'రూ.వెయ్యి కోట్లు సేఫ్... నేనెక్కడికి పారిపోలేదు'
షాంఘై: తాను పారిపోయినట్టు వచ్చిన వార్తలను చైనా ఈ-ఫైనాన్సింగ్ కంపెనీ వాంగ్జూ గ్రూపు చైర్మన్ తోసిపుచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదని, పది రోజుల పాటు ఫోన్ లో అందుబాటులో లేకపోవడంతో తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయని వివరణయిచ్చారు. ఈ-ఫైనాన్సింగ్ కంపెనీ వాంగ్జూ ఫార్టూన్ కంపెనీ చైర్మన్ యాంగ్ వీగుయ్ బిలియన్ యువాన్లతో పారిపోయినట్టు చైనా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇన్వెస్టర్ల నుంచి రూ.2 వేల కోట్లుపైగా సేకరించి వెయ్యి కోట్లతో ఆయన ఉడాయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో యాంగ్ వీగుయ్ స్పందించారు. తన వివరణతో కూడిన వీడియోను పంపించారు. తన సిబ్బంది లేఖ కూడా రాశారు.
పది రోజుల పాటు ఫోన్లకు దొరక్కకుండా ప్రశాంతంగా ఉండి.. కంపెనీని పటిష్టపరిచే వ్యూహాలు ఆలోచించేందుకు గోబీ ఎడారికి వెళ్లిపోయానని తెలిపారు. తాను తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాను పారిపోయానంటూ వచ్చిన వార్తలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల సొమ్ముతో పరారైనట్టు చిత్రీకరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్ల సొమ్ము ఎక్కడికి పోదని భరోసా యిచ్చారు. తన కోసం వెదుకుతున్న స్థానిక పోలీసులకు సహకరిస్తానని చెప్పారు.