bike accident
-
అతివేగంతో ట్రిపుల్ రైడింగ్.. స్పాట్లోనే మృతి
హైదరాబాద్, సాక్షి: రాజేంద్రనగర్ మండలం పరిధిలో గత రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగా ప్రారంభమైన మన్మోహన్ సింగ్ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ బైక్ వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.బహదూర్‌పురా-ఆరాంఘడ్ కొత్త ఫ్లై ఓవర్‌పై సోమవారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఇద్దరు స్పాట్లోనే చనిపోగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ధృవీకరించారు.మృతుల్ని బహుదూర్‌పురాకు చెందిన మాబ్, అహ్మద్, సయ్యద్గా గుర్తించారు. ఈ ముగ్గూరూ మైనర్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు బ్రిడ్డిపైన ఉన్న డివైడర్ని ఢీకొట్టి కిందపడ్డారు. ఈ ఘటనలో బ్రిడ్జిపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్, జాబ్ సెర్చింగ్‌లో ఉన్న బాలప్రసన్న మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ బైక్‌పై అతివేగంగా బైక్ నడపడటంతో డివైడర్‌ను ఢీకొని వంతెనపై నుంచి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
కాకినాడలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మురారీ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాల ప్రకారం.. కాకినాడలోకి గండేపల్లి మండలం మురారీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతిచెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, మృతులను భీమవరానికి చెందిన వారిగా గుర్తించారు. -
ఆకలే ఆమెకు శాపమైంది.. ఒక్కగానొక్క కూతురు ఇలా..
సాక్షి, పెందుర్తి: తమ కూతురు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు విధి తీరని విషాదం నింపింది. భోజనం చేసేందకు రోడ్డు దాటేందుకు ప్రయత్నించడమే ఆమె పాలిట శాపమైంది. బైక్ ఢీకొనడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణానికి చెందిన ముల్లా షహీద(23) కుటుంబం ఉపాధి కోసం విశాఖ వలస వచ్చారు. ఆమె తల్లిదండ్రులు పెందుర్తి గాంధీనగర్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. కాగా, వీరికి ఒక్కగానొక్క కుమార్తె షహీద. అయితే, షహీద.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం పాఠశాలకు వెళ్లిన ఆమె.. స్కూల్లో ఒక విద్యార్థి భోజనం తీసుకురాకపోవడంతో తన భోజనాన్ని సదరు విద్యార్థికి ఇచ్చేశారు. ఇక, సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఆకలి వేయడంతో ఆమె ఇంటికి సమీపంలోనే ఓ బండి వద్ద పునుగులు తిన్నారు. అనంతరం నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా దూసుకొచ్చిన బైక్.. ఆమెను ఢీకొట్టింది. దీంతో, షహీదా కుప్పకూలి కిందపడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఆమె కాలు విరిగిపోగా, చేతికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలిస్తుండగా తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గ మధ్యలోనే మృతి చెందారు. దీంతో, ఒక్కగానొక్క కూతురు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడంతో పేరెంట్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెందుర్తి సీఐ మరడాన శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదానికి కారణమైన పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన యువకుడు రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగం ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఇది కూడా చదవండి: రూ. కోట్లకొద్దీ డబ్బు, బంగారం స్వాధీనం -
తృటిలో తప్పించుకున్నారు, లేదంటే తల పగిలేది!
-
పెళ్లింట విషాదం.. బైక్‌పై సామానులతో వస్తుండగా
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ పరిధి బొడ్డేపల్లిపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన యువకుడు చిలకలపల్లి మణికంఠ (23) కొర్లకోటలో తన పిన్ని కుమారుడు వివాహం జరుగుతున్న సందర్భంగా ఇద్దరు మహిళలు పిడిమి రాజులమ్మ, పిడిమి మీనాలను తన బైకుపై ఎక్కించుకొని కొంత సామానులతో వస్తున్నాడు. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి పాలకొండవైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో మణికంఠ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజులమ్మ, మీనాలకు తీవ్ర గాయాలు కావడంతో 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన రాజులమ్మ తమ్ముడి వివాహం కోసం కన్నవారి గ్రామం కొర్లకోట ఇటీవల చేరుకుంది. వివాహ సామగ్రి కొనుగోలు నిమిత్తం తోటికోడలు మీనాతో కలిసి మణికంఠ బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రాజులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమదాలవలస ఎస్ఐ వై.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో వివాహం జరుగుతున్న వేళ పెండ్లికుమారుడి పిన్ని కొడుకు మృతిచెందడం, అక్క, పిన్నికుమార్తెకు గాయాలు కావడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. బుడితిలో విషాదఛాయలు సారవకోట: చిలకపల్లి మణికంఠ మృతితో స్వగ్రామం బుడితిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి పాపారావు బుడితి జంక్షన్లో రైస్‌మిల్లులో హమాళిగా పనిచేస్తుండగా, మణికంఠ పెయింటింగ్ పనులకు వెళ్తుండేవాడు. -
రక్తం చుక్క కూడా రాలేదు.. చాలా భయపడ్డా: అల్లు అరవింద్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతంలో బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తేజ్..ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తేజ్ నటించిన చిత్రం ‘విరూపాక్ష’ విడుదలకు సిద్ధంగా ఉంది. నేడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అరవింద్ .. తేజ్ ప్రమాదం గురించి మాట్లాడారు. ‘తేజ్‌కు యాక్సిడెంట్ అయిందనే విషయం తెలియగానే.. మొదట నేనే ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లాను. సాయి ధరమ్ తేజ్ పరిస్థితి చూసి చాలా భయమేసింది. రక్తం చుక్క కూడా రాలేదు. ఏం జరిగిందో తెలియడానికి పావు గంట పట్టింది. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు చాలా ఆనందంగా ఉంది. బ్రతుకుతాడో లేదో అనుకున్న వ్యక్తి.. ఇప్పుడు ‘విరూపాక్ష’లో అద్భుతంగా నటించాడని కొంతమంది చెబుతుంటే సంతోషంగా ఉంది’అని అల్లు అరవింద్ అన్నారు. కార్తీక్‌దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరూపాక్ష’లో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బైక్‌పై దూసుకెళ్తూ మొబైల్ దొంగ దుర్మరణం!
సాక్షి, శివాజీనగర: ప్రజల నుంచి మొబైల్ఫోన్లు లాక్కెళ్తూ వేగంగా దూసుకెళ్లిన బైకర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోడ్డు డివైడర్‌కు బైక్ ఢీకొనడంతో ఒకరు అక్కడే మృతి చెందగా అతని వద్ద 8 మొబైల్ఫోన్లు చిక్కడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి సిటీ మార్కెట్ పై వంతెన మీద ఈ ఘటన జరిగింది. మృతుడు కబీర్ పాషా. అతి వేగంగా పై వంతెన మీద వెళుతుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పడడంతో తలకు గాయాలై చనిపోయాడు. ద్విచక్ర వాహనంలో ఎనిమిది మొబైల్‌లు లభించడం పలు అనుమానాలకు కారణమైంది. కేపీసీసీ కార్యాలయం వద్ద ఓ మహిళ మొబైల్ ఫోన్‌ను లాక్కొని పరారైంది ఇతడేనని అనుమానం ఉంది. సెల్ చోరీలకు పాల్పడి ఉడాయించాలనే తొందరలో ప్రమాదానికి గురైనట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరో వ్యక్తి గాయపడగా ఆస్పత్రికి తరలించారు. (చదవండి: భార్యకు బీమా పత్రాలు, డెత్‌నోట్ వాట్సాప్ చేసి..) -
జగిత్యాల: పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి
సాక్షి, జగిత్యాల: పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. కిషన్రావుపేట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ వెళ్తుండగా ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బైక్‌పై ఫాలో అవుతుండగా రాజ్‌కుమార్ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కొండగట్టు శ్రీఆంజనేయస్వామి, ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. ఆయన శ్రీఆంజనేయస్వావిుకి శేష వస్త్రాలు, తమలపాకులు, పండ్లు సమర్పించారు.మూలవిరాట్టుకు అభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు జితేంద్రస్వామి, ఉపప్రధాన అర్చకులు చిరంజీవి, అఖిల్‌కృష్ణ, రామ్, లక్ష్మణ్.. పవన్ కల్యాణ్‌కు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు -
అందుకే ‘హెల్మెట్’ పెట్టుకోమని చెప్పేది.. ఓసారి ఈ వీడియో చూడండి
బైక్‌పై వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తున్నారు. జరిమానాలు సైతం విధిస్తున్నారు. కానీ, చాలా మంది హెల్మెట్ పెట్టుకునేందుకు ఇష్టపడటం లేదు. అయితే, అలాంటి వారు ఈ వీడియోను చూస్తే వారు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో, హెల్మెట్ వల్ల ఏ మేర ప్రయోజనం ఉందో తెలుస్తుంది. ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా దూసుకొచ్చి పడిపోయాడు. ఎదురుగా వస్తున్న బస్సు వెనకాల టైర్ల కిందకు దూసుకెళ్లాడు. హైల్మెట్ ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన గతంలో జరిగినా.. పాత వీడియోనే మరోమారు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను తాన్సుయోగెన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బస్సును ఢీకొట్టిన బైకర్.. వెనక టైర్ల కిందకు దూసుకెళ్లాడు. తల టైర్ కిందకు వెళ్లింది. దీంతో హెల్మెట్ పగిలింది. అయితే, బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తానే బస్ కింద నుంచి బయటకు రాగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు హెల్మెట్ ఉండటం వల్లే అతడి ప్రాణాలు నిలిచాయని కామెంట్ చేశారు. ‘అతడు పెట్టుకున్న హెల్మెట్ బ్రాండ్ నాకు చెప్పండి ప్లీజ్..’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మరోవైపు.. ఆ హెల్మెట్ తయారు చేసిన సంస్థనే ప్రచారం కోసం ఇలాంటి వీడియోలు చేస్తుందని మరికొంత మంది పేర్కొన్నారు. My reactions in order: 1) OMG😱 2) I hope he has survived🙏 3) Yes he did👏 4) What is the brand of his helmet❓ pic.twitter.com/dnBugyycGe — Tansu YEĞEN (@TansuYegen) December 12, 2022 ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
హబ్సిగూడలో కారు బీభత్సం
సాక్షి, లాలాపేట: మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ హబ్సిగూడ ప్రధాన రహదారిలో బీభత్సం సృష్టించారు. నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను, ఓ స్కూటీని ఢీకొట్టిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహిస్తున్న మౌర్య తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పూటుగా మద్యం తాగారు. ఉదయం ఒక్కడే మౌర్య 8 గంటలకు హబ్సిగూడ స్ట్రీట్ నంబర్–8 నుంచి సికింద్రాబాద్‌కు కారులో బయలుదేరారు. కొద్ది సేపటికే మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో రామంతాపూర్ వైపు వెళ్తున్న ఓ ఆటోను, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఆటో, స్కూటీ నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు హరీష్, శ్రీనివాస్, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. కారు డ్రైవర్ మౌర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉందని ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. (చదవండి: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే) -
రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్‌ను బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా..
సాక్షి, హైదరాబాద్: బైక్ అదుపుతప్పి డివైడన్‌రు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వేణుమాధవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ మారుతీనగర్ కాలనీకి చెందిన దంతులూరి అభిసాయిరామ్‌రాజు (22) హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. గత శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అభి సిద్దిపేట నుంచి వచ్చిన మిత్రుడు రమేష్‌నును కలిశాడు. ఇద్దరు కలిసి నాగారంలోని మరో మిత్రుడి ఇంటికి వెళ్లారు. రాత్రి ఇంటికి రావడం లేదని మరుసటి రోజు ఉదయం వస్తానని తన తల్లికి ఫోన్ చేసి చెప్పిన అభి రాత్రంతా మిత్రులతో కలిసి సరదాగా గడిపారు. ఆదివారం తెల్లవారుజామున రమేష్‌ను జేబీఎస్లో డ్రాప్ చేయడానికి మరో మిత్రుడి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో ఈసీఐఎల్ చౌరస్తా నుంచి రాధిక వైపుగా వెళ్తుండగా సోనీ సెంటర్ మూలమలుపు వద్ద అదుపు తప్పిన బైక్ డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అభిసాయిరామ్‌రాజు తల పగిలి అక్కడిక్కడే మృతిచెందగా రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. చదవండి: విహారంలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి -
వీడియో: కర్మ అంటే ఇదేనేమో.. దెబ్బకు తిక్క కుదిరింది!
పెద్దలు ఊరికే అనలేదు.. చెడపకురా చెడేవు అని. పక్కవారికి హాని తలపెట్టాలని చూస్తే అది మనకే రివర్స్‌లో తగులుతుంది. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ యువతి తాను చేసిన పనికి.. కర్మ ఫలం వెంటనే అనుభవించింది. ఓ యువకుడు, యువతి రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి పక్కన మరో బైక్‌పై ఓ వ్యక్తి వెళ్తున్నాడు. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఆమెకు ఏం అనిపించిందో ఏమో.. పక్కన బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని తన కాలితో తన్నే ప్రయత్నం చేసింది. దీంతో, బ్యాలెన్స్ తప్పి రన్నింగ్‌లో ఉన్న బైక్ మీద నుండి కిందపడిపోయింది. కాగా, పక్కన వెళ్తున బైకర్.. తనను ఆమె తన్నడాన్ని గమనించకపోవడం విశేషం. ఆమె కిందపోడిపోవడంతో స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఇక, ఆమె కిందపడిపోవడం గమనించిన రైడర్.. బైక్‌ను పక్కనే ఆపి మళ్లీ ఆమెకు మళ్లీ బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. బహుషా కర్మ అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. ఇది కూడా చదవండి: ‘అమ్మో ఎలుగుబంటి.. దారుణంగా దాడి చేసింది’ -
షాకింగ్ వీడియో.. కారు డోరు తెరిచేప్పుడు కాస్త చూసుకోండి..!
బెంగళూరు: రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఊహించలేం. కొందరు నిర్లక్ష్యపూరింతా చేసే చిన్న చిన్న తప్పులు మరొకరి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన అలాంటి ఓ రోడ్డు ప్రమాదం వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం.. ఓ మహిళ తన స్కూటర్‌పై వెళ్తోంది. ముందు నిలిపి ఉంచిన కారు డోరును అకస్మత్తుగా తెరవటంతో దానిని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది మహిళ. ఆ వెనకాలే వస్తున్న కారు ఆమెపైకి ఎక్కింది. కారు డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేసినా ఫలితం లేకుండా పోయింది. కారు కింద ఉన్న మహిళను కాపాడేందుకు చుట్టుపక్కల జనం హుటాహుటిన అక్కడికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గత సెప్టెంబర్ 24న జరిగింది. రోడ్డుపై వెళ్లేప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ ప్రమాదం వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది కర్ణాటక రోడ్డు భద్రతా సంస్థ. ‘రోడ్లపై మీ కారు డోరు తెరిచేప్పుడు తప్పనిసరిగా సైడ్ మిర్రర్లో ఓసారి తనిఖీ చేసుకుని వెనకాల ఏమైనా వాహనాలు వస్తున్నాయో లేదో గమనించండి. దాంతో ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. రోడ్డుపై జగ్రత్తగా ఉండండి, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించండి’అని పేర్కొంది. Before opening the door of your car on public roads, make sure to check in the side or rear view mirror for vehicles coming from behind to avoid such accidents. Be mindful and careful! #roadsafety #rules #safety #drive #drivesafe #traffic pic.twitter.com/McPqHHr1GY — Karnataka State Road Safety Authority (@KSRSA_GoK) October 10, 2022 ఇదీ చదవండి: సింహం పిల్లలే కదా అనుకుంటే ఇట్లుంటది.. ఒక్క గాండ్రింపుతో హడల్ -
అతివేగానికి ముగ్గురి ప్రాణాలు బలి
మరికల్: అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మరికల్ మండలం బండతండాకు చెందిన రాహుల్ నాయక్ (21), అమరచింత చంద్రప్ప తండాకు రాజేశ్ నాయక్(18), బూడ్యాగాని తండాకు చెందిన కిషన్‌నాయక్‌లు ఒకే బైక్‌పై బయలుదేరారు. శనివారంరాత్రి కన్మనూర్‌లో మద్యం కొనుగోలు చేసి మరికల్‌లోని ఓ హోటల్లో బిర్యానీ పార్శిల్ తీసుకొని పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. అక్కడ పెట్రోల్ లేకపోవడంతో లాల్కోట చౌరస్తాలోని మరో బంక్ వద్దకు బయల్దేరారు. అతివేగంగా వెళ్తున్న వీరి బైక్ అదుపు తప్పి, షాద్‌నగర్ నుంచి నారాయణపేటకు మరో బైక్‌పై వస్తున్న నవీన్‌కుమార్(35) అనే వ్యక్తిని తీలేర్ స్టేజీ దగ్గర ఢీ కొట్టింది. ఈ ఘటనలో నవీన్‌కుమార్, రాజేశ్‌నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రాహుల్, కిషన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాహుల్ మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిషన్‌నాయక్ పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పెద్దల పండుగకు వస్తూ.. నారాయణపేటకు చెందిన నవీన్‌కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమార్తె ఉన్నారు. షాద్‌నగర్‌లో ఓ ప్రైవేట్ ప్లాస్టిక్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. నెల క్రితం మృతి చెందిన పెద్దనాన్నకు ఆదివారం పెద్దల పండుగ చేయాల్సి ఉండటంతో భార్య, కూతురిని ఆదివారం బస్సులో రమ్మని చెప్పిన నవీన్ శనివారం రాత్రి బైక్‌పై నారాయణపేటకు బయల్దేరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
మరణం అంచున నరకయాతన! ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా..
ఆలమూరు: మరణానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరం ఉండి కొన్ని గంటల పాటు నరక యాతన అనుభవించి.. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. కోనసీమ జిల్లా రావులపాలెం ఇందిరా కాలనీకి చెందిన చిర్రా ప్రదీప్‌కుమార్ రాజమహేంద్రవరంలోని ఓ ప్రయివేటు కంపెనీలో హోమ్‌గార్డ్. బుధవారం విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా గౌతమీ గోదావరి కొత్త వంతెనపై వాహనాన్ని తప్పించబోయి రైలింగ్ పక్కన ఉన్న కాంక్రీట్ గోడను ఢీకొట్టి గోదావరిలో జారి పోయాడు. అదృష్టవశాత్తు గోదావరి నదికి, వంతెన పైభాగానికి మధ్యనున్న చెక్కబల్లపై పడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ప్రదీప్‌కుమార్ హెల్మెట్ ధరించడం వల్ల బలమైన గాయాలు కాలేదు. గాయాలు తట్టుకోలేక, మరో పక్క గోదావరిలో పడిపోతానన్న భయంతో ఆర్తనాదాలు చేశాడు. ఆ అరుపులు విన్న ప్రయాణికులు వెంటనే పోలీసులకు, హైవే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ను తెప్పించి పోలీసులు కిందకు దిగి తాడు సాయంతో అతన్ని పైకి తీసుకొచ్చారు. వెంటనే ఎన్‌హెచ్ 16 అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించాక.. రావులపాలెంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రదీప్‌కుమార్ ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా పడి ఉంటే.. నీటిలో మునిగి ప్రాణాలు పోయేవని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, హైవే సిబ్బంది సకాలంలో స్పందించకున్నా పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. -
వైరల్ వీడియో: రైలు పట్టాలపై బైక్.. దూసుకెళ్లిన ట్రైన్
-
పెద్దలు కాదు.. విధి ఆ ప్రేమజంటను విడదీసింది
ఒకేచోట పని చేసే ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో చెబితే పెద్దలు కాదన్నారు. వీళ్లు ఎదురించారు. ఇంట్లోంచి వెళ్లిపోయి కలిసి బతకాలనుకున్నారు. కానీ, విధి ఈ లవ్‌స్టోరీని విచిత్రమైన మలుపు తిప్పింది. విషాదాంతమైన ముగింపు ఇచ్చింది. హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): బాపులపాడు మండలం వీరవల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న ప్రేమజంట రోడ్డు ప్రమాదానికి గురైంది. 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైంది. పోలీసుల కథనం మేరకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెరువూరుకు చెందిన సారపు పోతురాజు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మెర్సీ కొంతకాలంగా ఓ స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ తమ పెద్దలకు చెప్పగా వారు అంగీకరించలేదు. ఈ నెల 19వ తేదీన మెర్సీకి వేరే యువకుడితో వివాహం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో 18వ తేదీనే మెర్సీ, పోతురాజు తమ ఇళ్ల నుంచి పరారయ్యారు. దీంతో.. మెర్సీ అదృశ్యమైందని ఆమె తల్లిదండ్రులు తెనాలి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెర్సీ, పోతురాజుతో కలిసి అతని స్వగ్రామమైన రంపచోడవరం మండలం చెరువూరులో ఉన్నట్లుగా గుర్తించారు. విచారణ నిమిత్తం తెనాలి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా ప్రేమికులకు పోలీసులు సూచించారు. దీంతో పోతురాజు, మెర్సీ బైక్‌పై తెనాలి బయలుదేరారు. వీరవల్లి సమీపంలో జాతీయ రహదారి ప్లై ఓవర్ బ్రిడ్జి మీదకు రాగానే పోతురాజు సెల్‌ఫోన్ మోగింది. అతను బైక్ నడుపుతూనే ఫోన్ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. బైక్ అదుపుతప్పి వంతెన సైడ్ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రేమికులు ఇద్దరూ ఎగిరి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై నుంచి కింద ఉన్న సర్వీసు రోడ్డుపై పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో పోతురాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మెర్సీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వీరవల్లి ఏఎస్ఐ వై.ఆంజనేయులు, హైవే రోడ్ సేఫ్టీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మెర్సీని హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నోట్: వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ కాల్ మాట్లాడడం మంచిది కాదు. నిర్లక్ష్యంగా చేసే ఈ పని.. జీవితాలను తలకిందులు చేసే అవకాశం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
చిన్నమండెం: మండల పరిధిలోని మల్లూరు క్రాస్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని మల్లికార్జున(27), రెడ్డిశేఖర్(26)లు అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ రామాంజినేయుడు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రాయచోటిలో బేల్దారి పనులు ముగించుకొని ద్విచక్రవాహనంలో భార్య సంధ్యతో కలసి మల్లికార్జున తన సొంత ఊరు పెద్దమండెం మండలం కుంటకిందపల్లెకు బయలుదేరారు. అలాగే చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకు చెందిన రెడ్డిశేఖర్ సొంత పనుల నిమిత్తం తన ద్విచక్రవాహనంలో రాయచోటికి వస్తున్నాడు. వీరు మల్లూరు క్రాస్ సమీపానికి రాగానే ఎదురెదురుగా వస్తున్న రెండు స్కూటర్లు ఢీకొయి. ప్రమాదంలో మల్లికార్జున, రెడ్డిశేఖర్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సంధ్యను 108 సాయంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ రామాంజినేయుడు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బైకు ప్రమాదంలో యువతి మృతి
యలమంచిలి రూరల్ : జాతీయ రహదారిపై పెదపల్లి జంక్షన్ సమీపంతో బైక్ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో యువతి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తవలస మండలం యర్రవానిపాలెం గ్రామానికి చెందిన దుంగా రమేష్, లావణ్య(20) తెల్లవారుజామున బయలుదేరి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో పెదపల్లి వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిని 108 సిబ్బంది, జాతీయ రహదారి సిబ్బంది అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందినట్టు యలమంచిలి టౌన్ ఎస్ఐ నీలకంఠరావు తెలిపారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించారు. -
ప్రమాదకర మలుపులో రెండు బైకులు ఢీ..
సాక్షి, పాడేరు: మైదాన ప్రాంతాలకు వెళ్లే పాడేరు ప్రధాన రోడ్డులో కందమామిడి జంక్షన్ సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద సోమవారం ఉదయం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గిరిజన యువకుడు మృతి చెందగా, మరో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ చింతగున్నలకు చెందిన పాంగి వెంకట్(20), మోదాపల్లి పంచాయతీ గుర్రగరువుకు చెందిన మర్రి శేఖర్, మర్రి కామేష్ పల్సర్ బైక్‌పై మోదాపల్లి వెళ్తున్నారు. అదే సమయంలో అనకాపల్లికి చెందిన సిరిపురపు రాజు నరేంద్ర, శరగడం కుమార్ మరో బైక్‌పై వస్తున్నారు. కందమామిడి జంక్షన్ సమీపంలో ప్రమాదకర మలుపు వద్ద వీరు ఎదురెదురుగా రావడంతో బలంగా ఢీకొన్నారు. రెండు బైకుల మీదున్న వారంతా ఎగిరిపడ్డారు. పల్సర్ బైక్‌పై మధ్యలో కూర్చున్న పాంగి వెంకట్ తలకు తీవ్ర గాయమవడంతో హుటాహుటిన పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. మిగిలిన నలుగురిలో సిరిపురపు రాజు నరేంద్ర, మర్రి శేఖర్‌లకు తీవ్ర గాయాలవడంతో కేజీహెచ్‌కు తరలించామని పాడేరు ఎస్ఐ లక్ష్మణ్‌రావు తెలిపారు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే మృతుడు వెంకట్ స్వగ్రామం చింతగున్నలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి రోలుగుంట: మండలంలోని కుసుర్లపూడిలో ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ చక్రం కింద పడి గొర్లె చెల్లయ్యనాయుడు(37) మృతి చెందాడు. దీనిపై మృతుడు అన్నయ్య పెద్దియ్యనాయుడు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై బి.నాగకార్తీక్ కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం చెల్లయ్యనాయుడు తన పొలంలో దుక్కు పనులు చేసేందుకు ట్రాక్టర్ తీసుకెళ్లాడు. సాయంత్రం కురిసిన వర్షానికి పనులు నిలిపివేసి తిరిగి వస్తున్న క్రమంలో కాలు జారి ట్రాక్టర్ చక్రం కిందే పడిపోయాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవ పంచనామా చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పదేళ్ల పాప ఉన్నారు. -
బైక్‌పై లవర్‌తో సోదరి షికారు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అన్న
భోపాల్: తన సోదరి.. లవర్‌తో బైక్ మీద వెళ్తోందని ఆమె అన్న గమనించాడు. దీంతో వారిని రోడ్డుపై ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, వారు బైక్ స్పీడ్ పెంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం పట్టలేక దారుణనికి ఒడిగట్టాడు. వారు వెళ్తున్న బైక్‌ను ఓ మినీ ట్రక్కుతో ఫాలో చేసి హైస్పీడ్‌లో ఢీకొట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని అయోధ్యనగర్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తన సోదరి.. లవర్‌తో బైక్‌పై వెళ్తోందన్న కోపంతో ఆమె సోదరుడు అజీం మస్సూరీ వారిని వెంబడించాడు. వారు వెళ్తున్న బైక్‌ను ఓ మినీ ట్రక్కుతో వెంబడించి.. బలంగా ఢీకొట్టాడు. అలాగే బైకును, వారిద్దరినీ 10 మీటర్ల దూరం ట్రక్కుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా వాహనం దిగి.. తన సోదరి సహా ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోగా.. స్థానికులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అజీం మన్సూరీని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్ రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. #WATCH | Bhopal: A couple in their twenties from different communities were injured after the girl’s cousin allegedly chased, hit their scooter and assaulted them while they were trying to elope in Ayodhya Nagar on Monday afternoon. pic.twitter.com/hFgg3kOfVC — TOI Bhopal (@TOIBhopalNews) April 20, 2022 ఇది చదవండి: హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్ -
కొత్త బైక్ కొన్న ఆనందం.. పూజ కోసం వెళ్తూ..
సాక్షి,పెద్దశంకరంపేట(మెదక్)/నిజాంసాగర్(జుక్కల్): పెద్దశంకరంపేట 161 జాతీయ ప్రధాన రహదారి కోళాపల్లి వద్ద ఎదురెదురుగా ఆటో–బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఎస్సై నరేందర్ వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వెల్గనూర్‌కు చెందిన గువ్వ సాయిలు(22) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉంటూ డెకరేషన్ పనులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే కొత్త బైక్ కొనుగోలు చేశాడు. బైక్‌కు పూజ చేయించేందుకు మంగళవారం స్వగ్రామానికి వెళ్తుండగా జోగిపేట వైపు నుంచి రాంగ్రూట్లో వస్తున్న ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. అరగంటలో ఇంటికి చేరుకుంటాడనగా ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సాయిలు తల్లి హన్మమ్మ గతంలోనే చనిపోగా, తండ్రి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆటోలో ఉన్న చాకలి రవీందర్‌కు గాయాలు కాగా అతడిని హైవే అంబులెన్స్‌లో పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సాయిలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. కళ్లలో కారం చల్లి.. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన షేన్ వార్న్..
Former Australian Cricketer Shane Warne Injured In Bike Accident: ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కొడుకు జాసన్‌తో కలిసి రైడ్‌కు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతడి కాలికి గాయమైనట్లు సమాచారం. ఆస్ట్రేలియన్ మీడియా నివేదికల ప్రకారం.. షేన్ వార్న్ మెల్బోర్న్లో రైడ్‌కు తన కూమారుడితో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే స్పోర్ట్స్ బైక్‌ను అతివేగంగా నడిపినందునే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంపై స్పందించిన షేన్ వార్న్ మాట్లాడూతూ.. "నేను అదుపు తప్పి బైక్‌పై నుంచి కిందపడిపోయాను. ఆసమయంలోనేనే కాస్త బయపడ్డాను. స్పల్పగాయాలతో బయటపడ్డాను. అప్పుడు నేను బాగానే ఉన్నానని అనుకున్నాను. కానీ మరుసటి రోజుకి గాయం తీవ్రమైంది. దీంతో పూర్తిగా నడవలేకపోయాను. తర్వాత ఆసుపత్రికి వెళ్లగా నా కాలికి గాయమైందని వైద్యలు తెలిపారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బాలో జరిగే తొలి టెస్ట్‌కు నేను అక్కడే ఉంటాను" అని వార్న్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు సాధించాడు. చదవండి: PAK Vs BAN: ఏంటి బాబర్ ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకున్నావా.. -
ముగ్గురి యువకుల ప్రాణం తీసిన త్రిబుల్ రైడింగ్
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో.. పైగా ముగ్గురు బైక్‌పై వెళ్తున్న యువకులు ప్రమాదం బారిన పడి మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కండ్రిక పాతపాడులో చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వారు విజయవాడలోని వాంబే కాలనీవాసులుగా పోలీసులు గుర్తించారు. అతి వేగంగా వెళ్తున్న ఆ యువకులు రోడ్డు మళ్లింపు ఉందనే విషయాన్ని గమనించకుండా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు దాటుతున్న మహిళలపైకి దూసుకెళ్లిన బైకిస్ట్
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పిల్లర్ నంబర్ 143 వద్ద రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను బైక్ ఢీ కొట్టడంతో వారికి గాయాలయ్యాయి. ఆ వివరాలు.. రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తుండగా అత్తాపూర్ వద్ద ఇద్దరు మహిళలను బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. (చదవండి: విందుకు వెళ్తుండగా మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్) ప్రమాదానికి కారణమైన బైక్ ఓనర్ రాజు తన ఫ్రెండ్ అయిన శివ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజు బైక్ తన లైసెన్స్ ఆర్సీ ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం మహిళల ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: బాచుపల్లి: తీరని శోకాన్ని మిగిల్చిన ‘ఓవర్టేక్’ -
సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై పోలీసుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: నటుడు సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. సెకండ్ హ్యాండ్ బైక్‌ను ఎల్బీనగర్కు చెందిన అనిల్‌కుమార్ అనే వ్యక్తి నుంచి సాయి ధరమ్ తేజ్ కొనుగోలు చేశారని మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు. బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదని, బైక్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని మాదాపూర్ డీసీపీ పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రయాణించిన బైక్‌పై గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్ వద్ద ఓవర్ స్పీడ్ వెళ్లినందుకుగాను రూ.1,135 చలాన్ వేశమన్నారు. ఈ చలాన్‌ను ఈ రోజు సాయి ధరమ్ తేజ్ కుటుంబసభ్యులు క్లియర్ చేశారని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 78 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు పేర్కొన్నారు. దుర్గం చెరువుపై 102 కి.మీ. వేగంతో బైక్ నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ రాష్ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆటోను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టెక్ చేయబోయి స్కిడ్డై సాయిధరమ్ తేజ్ కిందపడ్డాడని పోలీసులు వెల్లడించారు. తేజ్ నుంచి టూవీలర్ నడిపే డ్రైవింగ్ లైసెన్స్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కేవలం లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసే లైసెన్స్ మాత్రమే ఉందన్నారు. ప్రమాదం సమయంలో హెల్మెట్ ధరించి ఉన్నాడని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్‌కు అపోలో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. చదవండి: సాయి అలాంటి వాడు కాదు, వదంతులు పుట్టించకండి: లక్ష్మీ మంచు -
రేసింగ్ అనేది అబద్దం...అసలు కారణాలివే
-
సాయిధరమ్ తేజ్ మా ఇంటి నుంచే బయలుదేరాడు: నరేశ్
టాలీవుడ్ యంగ్ హీరో, సాయిధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విదితమే. అపోలో ఆసుపత్రిలో ఆయనకి చికిత్స జరుగుతోంది. మెగా మేనల్లుడి ప్రమాద విషయం తెలిసిన ఎంతో మంది సినీ ప్రముఖులు అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా, సాయిధరమ్ తేజ్‌ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ మీడియాతో మాట్లాడారు. ‘మా అబ్బాయి నవీన్‌కి తేజ్ క్లోజ్‌ఫ్రెండ్. ప్రమాదం జరగడానికి ముందు మా ఇంటి నుంచే ఇద్దరూ కలిసి బయలుదేరారు. బైక్‌పై వద్దని చెబుదామనుకున్నా, కానీ ఆలోపే వెళ్లిపోయారు. పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాల్సిన సమయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నా ఈలోపే ప్రమాదం జరగడం బాధాకరం. వేగం విషయంలో యువత కంట్రోల్ ఉండాలి. నాకు ఒకసారి చిన్న ప్రమాదం జరగడంతో.. బాధతో మా అమ్మ ఒట్టు వేయించుకోవడంతో మళ్లీ బైక్ ముట్టుకోలేదు. కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్, కోమటి రెడ్డి అబ్బాయిలు ఇలాగే ప్రమాదాల్లో మరణించి వారి కుటుంబాలను శోక సముద్రంలో ముంచారు. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోరి అందరూ అనవసరంగా బైక్ ముట్టుకోకుండా ఉండాల’ని నరేశ్ కోరారు. -
సాయి ధరమ్ మా ఇంటి నుండే బయలుదేరాడు: నటుడు నరేశ్
-
సాయి తేజ్ యాక్సిడెంట్..సీసీ టీవీ దృశ్యాలు
-
సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ హీరో సాయిధరమ్‌తేజ్ కోలుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘‘యువ హీరో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్‌పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని’’ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆకాంక్షించారు. సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2021 సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. Saddened to know that @IamSaiDharamTej met with an accident. Our prayers to Almighty🙏for his quick recovery.@PawanKalyan @KChiruTweets @NagaBabuOffl pic.twitter.com/Xoyi3A6R4E — Dr Sravan Kumar Dasoju (@sravandasoju) September 10, 2021 ఇవీ చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్ వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్.. కొనసాగుతున్న చికిత్స -
ఇవాళ కూడా ఐసీయూలోనే సాయిధరమ్ తేజ్: వైద్యులు
-
సాయిధరమ్‌తేజ్ కోలుకుంటున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: అభిమానులు ఆందోళన పడవద్దని.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సాయిధరమ్‌తేజ్ కోలుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.. రెండు రోజుల్లో సాయిధరమ్ తేజ్ తిరిగి వస్తాడని చిరంజీవి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్‌తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో శుక్రవారం రాత్రి చిరంజీవి, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. మెరుగైన వైద్యం కోసం మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రి నుండి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి సాయిధరమ్‌తేజ్‌ను తరలించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు రోడ్డు ప్రమాదంలో హీరో సాయి ధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు -
సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్: సాయిధర్మ్ తేజ్‌కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు అర్ధరాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరిగిందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రోడ్డు ప్రమాదంలో హీరో సాయి ధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న ధరమ్ తేజ్‌ను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు. -
విందుకు వెళ్తుండగా మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్
యానాం: ఆనందంగా ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బైక్‌పై వెళుతున్న ఆ కుటుంబాన్ని స్కార్ఫ్ రూపంలో ప్రమాదం వెంటాడింది. ఆ మహిళ ధరించిన స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకు పోవడంతో ఆమె కింద పడటంతో తలకు తీవ్రగాయాలై మృతిచెందింది. గురువారం కాట్రేనికోన మండలం పల్లంకు చెందిన దంపతులు పాలెపు లక్ష్మణ్, పాలెపు దుర్గ (25) యానాం శివారు సావిత్రినగర్‌లో బంధువుల ఇంటిలో ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బైక్‌పై తమ మూడేళ్ల కుమారైతో వెళ్తున్నారు. మార్గమధ్యలో దొమ్మేటిపేట ఇసుక కాలువ వద్దకు వచ్చేసరికి దుర్గ ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకుపోయింది. దీంతో బైక్ అదుపుతప్పి ఆమె రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరిన ఆమెను స్థానికులు యానాం జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ దుర్గ మృతిచెందింది. భర్త లక్ష్మణ్‌కు, కుమారైకు స్వల్ప గాయాలయ్యాయి. యానాం ట్రాఫిక్ ఎస్సై కట్టా సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాచుపల్లి: తీరని శోకాన్ని మిగిల్చిన ‘ఓవర్టేక్’
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారి రోడ్డు మీదకు వచ్చామంటే.. ఒళ్లంతా కళ్లు చేసుకుని జాగ్రత్తగా చుట్టుపక్కల గమనిస్తూ.. వాహనాలు నడపాలి. మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించి.. మనమే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కేవలం ప్రాణం పోవడమే కాదు.. కొన్నేళ్ల పాటు మన కుటుంబం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. అర సెకను అజాగ్రత్త.. ఎంతటి కష్టాన్ని, నష్టాన్ని మిగులుస్తోందో చెప్పడానికి మాటలు చాలవు. ఇందుకు సంబంధించిన వీడియోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఆ ప్రమాద వివరాలు.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘‘దీని ద్వారా మీరు ఏం గమనించారు’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలోని ప్రమాదం బాచుపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. రోడ్డు మీద కొన్ని వాహనాలు వెళ్తుంటాయి. పెద్దగా రద్దీగా కూడా లేదు. రోడ్డు మీద లారీ, ఇన్నోవా వెళ్తుంటాయి. ఈ రెండింటి మధ్య ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఇన్నోవాకు ముందు ప్రయాణిస్తున్న ఆటో.. దానికి దారి ఇవ్వడం కోసం కొద్దగా ముందుకు వెళ్లి ఓ పక్కకు ఆగుతుంది. ఇక అంతసేపు ఇన్నోవాకు అతి సమీపంలో ఉన్న బైకర్.. ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. లారీ ముందుకు వెళ్తాడు. అయితే ఇది గమనించని లారీ డ్రైవర్ ఫాస్ట్‌గా వెళ్లడంతో బైక్‌ను ఢీ కొడతాడు. దాంతో ఆ వ్యక్తి ఎగిరి లారీ కింద పడి కొద్ది దూరం వెళ్తాడు. లారీలోని వ్యక్తి ప్రమాదాన్ని గుర్తించి కిందకు దిగి చూస్తుంటాడు. ఇంతలో లారీ కొంచె దూరం వెనక్కి కదిలి.. దాని కిందే ఉన్న బైకర్ మీదుగా కొంచెం దూరం వెళ్తుంది. కింద ఉన్న వ్యక్తి హెచ్చరించడంతో లారీని ఆపుతాడు. ఓవర్టేక్ చేయాలనే అర సెకను కోరిక.. బైకర్‌కి.. అతని కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందనే దాని గురించి వీడియోలో ఎలాంటి సమాచారం లేదు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని షేర్ చేశామని.. ఇతరుల అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విటర్లో దీన్ని షేర్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా బాధితుడిది, ఇన్నోవా డ్రైవర్‌దే తప్పని విమర్శిస్తున్నారు. -
పుట్టిన రోజు జరుపుకోవడానికి వచ్చి తిరిగిరాని లోకానికి..
సాక్షి, శ్రీకాకుళం: రావివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం లారీ ఢీకొని పిలక రమణ మృతి చెందగా.. చాట్ల గోవింద గాయపడ్డాడు. ఎచ్చెర్ల మండలం కొత్తకూరి్మనాయుడుపేట గ్రామానికి చెందిన రమణ, చినఅజ్జరాం గ్రామానికి చెందిన గోవింద్‌లు విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని తిమ్మాపురంలో ఉంటూ ఆటోలు నడుపుకుంటున్నారు. జూలై 30వ తేదీన రమణ పుట్టిన రోజు కావడంతో స్వగ్రామం కొత్తకూరి్మనాయుడుపేటలో స్నేహితులతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి స్నేహితుడు గోవింద్‌ను తీసుకొని వచ్చాడు. పుట్టిన రోజు వేడుకలు అయిపోవడంతో శనివారం సాయంత్రం తిమ్మాపురం వెళ్లేందుకు రమణ, గోవింద్‌లు స్కూటీతో వెళ్తూ రావివలస సమీపంలో లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదే లారీ ఢీకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రమణ లారీ చక్రాల కింద పడిపోవడంతో తలకు తీవ్ర గ్రాయమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గోవింద్‌ను 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. లావేరు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. రమణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రమణకు 2019వ సంవత్సరంలో వివాహమైంది. భార్య కుమారి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. -
తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన కేటీఆర్
సిద్దిపేటకమాన్: బైక్ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టిన ఘటనలో గాయపడిన ఇద్దరు యువకులను మంత్రి కేటీఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సిద్దిపేట పట్టణ శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీకి చెందిన జాఫర్ (26), యాకూబ్ (30) ద్విచక్ర వాహనంపై పట్టణం వైపు వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి బైపాస్‌రోడ్డు వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. వారిద్దరికి గాయాలయ్యాయి. అదే సమయంలో సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి కేటీఆర్ జరిగిన ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపించారు. కాన్వాయ్‌లోని రెండు వాహనాల్లో క్షతగాత్రులిద్దరినీ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్‌చేసి చెప్పారు. -
పండగపూట విషాదం; కుమారుడి పుట్టినరోజు కేక్ కోసమని వెళ్లి
ఓ వైపు బక్రీద్ పర్వదినం.. మరో వైపు కుమారుడి పుట్టినరోజు వేడుక.. రెండు విశేషాలు ఒకే రోజు రావడంతో ఆ ఇంట ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. తొలుత పర్విదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు.. సమీప బంధువుల రాకతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. తదనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుక నిర్వహణకు కేక్ తెచ్చేందుకు సమీప బంధువుతో కలిసి వెళ్లిన తండ్రిని సిమెంట్ ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించడంతో పండుగ పూట ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. జుపెన్‌పహాడ్ : మండల కేంద్రానికి చెందిన షేక్ జమాల్(33)కు భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం బక్రీద్ పర్వదినంతో పాటు కుమారుడి పుట్టినరోజు కూడా కలిసి రావడంతో సంతోషించాడు. వేడుకకు సమీపం బంధువులను కూడా ఆహ్వానించాడు. ఉదయం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ తెచ్చేందుకు వెళ్తుండగా.. మధ్యాహ్నం వరకు జమాల్ సంతోషంగా ఇంట్లోనే గడిపాడు. అనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు, అందుకు అవసరమైన కేక్ తదితర సామగ్రి తీసుకువచ్చేందుకు బంధువు లతీఫ్‌తో కలిసి బైక్‌పై సూర్యాపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో సింగారెడ్డిపాలెం గ్రామ శివారుకు చేరుకోగానే సూర్యాపేట నుంచి గరిడేపల్లి వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో షేక్ జమాల్ అక్కడికక్కడే మృతిచెందగా షేక్ లతీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు పో లీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి యాకూబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపారు. ఇనుప బోర్డును ఢీకొట్టి ఒకరు.. కోదాడ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దోరకుంట సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన షేక్ బషీర్ (35) బైక్‌పై కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వచ్చాడు. బక్రీదు పండుగ సందర్భంగా చికెన్ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో గ్రామశివారులోని పెట్రోలు బంకు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఇనుప బోర్డును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బషీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శంషాద్ భేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ వై.సైదులు తెలిపారు. -
బాలానగర్ వంతెనపై దారుణం: సేప్టీ గోడకు గుద్దుకుని..
సాక్షి, హైదరాబాద్: అతి వేగం ప్రమాదకరం.. హెల్మెట్ లేని ప్రయాణం వద్దు అని ఎంత ప్రచారం చేసినా పట్టించుకోరు కొందరు. చివరకు ఏం అవుతుంది.. అంటే ఇదిగో ఇలా ఊహించని విధంగా ప్రమాదాలకు గురై మరణించే పరిస్థితులు తలెత్తుతాయి. బాలానగర్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ మీద బైక్‌పై అతి వేగంగా వెళ్తూ.. అదుపుతప్పి సేఫ్టీ గోడకు గుద్దుకుని బుధవారం ఓ యువకుడు మృతి చెందాడు. లైసెన్స్ తీసుకునేందుకు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్(24) అనే యువకుడు లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ తీసుకునేందుకు బైక్ మీద తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. బాలానగర్ వంతెనపై నుంచి అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఎడమవైపు ఉండే సేఫ్టీ డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఇది గమనించిన స్థానికుల వెంటనే 108లో అశోక్‌ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు కారణంగానే బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
‘మదర్స్ డే’ నాడు అమ్మకు కేక్ కొనాలని వెళ్తూ..
నరసరావుపేట రూరల్: మదర్స్ డే సందర్భంగా అమ్మను సంతోషపెట్టాలని కేక్ కొనేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు చేరారు. ఈ విషాద ఘటన మాతృ దినోత్సవం నాడు ఇద్దరు తల్లులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. వివరాలు.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురం గ్రామానికి చెందిన మలతోటి వెంకిబాబు (19), వేమర్తి ఏసుబాబు (17)లు ఆదివారం మదర్స్ డే సందర్భంగా కేక్ కొనేందుకు బైక్‌పై నరసరావుపేటకు వస్తుండగా కేసానుపల్లి గ్రామ సమీపంలోని పెద్ద ఈద్గా వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో వెంకిబాబు ఐటీఐ చదువుతుండగా, ఏసుబాబు పదో తరగతిలో చేరాల్సి ఉంది. వెంకిబాబుకు తల్లిదండ్రులు వెంకటరావు, వజ్రమ్మ, ఒక సోదరి ఉన్నారు. ఏసుబాబు తల్లిదండ్రులు సుధాకరరావు, పుష్పలీలలకు అతనొక్కడే సంతానం. మాతృదినోత్సవం నాడే కొడుకును కోల్పోవాల్సి రావడంతో కన్నవారు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. సీఐ అచ్చయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ టి.సూర్యనారాయణరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్నా.. లేవండి నాన్నా..!
మహేశ్వరం: నగరానికి వచ్చిన తండ్రీకొడుకు తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. తండ్రి బైకు నడుపుతుండగా కుమారుడు వెనుకాల కూర్చుకున్నాడు. ఇద్దరూ కుటుంబ విషయాలు, వ్యవసాయం గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే మృత్యువు రూపంలో వెనుక నుంచి దూసుకొచ్చిన డీసీఎం వీరి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి తీవ్రంగా గాయపడి మృతిచెందగా కొడుకుకు గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని శ్రీశైలం జాతీయ రహదారిపై మొహబ్బత్‌నగర్ గేటు సమీపంలో బుధవారం జరిగింది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం లేమూర్ గ్రామానికి చెందిన వరికుప్పల జంగయ్య(50) తన కుమారుడు వరికుప్పల నర్సింహతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నగరం నుంచి స్వగ్రామానికి బైకుపై వెళ్తున్నారు. ఈక్రమంలో శ్రీశైలం రహదారిపై మండల పరిధిలోని మొహబ్బత్‌నగర్ గేటు సమీపంలో వీరి బైకును.. వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన జంగయ్య పైనుంచి డీసీఎం వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైకు వెనుకాల కూర్చున్న ఆయన కొడుకు నర్సింహకు గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో తండ్రి తన కళ్ల ఎదుటే మృతిచెందడంతో నర్సింహ గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం. లేవండి.. నాన్నా.. ఇంటికి వెళ్దాం పదండి.. అయ్యో.. దేవుడా.. అంటూ నర్సింహ రోదించిన తీరు అక్కడున్న వారికి కంట తడి తెప్పించింది. ప్రమాదం జరగడంతో వాహనాలు స్తంభించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం వాహనాలను నియంత్రించారు. డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతీ ఏడాది ప్రభుత్వం, పోలీసులు అనేక చర్యలను చేపడుతున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నా వారి నిర్లక్ష్యం కారణంగా నిత్యం రహదారులు రక్తసిక్తమవుతునే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నా.. వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు పలు రకాలుగా వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగే అనర్థాలను వివరిస్తూ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. చదవండి: 16 హత్యలు: సీరియల్ కిల్లర్ అరెస్ట్.. తాజాగా ‘ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియోను ట్వీట్ చేశారు. రాజేంద్రనగర్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన బైక్ రైడర్లకు సంబంధించి.. సీసీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను పోస్ట్ చేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తూ ఇద్దరు బైక్ రైడర్లు ఎదురెదురుగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యంగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరు అనే కోణంలో పోలీసులు సంధించిన ప్రశ్న ఆలోచింపజేసింది. చదవండి: ఈ దొంగ బాగా రిచ్, ఓ విల్లా.. 4 హైఎండ్ కార్లు -
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఉప్పల్ మోడ్రన్ బేకరీ వద్ద కేటిఎం స్పోర్ట్స్ బైక్‌తో ఇద్దరు యువకులు అతివేగంగా జేసీబీని ఢీకొట్టారు. బైక్‌పై ప్రయాణిస్తున్న నరేష్ (22), గణేష్(20) అనే యువకులు దుర్మరణం పాలయ్యారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. రామంతాపూర్ నుండి ఉప్పల్ వైపు బైక్‌పై అతి వేగంగా వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన నరేష్.. భువనగిరి ఆకుతోట తండా సూరేపల్లికి చెందిన వ్యక్తి కాగా, గణేష్.. పోచారం ఘట్కేసర్కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉప్పల్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల మృతి
వరంగల్ క్రైం: ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన హన్మకొండ నక్కలగుట్టలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సుబేదారి ఎస్సై వీరేందర్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన గజ్జెల సంజీవ్ కుటుంబంతో కలిసి బాలసముద్రంలోని అంబేడ్కర్ కాలనీలో నివాసం ఉంటూ ఫొటో గ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఇటీవల ఫొటోలు తీసిన వ్యక్తి నుంచి డబ్బు తీసుకురావటానికి ఉదయం పెద్ద కొడుకు రూఫస్తో కలిసి బయలుదేరాడు. 8.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రీకొడుకును హన్మకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నక్కలగుట్టలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎదుట వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో గజ్జెల సంజీవ్(42), రూఫస్(14) అక్కడికక్కడే మృతి చెందారు. బతుకుదెరువు కోసం హన్మకొండకు వచ్చిన సంజీవ్ అర్థాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక రూఫస్ పదోతరగతి చదువుతున్నాడు. మృతుడి భార్య మాధవి ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తుంది. ఇద్దరి మరణ వార్త విని రేగొండ నుంచి పెద్ద ఎత్తున జనం ఎంజీఎం మార్చురీ చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ దామెర స్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వస్థలమైన రేగొండకు తరలించి అంత్యక్రియలు ని ర్వహించారు. -
తనపై కూడా ఆశలు వదలు కోవాలని ఫోన్ ..
ఆత్మకూరు: ఇంటి నుంచి నెల్లూరుకు వెళ్తున్నామని ద్విచక్ర వాహనంపై బయలు దేరిన దంపతులు గంట వ్యవధిలోనే ఆత్మకూరు చెరువులో 3వ నంబర్ తూము గేట్ల వద్ద మృతదేహాలై తేలియాడారు. ఆత్మకూరు పోలీసులు, మృతుల బంధువుల సమాచారం మేరకు.. అనంతసాగరం మండలం రేవూరుకు చెందిన వంగవరుగు నారాయణరెడ్డి (60), స్వర్ణమ్మ (58) దంపతులు వ్యవసాయం, చిన్నచిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తూ గ్రామంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరి కుమారుడు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నారాయణరెడ్డి, స్వర్ణమ్మ దంపతులు నెల్లూరుకు పని ఉందని స్కూటీపై బయలు దేరారు. ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ద్విచక్ర వాహనాన్ని పెట్టి బస్సులో వెళ్తామని సమీప బంధువులకు తెలిపారు. అయితే ఇంటి దగ్గర కదిలిన గంట వ్యవధిలోనే ఆత్మకూరులోని చెరువులో 3వ నంబర్ తూము వద్ద శవాలై తేలియాడారు. అంతకు ముందే నారాయణరెడ్డి అతని సోదరుడికి ఫోన్ చేసి చెరువు వద్దకు రాగానే చీకట్లో పంది అడ్డు వచ్చిందని, దానిని తప్పించే క్రమంలో వేగంగా స్కూటీ చెరువులోకి దూసుకెళ్లిందని, భార్య స్వర్ణమ్మ నీళ్లలో పడి మృతి చెందిందని, తనపై కూడా ఆశలు వదలు కోవాలని తెలిపినట్లు సమాచారం. తెల్లవారుతుండగా పలువురు ఆ మార్గంలో వాకింగ్ చేస్తూ పడిన స్కూటీని, నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న సీఐ వైవీ సోమయ్య, ఎస్సైసీ సంతోష్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది సహకారంతో మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగిందా.. ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అందరితో కిలివిడిగా ఉండే దంపతులు మృతి చెందడంతో రేవూరులో విషాదఛాయలు అలముకున్నాయి. రేవూరులో విషాదం సోమశిల: మండలంలోని రేవూరుకు చెందిన దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, భార్య స్వర్ణమ్మ నెల్లూరుకు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా ఆత్మకూరు చెరువులో పడి మృతి చెందారు. అందరితో కలివిడిగా ఉండే ఆ దంపతుల మరణ వార్త విని గ్రామస్తులు దిగ్భ్రాంతి చెందారు. ఒక్కగానొక్క కుమారుడు తల్లిదండ్రుల మృతదేహాల వద్ద విలపిస్తుండడం స్థానికులను కంటతడి పెట్టించింది. -
అక్క పెళ్లికి బట్టలు కొనేందుకెళుతూ..
పలమనేరు : తన అక్క పెళ్లికి కొత్త బట్టలు కొనేందుకు బంధువుతో కలసి బైక్‌పై వస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని టి.వడ్డూరు వద్ద జరిగింది. కాలువపల్లె గ్రామానికి చెందిన వెంకటాద్రి సోదరి వివాహం ఈ నెల 13న జరుగనుంది. టుంబీకులు కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పడంతో వెంకటాద్రి (17) తన బంధువు కర్ణాటకు చెందిన ప్రశాంత్ (23)తో కలసి బైక్‌పై పలమనేరు వైపు వస్తుండగా ఎదురుగా వెళ్లిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటాద్రి తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ప్రశాంత్(23) తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పట్టణ సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
అన్నకు రాఖీ కట్టి వెళ్తూ.. అనంత లోకాలకు!
చిన్నంబావి/వీపనగండ్ల (వనపర్తి): ‘అన్నాచెల్లెళ్ల అనుంబంధానికి ప్రతీక రక్షాబంధన్.. అన్నయ్యా.. నువ్వే నాకు రక్ష..’ అంటూ ఆ చెల్లెలు రాఖీ కట్టింది. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెతో పాటు వరుసకు సోదరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిస్టేజీ సమీపంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన నందిని (14), వరుసకు అన్నయ్య అయిన దామోదర్ (16) తో కలిసి సోమవారం ఉదయం రాఖీ పౌర్ణమి సందర్భంగా పెద్దదగడకు బైక్‌పై వెళ్లారు. తమ బంధువు శంకరయ్య ఇంటికి వచ్చి వరుసకు ఆయన కుమారులు సోదరులు కావడంతో రాఖీ కట్టింది. సాయంత్రం తిరిగి శంకరయ్య కూతురు లక్ష్మితో కలిసి ముగ్గురూ తిరుగు ప్రయాణమయ్యారు. లక్ష్మీపల్లి స్టేజీ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో పెబ్బేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, తూంకుంటకు చెందిన సుధాకర్, కురుమయ్య సొంత అన్నదమ్ములు. సుధాకర్ కూతురు నందిని, కురుమయ్య ఒక్కగానొక్క కుమారుడు దామోదర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్కూటీ, కారు ఢీకొన్న ఘటనలో యువతి.. దేవరకద్ర: స్కూటీని కారు ఢీకొన్న ఘటనలో ఓ యువతి మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. నారాయణపేటకి చెందిన వడ్ల నాగరాణి(21), జాజాపూర్‌కు చెందిన సిద్దప్ప సోమవారం నారాయణపేట నుంచి మహబూబ్‌నగర్‌కు స్కూటీపై బయల్దేరారు. చౌదర్పల్లి సమీపంలో అంతర్రాష్ట రహదారిపై మహబూబ్‌నగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీ కొట్టింది. దీంతో నాగరాణి అక్కడికక్కడే మృతి చెందగా సిద్దప్ప తీవ్రంగా గాయపడ్డాడు. -
ఎద్దుల బండిని తప్పించబోయి..
కోడుమూరు రూరల్: ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని రామాపురం గ్రామం వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కోడుమూరుకు చెందిన చాకలి దస్తగిరి, బజారమ్మ పెద్ద కుమారుడు ధర్మతేజ (23) ఐటీఐ పూర్తి చేసి, ఎలక్ట్రీషియన్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. వెల్దుర్తిలో పని ముగించుకుని పట్టణానికి చెందిన స్నేహితుడు సతీష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై కోడుమూరు బయలుదేరాడు. మార్గమధ్యంలో రామాపురం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని తప్పించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడ్డారు. ప్రమాదంలో ధర్మతేజ తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతిచెందగా, సతీష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య జయలక్ష్మి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు వాసి మృతి.. కర్నూలు: స్థానిక బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం హోసూరు గ్రామానికి చెందిన శివకుమార్(49) అక్కడికక్కడే మృతిచెందాడు. ఐచర్ వాహనంలో తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ మంగళవారం తెల్లవారుజామున కర్నూలు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లారీని ఢీకొనడంతో ముందు భాగమంతా నుజ్జునుజ్జై అందులో శివకుమార్ ఇరుక్కుపోయి మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. వాహనంలో ఇరుక్కుపోయిన శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
‘తుంగబద్రంత్త' విషాదం
కర్నూలు, మంత్రాలయం రూరల్: భార్యాభర్త, ముగ్గురు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం.. విధి చూసి ఓర్వలేకపోయింది. రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. కుటుంబ యజమానిని ఒంటరి చేస్తూ.. భార్యను, ముగ్గురు పిల్లలను తీసుకెళ్లిపోయింది. ఈ ఘటన మంత్రాలయానికి సమీపంలోని తుంగభద్ర గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా తుంగభద్ర గ్రామానికి చెందిన గురుస్వామి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి శనివారం ఉదయం ఎమ్మిగనూరులోని సోదరి జయమ్మ ఇంటికి వెళ్లి వస్తుండగా మంత్రాలయం శివారులో బైక్ అదుపు తప్పి ఇనుప దిమ్మెను ఢీకొన్న ఘటనలో గురుస్వామి కుమారుడు మహేష్(4) అక్కడికక్కడే మరణించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో గాయపడిన భార్య నాగవేణి (26), కుమార్తెలు మౌనిక(7), శైలజ (3) కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక కొన్ని గంటల తేడాతో చనిపోయారు. స్వల్పగాయాలతో బయటపడిన గురుస్వామి ఒంటరిగా మిగిలాడు. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న అతను రోదించిన తీరు పలువురిని కలచివేసింది. మృతదేహాలను ఆదివారం కర్నూలు నుంచి ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్ ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. బైక్ అదుపుతప్పి వేగంగా నల్లవాగు బ్రిడ్జిపైఉన్న ఇనుప దిమ్మెను ఢీకొట్టడమే ఈ ఘోరానికి కారణమని వారు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎస్పీతో పాటు మంత్రాలయం సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు వేణుగోపాల్రాజ్, బాబు తదితరులు ఉన్నారు. -
లగ్నపత్రిక రాయించేందుకు వెళ్తూ..
పత్తికొండ రూరల్: కుమార్తె పెళ్లికి లగ్నపత్రిక రాయించేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో ఎదురొచ్చి కాటువేసింది. పత్తికొండ మండలం అటికెలగుండు బ్రిడ్జి సమీపంలో సోమవారం ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన వీరేశప్ప (50)తన రెండో కుమార్తెకు దేవనకొండ మండల వాసితో వివాహం నిశ్చయించారు. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామంలో అర్చకుడిని కలిసి లగ్నపత్రిక రాయించాలని బంధువు మహాలింగను వెంటబెట్టుకుని బైక్‌లో బయలుదేరాడు. మార్గమధ్యంలో అటికెలగుండు బ్రిడ్జి సమీపంలోని మలుపు వద్ద బోర్‌వెల్స్ లారీ ఎదురొచ్చి బైక్‌ను ఢీకొంది.ఈ ఘటనలో వీరేశప్ప అక్కడికక్కడే మృతిచెందగా మహాలింగకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గుర్రప్ప తెలిపారు. కాగా మృతుడు వీరేశప్పకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. అతని మరణ విషయం తెలియగానే వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. -
హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడేమో?
ద్విచక్రవాహనదారులు ప్రయాణంలో హెల్మెట్‌ధరించకపోవడంతో ప్రమాదంలోఆమూల్యమైన ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): ఆర్టీసీబస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాంధారి మండలం జువ్వాడి సర్పంచ్ కొనింటి సాయిలు మంగళవారం ఎల్లారెడ్డి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. గాంధారి నుంచి లింగంపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు మండలంలోని నల్లమడుగు సమీపంలోని ముడిగల ప్రాంతంలో బైక్‌ను ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించి బతికేవాడేమో అని స్థానికులు చర్చించుకున్నారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు కృపాకర్, జీవన్ ఉన్నారు. జీవన్ జన్మదినం మంగళవారం కావడం విశేషం. చిన్న కొడుకు జీవన్‌కు కాళ్లు్ల, చేతులు పని చేయవు, దివ్యాంగుడు. సర్పంచ్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.బస్సు డ్రైవర్ మంగళవారం మధ్యాహ్నం లింగంపేట సమీపంలోని రవిగౌడ్ పెట్రోల్ బంకు యజమాని కారును సైతం ఢీకొన్నట్లు లింగంపేట గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి లింగంపేట, గాంధారి పోలీసులు, చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రాణం తీసిన భగీరథ గుంత
రాయికల్(జగిత్యాల): మిషన్ భగీరథ పైప్లైన్కోసం తీసిన గుంతలు పూడ్చకపోవడంతో ప్రమాదం జరిగి యువకుడు మృతిచెందిన సంఘటన రాయికల్ పట్టణంలో విషాదం నింపింది. వివరాలు ఇలా..రాయికల్ పట్టణంలోని గ్రామ శివారులో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొట్టడంతో చంద సిద్దార్థ (19) అనే యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ఆరోగ్యం గురువారం తెలిపారు. పట్టణంలోని భరత్‌నగర్‌కు చెందిన చంద సిద్దార్థ ఇంటి నుంచి రాయికల్ పట్టణానికి బైక్‌పై వెళ్తుండగా కిష్టంపేట గ్రామానికి చెందిన ఏలేటి రాజేశ్ రామాజీపేట గ్రామానికి బైక్‌పై వస్తుండగా ఎదురెదుగా వాహనాలు ఢీకొనడంతో చంద సిద్దార్థ తలకు తీవ్రగాయాలుఅయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించినప్పటికీ సకాలంలో రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో జగిత్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన చోట మిషన్ భగీరథ పైప్లైన్కోసం గుంతలు తవ్వగా పూడ్చకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. -
చున్నీయే యమపాశమై..!
వైఎస్ఆర్ జిల్లా , గోపవరం: ముఖానికి చుట్టుకున్న చున్నీయే యమపాశమై మహిళ ప్రాణం తీసింది. గోపవరం మండలం పెద్దపోలుకుంట గ్రామానికి చెందిన మునగల లక్ష్మీదేవి (26) ఈ ప్రమాదానికి గురైంది. మునగల సుబ్రహ్మణ్యం తన భార్య లక్ష్మీదేవి, ముగ్గురు పిల్లలతో కలిసి 15 రోజుల క్రితం ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని చీమకుర్తిలో కూలీ పనులు చేసుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లారు. ఎన్ని రోజులు ఉన్నా పనులు దొరక్కపోవడంతో ఆదివారం మోటార్‌సైకిల్‌పై స్వగ్రామమైన పెదపోలుగుంట గ్రామానికి బయలుదేరారు.(విమాన ప్రమాదం.. పైలట్ల దుర్మరణం ) వేడిగాలి తగలకుండా లక్ష్మీదేవి చున్నీని ముఖానికి కట్టుకుంది. మార్గంమధ్యలోని భూమిరెడ్డిపల్లె వద్ద 565 జాతీయ రహదారిపై బైక్ వెనుక చక్రానికి చున్నీ చుట్టుకోవడంతో ఆమె ఒక్కసారిగా కిందపడింది. తల, ఛాతికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే చనిపోవడంతో భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై అంబటి చంద్రశేఖర్ పరిశీలించారు. అనంతరం కనిగిరి వైద్యశాలకు వెళ్లి ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి సోదరుడు పొదిలి నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ('నారాయణ స్కూల్'కు నోటీసులు) మిన్నంటిన రోదనలు మృతురాలు లక్ష్మీదేవికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. కళ్ల ముందే అమ్మ రక్తపు మడుగుల్లో విగతజీవిలా పడి ఉండటంతో ముగ్గురు చిన్నారులు ఏమైందో తెలియక రోదించడం స్థానికులు కలచివేసింది. -
అత్తగారింటికి వచ్చి వెళుతుండగా..
ఖమ్మంరూరల్: బైక్‌ను లారీ ఢీకొనడంతో తల్లీకూతుళ్లు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తల్లంపాడు గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రాంపురం గ్రామానికి చెందిన చాట్ల శ్రీహరి ఆదివారం భార్య నాగసుజాత(26),కూతురు ప్రజ్ఞాశ్రీ (3)లను తీసుకుని చింతకాని మండలం రామకృష్ణాపురంలోని తన అత్తగారింటికి వచ్చాడు. పది రోజుల క్రితం కూసుమంచి మండలం అగ్రహారంలో తమ సమీప బంధువు ఒకరు మృతి చెందగా, సోమవారం బంధువు దశదిన కర్మలో పాల్గొనేందుకు శ్రీహరి దంపతులు తమ కూతురిని తీసుకుని రామకృష్ణాపురం నుంచి అగ్రహారం బయల్దేరారు. బైక్‌పై వెళ్తుండగా తల్లంపాడు గ్రామం శివారులోని వశిష్ట ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న నాగసుజాత, ప్రజ్ఞాశ్రీ ఎగిరి రోడ్డుపై పడిపోయారు. లారీ వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు పక్కకు పడిపోయిన శ్రీహరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీహరి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అక్బర్‌పాషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాణాల రాము తెలిపారు. కాగా శ్రీహరి కొంతకాలంగా ఖమ్మంలోని ఓ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఖమ్మం నుంచి వెళ్లి రెండు నెలలుగా స్వగ్రామం రాంపురంలో ఉంటున్నారు. -
ఆ భయమే ఆయువు తీసిందా?
రాంగోపాల్‌పేట్: ఓ మహిళను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో పోలీస్ కేసు అవుతుందేమోననే భయంతో ఓ యువకుడు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్‌హాట్‌కు చెందిన విశాంబర్ బిర్దార్ చిన్న కుమారుడు బి.మహేష్ (26) 7 నెలలుగా సికింద్రాబాద్‌లోని ఓ జ్యువెలరీ షోరూమ్‌లో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 23న సాయంత్రం విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నాడు. బైబిల్ హౌస్ సిగ్నల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు వెళుతుండగా బోట్స్ క్లబ్ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహేష్‌ను గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వివరాలు తీసుకుని మరుసటి రోజు తిరిగి రావాలని పంపించారు. ప్రమాదం జరిగిన సమయంలో మహేష్ మొబైల్ ఫోన్ అక్కడే పడిపోవడంతో అదే రోజు రాత్రి కిశోర్ అనే వ్యక్తి మహేష్ స్నేహితుడైన గంగా సాగర్‌కు ఫోన్ చేసి అక్కడ జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు. మహేష్ కూడా గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నాడు. విషయం తెలుసుకున్న మహేష్ తండ్రి మహేష్ కోసం ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రికి వెళ్లి వాకబు చేసినా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన అదే రోజు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే మంగళవారం ఉదయం నెక్లెస్‌రోడ్‌లోని సంజీవయ్య పార్కు సమీపంలోని హుస్సేన్ సాగర్‌లో మహేష్ శవమై తేలాడు. అతడి దగ్గర లభించిన ఆధారాలతో మహేష్‌గా పోలీసులు గుర్తించారు. తాను చేసిన ప్రమాదంతో ఏమైనా జరుగుతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేధింపులే ఉసురు తీశాయి బన్సీలాల్‌పేట్: హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహేష్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మంగళవారం రాత్రి మృతుడి కుటుంబికులు, స్నేహితులు గాంధీనగర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మృతుడి సోదరుడు విక్రమ్, స్నేహితులు విలేకరులతో మాట్లాడారు. మహేష్ మరణానికి పోలీసుల వేధింపులు కారణమని ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో తమ సోదరుడి సెల్‌ను ఎవరో బలవంతంగా లాక్కుని తాను కానిస్టేబుల్‌ను అంటూ మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. మహేష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. మహేష్ మరణంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. మాకెలాంటి సంబంధమూ లేదు.. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహేష్ మరణంతో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని గాంధీనగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు స్పష్టంచేశారు. ఈ నెల 23న సాయంత్రం ఆర్పీ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే రహదారిలో మహేష్ తన ద్విచక్ర వాహనంపై వెళుతూ హైదర్‌బస్తీ ప్రాంతానికి చెందిన సుభాషిణి అనే మహిళను ఢీకొట్టాడని చెప్పారు. డయల్ 100 నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. వాహనం ఢీకొన్న మహిళ అపస్మారక స్థితికి చేరుకోడంతో ఉస్మానియా ఆస్పత్రికి చికిత్ప కోసం తరలించి మహేష్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం మహేష్‌ను ఇంటికి పంపించినట్లు చెప్పారు. లాక్డౌన్ కర్ఫ్యూ నేపథ్యంలో తమ కానిస్టేబుల్ వాహనంపై ఇంటికి పంపిస్తామని చెప్పినా మహేష్ వినిపించుకోకుండా కాలినడకన వెళ్లిపోయాడని వివరించారు. మహేష్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోడానికి తమకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే చట్టపరంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ విషయాన్ని మహేష్ తండ్రి విశ్వంభరం, చిన్నాన్న రాజేందర్ కుటుంబ సభ్యులకు కూడా వివరించినట్లు చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలో మహేష్ ఈ నెల 23 రా>త్రి సుమారు 8 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొన్నామని సీఐ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. గంటల వ్యవధిలో తల్లిదండ్రులు మరణించారు. అమ్మా, నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలియని పిల్లలు అమాయకంగా అటు ఇటు తిరుగుతుండటం చూపరులను కలచివేసింది. చిన్నవయసులోనే ఆ పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేశావా దేవుడా అంటూ బంధువులు విలపించారు. అనంతపురం, వజ్రకరూరు: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. వజ్రకరూరు మండలం బోడిసానిపల్లి తండాకు చెందిన మూడ్ కేశవనాయక్(30)కు ఇదే మండలం ఎన్‌ఎన్‌పి తండాకు చెందిన వరలక్ష్మిబాయి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు సంవత్సరాల కుమారుడు యువరాజ్‌తోపాటు ఒకటిన్నర సంవత్సరం వయసు గల కూతురు నందిని ఉంది. వరలక్ష్మిబాయి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. కేశవనాయక్ అక్క ధనలక్ష్మికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంలో భార్య, కూతురితో కలిసి బళ్లారికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం బళ్లారి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో పాల్తూరు క్రాస్ వద్ద గుర్తు తెలియని బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో వరలక్ష్మిబాయి అక్కడికక్కడే మృతి చెందగా కేశవనాయక్ అనంతపురం ఆస్పత్రిలో అదే రోజు రాత్రి మృతి చెందాడు. కూతురు నందిని స్వల్ప గాయాలతో బయట పడింది. ఉరవకొండ ఎస్ఐ ధరణిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్య విద్యార్థిని దుర్మరణం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు వైద్య కళాశాలలో చదువుతున్న మెడికో సాయంత్రం ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. కర్నూలు స్పెషల్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కాశయ్య స్థానిక రేడియో స్టేషన్ సమీపంలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఆ దంపతులకు పెళ్లయిన పదేళ్లకు కుమార్తె బి. శ్రావణి జన్మించింది. దీంతో ఎంతో అల్లారుముద్దుగా ఆమెను పెంచుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా శ్రావణి చదువులో రాణించారు. ఎంసెట్‌లో ర్యాంక్ సాధించి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ప్రస్తుతం ఆమె ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. సోమవారం సాయంత్రం కళాశాల నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా బళ్లారి చౌరస్తా దాటిన తర్వాత హనుమాన్ కాటా సమీపంలో వెనుక నుంచి ఏపీ 21టిఈ 6489 నెంబరు గల లారీ ఢీకొంది. ప్రమాదంలో శ్రావణి తీవ్రంగా గాయపడగా.. వెంటనే స్థానికులు సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దాస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ, వైద్యులు, విద్యార్థుల సంతాపం ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బి. శ్రావణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న తోటి విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొద్ది నిమిషాల ముందు తమతో ఎంతో ఉల్లాసంగా మాట్లాడిన ఆమె విగతజీవురాలై కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. కొద్దిసేపటికే జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సైతం మార్చురీకి చేరుకుని శ్రావణి మృతదేహాన్ని సందర్శించారు. ఆమె తల్లిదండ్రులను ఓదార్చి సంతాపం ప్రకటించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనువు చాలించడంతో కాశయ్య తట్టుకోలేకపోయారు. అతని ఓదార్చడం సహ ఉద్యోగులకు వీలుకాలేదు. కాశయ్య కుటుంబం మొన్నటి వరకు పోలీస్క్వార్టర్స్లో నివాసం ఉండేది. ఇటీవలే వారు రేడియోస్టేషన్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో చేరారు. శ్రావణికి సైతం వారం క్రితమే కొత్త స్కూటీని తండ్రి కొనిచ్చారు. ఈ విషయాలను తలచుకుని మార్చురీకి చేరుకున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. శ్రావణి మృతదేహాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, వైద్యులు సందర్శించి సంతాపం ప్రకటించారు. -
పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిని..
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమార్తెను వధువుగా చూసి మురిసిపోవాలకున్న ఆ తల్లిదండ్రుల ఆశ తీరలేదు.. కాళ్ల పారణితో బుగ్గన చుక్క పెట్టుకుని మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలకున్న ఆ యువతి కాంక్ష నెరవేరలేదు.. నచ్చిన మెచ్చిలిపై తలంబ్రాలు పోసి జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్న ఆ యువకుడి కల ఫలించలేదు. శుభలేఖలు రావాల్సిన ఆ ఇంట్లో నుంచి చావు కబురు వినిపించింది. పెళ్లి బాజాలు మోగాల్సిన చోట మరణ మృదంగం మోగింది. పచ్చని పెళ్లిపందిరి, బంధుమిత్రులతో సందడిగా మారాల్సిన ఆ ఇంటి ప్రాంగణం శోక సంద్రంలో మునిగిపోయింది. వాయువేగంతో దూసుకొచ్చిన మృత్యువు మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిని చిదిమేసింది. యువకుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఆ యువతి కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన సోమవారం రాత్రి విజయవాడ లబ్బీపేట ఎంజీరోడ్డులో చోటుచేసుకుంది. కృష్ణలంక(విజయవాడ తూర్పు): మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా బ్రెయిడ్ డెడ్ అయ్యి కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఘటన సోమవారం రాత్రి లబ్బిపేట ఎంజీరోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముత్యాల రాము కుండలు విక్రయిస్తూ భార్య, కొడుకు, కూతురుతో కలసి జగ్గయ్యపేట రంగుబజార్‌లో నివాసముంటున్నాడు. అతని కూతురు ముత్యాల ఉమా(26) డిగ్రీ పూర్తిచేసుకుని తండ్రికి ఆర్థికంగా సహాయ పడేందుకు నాలుగేళ్లుగా నగరంలోని ఎంజీరోడ్డులోనున్న కాల్సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తూ లబ్బీపేటలోని లేడిస్ హస్టల్లో నివాసముంటుంది. ఇటీవలే కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసే తమ సమీప బంధువు రాయల వివేక్కుమార్తో ఉమాకు నిశ్ఛితార్థం చేసి ఏప్రిల్ 8న వివాహం నిశ్చయించారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో లబ్బీపేట ఎంజీరోడ్డులోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నగదు డ్రాచేసుకుని రోడ్డు దాటుతుండగా ఏపీ05ఈఎస్6895 నెంబర్ కలిగిన వాహనంపై ముగ్గురు యువకులు బెంజిసర్కిల్ నుంచి బస్‌స్టేషన్ వైపు మితిమీరిన వేగంతో దూసుకువచ్చి ఆమెను బలంగా ఢీకొట్టారు. దీంతో యువతి ఎగిరి దూరంగా పడిపోవడంతో తల వెనుక గాయమై తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ సమయంలో ఆమెతోపాటు పనిచేసే తోటి ఉద్యోగులు చూసి ఆమెను దగ్గరలోని రమేష్ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆమెను పెళ్లిచేసుకోబోయే యువకుడు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. బ్రెయిన్ డెడ్అయినట్లు డాక్టర్లు చెప్పడంతో వారు బోరున విలపిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేశారు. వాహనం నడిపిన జయంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
మానవత్వం చాటుకున్న ఆర్కే
సాక్షి, గుంటూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను ఆస్పత్రికి తరలించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన మానవత్వాన్ని చాటుకున్నారు. తాడేపల్లి శివారులో సోమవారం రెండు బైకులు ఢీకొని ధనలక్ష్మీ అనే మహిళ తలకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ధనలక్ష్మీ అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. అటుగా వెళ్తున్న ఆర్కే.. ప్రమాద విషయాన్ని గమనించి తన కారులోఆమెను ఆస్పత్రికి తరలించారు. దగ్గర ఉండి మహిళకు చికిత్సను అందించారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
సాక్షి, హైదరాబాద్ : బైక్ అదుపుతప్పి గుంతలో పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న విదేశీయుడికి తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ సైనిక్‌పురి నిర్మల్ నగర్‌కు చెందిన చిలుక అరవింద్(24) పంజగుట్టలోని స్విఫ్ట్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూనే ఖాళీ సమయాల్లో ఉబర్ బైక్ డ్రైవర్‌గా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో ఉండేనైజీరియా దేశస్తుడైన అబ్దుల్లాహి అనే యువకుడు ఉబర్ మోటో బైక్‌ను బుక్ చేసుకున్నాడు. పంజగుట్ట నుంచి బైక్(టీఎస్ 08 ఈఎన్ 6329)పై అరవింద్ ఆ విదేశీయుడిని కూర్చోబెట్టుకొని బంజారాహిల్స్‌రోడ్ నం. 12 లోటస్‌పాండ్ మీదుగా పారామౌంట్ కాలనీకి వెళ్తుండగా ఫొటోగ్రాఫర్స్ కాలనీ వద్ద బైక్ అదుపు తప్పి గుంతలో పడింది. దీంతో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్నఅబ్దుల్లాహికి తీవ్ర గాయాలుకాగా సమీపంలోని సిటీ న్యూరో సెంటర్‌కు తరలించారు. ఎస్ఐ వాసవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ
హయత్‌నగర్: బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నలగొండ జిల్లా, నకిరెకల్‌లోని మాయాబజార్ ప్రాంతానికి చెందిన సురేష్ (19) ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని రహమత్‌నగర్‌కు చెందిన ఖాజా మోయియుద్దీన్ అలియాస్ సోహెల్(20) అతడికి స్నేహితుడు ఆదివారం ఉదయం నల్లగొండ వెళ్లేందుకు బయలుదేరిన వీరు అటు వెళ్లకుండా నగరం వైపు వచ్చారు. హయత్‌నగర్ సమీపంలోని లక్ష్మారెడ్డి పాలెం వద్దకు రాగానే పక్కనుంచి వెళుతున్న మరో వాహనం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న ఖాజా మెయియుద్దీన్ వెనుక సీటులో కూర్చున్న సురేష్ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో మరోపక్క నుంచి వెళుతున్న బీఎంఎస్ కంపెనీకి చెందిన లారీ చక్రాలు వారి తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని మహిళ మృతి... లారీ ఢీకొనడంతో చర్చికి వెళుతున్న ఓ మహిళ మృతి చెందిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హయత్‌నగర్ డివిజన్, ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన గండి ఎలిజబెత్(74) ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి. ఆదివారం ఉదయం ఆమె చర్చికి వెళ్లేందుకు పోలీస్టేషన్ సమీపంలో జాతీయ రహదారిని దాటుతుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు డానియల్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహ వేళ.. విషాద గీతిక
వివాహ మహోత్సవాన గుండెల్లో మూటకట్టుకుని వచ్చిన ఆనంద క్షణాలు రెప్పపాటులో ఆర్తనాదాలుగా మారాయి.. పెళ్లింట ఆకట్టుకున్న వివిధ వర్ణాల కట్టూబొట్టులు నెత్తుటి చెమ్మలో తడిచి ఎర్రటి రంగు పులుముకున్నాయి. బంధుమిత్రుల మధ్య సాగిన యోగక్షేమాల ముచ్చట్లు మూడు గంటలు కూడా గడవకముందే విషాదాంతమయ్యాయి. ట్రాక్టర్ వేగంతో పోటీ పడుతూ కలవరపెట్టిన కుదుపులు.. ఐదు కుటుంబాలను అంతులేని ఆవేదనతో కుదిపేశాయి. గురువారం చుండూరు మండలం చినపరిమి– కూచిపూడి మధ్య పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. వీరిలో మేమూ వస్తామంటూ మారాం చేసి మరీ ట్రాక్టర్ ఎక్కిన ఇద్దరు చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా చితిపైకి చేరాయి. కళ్లెదుటే మాంసం ముద్దలుగా మారిన బిడ్డను చూసి.. తల్లిదండ్రుల కన్నపేగులు తీరని శోకంతో కమిలిపోయాయి. ఉదయాన్నే రయ్యిమంటూ సంబరంగా పొలిమేర గట్టు దాటిన పెళ్లి ట్రాక్టర్.. మధ్యాహ్నం వేళకు తన ముంగిటే చావు కేక పెట్టడంతో చినపరిమి గుండెలు వేదనతో ముక్కలయ్యాయి. తెనాలిరూరల్: వివాహ వేడుకకు వెళ్లిన వారి ఇంట విషాదం చోటుచేసుకుంది. చుండూరు మండలం చినపరిమి అంబేడ్కర్ నగర్‌కు చెందిన యువతికి తెనాలి పట్టణ చినరావూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. తెనాలిలో గురువారం వివాహం జరిగింది. వేడుకకు యువతి స్వగ్రామం నుంచి ట్రాక్టర్‌పై 50 మంది తెనాలి వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని అదే ట్రాక్టరులో స్వగ్రామానికి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా.. చినపరిమి శివారులోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించే క్రమంలో ట్రాక్టరు ట్రక్కు రోడ్డు పక్కన కాల్వలోకి బోల్తా పడింది. దీంతో ఉన్నం పద్మ(35), గోరోజిన్నం అన్నమ్మ(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గుత్తికొండ శ్యామ్ (13) మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో దగ్గుబాటి హర్షవర్దన్(9), కట్టుపల్లి నిఖిల్(7) వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గోళ్ల నాగరాజమ్మ (34) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. గాయపడిన గుత్తికొండ శ్యామ్, టీ రమాదేవి, సౌజన్య, నాగలక్ష్మి, డీ వెంకటేశ్వర్లు, సంకీర్తన, ప్రకాశరావు, అద్భుత్, ఎస్తేర్‌రాణి, సుబ్బారావులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో శ్యామ్‌ను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. మిన్నంటిన హాహాకారాలు.. ఘటనా స్థలం బాధితుల హాహాకారాలతో మిన్నంటింది. మృతి చెందిన పద్మ, అన్నమ్మ మృతదేహాలను తెనాలి వైద్యశాలకు తరలించారు. అడుతూ పాడుతూ ఉన్న తమ ముద్దుల చిన్నారులు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు వేదనకు అంతులేకుండా ఉంది. వైద్యశాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృత్యు కౌగిలిలో అమ్మమ్మ, మనవడు.. చినపరిమికి చెందిన అన్నమ్మ తన కుమార్తె ఏసుమరియమ్మను నగరం మండలం కల్లిపాలేనికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. వీరికి కుమార్తె, నిఖిల్ సంతానం. నాలుగు రోజుల క్రితం నిఖిల్ తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆమెతో కలసి వివాహానికి వెళ్లాడు. తోటి పిల్లలతో అక్కడ ఆడుకుంటూ సందడి చేశాడు. తిరుగు ప్రయాణంలో అమ్మమ్మ వెంటే ట్రాక్టరులో కూర్చున్నాడు. బిడ్డకు ఎండ తగలకుండా అన్నమ్మ చీర కొంగును కప్పి రక్షణ కల్పిస్తూ వచ్చింది. అంతలోనే ప్రమాదం జరగడంతో అన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన నిఖిల్ తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తల్లడిల్లిన తల్లిదండ్రులు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దగ్గుబాటి మురళి, నాగలక్ష్మిలకు ఇద్దరు మగ పిల్లలు. వ్యవసాయ కూలీలైన వీరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్నవాడైన హర్షవర్దన్ నాలుగో తరగతి చదువుతున్నాడు. చలాకీగా ఉండే వాడు. ట్రాక్టరు ప్రమాదంలో చిన్నారి విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల వేదన అంతులేకుండాపోయింది. ఎమ్మెల్యే మేరుగ పరామర్శ.. ప్రమాదం గురించి తెలుసుకున్న వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున తెనాలి వైద్యశాలకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వేగంగా మలుపు తిప్పడంతోనే ప్రమాదం: సౌజన్య, క్షతగాత్రురాలు గ్రామంలో బస్టాప్‌కు సమీపంలో మలుపు వద్ద వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగింది. ఎదురుగా మోటారుసైకిల్ వేగంగా వచ్చి ట్రాక్టర్‌కు తగిలింది. ఇంజిన్ మీద కూర్చున్న వారు దూకేశారు. ట్రక్కు బోల్తా కొట్టడంతో అందులో ఉన్న మాకు గాయాలయ్యాయి. పరిమితికి మించిప్రయాణం ప్రమాద సమయంలో ట్రాక్టరు ట్రాలీలో పరిమితికి మించి ప్రయాణిస్తుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో యజమాని ట్రాక్టర్ శ్రీనివాసరావు ట్రాక్టర్ నడుపుతున్నాడు. ట్రాక్టర్లో సుమారు 40 మంది ఉండటంతో మలుపు తిరిగేటప్పుడు అదుపు తప్పి బొల్తా కొట్టిందని స్థానికులు అంటున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడికి తెనాలి డీఎస్పీ కే శ్రీలక్ష్మి సిబ్బందితో చేరుకున్నారు. చుండూరు సీఐ బీ నరసింహారావు, ఎస్ఐలు రాజేష్, జీ పాపారావు, ఇతర సిబ్బంది, స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. -
లైవ్ వీడియో తీస్తూ ప్రాణం పోగొట్టుకున్నాడు
బుర్ద్వాన్ : పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లా అండాల్ టౌన్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల వ్యక్తి తన బైక్‌పై వెళుతూ సరదాగా దానిని లైవ్ వీడియో తీసి ఫేస్బుక్లో షేర్ చేయాలని భావించాడు. అయితే వీడియో తీస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించిన కాసేపటికే తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. శనివారం సాయంత్రం కాళీ మాత గుడికి వెళ్తున్నానని చెప్పినట్లు మృతుడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అతను బైక్‌పై వచ్చేటప్పుడు తన డ్రైవింగ్‌ను ఫేస్బుక్ లైవ్ వీడియో తీసే క్రమంలో వాహనం ఒక్కసారిగా కంట్రోల్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో తలకు హెల్మట్ లేకపోవడం వల్లే మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. -
అనుకోని విషాదం
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: వేగంగా వెళ్తున్న బైక్‌కు జింక అడ్డు రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ చోదకునితోపాటు జింక కూడా దుర్మరణం పాలైంది. ఈ విషాదం నెలమంగల తాలూకా అప్పగొండనహళ్లిలో చోటుచేసుకుంది. అప్పగొండనహళ్లి గ్రామం నివాసి హరీష్ (21) మృతుడు. స్థానిక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న హరీష్ మంగళవారం తెల్లవారుజామున అక్కను బైక్‌పై ఎక్కించుకుని బస్టాండులో వదిలి తిరిగివస్తున్నాడు. ఎలా జరిగిందంటే మంగళవారం తెల్లవారుజాము.. మంచు కారణంగా ముందు ఏముందు సరిగా కనిపించడం లేదు. ఈ సమయంలో ఎక్కడినుంచో బైక్‌కు అడ్డుగా వచ్చిన జింకను హరీష్ త్వరగా గుర్తించకపోవడంతో దానిని ఢీకొన్నాడు. హరీష్ హెల్మెట్ ధరించకపోవడంతో కిందపడ్డ తక్షణం తలకు గాయమై ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఇటు జింక తలకు కూడా తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందింది. త్యామగొండ్లు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త కళ్ల ఎదుటే భార్య మృతి..
చెన్నై, తిరువొత్తియూరు: బైక్‌ను లారీ ఢీకొనడంతో భర్త కళ్ల ఎదుటే భార్య మృతి చెందింది. చెన్నై మీంజూరు రామిరెడ్డి పాళయం ప్రాంతానికి చెందిన యువరాజ్ (28), భార్య జయ (24) మంగళవారం సాయంత్రం బైక్‌పై బంధువు ఇంటికి బయలుదేరారు. తిరువళ్లూరు జీఎన్టీ రోడ్డులో వెళుతుండగా వెనుక వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. అదుపు తప్పి ఇద్దరూ కింద పడ్డారు. ఆ సమయంలో జయ తల, నడుము భాగంలో లారీ ఎక్కిదిగడంతో తీవ్రంగా గాయపడింది. సురేష్ హెల్మెట్ వేసుకుని ఉండడంతో స్పల్వ గాయాలతో బయటపడ్డాడు. జయను చికిత్స నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలో ఆమె మృతిచెందింది. కళ్ల ఎదుటే భార్య మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యా డు. మాధవరం పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
కన్నవారికి గుండె కోత
ప్రకాశం, మార్కాపురం: సరదాగా గడపాల్సిన ఆదివారం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థి జీవితాన్ని కబళించింది. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో పెద్ద వాటర్ ట్యాంక్ దగ్గర మోటార్ సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణంలోని శివాజీనగర్ 6వ లైనులో నివాసం ఉండే దూదేకుల చిన్న జీజీర్ కుమారుడు కరీముల్లా (15) స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎన్సీసీ డ్రిల్‌కు వెళ్లి బయటకు వచ్చిన తరువాత స్నేహితుడి మోటార్ బైక్ తీసుకుని తర్లుపాడు రోడ్డు వైపు వెళ్తుండగా వినుకొండ నుంచి రాగుల లోడుతో వస్తున్న లారీ పెద్ద వాటర్ ట్యాంక్ వద్దకు రాగానే లారీడ్రైవర్ తన వాహనాన్ని లెఫ్ట్ వైపు కట్ చేస్తుండగా అప్పుడే మోటార్ సైకిల్‌పై వస్తున్న కరీముల్లాకు తగలటంతో లారీ కింద పడి దుర్మరణం చెందాడు. వార్త విన్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వచ్చి రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. మార్బుల్ రాళ్ల కూలీగా పని చేస్తున్న చిన్న జజీర్‌కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. మృతుడు కరీముల్లా ఆఖరి అబ్బాయి. బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తాడని కలలు కంటుండగా ఊహించని రీతిలో లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చి కుటుంబంలో విషాదం నింపిందని కుటుంబ సభ్యులు రోదించారు. శివాజీనగర్ 6వ లైనులో ఉంటున్న కరీముల్లా ఆ ప్రాంతంలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతని మృతితో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఉదయం 6 గంటల వరకు తమతో ఉన్న కుమారుడు 9గంటల కల్లా మృతదేహంగా రోడ్డుపై పడి ఉండటాన్ని తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. -
చిన్నారి కళ్లెదుటే తండ్రి దుర్మరణం
వారిద్దరూ అన్నదమ్ములు. కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. విధులకు బయల్దేరిన సమయంలో వెళ్లనీయకుండా మారాం చేస్తుండడంతో తమ కుమారుడినీ బైక్‌లో తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ప్రమాదానికి గురై సోదరుల్లో ఒకరు మృత్యువాత పడ్డారు. మృతుడి కుమారుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బైటపడ్డాడు. కళ్లెదుటే తండ్రి చనిపోవడం, పెదనాన్న తీవ్రగాయాలతో అచేతనంగా పడిపోవడంతో ఆ చిన్నారికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. భోరున ఏడవడం మినహా.. వాల్మీకిపురం : ట్రాక్టర్–మోటార్ సైకిల్ ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో చిన్నారి సురక్షితంగా బైటపడ్డాడు. గురువారం ఈ సంఘటన స్థానిక బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలు..వాల్మీకిపురం శివారులోని అగ్నిమాపక బాధిత కాలనీకి చెందిన రెడ్డిబాషా తన ఇద్దరు కుమార్తెలను మదనపల్లె బసినికొండకు చెందిన అన్నదమ్ములు బావాజాన్ (24) చాన్‌బాషా (22)కు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానంతరం వాల్మీకిపురంలో మామగారి ఇంటిలోనే వారు కాపురం పెట్టారు. మదనపల్లెలోని ఓ లారీ షెడ్లో కూలీలుగా పని చేస్తూ నిత్యం వెళ్లివచ్చేవారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విధులకు వెళ్లడానికి వారిద్దరూ ద్విచక్రవాహనంలో బయలుదేరారు. దీంతో చాన్‌బాషా కుమారుడు బైక్ ముందు నిలబడ్డాడు. వెళ్లవద్దని ఏడుపు అందుకున్నాడు. సముదాయించినా ఏడుపు ఆపలేదు. పోనీలెమ్మని తమతో తీసుకువెళితే షెడ్డులో పనులు చేసేంతవరకు ఆడుకుంటూ ఉండాడని సోదరులు తలచారు. దీంతో చాన్‌బాషా తన రెండేళ్ల కుమారుడు సయ్యద్ మహమ్మద్‌నూ బైక్‌లో మధ్యలో కూర్చోబెట్టుకుని బయల్దేరారు. కొంతదూరం వెళ్లేసరికి బైక్‌లో పెట్రోలు అయిపోవడంతో సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద పెట్రోలు పట్టుకుని మళ్లీ తిరిగి పయనమయ్యారు. మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్ ట్రాలీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో చాన్‌బాషా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, బావాజాన్ తీవ్రంగా గాయపడ్డాడు. చిన్నారి సయ్యద్ మహమ్మద్ ప్రాణాలతో బయపడ్డాడు. బావాజాన్‌ను చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి చెన్నైకి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌హెచ్‌వో అలీఖాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే విడదల రజని
యడ్లపాడు: నిలిపి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు గాయపడిన సంఘటన యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని చిన కోండ్రుపాడు గ్రామానికి చెందిన తమ్మలూరి నాగరాజు నాదెండ్ల మండలం గణపవరంలోని పశువుల ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి యడ్లపాడులో చర్చికి వెళ్లాడు. అనంతరం భార్య యశోద, కుమారుడు రాణా, కుమార్తె దివ్యలను గణపవరంలోని అత్తగారింటి వద్ద దింపేందుకు బైక్‌పై బయలుదేరాడు. తిమ్మాపురం చేపలచెరువు సమీపంలో పంక్చర్ కావడంతో తమిళనాడుకు చెందిన లాంగ్‌ట్రాలీ లారీ హైవేపై నిలిపి ఉంది. బైక్‌పై వస్తున్న నాగరాజుకు వెనుక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగాడు. అంతలో బైక్ ట్రాలీలారీని ఢీకొట్టింది. దీంతో బైక్ ట్రాలీ కిందకు దూరి ఇరుక్కుపోయింది. బైక్ ముందు ఆయిల్ ట్యాంక్‌పై కూర్చున్న నాగరాజు కుమారుడి ఎడమకన్నుకు తీవ్ర గాయమైంది. బైక్‌పై ఉన్న నలుగురు హైవేపై చెల్లాచెదురుగా పడిపోయారు. నాగరాజు తలకు, భార్య కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి బాలిక కన్నీరుమున్నీరుగా విలపించసాగింది. స్థానికులు పరుగున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూశారేఉ. ఎస్ఐ నాగేశ్వరరావు ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే విడదల రజని ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు గుంటూరు నుంచి వస్తున్న ఎమ్మెల్యే విడదల రజని హైవేపై జనాన్ని చూసి ప్రమాదం జరిగిందని గ్రహించి కారు దిగారు. బాధితులను పరామర్శించి అంబులెన్స్‌లో గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు. అక్కడ నుంచే జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి సత్వర వైద్యం అందించాలని సూచించారు. కొద్దిసేపటి తర్వాత నాగరాజు మెడకు సర్జరీ చేస్తున్నామని, అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయని, బాబు కన్ను పరిస్థితి మాత్రం చెప్పలేమని వైద్యులు ఎమ్మెల్యేకు వివరించారు. -
భర్త పెద్ద కర్మ.. కుమారుడి దుర్మరణం
వైఎస్ఆర్ జిల్లా, పెనగలూరు: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు భర్త పెద్దకర్మ రోజునే కుమారుడు కడుపుకోత మిగిల్చిన విషాదకర సంఘటన బుధవారం పెనగలూరు మండలం తిరుణంపల్లిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తిరుణంపల్లికి చెందిన పళ్లాల పెంచలయ్య అనారోగ్యంతో ఈనెల 6వ తేదీ మృతి చెందాడు. తండ్రి మృతి వార్త విన్న కుమారుడు ప్రసాద్(21) కువైట్ నుంచి తండ్రి మృతదేహాన్ని చూసేందుకు వచ్చాడు. బుధవారం రోజున తండ్రి పెద్దకర్మ ప్రారంభమవుతుందనుకున్న సమయంలో ప్రసాద్ తన మేనమామలైన పోలయ్య, గుర్రయ్యలతో కలిసి సరుకుల కోసం పెనగలూరుకు బయలుదేరాడు. ఇదే మార్గంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన టాటా ఏస్ వాహనం (ఎపీ04టియు8337) పెనగలూరు వైపు నుంచి బెస్తపల్లి వైపు వెళుతోంది. ఇదే సమయంలో కంబాలకుంట మలుపు వద్ద రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ద్విచక్రవాహనం ట్యాంక్ పూర్తిగా పగిలిపోయింది. ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కాగా పోలయ్య, గురవయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో తిరుపతికి సిఫార్సు చేశారు. తిరుపతికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో కోడూరు సమీపంలో ప్రసాద్ మృతి చెందాడు. మృతదేహాన్ని రాజంపేట ఆసుపత్రికి తరలించి మిగిలిన ఇద్దరిని తిరుపతికి తీసుకెళ్లారు. మృతుడి అన్న నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హేమీబాయ్ తెలిపారు. తిరుణంపల్లిలో విషాద ఛాయలు.. ఒక వైపు కుటుంబ పెద్ద పెద్దకర్మ జరుగుతుండగా అదే సమయంలో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన గ్రామస్తులందరిని కంట తడిపెట్టించింది. అటు భర్తను.. ఇటు కుమారుడిని కోల్పోయిన ఆ తల్లి వేదన వర్ణనాతీతంగా మారింది. -
అయ్యో పా'ప'ము..!
అనంతపురం, తాడిమర్రి : పెద్ద కుంటుంబం..పిల్లా, పెద్దా అంతా శుభకార్యంలో పాల్గొన్నారు. అప్పటి దాకా బంధువులతో సరదాగా గడిపారు.. సందడి చేశారు.. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.. ఎవరి ఊళ్లకు వాళ్లు బయల్దేరారు. అప్పటి వరకు ద్విచక్రవాహనం వెళ్లాల్సిన వేగంతో వెళ్తోంది. ఉన్నట్లుండి దారికి అడ్డంగా పెద్ద పాము వెళ్తోంది. పాముపై బైక్ ఎక్కడ ఎక్కుతుందోనని వేగం తగ్గించాడు వాహనదారుడు.. అంతే.. ఆ వెనకే అతివేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ముందున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వెనకవైపున కూర్చున్న మహిళ ఎగిరి కింద పడింది. తలకు తీవ్రగాయమైంది. 108 వాహనంలో ఆమెను బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచింది. ఈ హృదయవిదారక ఘటన తాడిమర్రి మండలం కునుకుంట్ల ప్రాంతంలో జరిగింది. బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామానికి చెందిన మదనాపు శంకరయ్య భార్య పద్మావతి (50), కుమారుడు అశోక్‌లు ద్విచక్ర వాహనంలో నార్పల మండలం గూగూడులో ఆదివారం జరిగిన శుభకార్యానికి ద్విచక్రవాహనంలో వెళ్లారు. తిరిగివచ్చేటపుడు పద్మావతి పుట్టినిల్లు కునుకుంట్లకు వెళ్లి అక్కడి వారిని పలకరించారు. అనంతరం తిరిగి పోట్లమర్రికి బయల్దేరారు. కునుకుంట్ల గ్రామం దాటగానే రోడ్డుపై పాము వెళ్తోంది. దీన్ని గమనించిన అశోక్ బైక్ వేగం తగ్గించాడు. అయితే వెనకాల అతివేగంతో వస్తున్న మరో బైక్ వీరిని ఢీకొంది. దీంతో తల్లి, కుమారుడు ఎగిరి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో పద్మావతి చెవులు, ముక్కుల్లో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పద్మావతికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
దేవుడా.. ఎంత పని చేశావయ్యా!
ఇరవై రెండేళ్ల ఓ యువకుడు తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు. పదేళ్ల పాటు అక్కడే ఉండి కుటుంబపోషణకు సరిపడా నాలుగు రాళ్లు సంపాదించుకున్నాడు. తిరిగొచ్చి వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర దాటినా పిల్లలు కలగలేదని దేవుడికి మొక్కుకుందామనుకున్నాడు. తల్లి, భార్యను బైక్‌పై ఎక్కించుకుని గుడికి వెళ్తుండగా వారిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడు మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. ఈ విషాద ఘటన కొమరోలు మండలం కత్తులవానిపల్లెవద్ద మంగళవారం జరిగింది. కొమరోలు (గిద్దలూరు): ఆర్టీసీ బస్సు–మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందారు. ఈ సంఘటన కొమరోలు మండలం కత్తులవానిపల్లె వద్ద మంగళవారం జరిగింది. ప్రమాదంలో అదే మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు సిద్ధమ్మ (55), నడిపి భూపాల్ (35) మృతి చెందగా భూపాల్ భార్య చంద్రకళకు తీవ్ర గాయాలయ్యాయి. అందిన సమాచారం ప్రకారం.. భూపాల్ తన భార్య చంద్రకళ, తల్లి సిద్ధమ్మతో కలిసి మోటారు సైకిల్‌పై గుడికి వెళ్తున్నారు. కడప–గుంటూరు రహదారిపైకి వస్తుండగా అదే సమయంలో కడప నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సు ఢీకొంది. మోటారు సైకిల్‌పై ఉన్న భూపాల్‌తో పాటు అతని తల్లి సిద్ధమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య చంద్రకళకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భూపాల్‌తో సిద్ధమ్మ మృతి చెందారు. చంద్రకళ చికిత్స పొందుతోంది. కళ్లెదుటే కన్న కుమారుడు, భార్య మృతి చెందడంతో పాటు కోడలు గాయాలతో చికిత్స పొందుతుండటాన్ని చూసిన భూపాల్ తండ్రి చిన్న నరసింహులు గుండెలవిసేలా విలపిస్తున్నాడు. పిల్లలు లేరని గుడికి వెళ్తుండగా ప్రమాదం.. ఉరియా నడిపి భూపాల్ సౌదీఅరేబియాకు వెళ్లి పదేళ్ల పాటు పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేంత వరకు సంపాదించుకుని రెండేళ్ల క్రితం స్వగ్రామం అయ్యవారిపల్లె వచ్చాడు. ఏడాదిన్నర క్రితం వైఎస్సార్ జిల్లా బాకరాపేటకు చెందిన చంద్రకళను వివాహం చేసుకుని ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయి ఏడాదిన్నర కావస్తున్నా పిల్లలు లేకపోవడంతో వైఎస్సార్ జిల్లాలోని ఓ గ్రామంలోని ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. పూజలు రాత్రి వేళ చేయాల్సి రావడంతో సాయంత్రమే మోటారు సైకిల్‌పై బయల్దేరారని, లేని పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఉన్న కొడుకు దూరమయ్యాడని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. మృతుడికి అన్న, తమ్ముడు ఉన్నారు. అన్న ఆర్మీలో, తమ్ముడు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మళ్లికార్జున కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పరిశీలించిన ఆయన పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. -
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
-
హైదరాబాద్‌లో విషాదం; యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చాదర్‌ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కావ్య అనే యువతి మృతి చెందింది. వివరాలు.. చాదర్‌ఘాట్‌లో ఓ వ్యక్తి యువతిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్తున్నాడు. రోడ్డుపై ఏర్పడ్డ గుంత కారణంగా వారి టూ వీలర్ ఒక్కసారిగా జారిపడటంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు వారి మీద నుంచి వేగంగా దూసుకుని పోయింది. దీంతో కావ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తి పరిస్థితి విషయంగా ఉంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని యువతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రోడ్డు సరిగా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని, రోడ్డుపై ఏర్పడ్డ గుంతల గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావ్య పరీక్ష రాయడానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు బెబుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. -
కళ్లెదుటే భర్త ప్రాణాలు విడవడంతో..
ఆనందపురం (భీమిలి): రోడ్డు నిర్మాణ కాంట్రాక్టరు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. నిర్మాణ పనుల నిమిత్తం పాత రోడ్డుని మూసివేసి, తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. హెచ్చరిక బోర్డులు, రూటు తెలిపే సంకేతాల బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యం వహించడంతో ఏ వాహనం ఎటు వెళ్తుందో తెలియని గందరగోళ పరిస్థితుల వల్ల ప్రమాదం సంభవించి నిండు ప్రాణం బలైంది. స్థానికంగా ఉన్న ప్లై ఓవర్ పక్కన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. తలకు హెల్మెట్ ఉన్నా లారీ చక్రాలు తలపై నుంచి వెళ్లి పోవడంతో తల నుజ్జునుజ్జయిపోయింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తర్లువాడ పంచాయతీ నగరప్పాలెం గ్రామానికి చెందిన బాయిన పైడినాయుడుకు విజయవాడకు చెందిన బిందుతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పైడినాయుడు తల్లిదండ్రులు గతంలోనే మరణించారు. బోయిపాలెంలో ఉన్న మీ సేవా కేం ద్రంలో పనిచేసుకుంటూ కుటంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా ఆదివారం పైడినాయుడు భార్య బిందుతో కలిసి మండలంలోని మెట్టమీదపాలెం గ్రామంలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మధురవాడలో మరో శుభకార్యానికి హాజరు కావాల్సి ఉండడంతో దంపతులిద్దరూ బైక్‌పై బయలుదేరి వెళ్తున్నారు. ఆనందపురం జంక్షన్లో ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఆ పక్క నుంచి జాతీయ రహదారిని చేరుకోవడానికి తాత్కాలిక రోడ్డుని ఏర్పాటు చేశారు. కాగా పైడినాయుడు దంపతులు ప్లై ఓవర్ కిందకి చేరుకోవడానికి మోటార్ బైక్‌పై వెళ్తుండగా పెందుర్తి వైపు నుంచి వస్తున్న లారీ జాతీయ రహదారిపైకి చేరుకోవడానికని డ్రైవర్ ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా తాత్కాలిక రోడ్డు మలుపు వద్ద ఎడమ వైపునకు మళ్లించాడు. దీంతో బైక్‌ని లారీ ఢీకొట్టడంతో బైక్ వెనుక కూర్చున్న బిందు తూలి దూరంగా పడిపోయింది. ఈ సంఘటనలో పైడినాయుడు బురదగా ఉన్న గోతిలో పడిపోగా అతనిపై బైక్ ఉండిపోయింది. దీంతో బైక్‌తోపాటు పైడినాయుడు తలపై నుంచి లారీ వెళ్లిపోవడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. బిందుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమై పరారైపోతున్న లారీని కొంత మంది స్థానికులు కారుతో వెంబడించి పెద్దిపాలేనికి సమీపంలో పట్టుకున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ గణేష్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరిపారు. మిన్నంటిన మృతుడి భార్య రోదన కళ్లెదుటే భర్త ప్రాణాలు విడవడంతో భార్య బిందు రోదించిన తీరు అందరినీ కలచి వేసింది. అయ్యో.. నా భర్త చనిపోయాడు.. నాకు, నా పిల్లలకు దిక్కెవరు అంటూ సంఘటనా స్థలంలోనే రోదిస్తూ కుప్పకూలిపోయింది. ఈ లోగా సమాచారం అందుకున్న బంధువులు ప్రమాద స్థలం వద్దకు చేరుకొని ఆమెకు సపర్యలు చేశారు. -
బైక్ లారీ కిందకు వెళ్లిపోవడంతో..
మేడ్చల్: బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్త కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం, గుంటిపల్లి గ్రామానికి చెందిన శ్యామ్‌కుమార్ శుక్రవారం తన అత్తగారి ఊరైన మెదక్ జిల్లా, జీడీపల్లి గ్రామానికి వెళ్లాడు. తన కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో డాక్టర్‌కు చూపించేందుకు గాను భార్య సరస్వతి కుమారుడు కేశవర్ధన్(8)తో కలిసి బైక్‌పై ఘనాపూర్ మెడిసిటి ఆసుపత్రికి వస్తుండగా మేడ్చల్ ఆర్టీసీ డిపో వద్ద కంటెయినర్ ఢీకొనడంతో బైక్ లారీ కిందకు వెళ్ళిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం నగర శివార్లలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. శ్యాంకుమార్, కేశవర్ధన్ చికిత్స పొందుతున్నారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి
బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి చెందిన హృదయ విదారక సంఘటన ఇబ్రహీంపట్నం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం (మైలవరం) : బైకును లారీ డీకొన్న ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి చెందిన హృదయ విదారక సంఘటన ఇబ్రహీంపట్నం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. అనారోగ్యంతో ఉన్న కూతురుకు చికిత్స చేయించే నిమిత్తం విస్సన్నపేట వెళ్లి తిరిగి వస్తూ తండ్రీ, కూతురు అసువులు బాయటం ఆ కుటుంబాన్ని కలచివేసింది. సేకరించిన వివరాల మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసరావు (30) పూల వ్యాపారం చేస్తాడు. ఇటీవల కాలంలో తన పదేళ్ల కుమార్తెకు చేయి విరగటంతో విసన్నపేటలో నాటువైద్యం చేయించేందుకు తన బైకుపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ మీదుగా వస్తుండగా ఇబ్రహీంపట్నం వద్దకు చేరుకునే సమయానికి వెనుక వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన లారీ వీరి బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రరక్తస్రావానికి గురైన కుమార్తె తిరపతమ్మ (10)ను ట్రాఫిక్ పోలీసులు తమ పెట్రోలింగ్ వాహనంలో వైద్యశాలకు తరలించారు. గొల్లపూడి ఆంధ్రా వైద్యశాలలో చికిత్స పొందుతూ బాలిక కూడా మరణించినంది. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రాణం తీసిన వేగం
మేడ్చల్: అతివేగం కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. జాతీయ రహదారిపై మెదక్ జిల్లా చేగుంట నుంచి బైక్‌పై వస్తున్న జమాల్ పాషా(42)పండరిగౌడ్(56 అత్వెల్లి సెయింట్ క్లారేట్ స్కూల్ సమీపంలో డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో బైక్‌తో సహ రోడ్డు అవతలి వైపు పడిపోవడంతో అదే సమయంలో మేడ్చల్ నుంచి తూఫ్రాన్ వైపు వెళుతున్న టిప్పర్ వారిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. జమాల్‌పాషా కడప జిల్లా, చాపాడుకు చెందిన వాడు కాగా, పండరిగౌడ్ మెదక్‌జిల్లా చేగుంట మండలం రాజపల్లికి చెందిన వాడు. మృతులిద్దరు చేగుంటలోని ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికులుగాపని చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. పోలీసులు మృతదేహలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం అదే సమయంలో తన నియోజకవర్గానికి వెళుతున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కారు దిగి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు రావడంలో ఆలస్యం జరగడంతో తన కాన్వాయ్ లోని వామనాలను మృతదేహలకు అడ్డుగా పెట్టించారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రాణం బలిగొన్న జాలీ రైడ్
అనంతపురం , తాడిపత్రి అర్బన్/నార్పల: జాలీ రైడ్ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. అమ్మమ్మను చూసొస్తానంటూ తల్లిదండ్రులకు చెప్పి స్నేహితులతో కలిసి బైక్‌పై బయలుదేరిన విద్యార్థి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని సాయి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బూస మురళీకృష్ణ (16), మహమ్మద్ ఖాసీం, షాషావలీ స్నేహితులు. కళాశాలలో చేరిన తర్వాత వీరికి ప్రొద్దూటూరులో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం విద్యార్థి హాజీపీరాతో పరిచయమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం ద్విచక్ర వాహనాలపై జాలీ రైడ్‌కు స్నేహితులు సిద్ధమయ్యారు. ఈ విషయం ఇంటిలో వారికి తెలిస్తే పంపరనే భయంతో.. ధర్మవరానికి స్నేహితులు కారులో వెళుతున్నారని, తాను కూడా వారితో కలిసి వెళ్లి అక్కడున్న అమ్మమ్మను చూసి తిరిగి వస్తానంటూ మురళీ కృష్ణ తన తల్లిదండ్రులను నమ్మించి బయలుదేరాడు. అయితే కారులో కాకుండా రెండు ద్విచక్ర వాహనాల్లో స్నేహితులు గురువారం ఉదయం బయలుదేరారు. వేగాన్ని నియంత్రించుకోలేక.. జాతీయ రహదారిపై రయ్యిమంటూ బైక్‌లను దూకిస్తూ స్నేహితులు జాలీగా ముందుకు సాగారు. ముచ్చుకోట దాటిన తర్వాత నార్పల మండలం మద్దలపల్లి గ్రామ శివారులో మలుపు వద్దకు చేరుకోగానే వాహనాల వేగాన్ని వారు నియంత్రించుకోలేకపోయారు. దీంతో మురళీకృష్ణ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొని.. అదే వేగంతో పక్కనే ఉన్న స్నేహితుల మరో వాహనాన్ని ఢీకొంది. ఘటనలో కిందపడ్డ మురళీకృష్ణకు తలకు తీవ్రగాయమై అపస్మారకస్థితికి చేరుకుని మృతిచెందాడు. హాజీపీరాకు కాలు విరిగింది. మహమ్మద్ ఖాసీం, షాషావలీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రలను 108 వాహనంలో జిల్లా సర్వజనాస్పత్రికి తరలించారు. మురళీకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ఘటనపై నార్పలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కడే కుమారుడు.. తాడిపత్రిలో బియ్యం వ్యాపారం చేసుకుని జీవనం సాగించే రమేష్ మంజుల దంపతులకు మురళీకృష్ణ ఒక్కడే కుమారుడు, కారులో తన అమ్మమ్మను చూసి వస్తానంటూ ధర్మవరానికి ప్రయాణమై బయలుదేరాడని, అయితే ఇలా తిరిగి రాని లోకాలకు వెళతాడని తాము ఏనాడూ అనుకోలేదంటూ తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రి వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, మురళీకృష్ణ మృతిచెందినట్లు తెలుసుకున్న కళాశాల యాజమాన్యం గురువారం సెలవు ప్రకటించింది. దీంతో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని తమ మిత్రుడిని కడసారి చూసి, కన్నీటి నివాళులర్పించారు. -
రోడ్డు ప్రమాదంలో పేపర్ బాయ్ దుర్మరణం
నల్లకుంట: బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ పేపర్ బాయ్(మైనర్) మృతి చెందిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సవార్ వెంకట్ రావు, భార్య సంగీత, కుమారుడు అభినవ్(14)తో కలిసి బాగ్‌అంబర్‌పేట మల్లిఖార్జుననగర్‌లో ఉంటున్నాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభినవ్ గత కొన్ని నెలలుగా అదే ప్రాంతానికి చెందిన సతీష్ అనే న్యూస్ పేపర్ ఏజెంట్ వద్ద పేపర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున పేపర్ వేసేందుకు వెళ్లిన అతడిని సతీష్ ఓయూ ఎన్సీసీ చౌరస్తాలో పేపర్లు ఇచ్చిరావాలని చెప్పాడు. దీంతో అతను తన సైకిల్ అక్కడే పెట్టి ఏజెంట్‌కు చెందిన బైక్ తీసుకుని పెట్రోల్ ట్యాంక్‌పై బండిల్ పెట్టుకుని బయలు దేరాడు. శివం రోడ్డులోని సత్య సూపర్ మార్కెట్ సమీపంలో పేపర్ బండిల్ హ్యాండిల్‌కు తగలడంతో బైక్ అదుపుతప్పి ఫుట్ పాత్పైకి దూసుకెళ్లింది. అభినవ్ ఫుట్‌పాత్ పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మరో పేపర్ బాయ్ శ్రీనివాస్ అభినవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. నల్లకుంట పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి వెంకట్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్‌ను పనిలో పెట్టుకోవడమే కాకుండా అతడికి వాహనం ఇచ్చినందుకు పేపర్ ఏజెంట్ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. మహారాష్ట్ర నుంచి నగరానికి వలస వచ్చిన వెంకట్ రావు, సంగీత దంపతులకు అభినవ్ ఒక్కడే కుమారుడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంగీత సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆయాగా పనిచేస్తూ కుమారుడిని డీడీ కాలనీలోని కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తోంది. తల్లి కష్టాన్ని చూసిన అభినవ్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకుగాను 8 నెలలుగా పేపర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి తనకు పాయసం తినాలని ఉందని చెప్పడంతో సంగీత కుమారునికి పాయసం చేసి పెట్టింది. మంగళవారం ఉదయం తల్లి నిద్రలేపగా ఈ రోజు పేపర్ వేసేందుకు వెళ్లనని చెప్పిన అభినవ్ కొద్ది సేపటికే లేచి పేపర్ వేసేందుకు వెళ్లిపోయాడు. రెండు గంటలు గడువకముందే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియడంతో ఆమె బోరున విలపించింది. ఎమ్మెల్యే పరామర్శ స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ బాలుని మృతదేహం వద్ద నివాళులర్పించి, మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే అతని అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేశా రు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహా యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ డి.పద్మావతి రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
ఒకే బైక్‌పై ఐదుగురు.. ముగ్గురి మృతి
మోటారుసైకిల్‌పై ముగ్గురి ప్రయాణమే ప్రమాదకరం.. అలాంటిది ఐదుగురు ప్రయాణిస్తే.. వాహనం అదుపులో ఉండడం కష్టం. అదే జరిగింది వారి విషయంలో. చిన్నారులకు వచ్చిన సర్పికి వైద్యం చేయించేందుకు మోటారుసైకిల్‌పై ఐదుగురు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో కాలువలోకి దూసుకుపోగా ఇద్దరు బాలికలు, ఓ మహిళ మరణించారు. సాక్షి, మలికిపురం (తూర్పు గోదావరి): ప్రజల ప్రాణరక్షణ కోసమే ట్రాఫిక్ నిబంధనలు.. ఏం పర్లేదని వాటిని ఉల్లంఘిస్తే.. జరిగే దారుణం అంతా ఇంతా కాదు. ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి. వాహనంపై ముగ్గురి ప్రయాణం ప్రమాదకరం.. ఇలా నిబంధనలు చెబుతాయి. కానీ వాటిని చాలామంది పట్టించుకోరు. అదే ముప్పును తెచ్చిపెడుతుంది. అదే జరిగింది ఈ సంఘటనలో.. మోటారు సైకిల్‌పై ఐదుగురు ప్రయాణిస్తుండడంతో దాన్ని అదుపు చేయడం వాహనదారుకు సాధ్యం కాలేదు. దాంతో అది కాలువలోకి దూసుకుపోగా ఓ మహిళ, ఇద్దరు బాలికలు మరణించారు. పిల్లల శరీరంపై వచ్చిన సర్పి వ్యాధికి మంత్రం వేయిద్దామని వారితో బయల్దేరిన తల్లికి కడుపుకోతే మిగిలింది. తమకు సాయంగా వచ్చిన తోబట్టువు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె దుఃఖానికి అంతేలేదు. మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదం సఖినేటిపల్లి మండలం మోరి పోడు గ్రామంలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇద్దరు పిల్లలు మరణించడంతో తండ్రి బ్రహ్మాజీ, తాత మేడూరి గంగాధర్ వేదనకు అంతేలేదు. మోరిపోడు గ్రామంలో వడ్రంగి పని చేసుకొనే మేడూరి బ్రహ్మాజీకి పాలకొల్లు గ్రామానికి చెందిన సుగుణతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వారికి భార్గవి (5), కిరణ్మయి (4) సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొన్ని నెలలుగా వారు విడిగా ఉంటున్నారు. సుగుణ తన ఇద్దరు పిల్లలతో పాలకొల్లులోని పుట్టింట్లో ఉంటోంది. పిల్లలు భార్గవి, కిరణ్మయిలకు శరీరంపై సర్పి వచ్చింది. అది మంత్రం ద్వారా నయం అవుతుందని, సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలో ఉన్న మంత్రగాడితో మంత్రం వేయించేందుకు మంగళవారం ఉదయమే బయలుదేరారు. పిల్లల మేనత్త భర్త అయిన పాలకొల్లు సమీపంలోని కాజ గ్రామానికి చెందిన వడ్లమాని శివ నాగేశ్వరరావు హోండా ప్లెజర్ వాహనంపై చిన్నారులు భార్గవి, కిరణ్మయిలతో పాటు వారి తల్లి సుగుణ, సుగుణ అక్క కృప (పాలకొల్లు)లతో బయల్దేరారు. వారు గుడిమెళ్లంక– రామరాజులంక సరిహద్దులకు వచ్చే సరికి ప్రధాన పంట కాలువపై గల వంతెన వద్ద వాహనం మలుపు తిరగడం కష్టమైంది. దాంతో కాలువలోకి దూసుకుపోయింది. అప్పుడు సమయం తెల్లవారు ఝామున 4.30 గంటలైంది. అంతా చీకటిగా ఉండడంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారు కాలువలో ప్రవాహానికి కొట్టుకు పోసాగారు. శివ నాగేశ్వరరావు, సుగుణ ఈదుకుంటూ ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. మోటార్ సైకిల్‌తో పాటు కృప, భార్గవి, కిరణ్మయి గల్లంతయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మలికిపురం ఎస్సై కేవీ రామారావు తమ సిబ్బందితో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాజోలు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈత గాళ్లను రప్పించారు. ఉదయం 7 గంటలకు తొలుత కిరణ్మయి (4) మృత దేహం లభించింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో కృప మృత దేహం లభించింది. భార్గవి మృత దేహం కోసం తీవ్రంగా గాలించగా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సంఘటన స్థలానికి సమీపంలోనే లభించింది. అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా, రాజోలు సీఐ కె.నాగ మోహన రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ మృతి
విశాఖపట్నం, ఆనందపురం(భీమిలి): మండలంలోని బోయపాలెం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ మృతి చెందగా అతని భార్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానిక పొలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శిద్దాబత్తుల సత్యశ్రీ నగేష్ (55) అనారోగ్యానికి గురికాగా కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు చేయించుకునే నిమిత్తం సోమవారం ఉదయం తన భార్య విజయతో కలిసి మోటార్ బైక్‌పై విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి విజయనగరం నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో వారు బోయిపాలెం జాతీయ రహదారిపైకి చేరుకునే సరికి ముందు వెళ్తున్న వాహనం హఠాత్తుగా ఆగడంతో నగేష్ తన ద్విచక్ర వాహనానికి బ్రేక్‌లు వేశాడు. దీంతో అదుపుతప్పి భార్య భర్తలు రోడ్డుపై పడిపోయారు. ఈ సంఘటనలో నగేష్ తలకు, చేతులకు తీవ్ర గాయాలుకాగా, విజయకు బలమైన గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించి రోడ్డుపై పడి ఉన్న ఇద్దరినీ పైకి లేవదీశారు. వెంటనే విజయ ఫోన్లో తమ బంధువులకు సమాచారం అందించింది. పోలీసులు వారిరువురిని 108 వాహనంలో నగరంలోని గీతం ఆస్పత్రికి తరలించగా అక్కడ నగేష్ మృతి చెందారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన విజయ గీతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆనందపురం సీఐ జి.శంకర రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించి.. విజయనగరంలోని పూల్‌బాగ్ కాలనీకి చెందిన శిద్ధాబత్తుల సత్యశ్రీ నగేష్ 1987లో కానిస్టేబుల్‌గా ఎంపికై విజయనగరం జిల్లాలోని పెదమానాపురంలో తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. తర్వాత అన్నవరం, బుదులువలస పోలీస్ స్టేషన్లోను, ట్రాఫిక్ విభాగంలోను పనిచేసిన ఆయన క్రైం విభాగంలో హెచ్‌సీగా పదోన్నతి పొంది ప్రస్తుతం ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు హరి కిరణి, వంశీకృష్ణ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరి కిరణికి వివాహం కాగా వంశీకృష్ణ ఇటీవలే పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. -
దేవుడా..
తమిళనాడు, అరక్కోణం: ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల మేరకు.. వేలూరు జిల్లా రాణిపేట సమీపంలోని చెట్టితాంగల్ గ్రామానికి చెందిన ఇళంపరుది(40) ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేవారు. ఆదివారం సెలవు కావడంతో కాంచీపురంలో నాలుగు వసంతాల తరువాత దర్శనభాగ్యం కల్పిస్తున్న అత్తివరదర్‌ను దర్శించుకునేందుకు ఇళంవరుది అతని భార్య సరస్వతి(35) వారి పదేళ్ల బాలుడు ధనుష్ బైకులో కాంచీపురం వెళ్లారు. అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని బైకులో తిరుగుపయనమయ్యారు. కాంచీపురం, వేలూరు జాతీయ రహదారి మార్గంలో కావేరిపాక్కం సమీపం సుమైతాంగి అనే ప్రాంతంలో రోడ్డును ఓ వృద్ధుడు క్రాస్ చేస్తుండగా అదుపుతప్పిన బైకు అతన్ని ఢీకొని రోడ్డు పక్క ఆగివున్న కంటైనర్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నలుగురిని స్థానికులు వాలాజా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఇళంపరుది, అతని కుమారుడు ధనుష్ మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి, రోడ్డును క్రాస్ చేసిన కాళిముత్తు సైతం ప్రాణాలు విడిచారు. అత్తివరదర్ దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటున్న కుటుంబాన్ని మృత్యువు కబలించిన ఘటన వారి కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చింది. ప్రమాదం పట్ల కావేరిపాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరిపోయిన అక్షర దీపం
‘ఆరేళ్ల’ ఆశయం అప్పుడే చెదిరిపోయింది.. అ, ఆ..లతో ఆరంభమై.. అచ్చులు, హల్లులతో ఆగకుండా దిద్దిన అక్షరమే దిద్దుతూ.. అడుగులో అడుగు వేస్తూ.. తరగతులు ఎన్నో మారుతూ .. తలరాతను మార్చుకుందామని ఎన్నో మెట్లు ఎక్కుతూ.. ఉన్నతంగా చదివి ఉన్నత శిఖరం వైపు అక్షర‘బాట’ పట్టిన ‘బాల’విజ్ఞాని ఎక్కాల్సిన మెట్లు కుప్పకూలి.. అప్పుడే వందేళ్లు నిండాయి.. మొదటి ‘గురువు’ నాన్నచేయి పట్టుకొని బడికెళ్తుంటే మృత్యుశకటం మీదకొచ్చి ఆశ..శ్వాసను కాలరాస్తే.. ఆ ఇంట విషాదం అలుముకుంది. పూలకుంట గ్రామ శోకసంద్రమైంది. సాక్షి, ఎస్కేయూ: పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి వెళ్తున్న తండ్రీ కొడుకును రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన కాటప్పగారి నరసింహారెడ్డి (40), సంధ్యారాణి దంపతులు. సంధ్యారాణి తన పుట్టినిల్లు అయిన బుక్కపట్నం మండలం మారాలకు వెళ్లింది. ఇంటి వద్ద నరసింహారెడ్డి, కుమారుడు కార్తీక్‌రెడ్డి (6) ఉన్నారు. సోమవారం ఉదయం సమతాగ్రాంలోని రాధా స్కూల్లో ఒకటో తరగతిలో చేర్పించడానికి కుమారుడిని తీసుకుని నరసింహారెడ్డి బైక్‌లో బయల్దేరాడు. ఆకుతోటపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తండ్రీకుమారుడు నరసింహారెడ్డి, కార్తీక్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఐచర్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదంజరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే పూలకుంట గ్రామస్తులు, ఎస్కేయూ విద్యార్థులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ గ్రామస్తులు విలపించారు. నరసింహారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటుకలపల్లి ఏఎస్ఐ నాగన్న తెలిపారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో తండ్రీ కుమారుల మృతదేహాలను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సందర్శించి, నివాళులర్పించారు. అమ్మ ఊరికి వెళ్లకుంటే... పూలకుంటలో ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో స్కూల్లో అడ్మిషన్ కోసం నరసింహారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డిని వెంట తీసుకెళ్లాడు. ‘అమ్మ ఊర్లో ఉండి ఉంటే బతికి ఉండేవాడివి కద బిడ్డా’ అంటూ బంధువులు రోదించిన తీరు కలచివేసింది. -
రంజాన్ వేళ విషాదం
పరిగి: మండలంలోని యు.బసవనపల్లి క్రాస్‌వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు, క్షతగాత్రుడు ముస్లింలు. రంజాన్ వేళ ఈ ఘటన జరగడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఊటుకూరు నుంచి హిందూపురానికి ముగ్గురు ప్రయాణికులతో ఆటో వస్తోంది. పరిగికి చెందిన ముబారక్, ఇర్ఫాన్ (17)లు హిందూపురం నుంచి ఊటుకూరు వైపు ద్విచక్రవాహనంలో వస్తున్నారు. సరిగ్గా యు.బసవనపల్లి క్రాస్ మలుపు వద్ద ద్విచక్రవాహనం, ఆటో వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరూ కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇర్ఫాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. రంజాన్ పర్వదినం రోజున సంతోషంగా ఉన్న కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మలుపులో కంపచెట్లు ఏపుగా పెరగడం వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా పోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కంపచెట్లు తొలగించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఇరుక్కుపోయాడు..
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): త్రుటిలో ప్రమాదం తప్పింది.. నగరాని చెందిన ఓ కుటుంబం దైవదర్శనానికి వెళ్లింది. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా టిప్పర్ ఒకసారిగా దూసుకొచ్చింది. కొద్దిలో తప్పంచుకోగా వాహనచోదకులు గాయపడ్డాడు. వివరాలు.. ప్రైజర్‌పేటకు చెందిన చిట్లా జార్జి ప్రభుదాస్ భార్య, నాలుగేళ్ల కుమారుడితో ఆదివారం గుణదల చర్చి వద్ద నిద్ర చేశాడు. తిరిగి వేకువజామున 5గంటల సమయంలో ప్రభుదాస్ కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా పెజ్జోనిపేటకు సమీపంలోని ఎర్రకట్టకు చేరాడు. అదే సమయంలో కంకర రాయిని తరలిస్తున్న భారీ లారీ చిట్టినగర్ మీదుగా అదే సెంటర్‌కు వస్తోంది. ఎర్రకట్ట దిగువున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి మరో వైపు వెళ్తున్న ప్రభుదాస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భార్య, కుమారుడు పక్కకు పడిపోగా, ప్రభుదాస్ వాహనం లారీ కిందకు వెళ్లిపోయింది. కాలు ఇరక్కపోయింది. దీంతో లారీ డ్రైవర్ బ్రేక్ వేసి లారీని నిలిపి పరారయ్యాడు. లారీ వెనక్కి తీసేవారు లేక, ప్రభుదాసును బయటకు తీసేవారు రాక గంటన్నర సమయం లారీ కిందే ఉన్నాడు. అప్పటికే ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ సీఐ దుర్గారావు క్రేన్, జేసీబీలను రప్పించి వాటి సాయంతో లారీ ముందు చక్రాల్ని తొలగించి ప్రభుదాస్ కాలును బయటకు తీశారు. ఈ క్రమంలో తల, కాలికి గాయమైంది. సత్యనారాయణపురం సీఐ కనకారావు ఆదేశాల మేరకు హెడ్‌కానిస్టేబుల్ కోటేశ్వరమ్మ 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటి ఆవరణలోనే సమాధి చేస్తా...
అల్లిపురం(విశాఖ దక్షిణం): అప్పటి వరకు స్నేహితులతో సరదాగా గడిపారు... అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు... ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. సిరిపురం రోడ్డులోని అపోలో ఆస్పత్రి సమీపంలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరకుకు చెందిన జన్ని సుధీర్ (21), పెందుర్తి మండలం యలమతోటకు చెందిన పెనుమత్స వినయవర్మ (22) చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ అరకులోని సెయింట్ జోషెఫ్ పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం నగరంలోని బుల్లయ్యకాలేజీలో సుధీర్ డిగ్రీ చదువుతున్నాడు. నగరంలోని ఓ కళాశాలలో వినయవర్మ ఎమ్మెస్సీ చదువుతున్నాడు. వీరిలో సుధీర్ నగరంలోని మేఘాలయ హోటల్ దరి శ్రీ సాయి సూర్య బోయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వారితోపాటు స్కూల్ స్థాయిలో కలిసి చదువుకున్న స్నేహితుడు పుట్టినరోజు వేడుకను శనివారం రాత్రి బీచ్‌లో నిర్వహించారు. దీంతో హాస్టల్ నుంచి సుధీర్, స్వగ్రామం యలమతోట నుంచి వినయమర్మ బీచ్‌కు చేరుకుని అక్కడ స్నేహితులందరితో కేక్ కట్ చేసి ఆనందంగా గడిపారు. కొద్ది సేపటి తర్వాత అర్ధరాత్రి 2 గంటల సమయంలో సుధీర్ ఉంటున్న హాస్టల్‌కు వెళ్లేందుకు బీచ్ నుంచి సుధీర్, వినయవర్మ బయలుదేరారు. స్నేహితుడి బైక్‌పై జగదాంబ నుంచి సిరిపురం వైపు వేగంగా వస్తుం డగా... బైక్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో అపోలో ఆస్పత్రి దరి డివైడర్ మధ్యలోని సెంటర్ లైటింగ్ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న పెనుమత్స వినయవర్మ తల విద్యుత్ స్తంభానికి తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. జన్ని సుధీర్ కింద పడిపోవటంతో తలకు తీవ్ర గాయాలు కావడంతోపాటు కుడికాలు విరిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కొన ఊపిరితో ఉన్న అతడిని ఎదురుగా గల అపోలో ఆస్పత్రి సిబ్బంది చికిత్స నిమిత్తం స్ట్రక్చర్‌పై తీసుకెళ్తుండగా మరణించాడు. దీంతో స్థానికులు సుధీర్ సెల్‌ఫోన్ నుంచి అతని స్నేహితుడు టి.వెంకటగణేష్కు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు విషయం తెలియజేసి, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఆదివారం మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే పుట్టిన రోజు వేడుకుల తర్వాత సుధీర్, వినయ్ ఎక్కడకు వెళ్లారో తమకు తెలియదని... ప్రమాదం విషయం తెలిసన తర్వాతే వారు బయటకు వెళ్లినట్లు తెలిసిందని వారి స్నేహితుడు టి.వెంకటగణేష్ చెబుతున్నాడు. దీంతో ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇంటి ఆవరణలోనే సమాధి చేస్తా... సుధీర్, వినయవర్మ మృతదేహాలకు ఆదివారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా అక్కడ విషాద వాతావరణం నెలకొంది. సుధీర్ తండ్రి జన్ని సోమన అరకులో రైతుకూలీగా పనిచేస్తుండగా తల్లి విజయ సాలూరులో టీచరుగా పనిచేస్తున్నారు. కుమారుడి చదువు పూర్తయితే అందొస్తాడనుకుంటే... ఇలా అర్ధంతరంగా తనువు చాలించాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శనివారం రాత్రి 2 గంటల సమయంలో ప్రమాద విషయం తెలిసిందని... వెంటనే బైక్‌పై అరకు నుంచి వచ్చేశానని సోమన విలపిస్తూ చెప్పారు. తన కొడుకు మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టి, సమాధి నిర్మించుకుంటానని చెప్పడం అక్కడి వారిని కలిచివేసింది. వినయవర్మ తల్లిదండ్రులు శివప్రసాద్, పార్వతి కుమారుడి మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. నగరంలో పని ఉందని ఇంటి నుంచి శనివారం బయలుదేరిన కుమారుడు విగతజీవిగా మారాడని గుండెలవిసేలా రోదించారు. -
అగ్రికల్చర్ యూనివర్సిటీలో రోడ్డు ప్రమాదం
రాజేంద్రనగర్: ప్రొఫెసర్జయశంకర్ వ్యవసాయ వర్సిటీ క్యాంపస్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న రాహుల్æ(22) తన సీనియర్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని తీసుకోని రాత్రి ఒంటి గంట ప్రాంతంలో బయటకు వెళ్లేందుకు బయల్దేరాడు. 90 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన ఎన్ ఫీల్డ్ వాహనం మూసి ఉన్న వర్సిటీ ప్రధాన గేట్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో రాహుల్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పై ఎగిరి పడ్డాడు. అదే సమయంలో దారి గుండా వెళ్తున్న యువకులు రక్తపు మడుగులో పడి ఉన్న రాహుల్‌ను గమనించి 108కు సమాచారం అందించారు. రాహుల్ సెల్‌కు వచ్చి న ఫోన్‌ను రిసీవ్ చేసి విషయాన్ని తెలపడంతో విద్యార్థులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది గాయపడిన రాహుల్‌కు ప్రథమ చికిత్స నిర్వహించి ఉస్మానియాకు తరలించారు. ప్రమాదంలో ఎన్ఫీల్డ్ ముందుభాగం ధ్వంసం కాగా, గేటు సైతం విరిగిపోయింది. తోటి విద్యార్థులు రాజన్న జిల్లాకు చెందిన రాహుల్ తండ్రి నర్సింలుకు సమాచారం అందించడంతో బుధవారం తెల్లవారుజామున కుటుంబీకులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్త# చేస్తున్నారు. -
పెళ్లయిన ఏడాదికే..
విశాఖపట్నం ,పాడేరు: మండలంలోని మినుములూరు సమీ పంలో కాఫీబోర్డు కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత దుర్మరణం చెం దింది. మోదకొండమ్మ పండగకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి... నగల వ్యాపారి శ్రీశైలపు అయ్యప్ప, తన భార్య రమ్య(23)తో కలిసి బైక్‌పై వస్తూ ముందు వెళ్తున్న ఆటోను తప్పించేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఎదురుగా బస్సు రావడంతో బ్రేక్ వేశాడు. బైక్‌పై వెనుక కూర్చున్న రమ్య అదుపుతప్పి తుళ్లి కిందపడింది. ఎదురుగా వస్తున్న బస్సు చక్రం కింద తలపడడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. కిందపడిన అయ్యప్ప కూడా తీవ్ర షాక్‌కు గురై సొమ్మసిల్లిపోయాడు. ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఆర్టీసీ బస్సును, డ్రైవర్ ఎస్.గురును పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించినట్టు ఎస్ఐ రామారావు తెలిపారు. పెళ్లయిన ఏడాదికే.. రమ్య మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీశైలపు బ్రహ్మాజీ ఎన్నో ఏళ్లుగా పాడేరులో స్థిర నివాసం ఏర్పర్చుకుని బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన పెద్దకుమారుడైన అయ్యప్పకు రమ్యతో గత ఏడాది వివాహం చేశారు. భార్య రమ్యతో కలిసి అయ్యప్ప కొన్నాళ్ల నుంచి విజయనగరంలో నగల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పాడేరులో మోదకొండమ్మ పండగ కోసం భార్యభర్తలిద్దరూ విజయనగరం నుంచి పాడేరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రమ్య మృతి చెందడంతో భర్త అయ్యప్పతో పాటు ఇంటిల్లిపాదీ గుండెలవిసేలా విలపించారు. ఆదివారం సాయంత్రం రమ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. -
ఆయిల్ ట్యాంకర్ ఢీ : నవ దంపతులు మృతి
చిత్తూరు , వి.కోట : మోటార్ సైకిల్‌ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొని నవదంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన బుధవారం సాయంత్రం మండలంలోని పలమనేరు–వి.కోట జాతీయ రహదారిలోని తోటకనుమ క్రాస్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం..మండలంలోని విభూది ఎల్లాగరం గ్రామానికి చెందిన సోమప్ప కుమారుడు అశోక్(23), అతని భార్య అశ్విని (18) పలమనేరు నుంచి వి.కోట వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వి.కోట నుంచి ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ వారిని ఢీకొంది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. వారికి రెండు నెలల క్రితమే వివాహమైంది. వీరి మరణంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త కళ్లెదుటే భార్య మృతి
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): కాకినాడలో జరిగే ఓ శుభకార్యం కోసం వెళ్తున్న ఓ గర్భిణి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. భార్యను బస్సెక్కించడానికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్న క్రమంలో భార్యాభర్తలను ట్రాలర్ లారీ ఢీకొట్టింది. ఆటోనగర్ సిగ్నల్ పాయింట్ వద్ద బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో భార్య తీవ్ర గాయాలపాలై కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించగా.. భర్త స్వల్పగాయాలతో బయటపడ్డాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 59వ వార్డు తుంగ్లాంలో చంద్రశేఖర్, బోసు కృష్ణకుమారి(24)లు నివాసముంటున్నారు. చంద్రశేఖర్ ఆటోనగర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. వీరికి రెండేళ్ల కిందట వివాహమైంది. కాకినాడలో ఓ శుభకార్యానికి భార్యను పంపే క్రమంలో ఆమెను బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై చంద్రశేఖర్ తీసుకువెళ్తున్నాడు. ఆటోనగర్ నుంచి బీహెచ్‌పీవీ వైపు మలుపు తిరుగుతుండగా వారి వెనుక నుంచి ఐరన్ రాడ్ల లోడుతో వస్తున్న ట్రాలర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణకుమారి చీర లారీలో చిక్కుకుపోయింది. దీంతో సుమారు 200 మీటర్ల మేర ఆమెతో పాటు బైక్‌ను కూడా ఈడ్చుకుంటూ లారీ వెళ్లిపోయింది. కొన ఊపిరితో ఉన్న భార్యను కాపాడుకోవడం కోసం చంద్రశేఖర్ పడిన తపన అందర్ని కంటతడి పెట్టించింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ మొబైల్ వ్యాన్‌లో క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ కృష్ణకుమారి చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కాకినాడవాసి. వీరికి పిల్లలు లేరు. ప్రస్తుతం ఈమె గర్భవతి అని, ఓ శుభకార్యానికి హాజరవ్వడంతో పాటు, ఆరోగ్య పరీక్షలు కూడా కాకినాడలో చేయించుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. -
ఆటో..ద్విచక్రవాహనం ఢీ
ప్రకాశం, యర్రగొండపాలెం టౌన్: వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొన్న సంఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు ఆటో డ్రైవర్, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన యర్రగొండపాలెం మండలంలోని మార్కాపురం రోడ్లో అన్నకుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న పి.మల్లారెడ్డి మార్కాపురం నుంచి ద్విచక్ర వాహనంపై యర్రగొండపాలెం వస్తుండగా, బోయలపల్లె గ్రామానికి చెందిన పిన్నిక వెంకటేశ్వర్లు, పిన్నిక శివమ్మ(దంపతులు) ఆవులమంద నర్సమ్మ, నక్కా కోటేశ్వరరావులు యర్రగొండపాలెం నుంచి యల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీను ఆటోలో బోయలపల్లెకు వెళుతున్నారు. మార్గం మధ్యలోని అన్నకుంట సమీపంలో యర్రగొండపాలెం వైపు వేగంగా వస్తున్న హోంగార్డు మల్లారెడ్డి ద్విచక్ర వాహనం బోయలపల్లె వైపు వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న మల్లారెడ్డి, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు, ఆటో డ్రైవర్ శ్రీనులు గాయపడ్డారు. ప్రమాదంలో హోంగార్డు మల్లారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఇతని కుడికాలి వేళ్లు తెగి పోయాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఆవులమంద నర్సమ్మ(వృద్ధురాలు) ఎడమచేయి గూడ తొలిగిపోయి, తీవ్రంగా గాయపడింది. ఆటోడ్రైవర్ శ్రీను కుడికాలు విరిగి, తీవ్రంగా గాయపడ్డాడు. పిన్నిక వెంకటేశ్వర్లుకు తలకు, రెండు మోకాళ్లకు, ఎడమ చేయి మణికట్టుకు గాయాలయ్యాయి. పిన్నిక శివమ్మకు కుడి మోకాలు, ఎడమకాలు పాదానికి గాయాలయ్యాయి. నక్కా కోటేశ్వరరావుకు మోకా ళ్లకు, తలకు స్వల్పగాయాలయ్యాయి. సమీపంలోని కొందరు గాయపడిన వారిని ఆటోలో స్థానిక ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన హోంగార్డు మల్లారెడ్డి, ఆటో డ్రైవ ర్ శ్రీనులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట వైద్యశాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఆవులమంద నర్సమ్మను వినుకొండ వైద్యశాలకు తరలించారు. పిన్నిక వెంకటేశ్వర్లు, శివమ్మలు స్థానిక వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, స్వల్పంగా గాయపడిన కోటేశ్వరరావు ప్రాథమిక చికిత్స అనంతరం స్వగ్రామం బోయలపల్లెకు వెళ్లాడు. ఎస్సై ఎం.దేవకుమార్ ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌కు ఆర్టీసీ డ్రైవర్ దారి వదలకుండా బస్సు నడపడంతో బైక్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో బైక్ వెనుక సీటులో కూర్చున్న తల్లీబిడ్డలు బస్సు వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బైక్ నడుపున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం మదనపల్లె మండలం బొమ్మనచెరువులో చోటుచేసుకుంది. చిత్తూరు, మదనపల్లె టౌన్: రూరల్ పోలీసులు, స్థానికులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం.. రామసముద్రం మండలం గుంతలపేటకు చెందిన నారాయణస్వామి (37) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. రామసముద్రంలోని చెంబకూరు రోడ్డులో ఓ అద్దె ఇంటిలో నివసిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య శివమ్మ, పిల్లలు ప్రసన్న, బాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంతపనిపై మోటార్ సైకిల్లో మదనపల్లెకు భార్య, కుమారుడిని వెంట తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలోని బొమ్మనచెరువు వద్ద మదనపల్లె నుంచి రామసముద్రం వైపు వస్తున్న మదనపల్లె–2 డిపో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బైక్ నుంచి అదుపు తప్పి తల్లీబిడ్డలిద్దరూ బస్సు వెనుక చక్రాల కింద పడ్డారు. ఈ దుర్ఘటనలో బస్సు టైర్లు శివమ్మ, బాబు మీదుగా వెళ్లడంతో ఇద్దరూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న నారాయణస్వామిని 108 సిబ్బంది గోపి, అమర హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలికి రూరల్ సీఐ రమేష్, ఎస్ఐ దిలీప్ చేరుకుని పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందని నిర్ధారించుకున్నారు. పంచనామా అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిన్నంటిన బంధువుల రోదన ఆర్టీసీ బస్సు ఢీకొని మదనపల్లె సమీపంలో కోడలు శివమ్మ, మనవడు బాబు చనిపోయారని సమాచారం అందుకున్న హనుమన్న వారి కుటుంబ సభ్యులు ఉరుకులు పరుగులతో బొమ్మనచెరువుకు చేరుకున్నారు. మృతులను చూసి గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. అక్కడికి వచ్చిన ఆర్టిసీ అధికారులపై స్థానికులు, మృతుల బంధువులు గొడవకు దిగారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇద్దరి ప్రాణాలు పోయాయని మండిపడ్డారు. -
స్నేహితురాలిని పరామర్శించేందుకు వెళ్తూ..
కర్నూలు ,మహానంది: స్నేహితురాలి తండ్రి మృతి చెందాడన్న విషయం తెలుసుకుని ఆమెను పరామర్శించేందుకు అక్కా చెల్లెళ్లు స్కూటీపై బయలుదేరారు. అయితే.. వీరిని కూడా విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదంలో చెల్లెలు మృతి చెందగా.. అక్కకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మహానంది మండలం బోయిలకుంట్ల మెట్ట వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన అస్మా, రూబీన్(23) అక్కాచెల్లెళ్లు. వీరికి గాజులపల్లెలో అలియా అనే స్నేహితురాలు ఉంది. అలియా తండ్రి పఠాన్‌రఫి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో స్నేహితురాలిని పరామర్శించేందుకు అక్కాచెల్లెళ్లు మంగళవారం స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురుగా ఇద్దరు యువకులు బైక్‌పై వస్తూ వారి స్కూటీని ఢీకొట్టారు. దీంతో అక్కాచెల్లెళ్లిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ప్రైవేటు ఉద్యోగి ప్రసాద్ వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. మహానంది ఎస్ఐ తులసీనాగప్రసాద్ కూడా వెంటనే అక్కడికి చేరుకోవడం, రోడ్‌సేఫ్టీ పోలీసుల వాహనం సైతం రావడంతో ఇద్దరినీ రెండు వాహనాల్లో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రూబీన్ మృతిచెందింది. అస్మా పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రూబీన్ భర్త షేక్ షహీన్‌బాష నంద్యాల కూరగాయల మార్కెట్లో కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు. ఆ చిన్నారికి తల్లి దూరం కావడం ఆ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. భార్య మృతదేహం వద్ద షహీన్ బాష రాత్రి వరకు అక్కడే కూర్చుని రోదిస్తున్న తీరు చూపరులకు సైతం కంటతడి పెట్టించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్ఐ తులసీనాగప్రసాద్ తెలిపారు. -
చంద్రబాబు నివాసం సమీపంలో ఘోర ప్రమాదం
-
చంద్రబాబు నివాసం సమీపంలో ఘోర ప్రమాదం
సాక్షి, అమరావతి: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సీఎం ఇంటి సమీపంలోని కరకట్టపై బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఎదురెదురుగా వేగంగా వస్తున్న వాహనాలు రెండూ బలంగా ఢీకొట్టుకోవడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి బొలెరోపై పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్‌పై ఉన్న వ్యక్తి వాహనానికి బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనంలో ఉన్నవారెవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
బైక్ అదుపుతప్పి యువతి దుర్మరణం
మాదాపూర్: బైక్ అదుపు తప్పి ఓ యువతి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పూణేకు చెందిన మిథాలిశర్మ (20)మాదాపూర్ లోని నిఫ్టులో 6వ సెమిస్టర్ చదువుతోంది. గురువారం ఉదయం ఆమె తన స్నేహితుడు రిక్టిమ్‌తో కలిసి బైక్‌పై బోరబండ నుంచి కళాశాలకు వెళుతుండగా వంద అడుగుల రోడ్డులో ముందు వెళ్తున్న ట్రక్కును తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరూ కింద పడ్డారు. ఈ ఘటనలో మిథాలీ శర్మకు తలకు తీవ్ర గాయాలు కావడంతో మాదాపూర్ మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రిక్టిమ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన టాటా సఫారీ
తూర్పుగోదావరి, మారేడుమిల్లి (రంపచోడవరం): మద్యం మత్తులో టాటా సఫారీ కారుతో వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న మోటరు సైకిళ్లను బలంగా ఢీకొట్టడంతో వాటిపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మారేడుమిల్లి సమీపంలోని రంపచోడవరం వెళ్లే ప్రధాన రహదారిలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని సున్నంపాడు గ్రామానికి చెందిన కంగల గంగరాజు దొర(62) అనే గిరిజనుడు సున్నంపాడులోని తన ఇంటి వద్ద నుంచి పని నిమిత్తం మోటార్ సైకిల్‌పై మారేడుమిల్లి వస్తుండగా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వెలగాల రామరెడ్డి అనే వ్యక్తి మద్యం సేవించి టాటా సఫారీ కారులో వెళుతూ మారేడుమిల్లి– రంపచోడవరం రహదారిలో స్థానిక టేక్ ప్లాటేషన్ దాటిన తరువాత మలుపులో ఎదురుగా వస్తున్న బైక్‌ను అతి వేగంతో బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న గంగరాజు ఎగిరి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడి, అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంలో మృతి చెందిన గంగరాజు మారేడుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తూ గతేడాది ఉద్యోగవిరమణ పొందాడు. పరారయ్యే ప్రయత్నంలో కారుతో బైక్‌ను ఢీకొట్టిన తరువాత నిందితుడు రామారెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ నేçపథ్యంలో సంఘటన స్థలం నుంచి కిలో మీటరు దూరం వెళ్లగానే చీకట్లో మలువు వద్ద కాకినాడ నుంచి ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరికి బొలెరో వాహనంలో వెళుతున్న వారిని ఢీకొట్టాడు. దీంతో నిందితుడి వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బొలెరో వాహనం వెనుక టైర్ విరిగిపోయింది. నిందితుడు మద్యం మత్తులో ఉండడాన్ని గమనించి, అతడిని వాహనదారులు పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి అప్పగించారు. నకిలీ సర్టీఫికెట్‌తో చలామణీ ... నిందితుడు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ పొంది గిరిజన గ్రామంలో చలామణీ అవుతున్నాడు. అమాయక గిరిజనులను మోసం చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతుండేవాడని, గతంలో డబ్బు వెదజల్లి పలు కేసులు నుంచి బయటకు çవచ్చాడని పలువురు అంటున్నారు. స్టేషన్ వద్ద బంధువులు ధర్నాప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన నిందితుడు రామారెడ్డిని పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, అతడు రాజభోగాలు అనుభవిస్తున్నారని మృతుడి బంధువులు, గ్రామ గిరిజనులు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఇంతలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పది నిమిషాల్లో అతడు బయటకు వచ్చేయడంతో ఆగ్రహించిన బంధువులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆందోళనను ఉధృతం చేశారు. నిందితుడు డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో పోలీసులు అతడిని కేసు నుంచి తప్పించడానికి చూస్తున్నారని బంధువులు వాపోయారు. చివరికి రాజకీయ నాయకులు సమక్షంలో మృతుడి కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం చేస్తామని ఎస్సై ఎ. రాజు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
దూసుకొచ్చిన మృత్యువు
శ్రీకాకుళం, రణస్థలం: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో అరబిందో పరిశ్రమ కార్మికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు సంబం ధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కనిమెల్ల గ్రామానికి చెందిన దుర్గాశి అప్పలనాయుడు(45) పైడి భీమవరంలోని అరబిందో పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో తాను పండించిన కూరగాయలను ద్విచక్ర వాహనంపై ఊరూరా అమ్ముతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కూరగాయలు పట్టుకుని రణస్థలం వైపు వస్తుండగా యునైటేడ్ బ్రూవరీస్ పరిశ్రమ సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో అప్పలనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న జె.ఆర్.పురం ఎస్ఐ బి.అశోక్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పలనాయుడుకు భార్య అప్పలరాములు, ముగ్గురు కుమార్తెలు ఉమ, ప్రియాంక, పవిత్ర ఉన్నారు. వీరిలో ఇద్దరికి వివాహాలు జరిగాయి. అప్పలనాయుడు మృతితో కనిమెల్లలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఫంక్షన్‌కు వెళ్తూ.. పరలోకానికి
తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): పట్టణంలోని కొత్తూరులో ఫంక్షన్ కోసం బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్థానిక వంతెన వద్ద రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం తుని మండలం ఎస్.నర్సాపురానికి చెందిన మల్లిపాము ప్రసాద్ (45) అతని బంధువు మంచాల గంగాధర్ బైక్‌పై వారి గ్రామం నుంచి సామర్లకోట వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన ప్రసాద్ తల్లి, వారి బంధువులు మాత్రం ఎస్.నర్సాపురం నుంచి సామర్లకోటకు రైలులో వచ్చి ఫంక్షన్‌కు నేరుగా వెళ్లిపోయారు. వీరిద్దరూ బైక్‌పై వస్తుండగా సామర్లకోట–పిఠాపురం రోడ్డులోని ఇరుకు వంతెన వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో వీరిద్దరూ కింద పడ్డారు. ప్రసాద్‌ను లారీ కొంతదూరం ఈడ్చుకుపోవడంతో వంతెనపై మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న గంగాధర్‌కు తీవ్రంగా గాయాలు కావడంతో అతడిని పోలీసులు 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఫంక్షన్ సందడిలో ఉన్న మృతుని బంధువులకు ఈ విషయం తెలియడంతో వారు బోరున విలపిస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమతో రైలులోనే రమ్మంటే బైక్‌పై వచ్చాడని, అతడి భార్య, బిడ్డలకు ఎవరూ తోడు ఉంటారని మృతుని తల్లి, బంధువుల రోదన స్థానికులను కదిలించింది. వంతెన ఇరుకుగా ఉన్నందునే ఇలా ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు విమర్శించారు. ఏఎస్సై రాజబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్సై వి.కిశోర్ ఈ కేసును దర్యాప్తు చేస్తు న్నారు. -
బైకును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
ప్రకాశం , హనుమాన్ జంక్షన్ కుంట (పెద్దారవీడు): బైకుపై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని తోకపల్లె పంచాయతీ హనుమాన్‌జంక్షన్ కుంట సిద్దార్థ హైస్కూల్ ఎదుట శనివారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..హనుమాన్‌జంక్షన్ కుంట నుంచి పొలిశెట్టి వెంకటేష్ తన బంధువైన శివకుమార్‌తో కలిసి ఎర్రగొండపాలేనికి మోటార్ సైకిల్‌పై వెళ్తున్నారు. తోకపల్లె పంచాయతీ హనుమాన్‌జంక్షన్ కుంట సిద్దార్థ హైస్కూల్ ఎదుట ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వెంకటేష్‌కు (18) బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కుర్చొన్న శివకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. రోడ్డు పక్కనే డీప్‌బోరు వేస్తుండగా దుమ్ము గాలికి పైకి లేవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదం జరిగింది. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. వెంకటేష్ స్నేహితుడు శివకుమార్ విజయవాడ నుంచి ఎర్రగొండపాలెం వస్తున్నాడు. కుంట వద్ద దిగాలని చెప్పడంతో శివకుమార్ అక్కడ దిగాడు. ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ రాజ్‌కుమార్ తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు, బంధవులు కన్నీరుమున్నీరయ్యారు. -
మృతదేహాలతోపాటు, బైక్‌ను నాలుగు కిలోమీటర్లు..
వారి తీయని స్నేహంలో విధి విషం చిమ్మింది.. కన్నవారి ఆశలను తుంచేస్తూ మృత్యుదేవత వారి ప్రాణాలను హరించేసింది.. లారీ డ్రైవర్ మద్యం మత్తు వారి కలల్ని ఈడ్చుకుపోయింది.. ముక్కచెక్కలైన వారి దేహాలను చూసి చూపరులకు సైతం మనసు వికలమైపోయింది. అత్యంత దారుణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు నూనూగు మీసాల యువకులు మృత్యువాత పడడమే ఒక ఘోరం కాగా.. వారు ప్రమాదానికి గురైన తీరు మరింత బాధాకరంగా మిగిలింది. ఒకే గ్రామం.. ఒకే వీధికి చెందిన కుప్పిన కార్తీక్ (17), రాయి నవీన్ (17), కోరిబిల్లి దుర్గాప్రసాద్ (17)ల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పి.ధర్మవరం గ్రామానికి చెందిన వీరు అడ్డురోడ్డులో ఆదర్శ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం వీరు బైక్‌పై యలమంచిలి వెళ్లేందుకు ధర్మవరం జంక్షన్లో రోడ్డు దాటుతుండగా తుని నుంచి యలమంచిలి వైపు వెళ్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో జోగుతున్న డ్రైవర్ కనీసం ప్రమాదం జరిగిందన్న విషయాన్ని సైతం గుర్తించలేకపోయాడు. ఈ ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. కిలోమీటరు దూరం వెళ్లాక నవీన్ మృతదేహం లారీని వీడి కింద పడిపోయింది. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని బైక్‌తోపాటు లారీ నాలుగు కిలోమీటర్ల దూరం పోతిరెడ్డిపాలెం జంక్షన్ వరకు ఈడ్చుకుపోయింది. ఈ విషయం గమనించిన జాతీయ రహదారి సిబ్బంది తమ వాహనంలో లారీని వెంబడించి అడ్డుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్, ఎస్.రాయవరం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు డ్రైవరు ఎస్.కె.బాషాను పోలీసులకు అప్పగించారు. ఛిద్రమైన మృతదేహాలను చూసిపిల్లల తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తీరని గర్భశోకం వారి గుండెలను పిండేసింది. ఎస్.రాయవరం/యలమంచిలి/నక్కపల్లి/: మరణం వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. వారి మధ్య బంధం చూసి విధికి సైతం కన్నుకుట్టింది. పి.ధర్మవరం జంక్షన్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణస్నేహితులను బలిగొంది. విధి ఎంత వికృతమైందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతోంది. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు. కలిసి చదువుకున్నారు. ఆటపాటల్లో కూడా కలిసే పాల్గొనే వారు. చిన్నతనం నుంచి మరణించేవరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. చివరకు తుది శ్వాస కూడా కలిసే వదిలేశారు. విషాదమేమిటంటే ముగ్గురూ వారి ఇంటిలో ఆఖరి సంతానమే. సాయంత్రం వరకు తల్లికి చెప్పలేదు.. ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైన కుప్పిన కార్తీక్‌ది యలమంచిలి మండలం ఏటికొప్పాక. 40 ఏళ్ల క్రితం వీరి కుటుంబం పి.ధర్మవరానికి పొట్టకూటి కోసం వలస వచ్చింది. తల్లిదండ్రులు బాబూరావు, అప్పలనర్స. వీరికి ముగ్గురు సంతానం. పెద్దకొడుకులు కూలిపనులు చేస్తూ తమ్ముడ్ని చదివిస్తున్నారు. తండ్రి కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. నాలుగేళ్లక్రితం అనా రోగ్యంతో మరణించాడు. తల్లి ప్రస్తుతం అనా రోగ్యంతో బాధపడుతోంది. మందుల కోసం మంగళవారం ఆమె అనకాపల్లి వెళ్లింది. రోడ్డుప్రమాదంలో చిన్నకొడుకు మరణించిన విషయం ఆమెకు సాయంత్రం వరకు చెప్పలేదు. ఆమె షాక్‌కు గురైతే ఏం జరుగుతుందోనన్న భయంతో సాయంత్రం వరకు దాచివుంచారు. చివరకు సాయంత్రం చిన్నకొడుకు మరణ వార్త చేరవేయడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చనిపోయిన వారిలో కొడుకు ఉన్నాడని తెలీదు... పి.ధర్మవరం జంక్షన్లో లారీ ఢీకొని ముగ్గురు చనిపోయారని తెలుసుకున్న గ్రామస్తులంతా ఘటనాస్థలం వద్దకు పరుగులు తీశారు. వారితో పాటు మరో మృతుడు రాయి నవీన్ తల్లి రోహిణి కూడా ఉంది. అందరూ వెళ్తుంటే తాను కూడా చూసొద్దామని వెళ్లింది. కాని అక్కడ జరిగిన ఘటన తనకు కడుపుకోత మిగులుస్తుందని ఊహించలేదు. చనిపోయిన వారిలో తన కొడుకు ఉన్నాడని తెలిసి ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇదే ప్రమాదంలో మరణించిన కార్తీక్నకు నవీన్ మేనమామ కొడుకు. వీరి స్వస్థలం నక్కపల్లి మండలం పాటిమీద గ్రామం. 20 ఏళ్లక్రితం పి.ధర్మవరం వలస వచ్చారు. తండ్రి పశువుల వ్యాపారం చేస్తుంటాడు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు వ్యవసాయ పనులు చేస్తుంటాడు. చిన్నకొడుకును చదివిస్తున్నారు. తండ్రి రమణ వ్యక్తిగత పనులపై తుని వెళ్లినట్లు తెలిసింది. కొడుకు మృతదేహాన్ని లారీ ఈడ్చుకుపోయిందన్న విషయం తెలిసి కన్నతల్లి రోడ్డుపై వెతుక్కుంటూ వెళ్లడం స్థానికులను కలిచి వేసింది. చిన్నకొడుకు కావడంతో చదువుకుంటానంటే ఎంతో ఆప్యాయంగా చదివిస్తున్నామని.. ప్రయోజకుడవుతాడనుకుంటే భగవంతుడు తీసుకుపోయాడంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ... తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న కోరిబిల్లి దుర్గాప్రసాద్ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పి.ధర్మవరానికి చెందిన కోరిబిల్లి నాగేశ్వరరావు స్థానికంగానే బార్బర్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దుర్గాప్రసాద్ కూడా తీరిక సమయాల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ కులవృత్తి నేర్చుకుంటున్నాడు. నాగేశ్వరరావుకు ముగ్గురు సంతానం. మృతుడు మూడో కుమారుడు. కులవృత్తి నేర్చుకోరా నాన్నా.. అంటే చదువుకుంటాను, పెద్ద ఉద్యోగాలు చేస్తాను అనే వాడని.. తాము ఎలాగూ ఇదే వృత్తిలో ఉన్నాం... కనీసం వాడయినా చదువుకుంటానంటే చదివించడం మంచిది కదా అని చదివిస్తున్నానని.. విధి తమ కుటుంబానికి అన్యాయం చేస్తుందని ఊహించలేదని నాగేశ్వరరావు కుటుంబం బోరున విలపిస్తోంది. ఆటపాటలు, చదువు సంధ్యల్లో కలిసి మెలిసే.. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరు ముగ్గురూ ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకు ఒకే పాఠశాలలో, ఒకే కళాశాలలో చదివారు. ఆటల్లో పాల్గొన్నా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా ముగ్గురూ కలిసే చేసేవారు. పి.ధర్మవరంలో ఒకేధిలో నివసిస్తున్న వీరి మరణ వార్త తెలిసిన గ్రామస్తులంతా జాతీయ రహదారిపై ధర్మవరం జంక్షన్ వద్దకు చేరుకున్నారు. వీరి మృతదేహాలను చూసి కంటతడిపెట్టారు. వీరి స్నేహాన్ని చూసి మాకే కళ్లుకుట్టేవని... అంత ప్రాణప్రదంగా ఉండేవారని చుట్టు పక్కల వారు పేర్కొన్నారు. విధి కూడా వీరి స్నేహాన్ని చూసి ఓర్వలేకపోయిందని, ముగ్గురినీ ఒకేసారి పొట్టనపెట్టుకుందని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన అందరినీ ఆవేదనకు గురి చేసింది. కన్నీరు మున్నీరైన ధర్మవరం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ధర్మవరం కన్నీరుమున్నీరయింది. ఇదే గ్రామానికి చెంది న ముగ్గురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిన గ్రామస్తులంతా వందలాదిగా ఘటనాస్థలానికి చేరుకున్నారు.ఈ ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మరణించగా నవీన్, దుర్గాప్రసాద్‌ల మృతదేహాలతోపాటు, బైక్‌ను లారీ నాలుగు కిలోమీటర్ల దూరం ఈడ్చుకపోయింది. ఈ ఘటన స్థానికులను గగుర్పాటుకు గురిచేసింది. -
మృత్యువులోనూ ఒకరికొకరు తోడుగా..
తూర్పుగోదావరి , తుని రూరల్: వారికి పెళ్లై తొమ్మిది నెలలైంది. భార్య రెండు నెలల గర్భవతి. ఆనందంగా కాలం గడుపుతున్న ఆ కొత్తజంట మృత్యువు లోనూ ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు. రూరల్ ఎస్సై కె. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన భీముని మల్లేశ్వరరావు (35), సుజాత (25) దంపతులు. భీమేశ్వరరావు రాజ మహేంద్రవరంలో ఒకరి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అస్వస్థతకు గురైన మల్లేశ్వరరావు యజమానిని సెలవు అడిగేందుకు మోటారు సైకిల్‌పై భార్యతో కలసి రాజమహేంద్ర వరం వచ్చాడు. వారు ఆదివారం స్వగ్రామం తిరిగి వెళుతుండగా తుని మండలం చేపూరు గ్రామ సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ అదుపు తప్పి సెంటర్ డివైడర్‌ను ఢీకొంది. దాంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో సుజాత అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరరావును తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వారి బంధువులకు సమాచారం ఇచ్చి, కేసు నమోదు చేశామని, సోమవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారని ఎస్సై సుధాకర్ తెలిపారు. సెలవు పెట్టేందుకు వెళ్లి.. అనారోగ్యంతో ఉన్న మల్లేశ్వరరావు సెలవు పెట్టేందుకు వెళ్లివస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోయాడని ఆయన సోదరుడు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా అనారోగ్యంతో ఇంటివద్దే ఉన్నాడని, శనివారం భార్య సుజాతతో కలసి రాజమహేంద్రవరం వెళ్లాడని అన్నారు. తిరిగి వస్తుండగా మృత్యువు కబళించిందని బోరున విలపించాడు. నా కూతుర్ని బస్సెక్కించమన్నా తన అల్లుడు, కూతురు రాజమహేంద్రవరం సంతోషంగా వెళ్లారని, తిరుగు ప్రయాణంలో తన కూతుర్ని బస్సెక్కించమన్నా వినలేదని సుజాత తండ్రి ఉప్పులూరి భాస్కరరావు ఆస్పత్రి వద్ద వాపోయాడు. 2018 మే నెలలో వివాహం చేశానన్నాడు. సుజాత రెండునెలల గర్భవతి కావడంతో బైక్‌పై వద్దని చెప్పానన్నారు. భాస్కరరావు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. -
ప్రాణం తీసిన మలుపు
జియ్యమ్మవలస మండలంలోని గవరమ్మపేట, చింతలబెలగాం మధ్యనున్న ప్రమాదకర మలుపు వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేశారు. రెండు గంటల పాటు వేచిచూసినా వాహనం రాకపోవడంతో స్థానికుల కళ్లముందే దివంగత మాజీ ఎమ్మెల్యే మరిశర్ల వెంకటరామినాయుడు కుమారుడు మరిశర్ల వెంకటఅప్పల సూర్యప్రకాశరావు నాయుడుప్రాణం విడిచారు. విజయనగరం, జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట, చింతలబెలగాం మధ్యనున్న ప్రమాదకర మలుపు వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలం లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మలుపు వద్ద ఏమరుపాటుగా ఉండడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. చినమేరంగి ఎస్సై పొదిలాపు నారాయణరావు అం దించిన వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లి మండలం రావివలస గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే మరిశర్ల వెంకటరామినాయుడు కుమారుడు మరిశర్ల వెంకటఅప్పల సూర్యప్రకాశరావు నాయుడుతో పాటు లఖనాపు రం గ్రామానికి చెందిన శివ్వాల పకీరునాయుడు మాజీ మంత్రిని కలిసేందుకు పార్వతీపురం నుంచి కురుపాం బయలుదేరారు. సరిగ్గా గవరమ్మపేట – చింతలబెలగాం గ్రామాల మధ్య ఉన్న మలుపు వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే చెట్టును ఢీకొనడంతో వెంకట సూర్యప్రకాశరావునాయుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పకీరునాయుడుకు కాలు విరిగిపోయింది. 108కు ఫోన్ చేసిన ఎమ్మెల్సీ ప్రమాదవార్త తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరాజు, స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అప్పటికి ప్రాణాలతో ఉన్న సూర్యప్రకాశరావును ఆస్పత్రికి తరలించేందుకు ఎమ్మెల్సీ శత్రుచర్ల, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరాజు 108కు ఫోన్ చేయగా... సుమారు రెండు గంటల వరకు రాలేదు. ఈలోగా చినమేరంగి సీహెచ్‌సీకి డాక్టర్ కమలకుమారికి ఫోన్ చేయగా, ఆమె వచ్చి పరీక్షించారు. అయితే అప్పటికే సూర్యప్రకాశరావు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన పకీరునాయుడును ఆస్పత్రికి తరలించారు. 108 సకాలంలో వచ్చి ఉంటే సూర్యప్రకాశరావు బతికి ఉండేవాడని పలువురు తెలిపారు. మిన్నంటిన రోదనలు జియ్యమ్మవలస/గరుగుబిల్లి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరిశర్ల వెంకట ప్రకాశరావునాయుడు దివంగత మాజీ ఎమ్మెల్యే వెంకటరామినాయుడు మూడో కుమారుడు. ఇతడికి భార్య కమలతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇందులో ఒక అమ్మాయికి వివాహం జరిగింది. ఇంటి పెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మృతి పట్ల మాజీ సర్పంచ్ సింహాచలంనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శివున్నాయుడు, మాజీ ఎంపీపీ కోట జోగినాయుడు, గౌరమ్మలు, మాజీ సర్పంచ్ బలరాంనాయుడు, డీసీసీబీ చైర్మన్ మరిశర్ల తులసి సంతాపం తెలిపారు. సూర్యప్రకాశరావు మృతదేహానికి పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేపట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
దైవదర్శనానికి వెళ్తూ యువకుడి మృతి
విజయనగరం, చీపురుపల్లి: దైవ దర్శనానికి వెళ్తున్న వ్యక్తిపై విధికి కన్నుకుట్టింది. మరికొద్ది గంటల్లో విజయవాడ చేరుకుంటాడనున్న సమయంలో రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దుర్గమ్మ సన్నిధికి వెళ్లిన తన భర్త ప్రసాదంతో వస్తాడనుకున్న భార్యకు రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడన్న విషయం తెలిసి తల్లడిల్లిపోయింది. కుటుంబ యజమాని మృతితో భార్య, ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. వివరాల్లోకి వెళితే...ఆదివారం తెల్లవారుఝామున పిఠాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని రిక్షా కాలనీకు చెందిన చీమకుర్తి సంతోష్ (33) అనే యువకుడి మృతి చెందాడు. సంతోష్ స్థానికంగా టాటా మ్యాజిక్ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. మిత్రులతో కలిసి విజయవాడలోని అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం మధ్యాహ్నం చీపురుపల్లి నుంచి బయిలుదేరాడు. చీపురుపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు ట్రైన్లో బయలుదేరిన సంతోష్, అతని మిత్రులు విశాఖపట్టణానికి చేరుకుని రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం నుంచి విజయవాడ వెళ్లే వోల్వో బస్సును ఆశ్రయించారు. వాస్తవానికి విశాఖపట్టణం నుంచి విజయవాడకు రైలులో వెళ్లాల్సి ఉన్నప్పటికీ సంతోష్ అప్పటికే పరిచయం ఉన్న వోల్వో బస్సు డ్రైవర్‌తో మాట్లాడి అందులో వెళ్లారు. సంతోష్ వోల్వో బస్సు డ్రైవర్ సీటు పక్కన కూర్చున్నాడు. ఆదివారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపంలో ముందు వెళ్తున్న లారీని తప్పించేక్రమంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో లారీ వెనుకభాగం బస్సుకు తగిలింది. దీంతో బస్సు ముందు అద్దాల్లోంచి సంతోష్ రోడ్డుపై పడిపోవడంతో ఆయనమీద నుంచి బస్సు వెళ్లిపోయింది. దీంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనాథలైన భార్యాపిల్లలు.... రిక్షాకాలనీకు చెందిన సంతోష్‌కు భార్య రామలక్ష్మితో పాటు హర్ష (6), భాగ్యలక్ష్మి (3) ఉన్నారు. కుమారుడు హర్ష ఒకటో తరగతి చదువుతున్నాడు. దైవ దర్శనానికి వెళ్లి వస్తాడనుకున్న సంతోష్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
మోటార్ సైకిల్‌ను ఢీకొన్న ట్రాక్టర్
విజయనగరం, తెర్లాం: ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన మల్లేడ మంగ (22) ఆమె భర్త రమేష్ తెర్లాం నుంచి సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సరిగ్గా సూరీడు తోట దాటిన తర్వాత ఉన్న మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న మంగ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న తెర్లాం ఎస్సై ఎ.నరేష్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రమేష్‌ను వెంటనే రాజాం ఆస్పత్రికి తరలించారు. మంగ మృతదేహానికి కుటుంబ సభ్యుల సమక్షంలో శవపంచనామ చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఏడాదిన్నర కిందట వివాహం కునాయవలసకు చెందిన మల్లేడ రమేష్‌కు మంగతో ఏడాదిన్నర కిందట వివాహం కాగా వీరికి ఆరు నెలల పాప ఉంది. మంగకు అనారోగ్యంగా ఉండడంతో తెర్లాంలోని ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంగ మృతితో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ అదుపు తప్పి ఇద్దరు మృతి
ఆదిలాబాద్‌రూరల్: కార్యాలయ విధులు ముగించుకొని ఇంటికి వస్తున్నామని చెప్పిన యువకులు బైక్ అదుపు తప్పి దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై హరిబాబు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. బేల మండలకేంద్రానికి చెందిన జిలిపెల్లివార్ శుభం (25), అదే మండలం మనీయర్‌పూర్‌కి చెందిన తన మిత్రుడు మునేశ్వర్ దినేశ్ (27)తో కలిసి మంగళవారం శుభం ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్‌కు వచ్చారు. ఇద్దరు మిషన్ భగీరథలో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో భగీరథపై జరిగిన సమావేశం ముగించుకొని బేలకు వస్తుండగా చాందా (టి) శివారు ప్రాంతంలోని వంతెన వద్ద బైక్ అదుపు తప్పి వంతెన కింద పడిపోయారని తెలుస్తోంది. ఇద్దరి తలకు తీవ్రగాయాలుకావడంతో అక్కడిక్కడే మృతిచెందారు. బుధవారం అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులకు మృతదేహాలు కనిపించడంతో ఆరా తీయగా బేల మండల యువకులుగా గుర్తించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. శుభం తండ్రి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా ఇద్దరు యువకుల తల్లులు అంగన్వాడీ టీచర్లుగా పని చేస్తున్నారు. యువకుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే రామన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
రామవరప్పాడు (గన్నవరం): ఇయర్ ఫోన్స్‌లో సహోద్యోగితో మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన నిడమానూరు ఫ్లై ఓవర్‌పై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. సింగ్‌నగర్, వాంబే కాలనీకి చెందిన కాటూరి లక్ష్మి (22), జాక్సన్ భార్యభర్తలు. లక్ష్మి తండ్రి ఆటో డ్రైవర్ కాగా అతనికి ముగ్గురు కుమారైలు. గన్నవరంలోని హిందూస్తాన్ ప్రయివేట్ లిమిటెడ్‌లో లక్ష్మి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. నిత్యం వాంబేకాలనీ నుంచి గన్నవరానికి తన యాక్టివా స్కూటీపై రాకపోకలు సాగిస్తూ విధులకు హాజరవుతుంది. రోజు మాదిరిగానే విధులు పూర్తి చేసుకుని సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటికి బయలు దేరింది. నిడమానూరు ఫ్లై ఓవర్ వద్దకు వచ్చేసరికి గుర్తుతెలియని భారీ వాహనం ఢీ కొనడంతో వెనక చక్రాల కింద పడిపోయింది. వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తల నుజ్జు నుజ్జు అవ్వడంతో లక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. కాగా, ఆమెకు రెండేళ్ల క్రితం జాక్సన్‌తో వివాహం కాగా, ఆరు నెలల నుంచి భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారు. బోరున విలపించిన తల్లిదండ్రులు.. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అదే సమయంలో లక్ష్మి సహోద్యోగి అక్కడే ఉండటంతో ఇయర్ ఫోన్స్‌లో నీతోనే మాట్లాడుతూ ఈ ప్రమాదం కొని తెచ్చుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో లక్ష్మి కాపురంలో నిప్పులు పోశావని, ఇప్పుడు ఆమె చావుకు కూడా కారణమయ్యావని ఆరోపించారు. సమాచారం అందుకున్న పటమట ఎస్సై సుధాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ ఎస్సై పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ.. డ్రైవింగ్‌లో జాగ్రత్త గురూ..
తూర్పుగోదావరి,మండపేట :అప్రమత్తంగా లేకపోతే అన్నీ అనర్థాలే.. అన్నీ అపాయాలే.. దీనికి నిదర్శనమే ఈ చిత్రాలు..రాజమహేంద్రవరం నుంచి రామచంద్రపురం వైపు వెళుతున్న ఇండికా వాహనం మంగళవారం స్థానిక పెద కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి ముందుకు వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని గమనిస్తున్న మోటారు సైక్లిస్ట్ చూసుకోకుండా ముందు మోటారు సైకిల్‌పై వెళుతున్న వారిని ఢీకొట్టడంతో ఇదిగో వారు ఇలా కింద పడిపోయారు. అదృష్టవశాత్తు ఆయా ప్రమాదాల్లో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
బావను సాగనంపేందుకు వెళుతూ...
తన చిన్న తనంలోనే తండ్రి తనువు చాలించాడు. తనతో పాటు సోదరి, సోదరుడి భారమంతా తల్లిపై పడింది. కడు పేదరికం, అందులో కట్టుకున్నవాడు అర్ధంతరంగా కన్నుమూసినా మొక్కవోని ధైర్యంతో ఆ తల్లి ఉన్నంతలో కుటుంబాన్ని మోసుకొస్తుంది. తల్లి కష్టాలను చూడలేక మగ పిల్లలిద్దరూ పేపర్‌బాయ్‌లుగా పని చేస్తూ, చదువుకోవడం ఆరంభించారు. ఈ సమయంలో సోదరి భర్తను సాగనంపేందుకు వెళుతున్న చిన్న కుమారుడిని లారీ రూపంలో మృత్యువు కబలించింది. తల్లితో పాటు సోదరి, సోదరుడిని కన్నీటి సంద్రంలో ముంచేసింది. శ్రీకాకుళం, మందస: నర్సింగ మహరణ, శోభావతి మహరణ దంపతులు వలస వచ్చి మందస పట్టణంలోని ఆర్టిజన్కాలనీలో జీవనం సాగిస్తున్నారు. వీరికి సోమేశ్వరరావు మహరణ, రంజిత్‌కుమార్ మహరణ, మాధురి మహరణ అనే పిల్లలు కలిగారు. వీరంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నర్సింగ మహరణ హటాత్తుగా మరణించాడు. దీంతో పిల్లల భారం తల్లిపై పడింది. అప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్న శోభావతి ఎంతో భారంగా పిల్లలను పెంచిపోషిస్తోంది. అయితే, తల్లి కష్టాలను చూడలేక మగ పిల్లలిద్దరూ పేపర్‌బాయ్‌లుగా పని చేస్తూ, చదువుకోవడం ఆరంభించారు. చిన్నవాడైన రంజిత్‌కుమార్ ‘సాక్షి’ పేపర్‌బాయ్‌గా పనిచేస్తూ, మందస బస్టాండ్‌లోని పలు షాపుల్లో పనిచేస్తూ, కాశీబుగ్గలోని ఎస్బీఎస్వైఎం కళాశాలల్లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం హెచ్ఈపీ చదువుతున్నాడు. సోదరి పెళ్లీడుకు రావడంతో సోదరులిద్దరూ ఎంతో కష్టపడి పెళ్లి చేసి, తండ్రిలేని లోటును తీర్చారు. ఈ తరుణంలో ఒడిశాకు చెందిన సోదరి భర్త నరేంద్ర మహరణను సాగనంపడానికి సోమవారం ద్విచక్రవాహనంపై ఒడిశా వెళ్తుండగా ఇచ్ఛాపురం మండలం, బలరాంపురం గ్రామం సమీపంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రిప్పర్ హటాత్తుగా పక్కకు తిప్పడంతో నరేంద్ర, రంజిత్లిద్దరూ ట్రిప్పర్ వెనుక భాగాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రంజిత్‌కుమార్ అక్కడికక్కడే మరణించగా, నరేంద్ర తీవ్ర గాయాలకు గురికాగా, నడుము విరిగిపోయింది. ప్రస్తుత కాలంలో కాలేజిలో చదువుకునే విద్యార్థులు తమ సొంత పనులు చేసుకోవడానికే సిగ్గు పడుతున్న తరుణంలో కుటుంబం కష్టాలు... తాను చదువుకోవడానికి రాత్రనక, పగలన కష్టపడుతున్న రంజిత్‌కుమార్ హఠాన్మరణం అందర్నీ కలచివేసింది. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసే రంజిత్ మరణించాడా... అంటూ ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యాంతమవుతున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేంద్రకు స్పృహ రావడంతో రంజిత్ ఎక్కడున్నాడని ప్రశ్నిస్తుండగా, ఆయనికి ఏమి చెప్పాలో తెలియని పరిస్థితిలో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చిన్న వయస్సులోనే కుటుంబానికి ఆధారంగా మారిన రంజిత్ మరణంతో తల్లి శోభావతి, సోదరుడు సోమేశ్వరరావు, సోదరి మాధురిలు రోదిస్తున్నారు. వారిని ఆపడం ఎవరి తరమూకాలేదు. సోమవారం సాయంత్రం రంజిత్ మృతదేహాన్ని మందస తీసుకువచ్చి బంధువులు, స్నేహితులు, స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, రంజిత్ ఇటీవల జాబ్‌మేళాలో కాంట్రాక్ట్ పద్ధతిలో రైల్వేశాఖలో పని చేయడానికి ఎంపికయ్యాడు. రూ.15 వేలు జీతంపై విశాఖలో ఉద్యోగం చేసేందుకు బుధవారం వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో విధి వక్రీకరించి అందని లోకాలకు వెళ్లిపోయాడు. సంఘటన జరిగిన తీరు ఇది శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: రాంగ్ రూట్లో వస్తున్న ట్రిప్పర్ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో విద్యార్థి మృతి చెందగా, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఒడిశా రాష్ట్రం బరంపురంనకు చెందిన నరేంద్ర మహరణ సంక్రాంతి పండగ సందర్భంగా ఇటీవల భార్య మాధురితో కలిసి మందసలోని అత్తవారింటికి వెళ్లాడు. సంక్రాంతికి అక్కడే గడిపి సోమవారం బావమర్థి రంజిత్ కుమార్ మహరణ(18)తో కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామం బరంపురంనకు బయల్దేరాడు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఇచ్ఛాపురం మండలం దరి) బలరాంపురం వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించేందుకు డ్రైవింగ్ చేస్తున్న నరేంద్ర మహారణ కుడివైపునకు తన ద్విచక్రవాహనం తిప్పాడు. అయితే అప్పటికే రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు కనస్ట్రక్షన్‌కు చెందిన ట్రిప్పర్ అదే సమయంలో అదే పెట్రోల్ బంకువైపు తిరగడంతో ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నరేంద్ర హల్మెంట్ ధరించడంతో గాయాలుపాలవ్వగా, వెనుక కూర్చున్న బావమర్థి రంజిత్ ఎగిరి కింద పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రంజిత్ కుమార్ మృతి చెందాడు. గాయాలపాలైన నరేంద్రను మెరుగైన చికిత్స కోసం బరంపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పలాసలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్టు అతడి సోదరుడు సోమేష్ తెలిపాడు. భర్త మృతి చెందడంతో ఇద్దరు కుమారులే దిక్కుగా బతుకుతుండగా చిన్న కుమారుడు తనకు గర్భశోకాన్ని మిగిల్చాడని తల్లి శోభావతి ఆసుపత్రి వద్ద విలపించింది. ఇదిలావుండగా ట్రిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం డ్రైవర్ జరడా పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. జరడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
నార్కట్‌పల్లి(నకిరేకల్): రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్ర ంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం శివారులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన స్రవంతి(25), హైదరాబాద్‌కు చెందిన రమ్య, నాగజ్యోతి ఇక్కడి కామినేని వైద్యకళాశాలలో హౌస్ సర్జన్ విద్య అభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నారు. ఆదివారం కావడంతో ఉదయం టిఫిన్ చేసేందుకు ముగ్గురు కలిసి హాస్టల్ నుంచి స్కూ టీపై సమీపంలోనే ఉన్న ఏపీ లింగోటం గ్రామాని కి వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత స్కూటీపై సూర్యాపేట వైపు బయలుదేరారు. మరో కిలోమీటర్ దూరంలో యూటర్న్ తీసుకుని హాస్టల్‌కు వచ్చేందుకు ప్రయాణిస్తున్నా రు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న గుర్తుతెలి యని వాహనం వీరి స్కూటీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో స్రవంతి డివైడర్‌పై పడింది. స్రవంతి తలకు బలమైన గాయం తగిలింది. స్థానికులు గమనించి వెంటనే 108లో కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి స్రవంతి మృతిచెందింది. నాగజ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబా ద్‌కు తరలించారు. రమ్య ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఇచ్చోడలో విషాదచాయలు.. ఇచ్చోడ(బోథ్): ఇచ్చోడ టీచర్స్ కాలనీకి చెందిన సామన్‌పల్లి సుదర్శన్ రెండో కుమార్తె స్రవంతి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. స్రవం తి చిన్నప్పటి నుంచే చదువులలో చురుకుగా ఉం డేది. కూతురును డాక్టర్ చేయాలని సుదర్శన్ కష్టపడి చదివించాడు. రెండు నెలలో చదువు పూర్తి చేసుకునే లోపే మృతిచెందడం అందరినీ కలచివేసింది. స్రవంతి మృతితో టీచర్స్‌కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. -
బైక్‌ను ఢీకొన్న లారీ
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : బైక్‌ను లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలైన సంఘటన నెలమంగల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడిని మాదావర గ్రామానికి చెందిన దర్శన్ (20)గా, క్షతగాత్రుడని అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ (19)గా గుర్తించారు. ఇద్దరూ గురువారం ఉదయం బైక్‌పై జిమ్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా 4వ జాతీయ రహదారి మార్గంలోని మాదావర సమీపంలో లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దర్శన్ ఘటనాస్థలంలోనే మృతి చెందగా ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని బెంగళూరు నిమాన్స్‌కు తరలించారు. సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీతో పాటు పరారయ్యాడు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బావ కోసం వెళ్లి .. తిరిగిరాని లోకాలకు..
విశాఖపట్నం, కోటవురట్ల (పాయకరావుపేట): పండగ రోజు అందరూ సంతోషంగా ఉన్న వేళ..ఓ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. బావ కోసం ఎదురుగా వెళ్లిన ఆ యువకుడు కలుసుకోకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ప్రమాద వార్త ఆ ఇంట్లోనే కాదు గ్రామంలో విషాదం నింపింది. వివరాలిలావున్నాయి. రాజుపేటకు చెందిన మళ్ల సోమేశ్వరరావు (26) మంగళవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో అక్కడిక్కడే మృతి చెందాడు. పండగకు ఇంటికి వస్తున్న బావ మోటార్ బైక్ కొడవటిపూడిలో చెడిపోవడంతో తీసుకొచ్చేందుకు ఎదురుగా వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బైక్ ప్లగ్‌ను కోటవురట్లలో కొనుగోలు చేసిన సోమేశ్వరరావు వెంట మళ్ల సాయిని కుర్రాడిని తీసుకుని బైక్‌పై బయలుదేరాడు. తిమ్మాపురం దాటాక కె.వెంకటాపురం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ బలంగా ఢీకొట్టింది. దాంతో వాహనం నడుపుతున్న సోమేశ్వరరావు తల రోడ్డుకు తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సాయి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్‌పై ఉన్న కాళ్ల మాలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం రెండు కాళ్లు విరిగిపోయి, పళ్లు ఊడిపోవడంతో కేజీహెచ్‌కు తరలించారు. మృతుని సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతి చెందిన సోమేశ్వరరావు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ముగ్గురు అన్నల తర్వాత చివరివాడు. కబడ్డీ పోటీలలో జిల్లా స్థాయిలో పలు పోటీలలో ప్రతిభ చూపి మంచి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. పేదరికం కారణంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఇంతలో ఈ ప్రమాదం అనంతలోకాలకు చేర్చింది. పండగ రోజున మరణవార్త విన్న కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుపెట్టారు. -
పిండి మిషన్‌కు వెళ్లివస్తూ.. దుర్మరణం
సంక్రాంతి పండుగను సరదాగా జరుపుకోవాలనుకున్నఆ యువకుల ఆశలు ఆవిరయ్యాయి. పిండి వంటలుచేసుకునేందుకు మిషన్‌లో బియ్యపు పిండిని ఆడించుకుని వెళ్తున్న వారి బైకును మరో బైకు ఢీకొనడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాయచోటి టౌన్ : రాయచోటి రింగ్ రోడ్డు బిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి రూరల్ పరిధిలోని ఇందుకూరుపల్లెకు చెందిన పల్లె జగదీష్ (15), పవన్ కుమార్ (18) సోమవారం సాయంత్రం ఇందుకూరుపల్లె నుంచి రాయచోటికి వచ్చారు. అత్తిరాసలకోసం బియ్యం పిండిని మిషన్ ద్వారా తయారు చేసుకొని రాత్రి 7గంటల సమయంలో ఇంటికి బయలుదేరారు. చెన్నముక్కపల్లె సమీపంలోని మాండవ్యనదిపై నిర్మించిన బిడ్జి దగ్గరకు వెళ్లగానే కడప రోడ్డు వైపు నుంచి వచ్చిన మరో బైకు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. వీరి బైకును ఢీకొన్న మరో ద్విచక్రవాహనదారుడికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. సంక్రాంతి పండుగ కోసం వచ్చి... జగదీష్ స్వగ్రామం శిబ్యాల గ్రామం బలిజపల్లె ( పగడాలవాండ్లపల్లె). ఇతని తల్లిదండ్రులు ఇద్దరు జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. తమ కుమారుడిని మంచి ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో తిరుపతిలోని కార్పొరేట్ స్కూల్లో 10వ తరగతి చదివిస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి సెలవులు కావడంతో ఇందుకూరుపల్లెలోని అమ్మమ్మ గారి ఇంటికి సోమవారం ఉదయమే వచ్చాడు. తన మనవడు రాకరాక వచ్చాడని పిండివంటలు వండిపెట్టాలనే కోరికతో అమ్మమ్మ బియ్యం పిండి కొట్టించుకురమ్మని చెప్పి రాయచోటికి పంపింది. అతనితో పాటు అదే గ్రామానికి చెందిన పవన్‌కుమార్ కూడా వెళ్లాడు. బియ్యం ఆడించుకొని ఇంటికి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కలిసి వెళ్లారు.. కన్నుమూశారు
వైఎస్ఆర్ జిల్లా, సుండుపల్లె : సుండుపల్లె–రాయవరం రహదారిలో జరిగిన రోడ్డుప్రమాదంలో అన్నదమ్ములు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాయవరానికి చెందిన సిద్దిక్ కుమారులు మహ్మద్ రఫీక్ (45) అతని సోదరుడు ఇలియాస్ (42) శుక్రవారం ఉదయం రాయవరం నుంచి సుండుపల్లెకు తమ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో రాయవరం క్రాస్ మడితాడు మధ్యలోని మలుపులో రాయచోటి నుంచి పింఛాకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరి తలలకు బలమైన గాయాలు తగిలి ఇలియాస్ (42) అక్కడికక్కడే మృతి చెందగా మహమ్మద్ రఫీక్ (45)ను స్థానికులు ఆటోలో చికిత్స నిమిత్తం సుండుపల్లె ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో సోదరులను మృత్యువు కబళించిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ప్రమాదంలో ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతులు మహ్మద్ రఫీక్‌కు భార్య కుమారుడు, కుమార్తె, ఇలియాస్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. విషాదంలో రాయవరం :ఇంట్లోనుంచి బయలుదేరిన అయిదు నిమిషాల్లోనే జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటంతో మృతుల స్వగ్రామం రాయవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పరామర్శ :సుండుపల్లె మండల పర్యటనలో ఉన్న రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిలు వెంటనే ప్రమాదస్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుల అంత్యక్రియలకు ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డి రూ.10వేలు అందజేశారు. ప్రమాదస్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకుడు కరీంబాషా తదితరులు సందర్శించారు. -
జన్మభూమి సభకు వెళ్తూ మృత్యువాత
జన్మభూమి గ్రామసభ ముగించుకుని స్వగ్రామానికి వెళ్తున్న ప్రభుత్వోద్యోగి, కల్లూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన మరచిపోక మునుపే మళ్లీ మరో ఉదంతం చోటుచేసుకుంది. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ పర్యాయం జన్మభూమి గ్రామసభకు వెళ్తూ కానిస్టేబుల్ ఒకరు మృత్యువాత పడ్డారు. ఎస్ఐతోపాటు మరో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు గాయపడ్డారు. పూతలపట్టు: పులిచెర్ల మండలంలోని కేకే పేటలో బుధవారం జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి పోలీసులు హాజరు కావాలని మంగళవారం ఉన్నతాధికారులు ఎస్ఐ మల్లేష్‌యాదవ్‌ను ఆదేశించారు. గతంలో ఆ గ్రామంలో గొడవలు జరిగిన నేపథ్యంలో ఈ పర్యాయం గ్రామసభలో పునరావృ తం కాకుండా చూడాలని, ఉదయం 9 గంటలకంతా అక్కడికి చేరుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు పూతలపట్టు నుంచి హైవే పట్రోలింగ్æ వాహనంలో హెడ్‌కానిస్టేబుళ్లు మునిరత్నం, ధనశేఖర్ నాయుడు, కానిస్టేబుళ్లు అశోక్, కృష్ణమూర్తితో ఎస్ఐ బయలుదేరారు. పది నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురయ్యారు. తలపులపల్లె వద్ద ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను తప్పించే యత్నంలో డ్రైవింగ్ చేస్తున్న అశోక్ రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీకొన్నాడు. ఈ దుర్ఘటనలో అశోక్(32) అక్కడికక్కడే చనిపోగా ఎస్ఐకు తీవ్ర గాయాలయ్యాయి. హెడ్‌కానిస్టేబు ళ్లకు గాయాలయ్యాయి. పోలీసు వాహనం ప్రమాదానికి గురవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలకు పూనుకున్నారు. అశోక్ భౌతికకాయాన్ని, గాయపడిన పోలీసులను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెనుమూరు ఎస్ఐ వంశీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో మిన్నంటిన ఆర్తనాదాలు చిత్తూరు అర్బన్: పూతలపట్టు ప్రమాద ఘటన నేపథ్యంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి మృతుని కుటుంబ సభ్యుల రోదనలతో మార్మోగింది. ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే ఘటనా స్థలానికి నాలుగు అంబులెన్సులు చేరుకున్నాయి. పేటమిట్ట క్రాస్ నుంచి క్షతగాత్రులను అంబులెన్సుల్లో తీసుకొస్తుండగా చిత్తూరు సమీపంలోని చక్కెర ఫ్యాక్టరీ వద్ద రైల్వేగేటు వేసి ఉండడంతో కాస్త ఆందోళన నెలకొంది. అయితే అదే సమయంలో రైలు వెళ్లిపోవడంతో గేటు తెరిచారు. అంతే! శరవేగంతో అంబులెన్సులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి చేరాయి. ఎస్పీ, ఏఎస్పీ, ఇతర అధికారుల పరామర్శ ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏఎస్పీలు సుప్రజ, కృష్ణార్జునరావు, ఇతర పోలీసు అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. డీఎస్పీ రామాంజనేయులు, సుబ్బారావు, గిరిధర్, సీఐ ఆదినారాయణ, వెంకటకుమార్ తదితరులు బాధితులకు దగ్గరుండి వైద్యసేవలు అందేలా చూశారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఎస్ఐతోపాటు హెడ్‌కానిస్టేబుల్ మునిరత్నం, కానిస్టేబుల్ ధనశేఖర్నాయుడును వేలూరు సీఎంసీకి తరలించారు. చికిత్సతో వారికి ప్రాణాపాయం తప్పినట్లు అక్కడి వైద్యులు చెప్పారని పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే, మృతుడి కుటుంబ సభ్యులు, బాధితులను ఓదార్చి ఎస్పీ ఆర్థికసాయం అందచేశారు. ఆస్పత్రి వద్ద మృతుడు అశోక్‌కుమార్ భార్య శిల్ప, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తుండటం అందరినీ కలచివేసింది. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు యాదమరి : పూతలపట్టు మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ అశోక్‌కుమార్‌కు స్వస్థలమైన పెరుమాళ్లపల్లెలో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఇంటి వద్ద మృతదేహానికి పలువురు నివాళులు అర్పించారు. శ్మశాన వాటికలో సీఐలు శ్రీనివాసులు, హరినాథ్, ఆదినారాయణ, ఎస్ఐలు సునీల్ కుమార్, వంశీ, మనోహర్, ఏఆర్ పోలీసులు గాలిలో మూడు రౌండ్ల కాల్పుల (గార్డ్ ఆఫ్ హానర్) అనంతరం దహనక్రియలు నిర్వహించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం మృతుని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి అమరనా«థరెడ్డి, ఎస్పీ, ఎం ఎల్సీ దొరబాబు తెలిపారు. బుధవారం సాయంత్రం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ, మృతుని భార్యకు ప్రభు త్వ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. వారి వెంట డీఎస్పీ రామాంజనేయులు, సీఐలు, ఎస్ఐలు, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఉన్నారు. కానిస్టేబుల్ మృతికి ఎమ్మెల్యే సంతాపం కాణిపాకం: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పూతలపట్టు కానిస్టేబుల్ అశోక్ కుమార్ మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఫోన్లో మాట్లాడారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్ఐ మల్లేష్‌యాదవ్, మునిరత్నం, ధనశేఖర్ నాయుడు త్వరగా కోలుకో వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు పూర్తి స్థాయి సిబ్బందిని మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సిబ్బంది ప్రమాదాల బారిన పడితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ధవళేశ్వరం/రాజమహేంద్రవరం క్రైం: రోడ్డు ప్రమాదంలో యువతీయువకుడు మృతి చెందిన సంఘటన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ధవళేశ్వరం కాటన్‌పేట వద్ద ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పొట్టిలంక గ్రామానికి చెందిన ఆనం స్వరూప (18), నక్కిన వీరమల్లికార్జునరావు(20) మృతి చెందారు. సంఘటనకు సంబంధించి ధవళేశ్వరం పోలీసుల కథనం ఇలా.. ఆనం స్వరూప రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. బుధవారం ఆమెకు బంధువైన నక్కిన వీరమల్లికార్జునరావుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వేమగిరి వైపు వెళుతున్న భారీ కంటైనర్ లారీ ఢికొట్టింది. దీంతో స్వరూప, మల్లికార్జునరావు తలలపై నుంచి కంటైనర్ లారీ దూసుకుపోవడంతో వారిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. దక్షిణమండల ఇన్చార్జ్ డీఎస్పీ భరత్‌మాతాజీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధవళేశ్వరం సీఐ బాలశౌరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష్యం నెరవేరకుండానే!
తండ్రిలా శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణగా ఉండేందుకు కానిస్టేబుల్ కావాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఇక తండ్రి కూడా తనలానే తన ఇద్దరు కుమారులు పోలీసు ఉద్యోగంలో స్థిరపడాలని భావించాడు. కానీ విధి వారి ఆశలను అడియాశలు చేసింది. ఎదిగొచ్చిన కొడుకులు కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి వెళ్లి ఇంటికి ఎప్పుడు చేరుకుంటారోనని ఎదురు చూసిన తండ్రికి పుత్రశోకం మిగిలింది. తూర్పుగోదావరి, జగ్గంపేట: మండలంలోని వెంగాయ్యమ్మపురం గ్రామ శివారున మల్లిసాలకు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్దికొండ వంశీరత్నం(28) మృతి చెందాడు. వంశీరత్నం, తమ్ముడు మనోరత్నం కలిసి కాకినాడలో కానిస్టేబుల్ పరీక్ష రాసి తిరిగి రంపచోడవరంలోని ఇంటికి వెళుతుండగా ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఆటో వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వంశీరత్నం తలకు బలమైన గాయమవ్వడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముడు మనోరత్నం గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన ఆటోలోని ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని జగ్గంపేటలో ఆస్పత్రికి తరలించారు. మృతుడు రంపచోడవరం పోలీసు స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కనకరత్నం కుమారుడు. ఇద్దరు కుమారులు కానిస్టేబుల్ పరీక్షకు ఉదయం కాకినాడ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కనకరత్నం తలడిల్లారు. ప్రమాదంలో బైక్ నుజ్జు అవ్వగా ఆటో ఎడమవైపు దెబ్బతింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై ఏసుబాబు, సిబ్బంది ప్రమాదం తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి పీఎం నిమిత్తం తరలించారు. -
అయ్యో.. ఎంత పని చేస్తివి దేవుడా!
అనంతపురం, నల్లచెరువు: ‘అయ్యో..ఎంత పని చేస్తివి దేవుడా.. ఒక్కగానొక్క కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటిమే..ఇంతలోనే ఎంత పని చేస్తివయ్యా’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. మండలంలోని అల్లుగుండు సమీపాన మదరసా వద్ద జాతీయ రహదారిపై బైక్ బోల్తాపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు..తనకల్లు మండలం పెద్దకడపలవారిపల్లికి చెందిన గౌడుచెరువు శ్రీనివాసులురెడ్డి, చంద్రకళ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్ల్లల చదువు కోసం శ్రీనివాసులురెడ్డి బెంగళూరులోనే ఉంటూ ఫ్యాక్టరీలలో పని చేసేవారు. కుమారుడు శశివర్దన్‌రెడ్డి(19) బెంగళూరులో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. బుధవారం బెంగళూరు నుంచి ముత్యాచెరువులోని బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. అల్లుగుండు సమీపాన మదరసా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. శశివర్దన్‌రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న సాయికుమార్ స్పల్పగాయాలతో బయటపడ్డాడు. వెంటనే శశివర్దన్‌రెడ్డిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ రమేష్‌బాబు తెలిపారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో అపశ్రుతి
హసన్‌పర్తి: కొత్త సంవత్సరం వేడుకలు మూడు కుటుంబాల్లో విషాదం నింపాయి. వేడుకల్లో పాల్గొని వస్తుండగా ఓ ఆటో డ్రైవర్ అనుమానా స్పద స్థితిలో మృతిచెందగా, వేడుకల అనంతరం నిద్రిస్తున్న క్రమంలో ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో చనిపోయింది. ఓ యువకుడు మూత్రవిసర్జనకు వెళ్లి డ్రెయినేజీ వద్ద పడి ప్రాణాలు వదిలాడు.పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని 58వ డివిజన్ వంగపహాడ్‌కు చెందిన దోమ అరుణ్(28)కు భార్య కళ్యాణి, ఆరు నెలల కూతురు ఉన్నారు. అరుణ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి బైరాన్‌పల్లి శివారులోని ఓ మామిడితోటలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఈ క్రమంలో అతడు మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో మృతిచెంది కనిపించాడు. హత్యచేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ కాగా దోమ అరుణ్‌ను హత్య చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన న్యూయర్ గొడవలే హత్యకు కారణంగా వారు పేర్కొంటున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం ఆటో బోల్తాపడడంతో అరుణ్ మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. ఇంటికి వచ్చే క్రమంలో మూలమలుపు వల్ల ఆటో బోల్తాపడినట్లు పేర్కొంటున్నారు. భయపడ్డారా ? వంగపహాడ్ శివారులోని మూలమలుపు వద్ద ఆటో బోల్తాపడిన దృశ్యాన్ని అదే మార్గంలో వస్తున్న అతడి స్నేహితులు చూసినట్లు తెలిసింది. ఆటోను పక్కకు జరి పి దాని కిందన ఉన్న అరుణ్‌ను పరిశీలించగా ఎలాంటి చలనం లేకపోవడంతో భయపడిన ఆ యువకులు ఎవరికి చెప్పకుండా మరో మార్గం నుంచి ఇంటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కాగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ విందు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అరుణ్‌తోపాటు న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణ చేçస్తున్నాం.. అరుణ్ మృతిపై విచారణ చేపడుతున్నట్లు ఎస్పై సుధాకర్ తెలిపారు. వివిధ కోణాల్లో విచారిస్తున్నట్లు చెప్పారు. ఆటో బోల్తాపడడంతో అరుణ్ మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. –సుధాకర్, ఎస్సై -
సాక్షి ఫొటోగ్రాఫర్‌కు గాయాలు
సాక్షి, వైఎస్సార్ కడప : సాక్షి మీడియా సంస్థలో పనిచేస్తున్న ఫొటోగ్రాఫర్ రమేష్‌ను బైక్ ఢీకొట్టింది. నూతన సంవత్స వేడుకల సందర్భంగా కడప పట్టణంలోని ఏడురోడ్ల కూడలి వద్ద ఫొటోలు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం సేవించి వాహనం నడిపిన యువకులు అతివేగంగా వచ్చి రమేష్‌ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని తిరుమల ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. -
క్షమించండి.. 108 లేదు!
శ్రీకాకుళం, రాజాం: మంగళవారం సాయంత్రం 5.30 గంటలు.. రాజాంలోని బొబ్బిలిరోడ్డులో అమ్మవారి కాలనీ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలుపరస్పరం ఢీకొన్నాయి.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు..ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనచోదకులు స్పందించి క్షతగాత్రులను పక్కకు తీసి 108 అంబులెన్సుకు ఫోన్‌చేశారు. 108 వాహనం అందుబాటులో లేదని, ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయించాలని ఉచిత సలహా చెప్పడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. మరోవ్యక్తి ఫోన్ చేసినా అదే సమాధానం రావడం గమనార్హం. ఇదీ రాజాం పట్టణానికి కిలోమీటరున్నర దూరంలో మంగళవారం జరిగిన ప్రమాద ఘటన వద్ద చోటుచేసుకున్న పరిస్థితి. బొబ్బిలిరోడ్డులో అమ్మవారి కాలనీ సమీపంలో సాలూరు వైపు ద్విచక్రవాహనంతో వెళ్తున్న భార్యాభర్తలు, అటునుంచి రాజాం వస్తున్న మల్లికార్జున కాలనీకి చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనాలతో పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో మల్లికార్జున కాలనీకి చెందిన యువకుడితో పాటు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 108 రాకపోవడంతో క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాజాం పోలీసులు కూడా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. -
పొట్టకూటి కోసం వెళ్లి..
నెల్లూరు, కోవూరు: వారిద్దరూ పొట్టకూటి కోసం ఉదయం నెల్లూరు నగరానికి వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ఇంతలో రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుని వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది. బేల్దారి పనికి వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు బేల్దారి కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కోవూరు లారీ యార్డ్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దగదర్తి మండలంలోని అనంతవరం లైన్స్‌నగర్‌కు చెందిన పరశు వెంకటేశ్వర్లు (41), చంద్రమౌళి (40) బేల్దారి కూలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం ఇద్దరూ పనినిమిత్తం నెల్లూరుకు వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని తిరిగి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో కోవూరు లారీ యార్డ్ సమీపంలో జాతీయ రహదారిపై వెళుతుండగా వెనుకనుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. ఢీకొట్టిన వాహనం వారిపై నుంచి వెళ్లింది. హెల్మ్ట్లు ధరించి ఉన్నా వాహనం వారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు పరశు వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి, కోవూరు సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్సై వెంకట్రావు, ట్రైనీ ఎస్సై అనూషలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని జీజీహెచ్‌కు తరలించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
వైఎస్ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల– నిడుజివ్వి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి 9.30 గంటలకు జరిగిన రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ ఓబులయ్య (35) మృతి చెందారు.విధులు ముగించుకొని బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే రూరల్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు..ఓబులయ్య ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో (పీసీ నంబరు 363) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఈయన సుమారు ఆరు నెలల కిందట చిన్నమండెం పోలీస్‌స్టేషన్ నుంచి బదిలీపై ఎర్రగుంట్లకు వచ్చారు. ఈయన స్వగ్రామం ముద్దనూరు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎర్రగుంట్లలో ట్రాíఫిక్ విధులు నిర్వర్తిస్తున్నారు. రోజు మాదిరిగానే విధులు ముగించుకొని పిల్లలకు అరటి పండ్లు తీసుకొని స్కూటర్లో ముద్దనూరుకు బయలుదేరారు. ఎర్రగుంట్ల– నిడుజివ్వి గ్రామ సమీపాన క్వారీ వద్దకు రాగనే గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొంది. ఇనుప రాడ్ తలకు బలంగా తగిలింది. దీంతో హెల్మెట్ పగలిపోయి తల లోపలికి రాడ్డు దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ ఓబులయ్య అక్కడిక్కడే దుర్మరణం చెందారు. స్కూటర్ దూరంగా పడిపోయింది. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ కొండారెడ్డి పరిశీలించారు. వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. పరిస్థితిని పరిశీలించారు. -
జాగ్రత్త..బైక్‌లో వెళ్లకండి రా..!
చిత్తూరు, పూతలపట్టు/దొడ్డబళ్లాపురం/మదనపల్లె సిటీ: వారిద్దరూ కవల సోదరులు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చదువులోనూ పోటీ పడేవారు. అయితే విధి చిన్నచూపు చూసింది. కాలేజీకి బైక్‌పై వెళ్తూ వ్యాన్‌ను వెనుకనుంచి ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు సమీపంలో దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూతలపట్టుకు చెందిన మదనమోహన్, సౌభాగ్య దంపతులు కొన్నేళ్లక్రితం మదనపల్లెలో స్థిరపడ్డారు. వారికి కవ ల పిల్లలున్నారు. పెద్దవాడు సాయి హర్షిత్, చిన్నవాడు సాయి హా ర్తిక్. కర్ణాటకలోని గీతం యూనివర్సిటీలో వీరి ద్దరూ బీఈ కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్నా రు. ఇద్దరిదీ ఒకే సెక్షన్. మంగళవారం ఇద్దరూ బైక్‌పై కళాశాలకు బయల్దేరారు. హర్షిత్ (20) డ్రైవింగ్ చేస్తుండగా హార్తిక్ వెనుక కూర్చున్నాడు. మోపరహళ్లి వద్ద ముందు వెళ్తున్న వ్యాన్‌ను బైక్ ఢీకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో హర్షిత్ మృతి చెందగా, హార్తిక్ తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం హర్షిత్ మృతదేహాన్ని, చికిత్స నిమిత్తం హార్తిక్ను తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాగ్రత్త..బైక్‌లో వెళ్లకండి రా..!– ముందుగానే హెచ్చరించిన పిన్ని పూతలపట్టులో హర్షిత్, హార్తిక్ చిన్నాన్న, పిన్ని, బంధువులు ఉంటున్నారు. రెండ్రోజుల క్రితం హర్షిత్ ఫోన్లో తన చిన్నాన్న, పిన్నితో మాట్లాడాడు. ఇటీవల పూతలపట్టు మండలంలో చోటుచేసుకున్న మోటార్ సైకిళ్ల ప్రమాదాల్లో యువకులు మృతి చెందడంపై కలత చెందిన హర్షిత్ పిన్ని ఫోన్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించి బాధపడ్డారు. బైక్‌లో కాలేజీకి వెళ్లవద్దని, టయాలు బాగా లేవని, బస్సులోనే కాలేజీకి వెళ్లమని హర్షిత్, హార్తిక్పై ఉన్న ప్రేమకొద్దీ సున్నితంగా హెచ్చరించారు. జాగ్రత్తలు చెప్పారు. జాగ్రత్తగానే వెళ్తాం– పిన్నీ అంటూ హర్షిత్ బదులిచ్చాడు. అయినా, విధిచూపు చిన్నచూసింది. హర్షిత్ మరణంతో పూతలపట్టులో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి పిన్ని, స్థానిక బంధువర్గం కన్నీటిపర్యంతమవుతోంది. బుధవారం ఉదయం ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
భద్రాద్రి కొత్తగూడెం, అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతిచెందిన ఘటన అశ్వారావుపేట మండలం నందిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఊకే కిషోర్(27), కారం వీరభద్రం(29), కుంజా జోగారావు(28)తో పాటు ధర్ముల ముత్తేశ్వరరావు కలిసి ఒకే ద్విచక్రవాహనంపై ఆదివారం మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి నందిపాడుకు వస్తుండగా కుడుములపాడు గ్రామం వద్ద మూలమలుపులో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురూ తీవ్రంగా గాయపడగా, స్థానికులు గమనించి అశ్వారావుపేటలోని సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే కిషోర్, వీరభద్రం, జోగారావు మృతిచెందారు. ముత్తేశ్వరరావు అదే ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. మృతుల్లో వీరభద్రానికి వివాహం కాగా, ఏడాది వయసున్న కూతురు, భార్య సీత ఉన్నారు. కిషోర్, జోగారావులకు ఇంకా పెళ్లి కాలేదు. సమాచారంఅందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతి చెందిన ముగ్గురు యువకులూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. అందరూ నిరుపేదలే. కిషోర్ అశ్వారావుపేటలో బీఈడీ చదువుతుండగా, వీరభద్రం బీఈడీ పూర్తి చేసి, ప్రస్తుతం లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. జోగారావు ఏపీలోని పోలవరం ప్రాజెక్టు వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జోగారావు తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతి చెందగా, తమ్ముడు నాగరాజు ఉన్నాడు. కాగా ముగ్గురు యువకులు ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో నందిపాడు శోకసంద్రంలో మునిగిపోయింది. అంతకుముందే తల్లిదండ్రులు, ఇప్పుడు అన్న మృతిచెందడంతో జోగారావు తమ్ముడు నాగరాజు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
పాల కోసం వెళుతూ మృత్యువు పాలు
విశాఖపట్నం, చోడవరం జోన్ : పాలప్యాకెట్ల కోసం వెళుతూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు దీంతో రాయపురాజు పేటలో విషాదం అలముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాయపురాజుపేటకు చెందిన ఆళ్ల నర్సింగరావు(27) శుక్రవారం ఉదయం పాల పేకెట్టు కోసం తన ద్విచక్రవాహనంపైన వెంకన్నపాలెం వెళ్తుండగా నర్సాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న విశాఖ డెయిరీ పాల లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో నర్సింగరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. తల్లి కాసులమ్మతో పాటు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. ఎస్ఐ మల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నర్సింగరావు తండ్రి గంగయ్య చిన్నతనంలోనే మృతి చెందగా తల్లి కాసులమ్మ వ్యవసాయ కూలి చేస్తూ నర్సింగరావును, ఇద్దరు కుమార్తెలను పోషించింది. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. ప్రస్తుతం నర్సింగరావు అనకాపల్లిలోని ఒక ప్రయివేటు స్టీల్ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నర్సింగరావు మృతి చెందడంతో తల్లి కాసులమ్మ ఇక తనను పోషించేవారు ఎవరున్నారని తనకు తలకొరివి పెడతాడనుకున్న కొడుకు చనిపోయాడని కన్నీరు మున్నీరుగా విలపించింది. పండగపూట ప్రమాదం జరగడంతో రాయపురాజు పేటలో విషాదం అలము కుంది. -
రెండు బైక్‌లు ఢీ..
విజయనగరం టౌన్: మండలంలోని జమ్ము నారాయణపురం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నలుగురు గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రూరల్ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం మండలం రావాడ గ్రామానికి చెందిన ఎ. అప్పలనరసయ్య ఆయన భార్య రాధ, పిల్లలు సుజయ్రామ్, రాహుల్ విజయనగరంలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామానికి డెంకాడ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే మార్గంలో తాడివాడ నుంచి విజయనగరం వైపు టీవీఎస్ ఎక్స్‌ల్ పై రెడ్డి పైడిబాబు, మజ్జి శ్రీను వస్తున్నారు. జమ్ము నారాయణపురం జంక్షన్ మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించకపోవడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికీ గాయాలు కాగా అప్పలనరసయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం అప్పలనరసయ్యను విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ స్కిడ్ అయి కేకే రాజుకు గాయాలు
సీతమ్మధార(విశాఖ ఉత్తర): వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆదివారం బైక్ స్కిడ్ కావడంతో గాయపడ్డారు. హత్యాయత్నం అనంతరం తొలిసారి విశాఖ వస్తున్న జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు విశాఖ విమానాశ్రయానికి రాజు ఆదివారం భారీ బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ఉత్సాహంగా వెళ్తున్న ఆయన ఎన్ఏడీ వద్దకు చేరుకునేసరికి .. పెట్రోల్‌బంక్ నుంచి ఒక కారు బుల్లెట్‌కు అడ్డురా వడంతో బుల్లెట్‌కు ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీం తో స్కిడ్ అయి ఒక్కసారిగా బైక్ మీద నుంచి కిందికి పడిపోయారు. దీంతో షోల్డర్ డిస్క్‌తో పా టు కాళ్లు, చేతులు, కడుపుపై గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉన్న కిరణ్‌రాజు కారులో హూటాహుటిన గురుద్వార్ వద్ద గల రామా హాస్పిటల్లో చేర్పించడంతో వైద్యులు చికిత్స ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కేకేరాజును వెంటనే ఫోన్లో పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు నేతల పరామర్శ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేకేరాజును విశాఖ పార్లమెంట్ జిల్లా సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్తలు వంశీకృష్ణ, కన్నబాబురాజు, ఎస్. సుధాకర్, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి, విశాఖపా ర్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఆళ్ల గణేష్, వార్డు అధ్యక్షులు చల్లా ఈశ్వరరావు, కటుమూరి సతీష్, సారిపిల్లి గోవింద్, నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడు బాకీ శ్యాంకుమార్‌రెడ్డి, కేవీ బాబా, జూబేర్, కాయిత పైడి రత్నాకర్, సాడిపద్మారెడ్డి, ఉత్తరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. -
ఇద్దర్ని బలిగొన్న మితిమీరిన వేగం
ఆనందపురం(భీమిలి): మితిమీరిన వేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. స్పోర్ట్స్ బైక్‌పై ఉన్న మోజు చివరకు ఆ యువకుడి ప్రాణాలనే హరించింది. మండలంలోని వెల్లంకి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడితో పాటు దాన్ని ఢీకొని మరో వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన మెంగం నిచ్చలకాంత్(26)కు రేస్ బైకంటే చాలా ఇష్టం. ఇటీవల కవాసికి నింజా 650 సీసీ మోటార్ బైక్‌ను కొనుగోలు చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై ఇంటి వద్ద నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లిలో ఉన్న తన స్వగృహానికి వెళ్తున్నా డు. మండలంలోని వెల్లంకి జంక్షన్ వద్ద జాతీయ రహదారి పైకి చేరుకునే సరికి రోడ్డు దాటుతున్న వెల్లంకి గ్రామానికి చెందిన తాటిశెట్టి సత్తిబాబు (52) అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో సత్తిబాబు చొక్కా బైక్ హ్యండిల్‌కు తగులుకోవడంతో సుమారు వంద మీటర్ల వరకు ఈడ్చుకొని పోయింది. దీంతో బైక్ నడుపుతున్న నిచ్చలకాంత్తో పాటు సత్తిబాబు రోడ్డుపై తూలి పడిపోగా.. మోటర్ బైక్ మరో వంద మీటర్లు వరకు దూసుకుపోయింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికీ స్థానికులు సపర్యలు చేసి 108 వాహనంలో మొదట తగరపువలసలోని ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యంలో సత్తిబాబు చనిపోగా... నిచ్చలకాంత్ను కేజీహెచ్‌కు తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. బైక్‌ను మితిమీరిన వేగంతో నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిచ్చలకాంత్ తండ్రి చిన్నయ్యదొర కాంట్రాక్టు పనులు చేస్తూ సొంత గ్రామం నుంచి వచ్చి పిఠాపురంకాలనీలో స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా నిచ్చలకాంత్ చిన్నవాడు. గీతం యూనివర్సిటీలో బీబీఎం చదివిన నిచ్చలకాంత్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శవాలకు పోస్టుమార్టం నిర్వహించి ఆనందపురం సీఐ ఆర్.గోవిందరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
కృష్ణాజిల్లా, కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : ఆ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు.. కలిసి బడికి వెళ్ళారు... కలిసి ఆడుకున్నారు... కలిసే పెరిగారు... ఎక్కడి వెళ్ళినా కలిసే వెళ్లేవారు. ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా కలిసే పాల్గొనేవారు. ఒకరంటే ఒకరికి నమ్మకం... అలాంటి ఆ స్నేహితులకు మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చింది. క్షణాల్లో వారిపైకి దూసుకువచ్చింది. అప్పటి వరకు ఏమరుపాటుగా ఉన్న ఆ ముగ్గురూ ఎదురుగా వచ్చిన మృత్యువును చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే సమయం మించిపోవడంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయవిదారకర ఘటన బందరు మండలం చిన్నాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బందరు మండలం వాడపాలెం పంచాయతీ శివారు వెంకటదుర్గాంబపురానికి చెందిన ఒడుగు కుమార్‌స్వామి, మోకా సహదేవుడు (19), ఒడుగు సాయికుమార్ (20) స్నేహితులు. కుమార్‌స్వామి కృష్ణా యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. సహదేవుడు పవిత్ర డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతున్నాడు. సాయికుమార్ ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం చేపల చెరువుపై ఉంటూ కూలి పనులు చేస్తున్నాడు. చిన్ననాటి స్నేహితులైన వీరు ముగ్గురూ ఎక్కడికైనా కలిసే వెళ్తుంటారు. సహదేవుడికి ఎగ్జామ్ ఉండటంతో బుధవారం బైక్‌పై ముగ్గురూ బందరు బయలుదేరారు. చిన్నాపురం శివారు శ్మశానం సమీపంలోని మలుపు వద్ద భీమవరం నుంచి కోన చేపల చెరువు వద్దకు వెళ్తున్న లారీ వేగంగా వారి బైక్‌పైకి దూసుకువచ్చింది. అకస్మాత్తుగా లారీ మీదకు దూసుకురావటంతో కుమార్‌స్వామి బైక్‌ను తప్పించే ప్రయత్నం చేశాడు. అప్పటికే లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సహదేవుడు, సాయికుమార్‌లకు రోడ్డు దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయారు. బైక్ నడుపుతున్న కుమార్‌స్వామి కాళ్ళు, చేతులకు బలమైన గాయాలై రోడ్డు పక్క పడిపోయాడు. చికిత్స పొందుతూ మృతి.. స్థానికులు 108కు ఫోన్ చేసి ముగ్గురిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సహదేవుడు, సాయికుమార్ క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. కుమారస్వామి కొనఊపిరితో కొట్టుకుంటుండగా మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కదిలొచ్చిన రెండు గ్రామాలు.. విషయం తెలుసుకున్న వెంకటదుర్గాంబపురం, పోలాటితిప్ప గ్రామస్తులు ఆస్పత్రికి తరలివచ్చారు. చేతికి అందిన బిడ్డలు శవాలుగా మారటాన్ని చూసిన తల్లితండ్రులతో పాటు గ్రామస్తులు సైతం బోరున విలపించారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.. చిన్నాపురంలోని ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకోవాలని బందరు రూరల్ పోలీసులకు సూచించారు. ఆయనతోపాటు బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా, బందరు రూరల్ సీఐ బి. రవికుమార్ ఉన్నారు. నాయకుల పరామర్శ.. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, బందరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల బంధువులను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బాధితులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్‌దాదా, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ ఎల్ ఎన్ ప్రసాద్, ఇతర నాయకులు ఉన్నారు. -
ప్రాణం తీసిన ఓవర్టేక్
అనంతపురం , ఆత్మకూరు: ఓవర్ టేక్ ఒక ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పడంతో వెనుక కూర్చున్న మహిళ ఎగిరి రోడ్డుపై పడింది. ఆ వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు ఆమెపై వెళ్లడంతో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. శరణమ్మ (43) అనే మహిళ తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంలో కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వైపు వస్తున్నారు. మండల కేంద్రం ఆత్మకూరు స్టేట్ బ్యాంకు వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్‌చేయబోయాడు. అయితే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండటంతో బ్రేక్ వేశాడు. కుదుపునకు బైక్‌లో వెనుక కూర్చున్న శరణమ్మ ఎగిరి రోడ్డుపై పడింది. ఆమె కుమారుడు రోడ్డు పక్కన పడిపోయాడు. వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు శరణమ్మ ఛాతీభాగంపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో 108 వాహనంలో అనంతపురం తరలిస్తుండగా మార్గం మధ్యలోనే శరణమ్మ ప్రాణం విడిచింది. మృతురాలి వద్ద లభించిన ఆధార్ కార్డులో వివరాల ప్రకారం ఆమె అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి అని, బ్యాంకు పాస్‌పుస్తకంలో కంబదూరు మండలం కొత్తపల్లికి చెందినదిగా ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. -
బైక్‌ను ఢీకొన్న కారు : ఇద్దరు విద్యార్థుల మృతి
కృష్ణాజిల్లా, కంచికచర్ల (నందిగామ) : బైక్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన ఆదివారం కంచికచర్ల మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రికి చెందిన బొడ్డు ఉమేష్ (17) పరిటాల అమ్రితసాయి ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కన్నా మహేష్ అదే ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వారిద్దరు ఆదివారం బంధువులను చూసేందుకు ఫెర్రి నుంచి బైక్‌పై కునికెనపాడు గ్రామానికి వెళ్లారు. కొంతసేపు బంధువులలో మాట్లాడి అనంతరం అదేరూట్లో తిరిగి ఇంటికి బయలుదేరారు. మండలంలోని నక్కలంపేట సమీపంలోకి రాగానే విజయవాడ వైపు నుంచి హైద్రాబాద్ వైపు వెళ్తున్న కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. ఉమేష్ అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసమని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డీ చంద్రశేఖర్ తెలిపారు. ఫెర్రీలో విషాదచాయలు ఇబ్రహీంపట్నం (మైలవరం) : రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. కంచికచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందటంతో ఆ కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిలింది. గ్రామానికి చెందిన బొడ్డు ఉమేష్‌వర్మ, కన్నా మహేష్ చిన్ననాటి నుంచి స్నేహంతో మెలిగారు. విధి వంచనతో మృత్యువులో కూడా ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కన్నా రామయ్య తాపీ పనులు చేసుకుంటూ ఇద్దరు కొడుకులను చదివిస్తున్నాడు. కంచికచర్ల అమృతసాయి కళాశాలలో పెద్ద కుమారుడు మహేష్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చుట్టపుచూపుగా బంధువుల ఇంటికెళ్లి ప్రమాద రూపంలో తిరిగిరాని లోకాలకు వెళ్లటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మరో వ్యక్తి బొడ్డు నాగార్జున స్థానిక ఎన్టీటీపీఎస్లో రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు ఉమేష్‌వర్మ అమృతసాయి కళాశాలలో డిప్లమో సెకండ్ ఇయర్ చదువుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఉన్నత విద్యను అభ్యసించి ప్రయోజకులై ఆదుకుంటారని భావించిన తల్లిదండ్రులను విద్యార్థుల మరణవార్త విషాదంలోకి నెట్టింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ కుటుంబాల సభ్యులను ఓదార్చటం ఎవరితరం కావటం లేదు. -
పుట్టిన రోజు వేడుకలకు వెళ్తూ..
శృంగవరపుకోట రూరల్ : ఎస్.కోట మండలంలోని కాపుసోంపురం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ముందు వేసిన రాతిబుగ్గి కుప్పను ఢీకొట్టి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ఎస్సై ఎస్.అమ్మినాయుడు తెలియజేసిన వివరాల ప్రకారం.. విశాఖలోని మర్రిపాలెం జ్యోతినగర్‌కు చెందిన పైడి వాసు, షేక్ బాషా, దుర్గాప్రసాద్, సురేష్, శంకర్, రాజేష్ స్నేహితులు. వీరిలో సంపతిరావు సురేష్ పుట్టిన రోజు శుక్రవారం కావడంతో వేడుకలు జరుపుకునేందుకు వేకువజామున నాలుగు గంటల సమయంలో ఆరుగురూ మూడు ద్విచక్ర వాహనాలపై అరుకు బయలుదేరారు. ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఎస్.కోట దాటిన అనంతరం నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఉన్న రాతికుప్పను వాసు నడుపుతున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాసు రోడ్డుపైకి తుళ్లిపోగా... వెనుక కూర్చున్న బాషా రాతిబుగ్గి కుప్పపై పడిపోయాడు. వెనుక రెండు ద్విచక్ర వాహనాలపై వస్తున్న వారు వెంటనే స్పందించి వాసును ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ వాసు (21) మృతి చెందాడు. కళ్లముందే స్నేహితుడు చనిపోవడంతో మిగిలిన స్నేహితులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. వాసు మృతితో మర్రిపాలెంలోని జ్యోతినగర్‌లో విషాదం అలుముకుంది. మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్ర వాహనం నడిపినందు వల్లే ప్రమాదం జరిగినట్లు ఎస్సై అమ్మినాయుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యు శకటం
‘ఆయన లేకపోయినా ఇద్దరు బిడ్డలే రెండు కళ్లనుకున్నా.. ఒక బిడ్డపోయాక రెండో బిడ్డపై ఆశలు పెట్టుకున్నా..ఇప్పుడు..ఆ కన్ను కూడా పొడిచేసి నన్ను దుఃఖాల చీకట్లోకి నెట్టేశావా.. ఇంకెవరి కోసం బతకాలి భగవంతుడా’.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న శివయ్య(25) తల్లి కడుపుకోత కట్టలు తెంచుకుంది. అరగంటలో ఇంటికి వస్తానన్నావు కదయ్యా.. అర్ధంతరంగా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లిపోయావా.. అంటూ నాగేశ్వరరావు(65) భార్య గుండెలు బాదుకుంది. నాన్నా.. నన్ను చూడాలనిపించి బయలుదేరావా.. ఒక్క మాట చెబితే నేనే వచ్చేదాన్ని కదా.. ఇప్పుడు మన ఇంటికొచ్చాను నాన్నా.. ఒక్కసారి లే నాన్నా..అంటూ యల్లయ్య(65) కూతురు హృదయవిదారకంగా రోదించింది. సోమవారం సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురిని మృత్యువు మింగేసింది. బస్సు చక్రాల కింద చిందిన రక్తం.. ప్రతి గుండెపై కన్నీటిగా మారింది. మృతుల బంధువుల రోదన బెల్లంకొండ మండలంలోని రెండు గ్రామాల్లో విషాద గీతికై ప్రతిధ్వనించింది. ధూళ్లిపాళ్ల(సత్తెనపల్లి): ప్రమాదం ఎటువైపు పొంచి ఉందో తెలియదు. ఎంత జాగ్రత్తగా వెళుతున్నా ఎదుటి వారు సక్రమంగా రాకపోతే భారీ ప్రమాదాలు క్షణంలోనే జరిగిపోతుంటాయి. అందుకు నిదర్శనం సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం. సత్తెనపల్లి రూరల్ ఇన్చార్జి సీఐ పి.శరత్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల వద్ద సోమవారం ఉదయం ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామానికి చెందిన కోమటి యల్లయ్య(65), నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పిట్టల నాగేశ్వరరావు(65), పిట్టల శివయ్య(25) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. గోనెపూడి నుంచి ముగ్గురు ద్విచక్రవాహనంపై బెల్లంకొండ వెళుతుండగా మాచర్ల నుంచి గుంటూరు వెళుతున్న గుంటూరు–1 డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఆటోను క్రాస్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ద్విచక్రవాహనం నడుపుతున్న పిట్టల శివయ్య, వెనుక కూర్చున్న కోమటి మల్లయ్యలు బస్సు ముందు భాగంలోకి ఇరుక్కు పోయి మృతి చెందగా పిట్టల నాగేశ్వరరావు కొంత దూరంలో పడి మృతి చెందాడు. ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. నాగిరెడ్డిపాలెంకు చెందిన పిట్టల నాగేశ్వరరావు, పిట్టల శివయ్య వరుసకు తండ్రీకొడుకులు. ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసం కాగా ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలానికి సత్తెనపల్లి రూరల్ ఇన్చార్జి సీఐ పి.శరత్‌బాబుతో పాటు పిడుగురాళ్ల రూరల్ సీఐ సుబ్బారావు, సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ మీర్జా నజీర్‌బేగ్, రాజుపాలెం ఎస్ఐ రమేష్, క్రోసూరు ఎస్ఐ కొండలు, ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్.మంత్రూనాయక్, బెల్లంకొండ ఎంపీపీ చెన్నుపాటి పద్మావెంకటేశ్వరరెడ్డి చేరుకొని మృతదేహలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు ప్రైవేట్ అంబులెన్స్‌లో తరలించారు. మృతుడు పిట్టల నాగేశ్వరరావు కుమారుడు పిట్టల సాంబయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శివయ్య కుటుంబాన్ని వెంటాడిన మృత్యువు బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెంకు చెందిన పిట్టల శివయ్య(25) కుటుంబాన్ని మృత్యువు వెంటాడిది. ఆరు నెలల క్రితం శివయ్య సోదరుడు వెంకయ్య రైలు ఢీకొని మృతి చెందాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి వెంకట్రావు నరాలు పగిలి మరణించారు. ఇప్పుడు శివయ్య కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం మగ ఆధారం కోల్పోయి రోడ్డున పడింది. కుమారుడి మరణ వార్తను తెలుసుకున్న తల్లి వెంకటరమణ రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. కడసారి కుమార్తెను చూడకుండానే.... బెల్లంకొండ మండల మాచాయపాలెం గ్రామానికి చెందిన కోమటి యల్లయ్య తన రెండో కుమార్తె వెంకమ్మను చూసేందుకు కోటప్పకొండ సమీపంలోని గోనెపూడి గ్రామం వచ్చారు. తీరా గోనెపూడి గ్రామానికి యల్లయ్య వెళ్లే లోగా కుమార్తె వెంకమ్మ మాచాయపాలెం చేరుకుంది. సోమవారం ఉదయం నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పిట్టల నాగేశ్వరరావు, శివయ్యలతో కలసి యల్లయ్య ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో బస్సు ఢీకొని మృతి చెందాడు. ‘కడసారి కుమార్తెను చూడకుండానే లోకం విడిచి వెళ్లావా నాన్నా’.. అంటూ మృతుడి మూడో కుమారుడు వెంకటేశ్వర్లు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వస్తున్నానని చెప్పిన కొద్దిసేపటికే.. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంకు చెందిన పిట్టల నాగేశ్వరరావు ఆదివారం కోటప్పకొండ సమీపంలోని గోనెపూడి బంధువుల వద్దకు వెళ్లాడు. సోమవారం ఇంటికి వస్తున్నానని చెప్పిన కొద్ది సమయానికి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య శివమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. -
బెంగళూరులో మిరాకిల్ యాక్సిడెంట్..వైరల్!
-
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
శామీర్‌పేట: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. శామీర్‌పేట పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు గ్రామానికి చెందిన శిరీష, భార్గవి(16) తమ నాయనమ్మ లచ్చమ్మను తీసుకొని బైక్‌పై లాలాపేట నుంచి స్వగ్రామానికి వెళుతున్నారు. హైదరాబాద్–కరీంనగర్ జాతీయరహదారిలోని అలంక్రిత రిసార్ట్స్ సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొనడంతో వారు కిందపడిపోయారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ భార్గవి మీదుగా వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శిరీష, లచ్చమ్మలతో పాటు, ట్రాలీ ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో బైక్‌కు నిప్పంటుకుని దగ్ధమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేన్నట్లు ఎస్ఐ అబ్దుల్ రజాక్ తెలిపారు. -
బిడ్డ కడుపు నింపేందుకు వెళుతూ..
తెనాలిరూరల్: విధి నిర్వహణలో ఉన్న ఆ తల్లికి బిడ్డ ఆకలి గుర్తుకొచ్చింది. చిన్నారి కడుపు నింపాలన్న ఆలోచనతో భర్తతో కలిసి ఇంటికి బయలుదేరింది. ఇంతలో ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను కబళించింది. భర్త మృత్యువుతో పోరాడుతున్నాడు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామం కోనేటిపురానికి చెందిన కలకండ శేషయ్య, మాధవి భార్యభర్తలు. శేషయ్య సీసీఎల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తుండగా, వీర మాధవి(28) కొలకలూరులోనే ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల కుమార్తె సునంద తల్లి పని చేస్తున్న పాఠశాలలోనే మొదటి తరగతి చదువుతోంది. నాలుగు నెలల కిందట వీరికి కుమారుడు యజ్ఞ నాగ వంశీకృష్ణ జన్మించాడు. తమ బంధువు, పిల్లలకు మేనత్త రత్నకుమారి సంరక్షణలో చిన్నారిని ఇంట్లోనే ఉంచి, ఇటీవలి కాలం నుంచే మాధవి తిరిగి పాఠశాలలో విధులకు హాజరవుతోంది. ప్రతి రోజు పాఠశాల నుంచి మధ్యలో ఇంటికి వచ్చి, బిడ్డ ఆకలి తీర్చి వెళుతుండేది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి బైక్‌పై ఇంటికి వెళుతుండగా, నందివెలుగు–గుంటూరు రహదారిపై కోనేటిపురానికి సమీపంలోనే ఎదురుగా వచ్చిన కంకర లోడు ట్రాక్టర్ ఢీకొట్టింది. దంపతులిద్దరికీ తీవ్ర గాయాలవ్వగా, స్థానికులు వెంటనే తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే మాధవి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శేషయ్య పరిస్థితి విషమంగా ఉంది. ట్రాక్టర్‌ను నడిపింది మైనర్? ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను కొలకలూరుకే చెందిన మైనర్ బాలుడు నడిపినట్టు తెలుస్తోంది. రెండు నెలల కిందట ప్రభుత్వ సబ్సిడీతో వచ్చిన ట్రాక్టర్(రైతు రథం)తో, ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే పేరేచర్ల నుంచి కంకరలోడుతో వస్తుండగా, కోనేటిపురం సమీపంలోనే ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు చెబుతున్నారు. తెనాలి మండలం ఖాజీపేట, హాఫ్‌పేట గ్రామాల మధ్య రవాణా అధికారులు వాహన తనిఖీలు చేస్తుండటంతో వారి నుంచి తప్పించుకువచ్చే క్రమంలో వేగాన్ని నియంత్రించలేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని తాలూకా ఎస్ఐ ఎం.నారాయణ పరిశీలించారు. బాధితుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బర్త్‌డే పార్టీకంటూ వెళ్లి..
కొల్చారం(నర్సాపూర్) మెదక్ : స్నేహితుడి బర్త్‌డే పార్టీ ఉందని చెప్పి రాత్రి ఇంటి నుండి బైక్‌పై వెళ్లిన యువకుడు తెల్లవారు జామున గ్రామ శివారులో రోడ్డు పక్కన బురద గుంతలో శవమై కనిపిం చాడు. ఈ విషాదకర ఘటన చిన్నఘణాపూర్ గ్రామశివారులో చోటు చేసుకుంది. మృతుని తండ్రి వడ్ల లక్ష్మీనారాయణ, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు వడ్ల శ్రీనివాస్(24)తల్లి ఎనిమిదేళ్ల క్రితం మరణించింది. అతని సోదరి వివాహం సైతం కావడంతో తండ్రితో పాటు గ్రామంలో ఉంటూ మెదక్ పట్టణంలోని వరుణ్ మోటర్స్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం మెదక్ వెళ్లి వచ్చిన శ్రీనివాస్ రాత్రి 8 గంటల సమయంలో ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉందని తండ్రికి చెప్పి బైక్‌పై వెళ్లాడు. పొలం వద్ద సాయంత్రం వరకు పనులు చేసి అలసిపోయిన అతని తండ్రి లక్ష్మీనారాయణ కొడుకు కోసం ఎదురు చూస్తూ నిద్రపోయాడు. మధ్యలో మెలకువ రావడంతో ఫోన్ చేయగా వస్తున్నానని శ్రీనివాస్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున గ్రామ శివారులోని గొల్లగుట్ట సమీపంలోని మెదక్–జోగిపేట ప్రధాన రహదారి పక్కన బురదగుంటలో శ్రీనివాస్ మృతదేహం పడి ఉంది. శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. గమనించిన గ్రామస్తులు తండ్రి లక్ష్మీనారాయణకు సమాచారం అందించారు. బైక్ అదుపుతప్పి పడటంతో తీవ్రంగా గాయపడి శ్రీనివాస్ మృతి చెంది ఉంటాడని ఘటన స్థలాన్ని సందర్శించిన కొల్చారం ఎస్ఐ పెంటయ్య తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సర్వస్వం అనుకున్న కొడుకు శవమై కనిపించడంతో లక్ష్మీనారాయణ రోదిస్తున్న తీరు గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. గుంతలో పడి ఉన్న శ్రీనివాస్ మృతదేహం, ఇన్సెట్లో శ్రీనివాస్ ఫైల్ ఫొటో -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అనంతపురం సెంట్రల్ : నగరంలోని జాతీయ రహదారిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కృష్ణమూర్తి(20) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. జాతీయ రహదారిలో రుద్రంపేట, కళ్యాణదుర్గం రోడ్డు మధ్యలో ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రుద్రంపేటలో నివాసముంటున్న ఆంజనేయులు కుమారుడు కృష్ణమూర్తి మృతిచెందగా అతని స్నేహితుడు మహేష్, ఖాసీలకు తీవ్రగాయాలయ్యాయి. బొలోరో వాహనంను ఓవర్‌టెక్ చేస్తూ వచ్చిన ఖాసీ అనే వ్యక్తి కృష్ణమూర్తి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. రెండు బైకులు వేగంగా ఢీ కొనడంతో ఎగిరిపడ్డాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సవేరా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
టిప్పర్ ఢీకొని మహిళ దుర్మరణం
విజయపురం : నగరి మండపం వద్ద శుక్రవారం బైక్‌ను టిప్పర్ లారీ ఢీకొనడంతో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా అక్కడికి చేరుకుని పోలీసు అధికా రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. బాధితుల కథనం మేరకు.. నిండ్ర మండలానికి చెందిన శేఖర్, సుమతి (40) దంపతులు నగరి కోర్టుకు వచ్చారు. తిరిగి స్వగ్రామం వెళుతుండగా నగరి మండపం వద్ద అడవికొత్తూరు నుంచి పుత్తూరు వైపు కంకర తీసుకెళుతున్న టిప్పర్ లారీ ఢీకొంది. కింద పడిన సుమతి తలపై లారీ చక్రాలు ఎక్కాయి. దీంతో ఆమె అక్కడిక్కడే దుర్మరణం చెందింది. ఆమె భర్త శేఖర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా అక్కడికి చేరుకున్నారు. బాధితుల ఆర్తనాదాలు చూసి కంటతడి పెట్టారు. ఆమె మాట్లాడుతూ అడవికొత్తూరు వద్ద ఉన్న వేల్మురుగన్ క్రషర్ నుంచి టిప్పర్ లారీలు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్రధాన రహదారిపై తిరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని మండిపడ్డారు. క్వారీల నిర్వాహుకులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు కలెక్టర్‌కు విన్నవించా మని తెలిపారు. పరిశీలనకు వచ్చిన ఆర్డీవో స్థాయి అధికారి క్వారీ నిర్వాహకులతో కుమ్మక్కై నిందితులను రక్షిస్తున్నారని ఆరోపించారు. సీఐని సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే రోజా మూడు గంటల సేపు జాతీయ రహదారిపై ఎండలో ధర్నాకు దిగడంతో నీరసించి పోయారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. కల్తీ మద్యం స్మగ్లర్ మైకేల్ రాజ్, అక్రమ క్వారీ నిర్వహిస్తున్న వేల్‌మురగన్‌కు నగరి సీఐ మల్లికార్జునగుప్తా కొమ్ముకాస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. టిప్పర్లు, లారీలు పట్టణం వెలు పలి నుంచి వెళ్లేలా చూడాలని విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. నిరుపేద మహిళ ప్రమాదంలో మృతిచెందినా సీఐ నిర్లక్ష్యంగా శవాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారని ఆరోపించారు. మున్సిపాలిటీ అనుమతి లేకపో యినా మైకేల్‌రాజ్ రోడ్డు పక్కన బార్ ఏర్పాటు చేశారని, పోలీసులు అడ్డుకోవడం లేదన్నారు. మూడు గంటల పాటు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పుత్తూరు డీఎస్పీ భవాని శ్రీహర్ష, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సూర్యనారాయణ అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో చర్చించారు. సీఐని తక్షణం సస్పెండ్ చేయాలని ఎమ్యెల్యే తేల్చి చెప్పడం తో డీఎస్పీ ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ ఎమ్మె ల్యేకు ఫోన్లో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించా రు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
కంటైనర్ ఢీకొని అనంతలోకాలకు..
రాజాపూర్ (జడ్చర్ల): ద్విచకవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంగటన మండలంలోని రాజాపూర్ శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఏఎస్ఐ యాదయ్య కథనం ప్రకారం.. మిడ్జిల్ మండలం దోనూరు గ్రామానికి చెందిన పాలాది ప్రసాద్‌కుమార్(31) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం స్వగ్రామమైన దోనూరుకు తన బంధువు, డిగ్రీ విద్యార్థి జగద్గిరిగుట్టకు చెందిన వంశీ(18)తో కలిసి స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలో రాజాపూర్ శివారులోని వంతెన వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇనుప పైపుల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీ వీరి స్కూటీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు కిందపడగా.. ఇద్దరిపై కంటైనర్ టైర్లు వెళ్లడంతో తలలు పగిలి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రసాద్‌కుమార్‌కు గత మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రసాద్‌కుమార్ తమ్ముడు పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో లైన్ ఇన్స్పెక్టర్ మృతి
రాజుపాళెం/ ప్రొద్దుటూరు టౌన్ : వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న కాశిరెడ్డినాయన ఆలయం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో లైన్ఇన్స్పెక్టర్ బండారు రామచంద్రుడు(52) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రాజుపాళెం మండలం వెల్లాల సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు రామచంద్రుడు (52) లైన్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఆలయం వద్ద ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి వాహనంతో పాటు రామచంద్రుడు గుంతలో పడ్డారు. విషయాన్ని గమనించిన రాజుపాళెం ఏఈ హరికృష్ణ, సిబ్బంది, గ్రామస్తులు కలిసి గాయాలతో పడిఉన్న రామచంద్రుడిని బయటకు తీసి చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో నంద్యాల వద్ద మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈయనకు భార్య కృష్ణవేణితో పాటు ఇద్దరు కుమారులు రామకృష్ణ, నందకృష్ణ ఉన్నారు. వారిద్దరు ఇంజినీరింగ్ చదువుతున్నారు. మృతదేహానికి పరామర్శ: జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చిన లైన్ఇన్స్పెక్టర్ రామచంద్రుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ప్రొద్దుటూరు డివిజన్ ట్రాన్స్‌కో డీఈ విజయన్, రాజుపాళెం ఏఈ హరికృష్ణ, ఏడీలు, ఏఈలు, సిబ్బంది సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు
కాశీబుగ్గ : పలాసలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయపురం గ్రామానికి చెందిన పొట్నూరు అనిల్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనిల్ నడుచుకుని వస్తుండగా హడ్కో కాలనీకి చెందిన బోర తిరుమల బైకుపై వస్తూ అదుపుతప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కిందపడిన బాలుడిని పైకిలేపి ఇంటికి పంపించేశారు. కొద్దిసేపటి తర్వాత బాలుడు తీవ్రమైన నొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులు తిరుమల ఇంటికి వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
వెల్దుర్తి: పట్టణ సమీపంలోని ఎన్‌హెచ్ 44పై కర్నూలు క్రాస్ వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న బెస్త శ్రీనివాసులు(45), చాకలి రంగస్వామి అలంపూర్ జోగులాంబ ఆలయానికి పల్సర్ బైక్‌పై బయలు దేరారు. రిటైర్డ్ ఎస్ఐ ఉమాపతి కర్నూలు వెళ్లేందుకు వెల్దుర్తి క్రాస్ వద్ద హైవేపైకి అకస్మాత్తుగా వచ్చాడు. ఈక్రమంలో రెండు బైక్‌లు వేగంగా ఢీకొన్నాయి. ఘటనలో బెస్త శ్రీనివాసులు, చాకలి రంగస్వామిలకు తీవ్ర గాయాలయ్యాయి. రిటైర్డ్ ఎస్ఐ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు వారిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో బెస్త శ్రీనివాసులు మరణించినట్లు కర్నూలు ఆసుపత్రి డాక్టర్లు ధ్రువీకరించారు. -
వేగంగా 'కలిసి' పోయారు
అప్పటివరకూ నలుగురు స్నేహితులు సంతోషంగా మాట్లాడుకున్నారు. పలమనేరుకు వెళ్లొద్దామని బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు. ఈలోపే వారిని మృత్యువు బలిగొంది. ఒకే బైక్‌లో వస్తూ రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పెను విషాదం నింపింది. బైరెడ్డిపల్లి మండలంలోని ఇల్లూరు వద్ద పలమనేరు–కుప్పం రహదారిపై శుక్రవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. అతివేగమే వారి ప్రాణాలను తీసిందని తెలిసింది. పలమనేరు/ బైరెడ్డిపల్లి: బైరెడ్డిపల్లికి చెందిన దందోళ్ల మునిరత్నం కుమారుడు వంశీధర్(22), కరెంటు వెంకటేశు కుమారుడు కిశోర్(21), గంగరాజు కుమారుడు వినోద్ (22), శ్రీనివాసులు కుమారుడు తేజ(23) కలిసి చదువుకుంటున్నారు. చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. వీరు కలవని రోజు ఉండదు. ఈ నలుగు రూ శుక్రవారం మధ్యాహ్నం ఒకే బైక్‌లో పలమనేరుకు వెళ్లారు. చీకటి పడుతుండగానే స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇల్లూరువద్ద ఎదురుగా కుప్పం నుంచి వస్తున్న ఇన్నోవా వీరి బైక్ వేగంగా ఢీకొ న్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బైక్ ట్యాంకర్‌లోని పెట్రోలు తోడవ్వడంతో మం టలు భగ్గుమన్నాయి. నలుగురుస్నేహితులు అక్కడిక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో బైరెడ్డిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహా లను పరిశీలించారు. పాక్షికంగా కాలి, రక్తగాయాలతో చిధ్రమైన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి కన్పించాయి. మృతదేహాలను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వంద కిలోమీటర్ల వేగం నలుగురు స్నేహితులు ఒకే బైక్‌పై వేగంగా వస్తున్నారు. అదే తరుణంలో మరింత వేగంగా ఎదురుగా వచ్చిన ఇన్నోవా పరస్పరం ఢీకొన్నా యి. ఇన్నోవా ఇంజిన్ భాగం చాలా వరకు లొత్తుగా మారిందంటే వీరి వేగం వంద కిలోమీటర్ల దాకా ఉండొచ్చునని అక్కడున్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే రాపిడి జరిగి మంటలు వ్యాపించడం .. ఆపై బైక్ ట్యాంక్ నుంచి పెట్రోలు కింద పడడంతో అగ్నికీలలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు పెద్దవి కావడంతో నలుగురూ మంటల్లో కాలిపోయారు. దీనికితోడు నలుగురు యువకులు ఒకే బైక్‌పై వెళ్లినా ఎవరూ హెల్మెట్ ధరించలేదు. మిన్నంటిన రోదనలు మృతిచెందిన నలుగురూ 20 నుంచి 22 ఏళ్లవారే. ఎక్కడికైనా అందరూ కలిసే వెళ్లేవారు. కాకతాళీ యంగా నలుగురూ ఒకేసారి, ఒకే చోట మృత్యువాత పడడం అందరినీ కలసివేసింది.ఒకే గ్రామానికి చెందిన నలుగురు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారనే సమాచారంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. సంఘటనా స్థలం చేరుకున్న కుటుంబీకులు శవాలను గుర్తించి గుండెలవిసేలా రోదించారు. ఎదిగిన బిడ్డలు ఇలా దూరమయ్యారనే విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. మృతులు సామాన్య మధ్య తరగతికి చెందినవారే. ఈ ఘటనలో బైరెడ్డిపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి. నాలుగు కుటుంబాల్లో కమ్ముకున్న చీకట్లు! పలమనేరు: బైక్, ఇన్నోవా ఢీకొని బైరెడ్డిపల్లికి చెందిన నలుగురు స్నేహితులు మృతి చెందడం తో నాలుగు కుంటుంబాల్లో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. మృతులు నలుగురూ సా మాన్య మధ్య తరగతికి చెందినవారే. కుటుం బాలకు ఆసరాగా ఉంటున్నారు. దందోళ్ల ముని రత్నంకు ఇద్దరు కుమారులు. ఇటీవలే పెద్ద కుమారునికి పెళ్లి జరిపించాడు. చిన్న కుమారుడు వంశీధర్ ట్రాక్టర్ నడుపుతూ తండ్రికి ఆసరాగా ఉండేవాడు. సంఘటనా స్థలంగా విగతజీవిగా పడి ఉన్న కొడుకుని చూసి ఏం చేయాలో ఆయనకు పాలుపోలేదు. నలుగురికి సాయంగా నిలిచే ఆయనకు దేవుడు చిన్న చూపు చూశాడంటూ స్థానికులు వాపోయారు. మృతుడు కిశోర్ తల్లిదండ్రులు ఇటీవలే మృతిచెందారు. ఇప్పుడిప్పుడే ఆ కుటుంబ కోలుకుంటోంది. కిశోర్ ప్రమాదంలో మృతిచెందదంతో అతని అన్న, చెల్లి ఆవేదనకు అంతేలేకుండా పోయింది. గ్రామంలోని రామాలయం వద్ద కాపురముండే గంగరాజుది మధ్యతరగతి కుటుంబం. అతని కుమారుడు వినోద్. కొడుకు చేతికి రావడంతో చేదోడువాడుగా ఉంటాడని తండ్రి గంగరాజు సంబరపడ్డాడు. తలా ఒక పని చేసుకుంటే కుటుంబ కష్టాలు తీరతాయని అనుకున్నాడు. ఇంతలో కొడుకు అందనంత దూరం వెళ్లిపోవడంతో ఆయనకు నోటమాట రావడం లేదు. ఇక తేజ తల్లికి సాయంగా ఉంటుండేవాడు. అసలే కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. మృతిచెందిన యువకులకు ఇంకా వివాహం కాలేదు. వీరంతా తమ కుటుం బాలకు, తల్లిదండ్రులకు అండగా ఉండేవారు. దీంతో సామాన్య కుటుంబాలకు దేవుడు తీరని ద్రోహం చేశాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టాటా చెబుతూ..
ఆళ్లగడ్డ రూరల్: జాతీయ రహదారిపై మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి తెలిసినవారు కనిపించడంతో టాటా చెబుతూ ప్రమాదవశాత్తూ డివైడర్న్ను ఢీ కొని మృతి చెందిన ఘటన చింతకొమ్మదిన్నె గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన నాగేంద్రబాబు(58) లింగమయ్యవీ«ధిలో బాబు టైలర్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. పట్టణంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరై, అక్కడి నుంచి సొంతపని నిమిత్తం చాగలమర్రికి బయలు దేరాడు. చింతకొమ్మదిన్నె గ్రామం సమీపంలో తెలిసిన వారు కన్పించడంతో టాటా చెప్పే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. భార్య రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కుక్క తెచ్చిన తంటా..
మదనపల్లె క్రైం: కుక్క అడ్డురావడంతో బైక్ అదుపు ఇద్దరు మిలటరీ ఉద్యోగులు తీవ్రంగా గాయపడి న ఘటన మంగళవారం రాత్రి గుర్రంకొండ మం డలంలో జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దమండ్యం మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన వి.సంతోష్ కుమార్‌రెడ్డి(23), వి.కృష్ణకిరీటి రెడ్డి(24) మిలటరీలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా వీరిద్దరు సెలవుపై రెండు రోజులక్రితం స్వగ్రామంలో ఉన్న తల్లిదండ్రులను చూడటానికి వచ్చారు. మంగళవారం మధ్యహ్నం గుర్రంకొండలో వారి స్నేహితులను చూడానికి బైక్‌లో వెళ్లారు. తిరిగి రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తురకపల్లె వద్దకు రగానే ఓ కుక్క బైక్‌కు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న వీరిని స్థానికుల సాయంతో 108 సిబ్బంది మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తిరుపతికి రెఫర్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.