ఆటగాళ్లకు ఇక 'లక్ష్మీ' కటాక్షం లేదు
లక్ష్మి ఇక ఆటగాళ్లను కరుణించదు. వాళ్ల బాధలేవో వాళ్లే పడాలి ఇక.
అవును. ఉక్కు పరిశ్రమతో ప్రపంచమంతటా పేరుపొందిన లక్ష్మీ మిత్తల్ ఇక క్రీడాకారులను స్పాన్సర్ చేయడం లేదు. ఇప్పటి వరకూ వివిధ ఆటల్లో ఆటగాళ్లను స్పాన్సర్ చేయడానికి దాదాపు ఎనభై కోట్లు ఖర్చుపెట్టిన లక్ష్మీ మిత్తల్ ఛాంపియన్స్ ట్రస్ట్ ఇక తెరమరుగు కానుంది. దీంతో ఇప్పటి వరకూ ట్రెయినింగ్ నుంచి, ఎక్విప్ మెంట్ దాకా, కోచ్ నుంచి ఫిజియో దాకా అయ్యే ఖర్చును ఆటగాళ్లో లేక కల్మాడీలకు కేరాఫ్ అయిన క్రీడా సంఘాలో భరించాలి. దీంతో రాబోయే ఒలింపిక్స్ తయారీల్లో ఆటగాళ్లకు చాలా పెద్ద చిక్కే వచ్చి పడింది.
లక్ష్మీ మిత్తల్ ఛాంపియన్స్ ట్రస్ట్ 2005 నుంచి ఇప్పటి దాకా దాదాపు 40 మంది ఆటగాళ్లను స్పాన్సర్ చేసింది. అందులో 16 గురు కంచు నుంచి కనకం దాకా వివిధ మెడల్స్ గెలుచుకున్నారు. అందులో షూటర్ అభినవ్ బింద్రా, యోగేశ్వర్ దత్త, బాక్సర్ విజేందర్ సింగ్, బాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ లు ఉన్నారు. ఈ విజయగాధ బీజింగ్ నుంచి లండన్ దాకా కొనసాగింది. కానీ రాబోయే ఒలింపిక్స్ సంగతేమిటన్నది మాత్రం ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది.
సరైన క్రీడా వ్యవస్థలు, ప్రణాళికలు, వ్యూహాలు లేని మన దేశంలో స్టార్ ప్లేయర్లున్నా వనరులు, వసతులు లేక, భుజం తట్టేవారు లేక ఇబ్బందులు పడుతున్నాం. లక్ష్మీ మిత్తల్ ఛాంపియన్స్ ట్రస్ట్ ఈ లోటును పూరించింది. ఇప్పుడు వివిధ కారణాల వల్ల లక్ష్మీ మిత్తల్ డబ్బు సంచీలను ముడి బిగించేయడంతో క్రికెట్టేతర ఆటలు, ఆటగాళ్లు ఇబ్బందుల్లో పడటం ఖాయం.