రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నార్పల ( శింగనమల) : మండలంలోని బొందలవాడ గ్రామ సమీపంలోని తాడిపత్రి – ధర్మవరం ప్రధాన రహదారిపై ఉన్న మలుపు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు .. బొందలవాడకు చెందిన దాసరి వెంకటనారాయణ కుమారుడు శరత్‌కుమార్ (26) నార్పలలో వ్యక్తిగత పని ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో నార్పలకు చెందిన చిలమకూరి గోపాల్ కుమారుడు విజయ్ బొందలవాడలో నరసింహస్వామి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్నాడు.
వీరిరువురి వాహనాలు బొందలవాడ సమీపంలోని మలుపువద్ద ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో శరత్‌కుమార్ మరణించాడు. మరో యువకుడు చిలమకూరు విజయ్ పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ రాంప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.