స్వదేశంలో ఆడటం భారత్‌కు లాభం
టి20 ప్రపంచకప్‌పై జహీర్ వ్యాఖ్య
ముంబై: స్వదేశంలో ఆడనుండటం వల్ల రాబోయే టి20 ప్రపంచకప్‌లో భారత్ లాభపడుతుందని మాజీ పేసర్ జహీర్‌ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి పిచ్‌లపై స్పిన్ ఆడటంలో మనవాళ్ల నైపుణ్యం వల్ల భారత్ టైటిల్ ఫేవరెట్‌గా మారిందన్నాడు. ‘కచ్చితంగా ఈ టోర్నీలో భారత్ రాణిస్తుంది. టి20 కావడంతో పాటు టోర్నీ ఉపఖండంలో జరుగుతుంది. ఇక్కడ స్పిన్‌దే కీలక పాత్ర. మనం స్పిన్‌ను చాలా బాగా ఆడతాం. కాబట్టి ఇది టోర్నీలో బాగా లాభిస్తుంది. ఆటలో వచ్చిన చాలా మార్పులు చాలా ఉత్సాహాన్ని తెచ్చాయి.
బ్యాట్స్‌మన్ కూడా కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మొత్తానికి టి20లు అద్భుతమైన మ్యాచ్‌లుగా మారిపోయాయి’ అని ఐసీసీతో ఉన్న ఒప్పందాన్ని పొడిగించుకునేందుకు మనీగ్రామ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జహీర్ పేర్కొన్నాడు. సొంత అభిమానుల మధ్య 2011 వన్డే ప్రపంచకప్ గెలవడం చాలా ప్రత్యేకమైందని ఈ సందర్భంగా అతను గుర్తు చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు ఆదరణ పెంచడమే గవర్నింగ్ బాడీ ప్రధాన లక్ష్యమని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ అన్నారు. 2015-19 మధ్య కాలంలో క్రికెట్‌ను అత్యంత ప్రజాదరణ కలిగిన ఆటగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ తర్వాత క్రికెట్ రెండో స్థానంలో ఉందని చెప్పారు.