తనపై కూడా ఆశలు వదలు కోవాలని ఫోన్‌ .. | Couple Suspicious Death in Bike Accident SPSR Nellore | Sakshi

దంపతుల అనుమానాస్పద మృతి 

Aug 11 2020 12:35 PM | Updated on Aug 11 2020 12:46 PM

Couple Suspicious Death in Bike Accident SPSR Nellore - Sakshi

చెరువు తూముల వద్ద నీటిలో తేలియాడుతున్న దంపతుల మృతదేహాలు 

ఆత్మకూరు: ఇంటి నుంచి నెల్లూరుకు వెళ్తున్నామని ద్విచక్ర వాహనంపై బయలు దేరిన దంపతులు గంట వ్యవధిలోనే ఆత్మకూరు చెరువులో 3వ నంబర్‌ తూము గేట్ల వద్ద మృతదేహాలై తేలియాడారు. ఆత్మకూరు పోలీసులు, మృతుల బంధువుల సమాచారం మేరకు.. అనంతసాగరం మండలం రేవూరుకు చెందిన వంగవరుగు నారాయణరెడ్డి (60), స్వర్ణమ్మ (58) దంపతులు వ్యవసాయం, చిన్నచిన్న కాంట్రాక్ట్‌ పనులు చేస్తూ గ్రామంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరి కుమారుడు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నారాయణరెడ్డి, స్వర్ణమ్మ దంపతులు నెల్లూరుకు పని ఉందని  స్కూటీపై బయలు దేరారు. ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ద్విచక్ర వాహనాన్ని పెట్టి బస్సులో వెళ్తామని సమీప బంధువులకు తెలిపారు. అయితే ఇంటి దగ్గర కదిలిన గంట వ్యవధిలోనే ఆత్మకూరులోని చెరువులో 3వ నంబర్‌ తూము వద్ద శవాలై తేలియాడారు.

అంతకు ముందే నారాయణరెడ్డి అతని సోదరుడికి ఫోన్‌ చేసి చెరువు వద్దకు రాగానే చీకట్లో పంది అడ్డు వచ్చిందని, దానిని తప్పించే క్రమంలో వేగంగా స్కూటీ చెరువులోకి దూసుకెళ్లిందని, భార్య స్వర్ణమ్మ నీళ్లలో పడి మృతి చెందిందని, తనపై కూడా ఆశలు వదలు కోవాలని తెలిపినట్లు సమాచారం. తెల్లవారుతుండగా పలువురు ఆ మార్గంలో వాకింగ్‌ చేస్తూ పడిన స్కూటీని, నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న సీఐ వైవీ సోమయ్య, ఎస్సైసీ సంతోష్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్‌ సిబ్బంది సహకారంతో మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగిందా.. ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అందరితో కిలివిడిగా ఉండే దంపతులు మృతి చెందడంతో రేవూరులో విషాదఛాయలు అలముకున్నాయి.   

రేవూరులో విషాదం 
సోమశిల: మండలంలోని రేవూరుకు చెందిన దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, భార్య స్వర్ణమ్మ నెల్లూరుకు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా ఆత్మకూరు చెరువులో పడి మృతి చెందారు.  అందరితో కలివిడిగా ఉండే ఆ దంపతుల మరణ వార్త విని గ్రామస్తులు దిగ్భ్రాంతి చెందారు. ఒక్కగానొక్క కుమారుడు తల్లిదండ్రుల మృతదేహాల వద్ద విలపిస్తుండడం స్థానికులను కంటతడి పెట్టించింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement