పరిగి: మండలంలోని యు.బసవనపల్లి క్రాస్‌వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు, క్షతగాత్రుడు ముస్లింలు. రంజాన్ వేళ ఈ ఘటన జరగడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఊటుకూరు నుంచి హిందూపురానికి ముగ్గురు ప్రయాణికులతో ఆటో వస్తోంది. పరిగికి చెందిన ముబారక్, ఇర్ఫాన్ (17)లు హిందూపురం నుంచి ఊటుకూరు వైపు ద్విచక్రవాహనంలో వస్తున్నారు.
సరిగ్గా యు.బసవనపల్లి క్రాస్ మలుపు వద్ద ద్విచక్రవాహనం, ఆటో వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరూ కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇర్ఫాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. రంజాన్ పర్వదినం రోజున సంతోషంగా ఉన్న కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మలుపులో కంపచెట్లు ఏపుగా పెరగడం వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా పోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కంపచెట్లు తొలగించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment