ప్రమాదస్థలంలో దెబ్బతిన్న బైక్, ఆటో ప్రమాద స్థలంలో వంశీరత్నం మృతదేహం
తండ్రిలా శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణగా ఉండేందుకు కానిస్టేబుల్ కావాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఇక తండ్రి కూడా తనలానే తన ఇద్దరు కుమారులు పోలీసు ఉద్యోగంలో స్థిరపడాలని భావించాడు. కానీ విధి వారి ఆశలను అడియాశలు చేసింది. ఎదిగొచ్చిన కొడుకులు కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి వెళ్లి ఇంటికి ఎప్పుడు చేరుకుంటారోనని ఎదురు చూసిన తండ్రికి పుత్రశోకం మిగిలింది.
తూర్పుగోదావరి, జగ్గంపేట: మండలంలోని వెంగాయ్యమ్మపురం గ్రామ శివారున మల్లిసాలకు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్దికొండ వంశీరత్నం(28) మృతి చెందాడు. వంశీరత్నం, తమ్ముడు మనోరత్నం కలిసి కాకినాడలో కానిస్టేబుల్ పరీక్ష రాసి తిరిగి రంపచోడవరంలోని ఇంటికి వెళుతుండగా ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఆటో వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వంశీరత్నం తలకు బలమైన గాయమవ్వడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
తమ్ముడు మనోరత్నం గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన ఆటోలోని ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని జగ్గంపేటలో ఆస్పత్రికి తరలించారు. మృతుడు రంపచోడవరం పోలీసు స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కనకరత్నం కుమారుడు. ఇద్దరు కుమారులు కానిస్టేబుల్ పరీక్షకు ఉదయం కాకినాడ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కనకరత్నం తలడిల్లారు. ప్రమాదంలో బైక్ నుజ్జు అవ్వగా ఆటో ఎడమవైపు దెబ్బతింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై ఏసుబాబు, సిబ్బంది ప్రమాదం తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి పీఎం నిమిత్తం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment