి కనిపించిందతనికి. బహుషా అది డాగ్ స్మగ్లర్ల చేతిలో నుంచి తప్పించుకొని వచ్చిందేమో అనుకుని చేరదీసి ఇంటికి తీసుకెళ్లాడు.
ఆ రాత్రి అతని ఆలోచనలన్నీ కుక్కలు, కుక్క మాంసం, కుక్కల స్మగ్లింగ్ చుట్టూ తిరిగాయి. తెల్లారేసరికి ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన పెంపుడు కుక్క హ్యారీ(అదే.. మన స్పానిష్ కుక్క)తో కలిసి సైకిల్ పై ప్రపంచ పర్యటనకు బయలుదేరాడు. వీలైనంత దూరం సైకిల్ తొక్కడం, కుదరకుంటే, విమానమో, ఓడో ఎక్కిదిగుతూ.. ఏడాదిలో దాదాపు 23 దేశాలు చుట్టొచ్చాడు. 'చైనీయులు కుక్కల్ని చంపి తింటారని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ చైనీయులు కూడా కుక్కలను ప్రేమిస్తారని రుజువుచేసేందుకే పెట్ డాగ్ తో ప్రపంచయాత్ర చేశా' అంటున్నాడు జియావొ యూ. ఇటీవలే తన యాత్రకు సంబంధించిన ఫొటోలు, వివరాలను పుస్తక రూపంలో విడుదలచేశాడు. చైనీయులు.. మీ సోదరుడి మాట వినైనా కుక్క మాంసం మానండయ్యా..!