గ్రామీణ ప్రాంతాలకూ బీమా పథకాలు విస్తరింపజేయాలి
డెంకణీకోట,(హొసూరు, కెలమంగలం), న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాలకూ బీమా పథకాలు విస్తరింపజేసి, అక్కడి ప్రజలకు బీమా కల్పించాలని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కే.రోశయ్య సూచించారు. యునెటైడ్ ఇండియా ఇన్సురెన్స్, రాశీ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా స్వయం సహాయక గ్రూపులకు ఏర్పాటుచేసిన మదర్ థెరిసా బీమా పథకాన్ని శనివారం సాయంత్రం క్రిష్ణగిరి జిల్లా డెంకణీకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆటల మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ పథకం కింద స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యులైన 10 వేల మంది మహిళలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించారు. బీమా పథకం కార్డులను మహిళలకు గవర్నర్ అందజేశారు.ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి పలు పథకాలు ప్రవేశపెట్టాయని, వీటిని సద్వినియోగం చేసుకు మహిళలు స్వావలంబన సాధించాలని సూచించారు.
దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 75 జిల్లాల్లో బీమా పథకం అమలు జరుగుతోందని, ఈ పథకం దేశంలోని ప్రతి ఒక్కరికి వర్తించేలా చూడాలని కోరారు. ఆపదల్లో బీమా ఆదుకుంటుందన్నారు. యూనెటైడ్ ఇన్సురెన్స్ సంస్థలాగా ఇతర బీమా సంస్థలు కూడా ఇలాంటి ఉచిత బీమా పథకాలను ప్రవేశపెడితే అందరికి బీమా సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. క్రిష్ణగిరి జిల్లాలో రాశీ గ్రూప్ సంస్థలు 10 వేల మందికి ఉచితంగా బీమా కల్పించడాన్ని గవర్నర్ అభినందించారు. గవర్నర్ రోశయ్య ఇంగ్లిష్‌లో ఉపన్యాసం ప్రారంభించారు. ప్రజల కోరిక మేరకు తెలుగులో ప్రసంగించారు. మాజీ ఎంపీ. సి.నరసింహన్ స్వాగతోపన్యాసం చేశారు.
కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎం.హెచ్ అంబరీష్ కన్నడ భాషలో ఉపన్యసించారు. ఎం.మంజునాథ్ తదితరులు గవర్నర్‌ను సన్మానించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా క్రిష్ణగిరి ఎస్పీ సెందిల్‌కుమార్ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి గవర్నర్ నేరుగా డెంకణీకోటకు వెళ్లారు. హొసూరులోని హోటల్ రినేజెన్స్లో ప్రముఖులను కలిసే కార్యక్రమం రద్దయింది. డెంకణీకోట, హొసూరు, క్రిష్ణగిరి, బెంగళూరు, సర్జాపురం నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గవర్నర్‌కు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు జిల్లా కలెక్టర్ టి.పి.రాజేష్ స్వాగతం పలికారు. డెంకణీకోటలో రోశయ్యను కలసి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. గవర్నర్ రాక కోసం పెద్ద ఎత్తున ఉదయం నుంచి ప్రజలు వేచి ఉన్నారు.వర్షం జల్లులు పడడంతో కొంత ఇబ్బంది పడ్డారు.