మృతి చెందిన తులసీరామ్ ,మృతి చెందిన సుగుణ
ఆదివారం కావడంతో దంపతులు ఇద్దరూ సొంత ఊరికి బయలుదేరారు. సరదాగా మాట్లాడుకుంటూ నిదానంగా వెళుతున్నారు. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. దంపతులు ఇద్దరూ అనంతలోకాలకు కలిసే పోయారు.
చిత్తూరు అర్బన్: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన చిత్తూరు నగరంలోని చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న రవాణాశాఖ కార్యాలయ సమీపంలో ఆదివారం జరిగింది. పలమనేరు మండలంలోని గంటావూరుకు చెందిన తులసీరామ్ (45), అతని భార్య సుగుణ అలియాస్ రూప (35) చిత్తూరు నగరంలోని ప్రశాంత్‌నగర్ ఇందిరమ్మ కాలనీలో స్థిర పడ్డారు. వీరికి పిల్లలు లేరు. తులసీరామ్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఆదివారం భార్య సుగుణను తీసుకుని ద్విచక్ర వాహనంలో పలమనేరు వైపు వెళుతున్నాడు. రవాణాశాఖ కార్యాలయ మలుపు వద్ద ఎదురుగా అతివేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. దీంతో దంపతులు దాదాపు 30 అడుగుల దూరంలోకి ఎగిరి పడ్డారు.
తులసీరామ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సుగుణను స్థానికులు ఆటోలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తులసీరామ్ తలకు హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ టిప్పర్ ఢీకొట్టిన దాటికి ముక్కలైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ మనోహర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment