
చెల్లాచెదురుగా పడివున్న యువకుల మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు
అప్పటివరకూ నలుగురు స్నేహితులు సంతోషంగా మాట్లాడుకున్నారు. పలమనేరుకు వెళ్లొద్దామని బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు. ఈలోపే వారిని మృత్యువు బలిగొంది. ఒకే బైక్‌లో వస్తూ రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పెను విషాదం నింపింది. బైరెడ్డిపల్లి మండలంలోని ఇల్లూరు వద్ద పలమనేరు–కుప్పం రహదారిపై శుక్రవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. అతివేగమే వారి ప్రాణాలను తీసిందని తెలిసింది.
పలమనేరు/ బైరెడ్డిపల్లి: బైరెడ్డిపల్లికి చెందిన దందోళ్ల మునిరత్నం కుమారుడు వంశీధర్(22), కరెంటు వెంకటేశు కుమారుడు కిశోర్(21), గంగరాజు కుమారుడు వినోద్ (22), శ్రీనివాసులు కుమారుడు తేజ(23) కలిసి చదువుకుంటున్నారు. చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. వీరు కలవని రోజు ఉండదు. ఈ నలుగు రూ శుక్రవారం మధ్యాహ్నం ఒకే బైక్‌లో పలమనేరుకు వెళ్లారు. చీకటి పడుతుండగానే స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇల్లూరువద్ద ఎదురుగా కుప్పం నుంచి వస్తున్న ఇన్నోవా వీరి బైక్ వేగంగా ఢీకొ న్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బైక్ ట్యాంకర్‌లోని పెట్రోలు తోడవ్వడంతో మం టలు భగ్గుమన్నాయి. నలుగురుస్నేహితులు అక్కడిక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో బైరెడ్డిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహా లను పరిశీలించారు. పాక్షికంగా కాలి, రక్తగాయాలతో చిధ్రమైన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి కన్పించాయి. మృతదేహాలను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వంద కిలోమీటర్ల వేగం
నలుగురు స్నేహితులు ఒకే బైక్‌పై వేగంగా వస్తున్నారు. అదే తరుణంలో మరింత వేగంగా ఎదురుగా వచ్చిన ఇన్నోవా పరస్పరం ఢీకొన్నా యి. ఇన్నోవా ఇంజిన్ భాగం చాలా వరకు లొత్తుగా మారిందంటే వీరి వేగం వంద కిలోమీటర్ల దాకా ఉండొచ్చునని అక్కడున్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే రాపిడి జరిగి మంటలు వ్యాపించడం .. ఆపై బైక్ ట్యాంక్ నుంచి పెట్రోలు కింద పడడంతో అగ్నికీలలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు పెద్దవి కావడంతో నలుగురూ మంటల్లో కాలిపోయారు. దీనికితోడు నలుగురు యువకులు ఒకే బైక్‌పై వెళ్లినా ఎవరూ హెల్మెట్ ధరించలేదు.
మిన్నంటిన రోదనలు
మృతిచెందిన నలుగురూ 20 నుంచి 22 ఏళ్లవారే. ఎక్కడికైనా అందరూ కలిసే వెళ్లేవారు. కాకతాళీ యంగా నలుగురూ ఒకేసారి, ఒకే చోట మృత్యువాత పడడం అందరినీ కలసివేసింది.ఒకే గ్రామానికి చెందిన నలుగురు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారనే సమాచారంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. సంఘటనా స్థలం చేరుకున్న కుటుంబీకులు శవాలను గుర్తించి గుండెలవిసేలా రోదించారు. ఎదిగిన బిడ్డలు ఇలా దూరమయ్యారనే విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. మృతులు సామాన్య మధ్య తరగతికి చెందినవారే. ఈ ఘటనలో బైరెడ్డిపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి.
నాలుగు కుటుంబాల్లో కమ్ముకున్న చీకట్లు!
పలమనేరు: బైక్, ఇన్నోవా ఢీకొని బైరెడ్డిపల్లికి చెందిన నలుగురు స్నేహితులు మృతి చెందడం తో నాలుగు కుంటుంబాల్లో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. మృతులు నలుగురూ సా మాన్య మధ్య తరగతికి చెందినవారే. కుటుం బాలకు ఆసరాగా ఉంటున్నారు. దందోళ్ల ముని రత్నంకు ఇద్దరు కుమారులు. ఇటీవలే పెద్ద కుమారునికి పెళ్లి జరిపించాడు. చిన్న కుమారుడు వంశీధర్ ట్రాక్టర్ నడుపుతూ తండ్రికి ఆసరాగా ఉండేవాడు. సంఘటనా స్థలంగా విగతజీవిగా పడి ఉన్న కొడుకుని చూసి ఏం చేయాలో ఆయనకు పాలుపోలేదు. నలుగురికి సాయంగా నిలిచే ఆయనకు దేవుడు చిన్న చూపు చూశాడంటూ స్థానికులు వాపోయారు. మృతుడు కిశోర్ తల్లిదండ్రులు ఇటీవలే మృతిచెందారు. ఇప్పుడిప్పుడే ఆ కుటుంబ కోలుకుంటోంది.
కిశోర్ ప్రమాదంలో మృతిచెందదంతో అతని అన్న, చెల్లి ఆవేదనకు అంతేలేకుండా పోయింది. గ్రామంలోని రామాలయం వద్ద కాపురముండే గంగరాజుది మధ్యతరగతి కుటుంబం. అతని కుమారుడు వినోద్. కొడుకు చేతికి రావడంతో చేదోడువాడుగా ఉంటాడని తండ్రి గంగరాజు సంబరపడ్డాడు. తలా ఒక పని చేసుకుంటే కుటుంబ కష్టాలు తీరతాయని అనుకున్నాడు. ఇంతలో కొడుకు అందనంత దూరం వెళ్లిపోవడంతో ఆయనకు నోటమాట రావడం లేదు. ఇక తేజ తల్లికి సాయంగా ఉంటుండేవాడు. అసలే కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. మృతిచెందిన యువకులకు ఇంకా వివాహం కాలేదు. వీరంతా తమ కుటుం బాలకు, తల్లిదండ్రులకు అండగా ఉండేవారు. దీంతో సామాన్య కుటుంబాలకు దేవుడు తీరని ద్రోహం చేశాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment