అదను చూసి దోచేస్తాడు
తణుకు: తాళం వేసిన ఇళ్లే అతని లక్ష్యం.. గట్టుచప్పుడు కాకుండా రెక్కీ నిర్వహించి.. అదను చూసి ఉన్నదంతా దోచేస్తాడు.. ఇలా ఏడాది వ్యవధిలో ఎనిమిది చోరీలకు పాల్పడిన యువకుడు ఎట్టకేలకు తణుకు పోలీసులకు చిక్కాడు. నిడదవోలు పట్టణానికి చెందిన షేక్ అలీమొహిద్దీ న్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.8.86 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణ పోలీసు స్టేష న్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ చింతా రాంబాబు వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు బానిసైన అలీ మొహిద్దీ న్నిడదవోలు నుంచి మకాం మార్చి ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటున్నాడు. తణుకు పరిసర ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు. తణుకు పట్టణంతోపాటు తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జరిగిన వరుస చోరీల్లో సుమారు 39 కాసుల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి వస్తువులతోపాటు రూ.40 వేల నగదు అపహరించుకుపోయాడు. నిందితుడి కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు తణుకు శర్మిష్ట సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అలీమొహిద్దీ న్ను అదుపులోకి తీసుకుని విచారించారు. పాత చోరీల్లో తన ప్రమేయం గురించి ఒప్పుకోవడంతో నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కేసులను ఛేదించడంలో పట్టణ, రూరల్ ఎస్సైలు జి.శ్రీనివాసరావు, బి.జగదీశ్వరరావు, క్రైం ఎస్సై విఠల్, హెడ్కానిస్టేబుళ్లు శ్రీధర్, సంగీతరావు, సాయిబాబా, కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, శరత్, గణేష్, శివ, వాసు ప్రత్యేక దృష్టి సారించారని సీఐ రాంబాబు తెలిపారు.