'కేసీఆర్ ప్రభుత్వానికి, పార్టీకి తేడా లేకుండా చేస్తున్నాడు'
హైదరాబాద్: రాజకీయ ఆధిపత్యం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి విమర్శించారు. పార్టీ నేతలు ఎస్.మల్లా రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉన్న ఇద్దరు సీఎంలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. క్రియలు, ప్రతిక్రియలకు పాల్పడకుండా పరస్పర సహకారంతో అభివృద్ధికోసం పనిచేయాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా లేకుండా చేస్తున్నాడని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరపార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో చేర్చుకుని అనైతిక పద్ధతులకు పాల్పడిన కేసీఆర్ మండలస్థాయిలో ఇతర పార్టీల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులను కూడా పార్టీలో చేరాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు.
పోలీసులు, అధికారులు కూడా టీఆర్ఎస్కు కొమ్ముగాస్తున్నారని విమర్శించారు. శారీరక, మానసిక ఒత్తిడులను దూరం చేసి, శక్తివంతంగా తయారుచేసే యోగాకు కొందరు మతం రంగును రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. మతంతో యోగాకు సంబంధంలేదని, యోగా సమయంలో ఏ దేవుడిని అయినా పూజించుకోవచ్చునని సూచించారు. యోగా దినోత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలు యోగాను అమలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోనూ యోగా దినోత్సవాన్ని అధికారికంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంఐఎం వ్యతిరేకిస్తే అమలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. యోగాను నేర్చుకునేవారికోసం, యోగాను నేర్పాలనుకునేవారికోసం రూపొందించిన వెబ్సైట్ను జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
మీడియాకు నోటీసులపై ఖండన
మీడియా సంస్థలకు నోటీసులు ఇవ్వడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. మీడియా స్వేచ్ఛను హరించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఖండించామని, ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉన్నామన్నారు.